Pages

Wednesday, 30 October 2013

ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి చూడండి. ఎంత బాగుందో!


ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి చూడండి. ఎంత బాగుందో!
సాధారణంగా వేదమంత్రం ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి ఆరు పద్దతులు ఉన్నాయి. ఆ ఆరు పద్దతులనే మనం నిత్యజీవితంలో కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

ఆ పద్దతులు ఏంటంటే ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్థవాదం, ఉపపత్తి.


ఉపక్రమమంటే ప్రారంభం. ఉపసంహారమంటే చివర. మొదటి పద్ధతి ఈ రెంటినీ గమనించటం - దీనినే ఉపక్రమ - ఉపసంహార పద్ధతి అంటారు. ఈ రెండూ ఒకే విషయం గురించి చెప్తే మొత్తం విషయమదేనని గ్రహించవచ్చు.


అభ్యాసమంటే ఒక విషయాన్ని పదేపదే చెప్పటం లేక వల్లెవేయటం లేక మననం చేయటం.


ఏ వ్యాసంలోనైనా ఒకే విషయం గురించి పదే పదే చెప్తూంటే విషయం యొక్క సారాంశమదేననీ, మనస్సుకి బాగా హత్తుకోవటానికే తిరిగి తిరిగి దాని ప్రస్తావనే జరుగుతోందని గ్రహించవచ్చు.
అపూర్వత అంటే అంతకు పూర్వం చెప్పబడనిది అని అర్థం. అంటే విషయసారాంశమదే నన్న మాట.


''ఉపపత్తి'' అంటే విషయం గురించి చెప్పి ఆ విషయం యొక్క మూలమూ, ఉద్దేశమూ, ఔచిత్యమూ గురించి తెలుసుకోవడం. వీటి వల్ల ఆ విషయం స్పష్టమవుతుంది.


అర్థవాదం అంటే విషయాన్ని అనేక కోణాలలో విషయాన్ని చర్చించడం. వివిద రకాలుగా అర్థవంతమైన వాదాలు చేసుకోవడం.


'ఫలం'' అంటే ప్రతిఫలం. ''ఈ విధంగా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది'' అనటం లాంటిదన్నమాట. అంటే మనం నేర్చుకోవలసినదాని వైపు లేక పొందవలసినదాని వైపు మనలను నడిపించటం. దీనిని ''ఫలం'' అంటారు.

నేను హిందువును, అతడు ముస్లిం ఇంకొకతను క్రిస్టియన్ ఐనంత మాత్రాన కొట్టుకోవాలా? తిట్టుకోవాలా?


మనం అందరమూ చదువుకొన్నవాళ్ళము. లోకజ్ఞానము ఇంతో అంతో కలిగినవాళ్ళము. కాని మనము కూడా అనాగరికులలాగా మతము పేరుతో గొడవలు పడడము ఎంతవరకు సమంజసం?

ఎవరి మతము వారికి ప్రియము. ఆ ప్రియత్వము అనేది ఇతరమతాలను ద్వేషించకుండా ఉన్నంతవరకే బాగుంటుంది. ప్రత్యేకముగా ఏదో ఒక మతాన్ని లక్ష్యము చేసుకొని ఎప్పుడూ దానిపైనే బురద చల్లడానికి ప్రయత్నించడం సమంజసము కాదని నా వ్యక్తిగత అభిప్రాయము.

ఎవరి మతాలను వారు పొగడుకుంటూ, వారి మతాల గొప్పతనం గురించి కావాలనుకొంటే వారు వ్రాసుకోవచ్చు. అప్పుడు ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు. అలా కాకుండా ఇతర మతాల లోటుపాట్ల గురించి వాదించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం వాదించుకున్నంతమాత్రాన లేక వాటి గురించి గొడవ పడినంత మాత్రాన ఆయా మతధర్మాలు కాని, ఆచారసాంప్రదాయాలు కాని ఇసుమంతైనా మారవు కదా. ఊరికే మన మధ్య భేధాభిప్రాయాలు రావడం, వ్యక్తిగత కక్ష్యలు ఏర్పడడం( అసలు కనీసం ముఖపరిచయాలు కూడా లేకుండానే ) తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.

కొందరి తిండి లేదని, బట్టలు లేవని, ఇల్లు లేదని బాధ. ఈ మూడూ ఉన్న మనకు అభిప్రాయప్రకటన, వాక్స్వాతంత్రము పేరుతో వాదోపవాదాల బాధ. మొత్తానికి మనకు సౌలభ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక బాధను మెడకు గుదిబండలా తగిలించుకొంటే తప్ప మనకు జిల తీరదనుకొంటా.

నేనొక హిందువును. నా మతధర్మాలు నేను పాటిస్తాను. నాకు ముస్లిములు, క్రైస్తవులలో కూడా మంచి స్నేహితులున్నారు. మేము ఎవరి మతధర్మాలు వారు పాటిస్తాము. మా మత ధర్మాల గురించి, ఆచారసాంప్రదాయాల గురించి ఒకరికొకరు చెప్పుకొంటాము. కొత్త విషయాలు తెలుసుకొని ఆనందిస్తాము.

నాకు సమీర్ అనే ముస్లిం స్నేహితుడున్నాడు. భగవద్గీత గురించి అతను, ఖురాన్ గురించి నేను అతడిని తెల్సుకొంటుంటాము. ఉన్నట్టుండి అతను జ్ఞానయోగం అంటే ఏంటని అడుగుతాడు. నాకు తెలిసింది చెప్తాను. అలానే నాకూ అతని మతధర్మాలు గురించి నాకు చెప్తుంటాడు. అలానే ఫణి అనే క్రైస్తవ స్నేహితునితో కూడా ఇటువంటి సంబంధాలే ఉన్నాయి. మాకు ఎప్పుడూ మామా మతాల విషయంలో గొడవలు కానీ, వాదోపవాదాలు కానీ రాలేదు.

ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటాము. అంతవరకే. ఏ విషయములోనైనా మా మధ్య భేధాభిప్రాయాలు ఉండవచ్చు. కాని మా మతాల విషయాలలో, కుటుంబ విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మత విషయాలు, కుటుంబవిషయాలు అత్యంత సున్నితమైనవని మాకు తెలుసు. వాటి విషయములో ఒక సారి అభిప్రాయభేధాలు గనుక వస్తే జీవితమంతా బాధపడవలసి వస్తుందని మాకు తెలుసు. అలా మా స్నేహాన్ని నిలుపుకొంటున్నాము.

అందరికీ తెలుసు వాదోపవాదాలు మనసుకు ఎంత అశాంతికి గురిచేస్తాయో. కాని వాదాలను వదలలేకుండా పోతున్నారు.

ఫలానా రాముడో లేక మహమ్మదో లేక ఏసుక్రీస్తో, వీరి గురించి మనం ఎందుకు పోట్లాడుకోవాలి? ఆయా మతాలవారు వీరిని పూజిస్తారు. వీరి వ్యక్తిత్వాలతో పోలిస్తే మన వ్యక్తిత్వాలు ఏ మూలకు? వారున్నరో లేదో మనకు ఎందుకు? ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కాని వారున్నారని, వారు తమ వ్యక్తిత్వాలతో, జ్ఞానంతో, ప్రవర్తనతో సమాజాలను ప్రభావితం చేసారని పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు వారు భోధించిన, ఆచరించి చూపిన విషయాలను మనకు నచ్చితే అనుసరిద్దాము. నచ్చకపోతే వద్దు. అంతేకాని వారిని దూషిస్తూ, మనలో మనం వారి పేరుపై పోట్లాడుకొంటూ మనం ఎందుకు మనశ్శాంతిని పోగొట్టుకోవాలి? అవసరమా?

ఈ బ్లాగులు, కంప్యూటర్లు, ఆంగ్లము ఏమీ తెలియని గ్రామాల ప్రజలే పరమతసహనముతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొంటూ ఆనందముగా ఉంటున్నారు. ఏ మతపండుగ వచ్చినా అందరూ కలిసి జరుపుకొంటూ సంతోషముగా ఉంటున్నారు. కాని ఇవన్నీ తెలిసిన మనం ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకొంటున్నాము. నిజమే కదా?

చివరిగా ఒక మాట. తప్పు మతం పేరుతో చేసే తప్పులు చేసే మనుషులదే కాని, మతానిది ఎన్నటికీ కానేరదు.
ఇకనైనా మనము మతాల పేరుతో కువిమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఉండాలని నా అభిలాష.

కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)


వేదభాష్యకారులలో ఒకరైన శాయనాచార్యులు (క్రీ.శ.1315 -1387) విజయనగర రాజులలో ఒకరైన బుక్కరాయల అస్థానంలో మంత్రిగా ఉండేవారు.వీరు తమ ఋగ్వేద భాష్యంలో కాంతి యొక్క వేగాన్ని ప్రస్తావించాడు.

వీరు తమ ఋగ్వేద భాష్యంలో ఒక శ్లోకంపై వ్యాఖ్య లో (1.50 సూక్తము,4 వ శ్లోకం)
"ఓ! సూర్యదేవా నీ కిరణాలు అరనిమేషంలో 2202 యోజనాలు ప్రసరిస్తాయి"అన్నాడు.

మనకు తెలుసు
ఒక యోజనం=9.00625మైళ్ళు
మహాభారతం,శాంతిపర్వం ప్రకారం
అరనిమేషం= 8/75 సెకన్లు (ఇక్కడ 7.9789... ను సమీప 8 కు మార్చడం జరిగింది).

ఈ లెక్క ప్రకారం కాంతివేగం 186413.22 మైళ్ళు/సెకన్.
ఇప్పటి లెక్కప్రకారం ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.
ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం.ఎంత దగ్గరగా మనవాళ్ళు లెక్కించారో.

ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట భారతదేశంలోనే ఉంది


ప్రపంచంలో మొట్టమొదటి ఆనకట్ట భారతదేశంలోనే ఉంది.అంతేకాక నేటికీ అది చెక్కుచెదరకుండా ఉన్నదన్న విషయం అత్యంత ఆశ్చర్యకరం.కేవలం మరమ్మత్తులు మాత్రం చేశారు.నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ ఆనకట్ట నిదర్శనం.

ఈ ఆనకట్ట పేరు "కలనై".చోళరాజు "కరికాళ చోళుడు" కాలంలో క్రీ.శ 2వ శతాబ్దంలో నిర్మింపబడింది.తమిళనాడు లోని కావేరినది పై తంజావూరు పట్టణానికి 48 కి.మీ దూరంలో నిర్మింపబడి ఉంది.విచిత్రం ఏమిటంటే సిమెంట్ లాంటి ఏ అతుక్కోవడానికి ఉపయోగపడే (బైండింగ్ మెటీరియల్)దీని లో ఉపయోగించలేదు.
కావేరి నదీ జలాలను ఆనాటి నుండి నేటి దాకా నిరంతరాయంగా అనేక వేల ఎకరాలకు నీటిని అందిస్తూంది.
క్రీ.పూ 4వ శతాబ్దంలోనే గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద 'సుదర్శన జలాశయం' నిర్మింపబడింది.

సంఖ్యలను లెక్కించడంలో గ్రీకు,రోమనులకన్నా ముందున్న ప్రాచీన భారతదేశం


ప్రాచీన భారతీయుల గణితప్రతిభ క్రింద చూడండి.
1.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.(అనగా 0 నుండి 9 వరకు గల అంకెలతో లెక్కించు పద్దతి)
2.యజుర్వేదం 17వ అధ్యాయం,2వ మంత్రంలో పెర్కొనబడ్డ సంఖ్యల క్రమం
ఏక-1
దశ-10
శత-100
సహస్ర- 1000
ఆయుత-10000- పదివేలు
నీయుత- 100000-లక్ష
ప్రయుత- 1000000- పదిలక్షలు
అర్బుత- 10000000- కోటి
న్యార్బుద-100000000- పదికోట్లు
సముద్ర- 1000000000- వందకోట్లు
మధ్య- 10000000000- వేయికోట్లు
అంత- 100000000000- పదివేలకోట్లు
పరార్థ- 1000000000000- లక్షకోట్లు

క్రీ.పూ మొదటి శతాబ్దం నాటి "లలిత విస్తార"గ్రంథం లో "తల్లక్షణ" కొలమానం 10 ఘాతం 53(1 తర్వాత 53 సున్నాలు).
ప్రాచీన భారత జైనమతగ్రంథం ఐన "అనుయోగద్వార" లో 1 తర్వాత 140 సున్నాల వరకు గల సంఖ్య చెప్పబడింది.

3.ఆ కాలం నాటికి గ్రీకుల అతి పెద్ద సంఖ్య 10000(మీరియడ్).
4.రోమనులకు తెలిసిన పెద్ద సంఖ్య 1000(మిలి).

ఇక సున్న కనుగొన్నది మన భారతీయుడైన "ఆర్యభట" అని అందరికీ తెలుసు.
ఇతర గణిత ప్రక్రియలకు వస్తే నా గత టపాలైన "ఆర్యభటీయం","భాస్కరాచార్యుడు","ఆర్యభట" లలో వ్రాసాను.

"భారతీయులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము.వారే సులభంగా లెక్కించే దశాంశపద్దతిని ప్రపంచానికి అందించారు.అదే గనుక లేకపోతే నేడు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు". - అల్బర్ట్ ఐన్‌స్టీన్

ఓజోన్ - వేదాలు

ఋగ్వేదం 6వ అనువాకం,24 వ సూక్తం లోని 6,7 వ శ్లోకాలు



नहि ते कषत्रं न सहो न मन्युं वयश्चनामी पतयन्त आपुः
नेमा आपो अनिमिषं चरन्तीर्न ये वातस्य परमिनन्त्यभ्वम

अबुध्ने राजा वरुणो वनस्योर्ध्वं सतूपं ददते पूतदक्षः
नीचीना सथुरुपरि बुध्न एषामस्मे अन्तर्निहिताःकेतवः सयुः

అర్థం:
"ఓ వరుణ దేవా!నీవు పరాక్రమవంతుడవు.రెక్కలుగల పక్షులు నీని చేరలేవు.
నిన్ను అవి సహించలేవు
.ప్రవహించే నీరు కూడా నిన్నుచేరలేవు.వరుణుడు రాజులకు ప్రభువు.
ఆధారంలేని అంతరిక్షంలో
 అతను ఉన్నాడు.అతడు తేజో రాణి చే ఆవరింపబడిఉన్నాడు.కిరణములు 
అతని పై నుండి క్రిందకు
 ప్రసరిస్తున్నాయి.అందువలనే మన ప్రాణములు నిలిచిఉన్నవి.ఆ
 కిరణములకుమూలము 
అంతరిక్షమున ఉన్నది."
గమనించి చూస్తే వరుణదేవుడిని వాతావరణము గా,తేజోరాణి ని ఓజోన్
 పొరగా తెలుసుకోవచ్చు.

నీటి చికిత్స అనగా వాటర్ థెరపి - వేదాలు

ఋగ్వేదం లో క్రింది శ్లోకాలు పరిశీలించండి.ఇవి 5వ అనువాకం,23వ సూక్తం లోని 19,20,21 వ శ్లోకాలు

अप्स्वन्तरम्र्तमप्सु भेषजमपामुत परशस्तये देवाभवत वाजिनः
अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निं च विश्वशम्भुवमापश्च विश्वभेषजीः
आपः पर्णीत भेषजं वरूथं तन्वे मम जयोक च सूर्यं दर्शे

వీటి అర్థము:

"నీటి యందు అమృతము ఉన్నది.ఔషదములున్నవి.నీటి ప్రాముఖ్యతను చాటండి.ఇందులో సమస్త ఔషదాలున్నవి.నీటిలో విశ్వానికి ఉపయోగపడు అగ్ని ఉన్నది.నీరు మా శరీరమందలి సమస్త రోగాలను నశింపచేయు ఔషదము కావలెను.మేము చిరకాలము సూర్యున్ని చూడాలి అనగా ఎక్కువ కాలం బ్రతకాలి."
నీటి చికిత్స అనగా వాటర్ థెరపి గత శతాబ్దంలో కనుగొన్నట్లు ప్రచారంలో ఉంది.కాని పై శ్లోకాలను పరిశీలించిన అప్పుడే నీటి అద్భుత ఔషదగుణాలు మన ఋషులకు తెసిసినట్టు అర్థం చేసుకోవచ్చు.

భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు?ఋగ్వేదం లోని మంత్రం గమనించండి


మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు? మనం చదువుకున్నది 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్,కోపర్నికస్,గెలీలియోలని.

కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం " భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."

అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది" అని దాని అర్థం.

ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం " భూగోళః సర్వతో వృత్తః" అంటే " భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.

క్రీ.శ.505 లో వరాహమిహిరుడు " పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)"
అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.

లీలావతి గ్రంథం లో భాస్కరాచార్యుడు " నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో

శాంతి మంత్రము (పూర్తి శ్లోకము)

అసతోమా సద్గమయా


తమసోమా జ్యోతిర్గమయా

మృత్యోర్మా అమృతంగమయా

ఆవిరావిర్మయేతి రుద్రయిత్తే

దక్షిణమ్ ముఖం తేనమామ్ పాహినిత్యం

ఓం శాంతి శాంతి శాంతిః

అర్థము:

అసత్(భ్రాంతి) నుండి   సత్ (సత్యము) కు 
చీకటి (అజ్ఞానము) నుండి వెలుగు(జ్ఞానము) నకు
మృత్యువు నుండి అమృతత్వము వైపునకు మనము పోవుదము గాక.
అందుకొరకై దక్షిణముఖుడైన రుద్రున్ని మేము నిత్యమూ అనగా ప్రతిరోజూ ప్రార్థిస్తాము. 

ఓం శాంతి శాంతి శాంతి

సముద్రంలో ప్రయాణాన్ని వేదాలలో నిషేధించలేదు



ఋగ్వేదం 4వ అధ్యాయం,9వ అనువాకం,48వ సూక్తం


उवासोषा उछाच्च नु देवी जीरा रथानाम
ये अस्या आचरणेषु दध्रिरे समुद्रे न शरवस्यवः


అర్థము:

ధనము కోరువారు సముద్రమున నావలు నడుపుతారు.ఆట్లే ఉదయాకాశమునుఉషోదేవినడుపుచున్నది.ఇంతకు పూర్వము కూడా నడిపినది.ఇప్పుడూ నడుపుచున్నది.


సముద్రమున నావలు నడపడం ధనం కొరకు అని అన్నప్పుడు,సముద్రయానం వ్యాపారం కొరకే అనికదా అర్థము.దీనినిబట్టి వేదకాలములోనే మన పూర్వీకులు సముద్ర ప్రయాణం (ఇతర దేశాలతో కూడాఅయ్యుండవచ్చు) ద్వారావ్యాపారము చేస్తున్నట్టు అర్థం అగుచున్నది.


అంతేకాక సముద్రయానము నిషేదము అన్నది వేదకాలం తర్వాత ఎవరో మన గ్రంధాలలో చొప్పించారుఅన్నది అర్థంఅవుతోంది.

నవ వ్యాకరణాలు అంటే ఏవి?ఏవో చూద్దామా!

శ్రీమద్‌రామాయణంలో మొదటిసారి హనుమంతుడిని శ్రీరామ,లక్ష్మణులు కలుసుకొన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని మాటతీరుని మెచ్చుకొంటూ హనుమను "నవ వ్యాకరణ"పండితుడని పొగుడుతాడు.
















1.పాణినీయం
2.కలాపం
3.సుపద్మం
4.సారస్వతం
5.ప్రాతిశాఖ్యం (కుమార వ్యాకరణం)
6.ఐంద్రం
7.వ్యాఘ్రభౌతికం
8.శకటాయనం
9.శాకల్యం