Followers

Saturday 8 August 2015

మోక్షసన్న్యాసయోగ: 9 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత


అర్జున ఉవాచ :- 

నష్టో మోహః స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత,
స్థితోస్మి గతసందేహః
కరిష్యే వచనం తవ.



అర్జునుడు చెప్పెను - ఓ శ్రీకృష్ణా! మీయను గ్రహము వలన నా యజ్ఞానము నశించినది. జ్ఞానము (ఆత్మస్మృతి) కలిగినది. సంశయములు తొలగినవి. ఇక మీ యాజ్ఞను నెఱవేర్చెదను.

******************************************************************************************* 73

సంజయ ఉవాచ :-

ఇత్యహం వాసుదేవస్య
పార్థస్య చ మహాత్మనః,
సంవాదమిమమశ్రౌష
మద్భుతం రోమహర్షణమ్‌.



సంజయుడు చెప్పెను - ఓ దృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణునియొక్కయు, మహాత్ముడగు అర్జునునియొక్కయు ఆశ్చర్యకరమైనట్టియు, పులకాంకురమును గలుగజేయునదియునగు ఈ సంభాషణము వింటిని.

******************************************************************************************* 74

వ్యాసప్రసాదాచ్ఛ్రుతవా
నేతద్గుహ్యతమం పరమ్‌,
యోగం యోగేశ్వరాత్కృష్ణా
త్సాక్షాత్కథయతస్స్వయమ్‌.



శ్రీ వేదవ్యాసమహర్షి యొక్క అనుగ్రహము వలన, నేను అతిరహస్యమైనదియు, మిగుల శ్రేష్ఠమైనదియు నగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగీశ్వరుడగు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా (నేరులో) వింటిని.

******************************************************************************************* 75

రాజమ్‌ సంస్మృత్య సంస్మృత్య
సంవాదమిమమద్భుతమ్‌,
కేశవార్జునయోః పుణ్యం
హృష్యామి చ ముహుర్ముహుః.



ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆశ్చర్యకరమైనదియు, పావనమైనదియు, (లేక పుణ్యదాయకమైనదియు) నగు కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును, తలంచి మాటిమాటికి ఆనందమును బొందుచున్నాను.

******************************************************************************************* 76

తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరేః,
విస్మయో మే మహాన్‌ రాజన్‌
హృష్యామి చ పునః పునః.



ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణమూర్తి యొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. మఱియు (దానిని తలంచుకొని) మాటిమాటికిని సంతోషమును బొందుచున్నాను.

******************************************************************************************* 77

యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః,
తత్ర శ్రీర్విజయో భూతి
ర్ధ్రువా నీతిర్మతిర్మమ.



ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను, ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము.

******************************************************************************************* 78


ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్రికా్యాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, మోక్షసన్న్యాసయోగోనామ, అష్టదశోధ్యాయః


                                                                     శ్రీ కృష్ణార్పణమస్తు

                                                                      ఓమ్‌ తత్‌ సత్‌

మోక్షసన్న్యాసయోగ: 8 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత



సర్వగుహ్యతమం భూయః
శృణు మే పరమం వచః,
ఇష్టోసి మే దృఢమితి
తతో వక్ష్యామి తే హితమ్‌.



(ఓ అర్జునా!) రహస్యము లన్నిటిలోను పరమ రహస్యమైనదియు, శ్రేష్ఠ మైనదియునగు నా వాక్యమును మఱల వినుము. (ఏలయనిన) నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు. ఇక్కారణమున నీయొక్క హితమునుగోరి మఱల చెప్పుచున్నాను.

******************************************************************************************* 64

మన్మనాభవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు,
మామేవైష్యసి సత్యం తే
ప్రతిజానే ప్రియోసి మే.



నాయందు మనస్సునుంచుము. నాయెడల భక్తి గలిగియుండుము. నన్నారాధింపుము. నాకు నమస్కరింపుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడవై యున్నావు. కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

******************************************************************************************* 65

సర్వధర్మాన్‌ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ,
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మాశుచః.



సమస్త ధరములను విడిచిపెట్టి నన్నొక్కనిమాత్రము శరణుబొందుము. నేను సమస్త పాపముల నుండియు నిన్ను విముక్తినిగ జేసెదను.

******************************************************************************************* 66

ఇదం తే నాతపస్కాయ
నాభక్తాయ కదాచన,
న చాశుశ్రూషవే వాచ్యం
న చ మాం యోభ్యసూయతి.



నీకు బోధింపబడిన ఈ గీతాశాస్త్రము తపస్సు లేనివానికిగాని, భక్తుడుకానివానికిగాని, వినుట కిష్టము లేనివానికిగాని లేక గురుసేవ చేయనివానికిగాని, నన్ను దూషించువానికిగాని (లేక నాయెడల అసూయజెందువానికిగాని) ఎన్నడును చెప్పదగినదికాదు.

******************************************************************************************* 67

య ఇమం పరమం గుహ్యం
మద్భక్తేష్వభిధాస్యతి,
భక్తిం మయి పరాం కృత్వా
మామేవైష్యత్యసంశయః.



ఎవడు అతిరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టివాడు నాయం దుత్తమ భక్తి గలవాడై, సంశయరహితుడై (లేక నిస్సందేహముగ) నన్నే పొందగలడు.

******************************************************************************************* 68

న చ తస్మాన్మనుష్యేషు
కశ్చిన్మే ప్రియకృత్తమః,
భవితా న చ మే తస్మా
దన్యః ప్రియతరో భువి.



మనుజులలో అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియము నొనర్చు వాడెవడును లేడు. మఱియు అతనికంటె నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మఱియొకడు కలుగబోడు.

******************************************************************************************* 69

అధ్యేష్యతే చ య ఇమం
ధర్మ్యం సంవాదమావయోః,
జ్ఞానయజ్ఞేన తేనాహ
మిష్టస్స్యామితి మే మతిః.



ఎవడు ధర్మయుక్తమైన (లేక ధర్మస్వరూపమేయగు) మన యిరువురి ఈ సంభాషణమును అధ్యయనముచేయునో అట్టివానిచే జ్ఞానయజ్ఞముచేత నేనారాధింప బడినవాడనగుదునని నా నిశ్చయము.

******************************************************************************************* 70

శ్రద్ధావాననసూయశ్చ
శృణుయాదపి యో నరః,
సోపి ముక్తశ్శుభాన్‌ లోకాన్‌
ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్‌.



ఏ మనుజుడు శ్రద్ధతోగూడినవాడును, అసూయలేనివాడునునై ఈ గీతాశాస్త్రమును వినునో, అట్టివాడును పాపవిముక్తుడై పుణ్యకార్యములను చేసినవారి యొక్క పుణ్యలోకములను పొందును.

******************************************************************************************* 71

కచ్చి దేతచ్ఛ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా,
కచ్చి దజ్ఞానసమ్మోహః
ప్రనష్ట స్తే ధనంజయ.



ఓ అర్జునా! నాయీబోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా? అజ్ఞానజనితమగు నీయొక్క భ్రమ (దానిచే) సంపూర్ణముగా నశించినదా?

******************************************************************************************* 72


మోక్షసన్న్యాసయోగ: 7 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

భక్త్వా మామభిజానాతి
యావాన్యశ్చాస్మి తత్త్వతః,
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా
విశతే తదనంతరమ్‌.



భక్తి చేత మనుజుడు నేనెంతటివాడనో, ఎట్టివాడనో, యథార్థముగ తెలిసికొనుచున్నాడు. ఈ ప్రకారముగ నన్ను గూర్చి వాస్తవముగా నెఱింగి అనంతరము నాయందు ప్రవేశించచచున్నాడు.

******************************************************************************************* 55

సర్వకర్మాణ్యపి సదా
కుర్వాణో మద్వ్యపాశ్రయః,
మత్ప్రసాదాదవాప్నోతి
శాశ్వతం పదమవ్యయమ్‌.



సమస్తకర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు (శరణుబొందువాడు) నా యనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు .

******************************************************************************************* 56

చేతసా సర్వకర్మాణి
మయి సన్న్యస్య మత్పరః,
బుద్ధియోగ ముపాశ్రిత్య
మచ్చిత్త స్సతతం భవ.



సమస్త కర్మములను (కర్మఫలములను) వివేకయుక్తమగు బుద్ధిచేత నాయందు సమర్పించి, నన్నే పరమప్రాప్యముగా నెంచిన వాడవై చిత్తైకాగ్రతతో గూడిన తత్త్వవిచారణను (లేక ధ్యానయోగమును) అవలంబించి, ఎల్లప్పుడు నాయందే చిత్తమును నిల్పుము.

******************************************************************************************* 57

మచ్చిత్తస్సర్వదుర్గాణి
మత్ప్రసాదాత్తరిష్యసి,
అథ చేత్త్వమహంకారా
న్న శ్రోష్యసి వినక్షసి.



నాయందు చిత్తమును జేర్చినవాడవైతివేని నా అనుగ్రహము వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు. అట్లుగాక అహంకారమువలన నా యీ వాక్యములను వినకుందువేని చెడిపోదువు.

******************************************************************************************* 58

యద్యహంకారమాశ్రిత్య
న యోత్స్య ఇతి మన్యసే,
మిథ్యైష వ్యవసాయస్తే
ప్రకృతి స్త్వాం నియోక్ష్యతి.



ఒక వేళ అహంకారము నవలంబించి 'నేను యుద్ధము చేయను' అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) నియోగింపగలదు.

******************************************************************************************* 59

స్వభావజేన కౌంతేయ
నిబద్ధ స్స్వేన కర్మణా,
కర్తుం నేచ్ఛసి యన్మోహా
త్కరిష్యస్యవశోపి తత్‌.



ఓ అర్జునా! స్వభావము (పూర్వజన్మ సంస్కారము) చే గలిగిన (ప్రకృతి సిద్ధమైన) నీయొక్క కర్మముచే లెస్సగ బంధింపబడినవాడవై దేనిని చేయుటకు అవివేకమున నిచ్చగింపకున్నావో దానిని పరాధీనుడవై (కర్మధీనుడవై) తప్పక చేసియే తీరుదువు.

******************************************************************************************* 60

ఈశ్వర స్సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్ఠతి,
భ్రామయన్‌ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా.



ఓ అర్జునా! జగన్నియామకుడగు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత సమస్త ప్రాణులను యంత్రము నారోహించినవారినివలె (కీలుబొమ్మలను వలె) త్రిప్పుచు సమస్త ప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు.

******************************************************************************************* 61

తమేవ శరణం గచ్ఛ
సర్వభావేన భారత,
తత్ప్రసాదాత్పరాం శాంతిం
స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌.



ఓ అర్జునా! సర్వవిధముల ఆ (హృదయస్థుడగు) ఈశ్వరునే శరణుబొందుము. అతని యనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు.

******************************************************************************************* 62

ఇతి తే జ్ఞానమాఖ్యాతం
గుహ్యాద్గుహ్యతరం మయా,
విమృశ్యైత దశేషేణ
యథేచ్ఛసి తథా కురు.



ఈ విధముగా రహస్యము లన్నిటి కంటెను పరమరహస్యమైనట్టి జ్ఞానమును (గీతాశాస్త్రమును) నేను నీకు జెపితిని. దీనినంతను బాగుగ విచారణ చేసి తదుపరి నీకెట్లిష్టమో అట్లాచరింపుము.

******************************************************************************************* 63


మోక్షసన్న్యాసయోగ: 6 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యతః ప్రవృత్తిర్భూతానాం
యేన సర్వమిదం తతమ్‌,
స్వకర్మణా తమభ్యర్చ్య
సిద్ధిం విందతి మానవః.



ఎవనివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము (ప్రవృత్తి) కలుగుచున్నదో, ఎవనిచేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడియున్నదో, ఆతనిని (అట్టి పరమాత్మను) మనుజుడు స్వకీయ కర్మముచే నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు.

******************************************************************************************* 46

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్‌,
స్వభావనియతం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌.



తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణము లేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మము కంటె శ్రేష్ఠమైనదేయగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు .

******************************************************************************************* 47

సహజం కర్మ కౌంతేయ
సదోషమపి న త్యజేత్‌,
సర్వారంభా హి దోషేణ
ధూమేనాగ్ని రివావృతాః.



ఓ అర్జునా! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను (దృశ్యరూపమైనను, లేక త్రిగుణాత్మకమైనను) దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడునట్లు సమస్త కర్మములు (త్రిగుణములయొక్క) దోషముచేత కప్పబడియున్నవికదా!

******************************************************************************************* 48

అసక్త బుద్ధిస్సర్వత్ర
జితాత్మా విగతస్పృహః,
నైష్కర్మ్యసిద్ధిం పరమాం
సన్న్యాసేనాధిగచ్ఛతి.



సమస్త విషయములందును తగులుబాటు నొందని (అసక్తమగు) బుద్ధిగలవాడును, మనస్సును జయించిన వాడును, కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగముచే (జ్ఞానమార్గముచే) సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు.

******************************************************************************************* 49

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
తథాప్నోతి నిబోధమే,
సమాసేనైవ కౌంతేయ
నిష్ఠా జ్ఞానస్య యా పరా.



ఓ అర్జునా! కర్మసిద్ధిని (నిష్కామకర్మలచే చిత్తశుద్ధిని) బడసినవాడు పరమాత్మ నే ప్రకారము పొందగలడో ఆ విధమును మఱియు జ్ఞానముయొక్క శ్రేష్ఠమైన నిష్ఠ (లేక పర్వయసానము) ఏది కలదో దానినిన్ని (జ్ఞాననిష్ఠను, లేక జ్ఞానపరాకాష్ఠను) సంక్షేపముగ నావలన దెలిసికొనుము.

******************************************************************************************* 50

బుద్ధ్యా విశుద్దయా యుక్తో
ధృత్యాత్మానం నియమ్య చ,
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా
రాగద్వేషౌ వ్యుదస్య చ.



వివిక్త సేవీ లఘ్వాశీ
యతవాక్కాయ మానసః,
ధ్యానయోగపరో నిత్యం
వైరాగ్యం సముపాశ్రితః.



అహంకారం బలం దర్పం
కామం క్రోధం పరిగ్రహమ్‌
విముచ్య నిర్మమశ్శాంతో
బ్రహ్మభూయాయ కల్పతే.



అతినిర్మలమైన బుద్ధితో గూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును, శబ్ద స్పర్శాది విషయములను విడిచిపెట్టువాడును, రాగద్వేషములను పరిత్యజించువాడును, ఏకాంత స్థలమునందు నివసించువాడును, మితాహారమును సేవించువాడును, వాక్కును, శరీరమును, మనస్సును స్వాధీనము చేసికొనినవాడును, ఎల్లప్పుడును ధ్యానయోగతత్పరుడై యుండువాడును, వైరాగ్యమును లెస్సగ నవలంబించినవాడును, అహంకారమును, బలమును (కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండిపట్టును), డంబమును, కామమును (విషయాసక్తిని), క్రోధమును, వస్తుసంగ్రహణమును బాగుగ వదలివైచువాడును, మమకారము లేనివాడును, శాంతుడును అయియుండువాడు బ్రహ్మస్వరూపము నొందుటకు (బ్రహ్మైక్యమునకు, మోక్షమునకు) సమర్థుడగుచున్నాడు.

******************************************************************************************* 51,52,53

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా
న శోచతి న కాంక్షతి,
సమస్సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరామ్‌.



బ్రహ్మరూపమును (బ్రహ్మైక్యమును) బొందిన వాడు (జీవన్ముక్తుడు), నిర్మలమైన (ప్రశాంతమైన) మనస్సు గలవాడునగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖించడు. దేనిని కోరడు; సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై (వానిని తనవలెనే చూచుకొనుచు) నాయందలి ఉత్తమభక్తి పొందుచున్నాడు.

******************************************************************************************* 54


మోక్షసన్న్యాసయోగ: 5 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యత్తదగ్రే విషమివ
పరిణామేమృతోపమమ్‌,
తత్సుఖం సాత్త్వికం ప్రోక్త
మాత్మబుద్ధి ప్రసాదజమ్‌.



ఓ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధియొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది .

******************************************************************************************* 37

విషయేంద్రియసంయోగా
ద్యత్తదగ్రేమృతోపమమ్‌,
పరిణామే విషమివ 
తత్సుఖం రాజసం స్మృతమ్‌.



ఏ సుఖము విషయేంద్రియ సంబంధము వలన మొదట అమృతమునుబోలియు, పర్వవసానమందు (అనుభవానంతరరమున) విషము వలెను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడననది .

******************************************************************************************* 38

యదగ్రే చానుబంధే చ
సుఖం మోహనమాత్మనః,
నిద్రాలస్యప్రమాదోత్థం
తత్తామసముదాహృతమ్‌.



నిద్ర, సోమరితనము, ప్రమత్తత - అనువాని వలన బుట్టినదై ఏ సుఖము ఆరంభమందును, అంతమందును (అనుభవించినమీదట) తనకు మోహమును (అజ్ఞానమును, భ్రమను) గలుగజేయుచున్నదో అది తామససుఖమని చెప్పబడినది.

******************************************************************************************* 39

న తదస్తి పృథివ్యాం వా
దివి దేవేషు వా పునః,
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం
యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః.



ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు ఈ మూడు గుణములతో గూడియుండని వస్తు వీ భూలోకమున గాని, స్వర్గమందుగాని, దేవతలయందు గాని ఎచ్చటను లేదు.

******************************************************************************************* 40

బ్రాహ్మణ క్షత్రియ విశాం
శూద్రాణాం చ పరంతప,
కర్మాణి ప్రవిభక్తాని
స్వభావ ప్రభవైర్గుణైః.



శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు (వారి వారి జన్మాంతర సంస్కారము ననుసరించి) స్వభావము (ప్రకృతి) వలన పుట్టిన గునములనుబట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడననవి.

******************************************************************************************* 41

శమోదమస్తపః శౌచం
క్షాంతిరార్జవ మేవ చ,
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం
బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌.



అంతరింద్రియ నిగ్రహము (మనోనిగ్రహము) బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, ఋజుమార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దైవమందు, గురువునందు, శాస్త్రమందు నమ్మముగలిగియుండుట స్వభావమువలన పుట్టిన బ్రాహ్మణకర్మయై యున్నది.

******************************************************************************************* 42

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం
యుద్ధేచాప్య పలాయనమ్‌,
దాన మీశ్వర భావశ్చ
క్షాత్రం కర్మస్వభావజమ్‌.



శూరత్వము, తేజస్సు (కీర్తి, ప్రతాపము), ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పాఱిపోకుండుట, దానము (ధర్మపూర్వక), ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) - ఇయ్యవి స్వభావము వలన పుట్టిన క్షత్రియ కర్మమైయున్నదది.

******************************************************************************************* 43

కృషి గోరక్ష వాణిజ్యం
వైశ్యం కర్మ స్వభావజమ్‌
పరిచర్యాత్మకం కర్మ
శూద్రస్యాపి స్వభావజమ్‌.



వ్యవసాయము, గోసంరక్షణము, వర్తకము వైశ్యునకు స్వభావజనితములగు కర్మములైయున్నవి. అట్లే సేవారూపమైన కర్మము శూద్రునకు స్వభావసిద్ధమై యున్నది.

******************************************************************************************* 44

స్వే స్వే కర్మణ్యభిరత
స్సంసిద్ధిం లభతే నరః,
స్వకర్మ నిరతస్సిద్ధిం
యథా విందతి తచ్ఛృణు.



తన తన స్వాభావిక కర్మమునం దాసక్తి (శ్రద్ధ) గల మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని బొందుచున్నాడు. స్వకీయకర్మయం దాసక్తిగలవాడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని యెట్లు పడయగల్గునో దానిని చెప్పెదను వినుము.

******************************************************************************************* 45


మోక్షసన్న్యాసయోగ: 4 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
శఠో నైష్కృతికో లసః,
విషాదీ దీర్ఘసూత్రీ చ
కర్తా తామస ఉచ్యతే.



మనోనిగ్రహము (లేక చిత్తైకాగ్రత) లేనివాడును, పామరస్వభావము గలవాడును (అవివేకియు), వినయములేని వాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనమును పాడుచేయువాడును, సోమరితనముగలవాడును, ఎల్లప్పుడును దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో చేయవలసిన దానిని దీర్ఘకాలమునకైనను పూర్తిచేయనివాడునునగు కర్త తామసకర్తయని చెప్పబడుచున్నాడు.

******************************************************************************************* 28

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
గుణతస్త్రివిధం శృణు,
ప్రోచ్యమానమశేషేణ
పృథక్త్వేన ధనంజయ.



ఓ అర్జునా! బుద్ధి యొక్కయు, ధైర్యము యొక్కయు భేదమును గుణములనుబట్టి మూడు విధములుగా వేర్వేరుగను, సంపూర్ణముగను చెప్పబడుచున్నదానిని (నీ విపుడు) వినుము.

******************************************************************************************* 29

ప్రవృత్తిం చ నివృత్తిం చ
కార్యాకార్యే భయాభయే,
బంధం మోక్షం చ యా వేత్తి
బుద్ధిస్సా పార్థ సాత్త్వికీ.



ఓ అర్జునా! ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని (లేక ప్రవృత్తి మార్గమగు కర్మమార్గమును), అధర్మము నుండి నివృత్తిని (లేక నివృత్తి మార్గమగు సన్న్యాస మార్గమును), చేయదగుదానిని, చేయదగనిదానిని, భయమును, అభయమును, బంధమును, మోక్షమును తెలిసికొనుచున్నదో అట్టి బుద్ధి సాత్త్వికమైనది యగును.

******************************************************************************************* 30

యయా ధర్మమధర్మం చ
కార్యం చాకార్య మేవ చ,
అయథావత్పృజానాతి
బుద్ధిస్సా పార్థ రాజసీ.



ఓ అర్జునా! ఏ బుద్ధిచేత మనుజుడు ధర్మమును, అధర్మమును, చేయదగినదానిని, చేయరాని దానిని, ఉన్నది యున్నట్లుకాక (మరియొక విధముగ, పొరబాటూగ) తెలిసికొనుచున్నాడో ఆ బుద్ధి రాజసబుద్ధియై యున్నది.

******************************************************************************************* 31

అధర్మం ధర్మమితి యా
మన్యతే తమసా వృతా,
సర్వార్థాన్విపరీతాంశ్చ
బుద్ధిస్సా పార్థ తామసీ.



ఓ అర్జునా! ఏ బుద్ధి అవివేకముచేత కప్పబడినదై అధర్మమును ధర్మమని యెంచునో, మరియు సమస్త పదార్థములను విరుద్ధములుగా తలంచునో, అట్టి బుద్ధి తామసబుద్ధియై యున్నది.

******************************************************************************************* 32

ధృత్యా యయా ధారయతే
మనఃప్రాణేంద్రియక్రియాః,
యోగేనావ్యభిచారిణ్యా
ధృతిస్సా పార్థ సాత్త్వికీ.



ఓ అర్జునా! చలింపని (విషయములందు ప్రవర్తింపని) ఏ ధైర్యముతో గూడినవాడై మనస్సు యొక్కయు, ప్రాణము యొక్కయు, ఇంద్రియముల యొక్కయు, క్రియలను యోగసాధనచేత (విషయముల నుండి త్రిప్పి) ఆత్మధ్యానమున (లేక) శస్త్రోక్త మార్గమున) నిలువబెట్టుచున్నాడో, అట్టి ధైర్యము సాత్త్వికమైనది.

******************************************************************************************* 33

యయా తు ధర్మకామార్థాన్‌
ధృత్యా ధారయతేర్జున,
ప్రసజ్గేన ఫలాకాంక్షీ
ధృతిస్సా పార్థ రాజసీ.



ఓ అర్జునా! ఏ ధైర్యముచేత మనుజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును, అర్థమును, కామమును మిగుల యాసక్తితో అనుష్ఠించుచుండువో, అట్టి ధైర్యము రాజసమైయున్నది.

******************************************************************************************* 34

యయా స్వప్నం భయం శోకం
విషాదం మదమేవ చ
న విముఞ్చతి దుర్మేధా
ధృతిస్సా పార్థ తామసీ.



ఓ అర్జునా! ఏ బుద్ధిచేత దుర్బుద్ధియగు మనజుడు నిద్రను, భయమును, దుఃఖమును, సంతాపమును (దిగులును), మదమును విడువకయుండునో, అట్టి ధైర్యము తామసమైనది.

******************************************************************************************* 35

సుఖం త్విదానీం త్రివిధం
శృణు మే భరతర్షభ,
అభ్యాసాద్రమతే యత్ర
దుఃఖాంతం చ నిగచ్ఛతి.



భతతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! దేనియొక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము నొందుచుండునో, దుఃఖశాంతిని గూడ లెస్సగ బడయుచుండునో, అట్టి సుఖమిపుడు మూడువిధములుగా నాచే తెలుపబడుచున్నది. వినుము-.

******************************************************************************************* 36


మోక్షసన్న్యాసయోగ: 3 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

జ్ఞానం కర్మ చ కర్తా చ
త్రిధైవ గుణభేదతః,
ప్రోచ్యతే గుణసంఖ్యానే
యథావచ్ఛృణు తాన్యపి



గుణములను గూర్చి విచారణచేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అను నివియు సత్త్వాది గుణములయొక్క భేదము ననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి. వానినిగూడ యథారీతి (శాస్త్రోక్తప్రకారము) చెప్పెదను వినుము.

******************************************************************************************* 19

సర్వభూతేషు యేనైకం
భావ మవ్యయ మీక్షతే,
అవిభక్తం విభక్తేషు
తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్‌.



విభజింపబడి వేరువేరుగనున్న సమస్తచరాచర ప్రాణులందును, ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును (దైవము యొక్క ఉనికిని) విభజింపబడక (ఏకముగ) నున్నట్లు ఏ జ్ఞానముచేత నెరుగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్త్వికమని తెలిసికొనుము.

******************************************************************************************* 20

పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానాభావాన్‌ పృథగ్విధాన్‌,
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ది రాజసమ్‌.



ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్త ప్రాణులందును వేరు వేరు విధములుగనున్న అనేక జీవులను వేరువేరుగా నెరుగుచున్నాడో అట్టి జ్ఞానమును రాజసజ్ఞానమని తెలిసికొనుము .

******************************************************************************************* 21

యత్తు కృత్స్నవదేకస్మి
కార్యే సక్తమహైతుకమ్‌,
అతత్త్వార్థవదల్పం చ
తత్తామస ముదాహృతమ్‌.



ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్కపని యందు (శరీర, ప్రతిమాదులందు) సమస్తమును అదియేయని తగిలియుండునో, అందుకు తగిన హేతువు లేకుండునో, తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో, అల్పమైనదిగ (అల్పఫలము గలిగినదిగ) నుండునో, అట్టి జ్ఞానము తామసజ్ఞానని చెప్పబడినది.

******************************************************************************************* 22

నియతం సజ్గరహిత
మరాగద్వేషతః కృతమ్‌,
అఫల ప్రేప్సునాకర్మ
యత్తత్సాత్త్వికముచ్యతే



శాస్త్రములచే నియమింపబడినదియు, ఫలాపేక్షగాని, ఆసక్తి (సంగము), అభిమానముగాని, రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్వకకర్మ మనబడును.

******************************************************************************************* 23

యత్తు కామేప్సునాకర్మ
సాహంకారేణ వా పునః,
క్రియతే బహులాయాసం
తద్రాజస ముదాహృతమ్‌



ఫలాపేక్షగలవానిచేతగాని, మరియు అహంకారముతో గూడిన వానిచేగాని అధిక ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచున్నదో అది రాజసకర్మయని చెప్పబడినది.

******************************************************************************************* 24

అనుబంధం క్షయం హింసా
మనపేక్ష్య చ పౌరుషమ్‌
మోహాదారభ్యతేకర్మ
యత్తత్తామస ముచ్యతే



తాను చేయు కర్మకు మన్ముందు కలుగబోవు దుఃఖాదులను (ధానాదుల) నాశమును, (తనయొక్క, ఇతరులయొక్క శరీరాదులకుగల్గు) బాధను; తన సామర్థ్యమును ఆలోచింపక, అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మయని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 25

ముక్త సజ్గోనహంవాదీ
ధృత్యుత్సాహ సమన్వితః,
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః
కర్తా సాత్త్విక ఉచ్యతే.



సంగమము (ఆసక్తిని)ఫలాపేక్షను విడిచినవాడును, 'నేనుకర్త' నను అభిమానము, అహంభావము లేనివాడును, ధైర్యముతోను, ఉత్సాహముతోను గూడియున్నవాడును, కార్యము సిద్ధించినను, సిద్ధింపకున్నను వికారమును జెందని వాడునగు కర్త సాత్త్వికకర్తయని చెప్పబడుచున్నాడు.

******************************************************************************************* 26

రాగీ కర్మఫలప్రేప్సు
ర్లుబ్ధో హింసాత్మకో శుచిః,
హర్ష శోకాన్వితః కర్తా
రాజసః పరికీర్తితః



అనురాగము (బంధ్వాదులందభిమానము) గలవాడును, కర్మఫలము నాశించువాడును, లోభియు, హింసాస్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, (కార్యము సిద్ధించినపుడు) సంతోషముతోను, (చెడినపుడు) దుఃఖముతోను గూడియుండువాడునగు కర్త రాజసకర్తయని చెప్పబడును.

******************************************************************************************* 27


మోక్షసన్న్యాసయోగ: 2 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

న ద్వేష్ట్యకుశలం కర్మ
కుశలే నానుషజ్జతే,
త్యాగీ సత్త్వసమావిష్టో
మేధావీ ఛిన్న సంశయః



సత్త్వగుణముతో గూడినవాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను బోగొట్టుకొనినవాడునునగు త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరము నగు కర్మను ద్వేషింపడు. శుభమును, నిష్కామమును, సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు. (అభిమానము కలిగియుండడు).

******************************************************************************************* 10

న హి దేహభృతా శక్యం
త్యక్తుం కర్మాణ్య శేషతః,
యస్తు కర్మఫలత్యాగీ
స త్యాగీత్యభిధీయతే.



కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునకు సాధ్యముకాదు. ఎవడు కర్మముల యొక్క ఫములను విడుచుచున్నాడో అట్టివాడే త్యాగియని పిలువబడుచున్నాడు.

******************************************************************************************* 11

అనిష్టమిష్టం మిశ్రం చ
త్రివిధం కర్మణః ఫలమ్‌,
భవత్య త్యాగినాం ప్రేత్య
న తు సన్న్యాసినాం క్వచిత్.



దుఃఖకరమైనదియు, సుఖకరమైనదియు, సుఖదుఃఖములు రెండును గలసినదియునగు మూడు విధములైన కర్మఫలము కర్మఫలత్యాగము చేయనివారలకు మరణానంతరము కలుగుచున్నది. కర్మఫలత్యాగము చేసినవారికన్ననో అవి యెన్నటికిని కలుగనేరవు.

******************************************************************************************* 12

పఞ్చైతాని మహాబాహో
కారణాని నిభోధ మే,
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణామ్‌.



గొప్ప బాహువులుకల ఓ అర్జునా! సమస్త కర్మలునెరవేరుటకు కర్మకాండయొక్క అంతమును దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము.

******************************************************************************************* 13

అధిష్ఠానం తథా కర్తా
కరణం చ పృథగ్విధమ్‌,
వివిధాశ్చ పృథ క్చేష్టా
దైవం చైవాత్ర పఞ్చమమ్‌



ఈ కర్మాచరణ విషయమున 1. శరీరము 2. కర్త 3. వివిధములగు ఇంద్రియములు 4. పలువిధములుగను, వేరు వేరుగను నుండు క్రియలు (వ్యాపారములు) ఐదవదియగు 5. దైవమును కారణములుగా నున్నవి.

******************************************************************************************* 14

శరీరవాజ్మనోభిర్య
త్కర్మ ప్రారభతే నరః,
న్యాయ్యం వా విపరీతం వా
పఞై తే తస్య హేతవః.



మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అనువీనిచేత న్యాయమైనట్టిగాని (శాస్త్రీయమైనట్టి) గాని, అన్యాయమైనట్టి (అశాస్త్రీయమైనట్టి) గాని ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో, దాని కీయైదున్ను కారణములైయున్నవి .

******************************************************************************************* 15

తత్రైవం సతి కర్తార
మాత్మానం కేవలం తు యః,
పశ్యత్యకృతబుద్ధిత్వా
న్న స పశ్యతి దుర్మతిః.



కర్మవిషయమందిట్లుండగా (పైనదెల్పిన అయిదున్ను కారణములై యుండగా) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే, నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో, అట్టి అవివేకి కర్మము యొక్క గాని, ఆత్మ యొక్కగాని, వాస్తవ స్వరూపమును ఎఱుగకున్నాడు.

******************************************************************************************* 16

యస్య నాహంకృతో భావో
బుద్ధిర్యస్య న లిప్యతే,
హత్వాపి స ఇమాన్‌
లోకాన్న హంతి న నిబధ్యతే.



ఎవనికి ' నేను' కర్తను అను తలంపులేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుటలేదు. మఱియు నతడు కర్మలచే, పాపముచే బంధింపబడుటయులేదు.

******************************************************************************************* 17

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
త్రివిధా కర్మచోదనా,
కరణం కర్మ కర్తేతి
త్రివిధః కర్మసంగ్రహః.



కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియువాడు అని మూడు విధములుగ నున్నది. అట్లే కర్మ కాధారమున్ను ఉపకరణము (సాధనము), క్రియ, చేయువాడు - అని మూడు విధములుగ నున్నది.

******************************************************************************************* 18


మోక్షసన్న్యాసయోగ: 1 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

అర్జున ఉవాచ: - 
సన్న్యాసస్య మహాబాహో
తత్త్వమిచ్ఛామి వేదితుమ్,
త్యాగస్య చ హృషీకేశ.
పృథక్కే శినిషూదన



అర్జునుడు అడిగెను:- గొప్ప భుజములు గలవారును, ఇంద్రియముల యొక్క నియామకులును, కేశియను రాక్షసుని సంహరించినవారు నాగు ఓ కృష్ణా! సన్న్యాసము యొక్కయు, త్యాగము యొక్కయు యథార్థమును తెలిసికొనగోరుచున్నాను. కావున ఆ రెండిటిని వేఱు వేఱుగా నాకు చెప్పుడు .

******************************************************************************************* 1

శ్రీ భగవానువాచ:- 
కామ్యానాం కర్మణాం న్యాసం
సన్న్యాసం కవయో విదు:,
సర్వకర్మఫలత్యాగం
ప్రాహుస్త్యాగం విచక్షణా:.



శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) కామ్యకర్మలను వదలుటచే సన్న్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మలయొక్క ఫలమును త్యజించుటచే త్యాగమని వచించుదురు.

******************************************************************************************* 2

త్యాజ్యం దోషవదిత్యేకే
కర్మ ప్రాహుర్మనీషిణ:,
యజ్ఞదానతప:కర్మ
న త్యాజ్యమితి చాపరే.



కొందరు బుద్ధిమంతులు (సాంఖ్యులు) దోషమువలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరి కొందరు యజ్ఞము, దానము, తపస్సు - మున్నగు కర్మములు విడువదగనివనియు చెప్పుదురు.

******************************************************************************************* 3

నిశ్చయం శృణు మే తత్ర
త్యాగే భరతసత్తమ,
త్యాగో హి పురుషవ్యాఘ్ర
త్రివిధ: సంప్రకీర్తిత:.



భరతకులోత్తముడవును, పురుష శ్రేష్ఠుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగ విషయమున నాయొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడు విధములుగా చెప్పబడి యున్నది కదా!

******************************************************************************************* 4

యజ్ఞ దాన తప: కర్మ
న త్యాజ్యం కార్యమేవ తత్,
యజ్ఙోదానం తపశ్చైవ
పావనాని మనీషిణామ్



యజ్ఞమ; దానము, తపస్సు అనెడి కర్మములు త్యజింపదగినవికావు; చేయదగినవియే యగును. ఏలాయనిన ఆ యజ్ఞ దానతపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను (చిత్తశుద్ధిని) కలుగజేయునవై యున్నవి.

******************************************************************************************* 5

ఏతాన్యపి తు కర్మాణి
సజ్గం త్యక్త్వా ఫలాని చ,
కర్తవ్యానీతి మే పార్థ
నిశ్చితం మతముత్తమమ్.



అర్జునా! ఈ యజ్ఞదానతప: కర్మలను గూడ ఆసక్తిని, ఫలములను విడిచియే చేయవలెనని నాయొక్క నిశ్చితమగు ఉత్తమాభిప్రాయము.

******************************************************************************************* 6

నియతస్య తు సన్న్యాస:
కర్మణో నోపపద్యతే,
మోహాత్తస్య పరిత్యాగ
స్తామస: పరికీర్తిత:.



(వేదశాస్త్రాదులచే) విధింపబడినట్టి కర్మము యొక్క పరిత్యాగము యుక్తముకాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టునేని అది తామసత్యాగమే యగునని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 7

దు:ఖమిత్యేవ యత్కర్మ
కాయక్లేశ భయాత్త్యజేత్,
స కృత్వా రాజసం త్యాగం
నైవత్యాగఫలం లభేత్.



ఎవడు శరీర ప్రయాసవలని భయము చేత దు:ఖమును కలుగజేయునది యనియే తలంచి విధ్యుక్త కర్మమును విడిచిపెట్టునో, అట్టివాడు రాజసత్యాగమును గావించినవాడై త్యాగఫలమును బొందకయే యుండును.

******************************************************************************************* 8

కార్య మిత్యేవ యత్కర్మ
నియతం క్రియతేర్జున,
సజ్గం త్యక్త్వా ఫలంచైవ
స త్యాగస్సాత్త్వికో మత:.



ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియతమగు ఏ కర్మము అభిమానము, ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి (కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్వికత్యాగమని నిశ్చయింపబడినది.

******************************************************************************************* 9


శ్రద్ధాత్రయవిభాగయోగః 3 (అథ సప్తదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

మూఢగ్రాహేణాత్మనో
యత్పీడయా క్రియతే తప:,
పరస్యోత్సాదనార్థం వా
తత్తామస ముదాహృతమ్.



మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును (శుష్కోపవాసాదులచే) బాధించుకొనుటద్వారాగాని, లేక ఇతరులను నాశనము చేయవలెనను ఉద్దేశ్యముతోగాని చేయబడు తపస్సు తామసికతపస్సని చెప్పబడినది.

******************************************************************************************* 19

దాతవ్యమితి యద్దానం
దీయతేనుపకారిణే,
దేశే కాలే చ పాత్రే చ
తద్దానం సాత్త్వికం స్మృతమ్.



'ఇవ్వవలసినదే' యను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును, పుణ్యకాలమందును యోగ్యుడగువానికి మరియు ప్రత్యుపకారము చేయశక్తిలేని వాని కొఱకును ఇవ్వబడుచున్నదో అది సాత్త్వికదానమని చెప్పబడుచున్నది .

******************************************************************************************* 20

యత్తు ప్రత్యుపకారార్థం
ఫలముద్దిశ్య వా పున:,
దీయతే చ పరిక్లిష్టం
తద్దానం రాజసం స్మృతమ్.



ప్రత్యుపకారము కొరకుగాని, లేక ఫలము నుద్దేశించిగాని, లేక మన: క్లేశముతో (అతికష్టముతో) గాని ఇవ్వబడు దానము రాజసదానమని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 21

అదేశకాలే యద్దాన
మపాత్రేభ్యశ్చ దీయతే,
అసత్కృతమవజ్ఞాతం
తత్తామస ముదాహృతమ్.



దానమునకు తగని (అపవిత్రములగు) దేశకాలములందును పాత్రులు (అర్హులు) కానివాని కొరకును, సత్కారశూన్యముగను, అమర్యాదతోను ఇవ్వబడుదానము తామస దానమని చెప్పబడును.

******************************************************************************************* 22

ఓం తత్సదితి నిర్దేశో
బ్రహ్మణస్త్రివిధ: స్మ్రత:,
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ
యజ్ఞాశ్చ విహితా: పురా



పరబ్రహ్మమునకు 'ఓం' అనియు 'తత్' అనియు, 'సత్' అనియు మూడువిధములగు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వలననే (దాని యుచ్చారణ చేతనే) పూర్వము బ్రాహ్మణులూ (బ్రహ్మజ్ఞానులు), వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి.

******************************************************************************************* 23

తస్మాదోమిత్యుదాహృత్య
యజ్ఞ దానతప: క్రియా:,
ప్రవర్తన్తే విధానోక్తా 
స్సతతం బ్రహ్మవాదినామ్.



అందువలన, వేదములను బాగుగా నెరిగిన వారి యొక్క శాస్త్రోక్తములగు యజ్ఞదానతప:క్రియ లన్నియు ఎల్లప్పుడును 'ఓం' అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింప బడుచున్నవి.

******************************************************************************************* 24

తదిత్యనభిసన్ధాయ
ఫలం యజ్ఞతప: క్రియా:,
దాన క్రియాశ్చ వివిధా:
క్రియన్తే మోక్షకాంక్షి భి:.



అట్లే 'తత్' అను పదమును ఉచ్చరించియే ముముక్షువులు ఫలాపేక్షలేక పలువిధములైన యజ్ఞ దాన తప: కర్మలను చేయుచున్నారు.

******************************************************************************************* 25

సద్భావే సాధుభావే చ
సదిత్యేతత్ప్రయుజ్యతే,
ప్రశస్తే కర్మణి తథా
సచ్ఛబ్ద: పార్థ యుజ్యతే.



ఓ అర్జునా! 'కలదు' అనెడి అర్థమందును 'మంచిది' అనెడి అర్థమందును 'సత్' అను ఈ పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మము నందును ఆ 'సత్' అను పదము వాడబడుచున్నది.

******************************************************************************************* 26

యజ్ఙే తపసి దానే చ
స్థితి: సదితి చోచ్యతే,
కర్మచైవ తదర్థీయం
సదిత్యేవాభిధీయతే.



యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందును గల నిష్ఠ (ఉనికి) కూడ 'సత్' అని చెప్పబడుచున్నది. మరియు బ్రహ్మోద్దేశమైన (భగవత్ప్రీత్యర్థమైన) కర్మలుకూడ 'సత్' అనియే పిలువబడుచున్నవి.

******************************************************************************************* 27

అశ్రద్ధయా హుతం దత్తం
తపస్తప్తం కృతం చ యత్,
అసదిత్యుచ్యతే పార్థ
న చ తత్ప్రేత్యనో ఇహ.



ఓ అర్జునా! అశ్రద్ధతో చేయబడిన హోమము గాని, దానముగాని, తపస్సుగాని, ఇతర కర్మలుగాని 'అసత్తని' చెప్పబడును. అవి ఇహలోకఫలమును (సుఖమును) గాని, పరలోకఫలమును (సుఖమును) గాని కలుగజేయవు.

******************************************************************************************* 28


ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, శ్రద్ధాత్రయవిభాగయోగోనామ, సప్తదశోధ్యాయః


శ్రద్ధాత్రయవిభాగయోగః 2 (అథ సప్తదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యాతయామం గతరసం‌
పూతి పర్యుషితం చ యత్‌,
ఉచ్ఛిష్టమపి చామేధ్యం
భోజనం తామసప్రియమ్‌.



వండిన పిమ్మట ఒక జాము దాటినదియు (లేక బాగుగ ఉడకనిదియు), సారము నశించినదియు, దుర్గంధము గలదియు, పాచిపోయినదియు (వండిన పిదప ఒకరాత్రి గడచినదియు), ఒకరు తినగా మిగిలినది (ఎంగిలి చేసినది) యు, అశుద్ధముగానున్నదియు (భగవంతునకు నివేదింపబడనిదియు) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును.

******************************************************************************************* 10

అఫలాకాంక్షి భిర్యజ్ఞో‌
విధిదృష్టో య ఇజ్యతే‌,
యష్టవ్యమేవేతి మన
స్సమాధాయ స సాత్త్వికః‌.



'ఇది చేయదగినదియే' యని మనస్సును సమాధాన పఱచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్షలేని వారిచేత చేయబడుచున్నదో అది సాత్త్వికయజ్ఞమనబడును .

******************************************************************************************* 11

అభిసంధాయ తు ఫలం
దంభార్థమపి చైవ యత్‌,
ఇజ్యతే భరతశ్రేష్ఠ
తం యజ్ఞం విద్ధి రాజసమ్‌.



భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఫలమును గోరియు డంబము కొఱకును గావింపబడు యజ్ఞమును రాజసమైనదానినిగా నీవు తెలిసికొనుము.

******************************************************************************************* 12

విధిహీన మసృష్టాన్నం
మంత్రహీన మదక్షిణమ్‌,
శ్రద్ధావిరహితం యజ్ఞం
తామసం పరిచక్షతే.



విధ్యుక్తము కానిదియు, అన్నదానము లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణలేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిదియునగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును.

******************************************************************************************* 13

దేవద్విజగురుప్రాజ్ఞ
పూజనం శౌచమార్జవమ్‌,
బ్రహ్మచర్యమహింసా చ
శారీరం తప ఉచ్యతే



దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను (మహాత్ములను, బ్రహ్మజ్ఞానముగల పెద్దలను) పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధిగలిగియుండుట, ఋజుత్వముతో గూడియుండుట, (కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట),బ్రహ్మచర్యవ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక (శరీరసంబంధమైన) తపస్సని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 14

అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్‌,
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాజ్మయం తప ఉచ్యతే.



ఇతరుల మనస్సునకు బాధగలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు గలిగించునదియునగు వాక్యమును, వేదాదులయొక్క అధ్యయనమును అభ్యసించుట (వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత భాగవత రామాయణాదులు మున్నగువానిని అధ్యయనము చేయుట ప్రణవాది మంత్రములను జపించుట) వాచిక తపస్సని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 15

మనః ప్రసాదస్సౌమ్యత్వం
మౌనమాత్మవినిగ్రహః,
భావసంశుద్ధిరిత్యేత
త్తపో మానస ముచ్యతే.



మనస్సును నిర్మలముగా నుంచుట (కలతనొందనీయక స్వచ్చముగా నుండుట), ముఖప్రసన్నత్వము (క్రూరభావము లేకుండుట), పరమాత్మనుగూర్చిన మననము (దైవధ్యానము) గలిగియుండుట {లేక దృశ్య సంకల్పము లెవ్వియులేక ఆత్మయందే స్థితి గలిగియుండుట అను (వాజ్మౌన సహిత) మనో మౌనము} మనస్సును బాగుగ నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము గలిగియుండుట (మోసము మున్నగునవి లేకుండుట) అను నివి మానసిక తపస్సని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 16

శ్రద్ధయా పరయా తప్తం
తపస్త త్త్రివిధం నరైః,
అఫలాకాంక్షి భిర్యుక్తై
స్సాత్త్వికం పరిచక్షతే.



ఫలాపేక్షలేనివారును, నిశ్చలచిత్తులును, లేక దైవభావనాయుక్తులును అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ (పైన దెల్పిన శారీరక, వాచిక, మానసికములగు) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని (సాత్త్విక తపస్సని) (పెద్దలు) చెప్పుచున్నారు.

******************************************************************************************* 17

సత్కారమాన పూజార్థం
తపో దంభేన చైవ యత్‌,
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసం చలమధ్రువమ్‌.



ఇతరులచే తాము సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడుతపస్సు అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలముగలదై (లేక చపలమైనట్టి రూపముగలదై) ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది.

******************************************************************************************* 18



శ్రద్ధాత్రయవిభాగయోగః 1 (అథ సప్తదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

అర్జున ఉవాచ :‌

యే శాస్త్రవిధిముత్సృజ్య‌
యజంతే శ్రద్ధయాన్వితాః‌,
తేషాం నిష్ఠా తు కా కృష్ణ
సత్త్వమాహో రజస్తమః.


అర్జునుడు అడిగెను:- ఓ కృష్ణా! ఎవరు శాస్త్రోక్తవిధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదులు నొనర్తురో వారియొక్క స్థిరి సాత్త్వికమా, లేక రాజసమా, లేక తామసమా? ఏదియై యున్నది?.

******************************************************************************************* 1

శ్రీ భగవానువాచ:-‌

త్రివిధా భవతి శ్రద్ధా
దేహినాం సా స్వభావజా,
సాత్త్వికీ రాజసీ చైవ
తామసీ చేతి తాం శృణు‌.


శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) ప్రాణులయొక్క స్వభావముచే (పూర్వజన్మసంస్కారముచే) గలిగిన ఆ శ్రద్ధ సాత్త్వికమనియు, రాజసమనియు, తామసమనియు మూడు విధములుగా నగుచున్నది. దానిని గూర్చి వినుము.

******************************************************************************************* 2

సత్త్వానురూపా సర్వస్య
శ్రద్ధా భవతి భారత,
శ్రద్ధామయోయం పురుషో
యో యచ్ఛ్రద్ధస్స ఏవ సః.


ఓ అర్జునా! సమస్తజీవులకును వారివారి (పూర్వ జన్మ సంస్కారముతో గూడిన) యంతఃకరణము ననుసరించి శ్రద్ధ (గుణము, సంస్కారము) గలుగుచున్నది.

******************************************************************************************* 3

యజస్తే సాత్త్వికా దేవాన్‌
యక్షరక్షాంసి రాజసాః,
ప్రేతాన్‌ భూతగణాంశ్చాన్యే
యజంతే తామసా జనాః.


సత్త్వగుణముగలవారు దేవతలను, రజోగుణముగల వారు యక్షులను రాక్షసులను, తమోగుణముగలవారు భూతప్రేతగణములను పూజించుచున్నారు.

******************************************************************************************* 4

అశాస్త్రవిహితం ఘోరం
తప్యంతే యే తపో జనాః,
దంభాహంకారసంయుక్తాః
కామరాగ బలాన్వితాఃః
‌‌
కర్శయంత శ్శరీరస్థం‌
భూతగ్రామమచేతసః,‌
మాం చైవాంత శ్శరీరస్థం‌
తాన్విద్ధ్యాసురనిశ్చయాన్‌.


ఏ జనులు శరీరమున నున్నట్టి పంచభూత సముదాయమును, లేక ఇంద్రియ సమూహమును (ఉపవాసాదులచే) శుష్కింపజేయువారును, శరీరమందంతర్యామిగనున్న నన్నును కష్టపెట్టువారును, దంభాహంకారముతో గూడినవారును, కామము, రాగము, (ఆసక్తి) పశుబలము కలవారును (లేక కామబలము, రాగబలము గలవారును) అవివేకులును అయి శాస్త్రమునందు విధింపబడనిదియు, తనకును ఇతరులకును గూడ బాధాకర మైనదియునగు తపస్సును జేయుచున్నారో, అట్టివారిని అసుర స్వభావముగలవారినిగ తెలిసికొనుము.

******************************************************************************************* 5,6

ఆహారస్త్వపి సర్వస్య
త్రివిధో భవతి ప్రియః,
యజ్ఞస్తప స్తథా దానం
తేషాం భేదమిమం శృణు.


ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణ ములను బట్టి) మూడువిధములుగ ఇష్టమగుచున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానముకూడ జనులకు మూడు విధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమునుగూర్చి (చెప్పెదను) వినుము.

******************************************************************************************* 7

ఆయుస్సత్త్వబలారోగ్య
సుఖప్రీతివర్ధనాః,
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా
ఆహారాః సాత్త్విక ప్రియాః.


ఆయుస్సును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని, బాగుగ వృద్ధినొందించునవియు, రసముగలవియు, చమురుగలవియు, దేహమందు చాలాకాలము నూండునవియు, మనోహరము లైనవియునగు ఆహారములు సత్త్వగుణముగలవారికి ఇష్టములై యుండును.

******************************************************************************************* 8

కట్వామ్లలవణాత్యుష్ణ
తీక్ష్ణ రూక్ష విదాహినః,
ఆహారా రాజస స్యేష్టా
దుఃఖశోకామయప్రదాః.


చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనిదిగాను, మిగులదాహము గలుగజేయునవిగాను ఉండునవియు, (శరీరమునకు) దుఃఖమును, (మనస్సునకు) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణము గలవానికి ఇష్టములై యుండును.

******************************************************************************************* 9


దైవాసురసంపద్విభాగయోగః 3 ( అథ షోడశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

తానహం ద్విషతః క్రూరాన్‌
సంసారేషు నరాధమాన్‌,
క్షిపామ్యజస్రమశుభా‌
నాసురీ ష్వేవ యోనిషు.


(ఆ ప్రకారము) సమస్తప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించువారును, క్రూరులును, అశుభ (పాప) కార్యములను జేయువారునగు అట్టి మనుజాధములను నేను జననమరణరూపములగు ఈ సంసారమార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోసివైచెదను.

******************************************************************************************* 19

ఆసురీం యోనిమాపన్నా
మూఢా జన్మని జన్మని,
మామప్రాప్యైవ కౌంతేయ
తతో యాంత్యధమాంగతిమ్‌.


ఓ అర్జునా! అసుర సంబంధమైన (నీచ) జన్మమును పొందినవారలగు మూఢులు ప్రతిజన్మయందును నన్ను పొందకయే, అంతకంటె (తాము పొందిన జన్మ కంటె) నీచతరమైన జన్మమును పొందుచున్నారు.

******************************************************************************************* 20

త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మనః,
కామఃక్రోధస్తథాలోభ
స్తస్మాదేతత్త్రయం త్యజేత్‌‌.


కామము, క్రోధము, లోభము అను నీమూడును మూడు విధములగు నరక ద్వారములు. ఇవి తనకు (జీవునకు) నాశము గలుగజేయును. - కాబట్టి ఈ మూడింటిని విడనాడవలెను. {లేక కామము, క్రోధము, లోభము అను మూడు విధములగు ఈ అసుర సంపద నరకమునకు ద్వారములు - అనియు చెప్పవచ్చును}.

******************************************************************************************* 21

ఏతైర్విముక్తః కౌంతేయ
తమోద్వారై స్త్రిభిర్నరః,
ఆచరత్యాత్మనః శ్రేయ
స్తతో యాతి పరాం గతిమ్‌‌.


ఓ అర్జునా! (కామ, క్రోధ, లోభములనునట్టి) ఈ మూడు నరకద్వారములనుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు.

******************************************************************************************* 22

యశ్శాస్త్రవిధిముత్సృజ్య
వర్తతే కామకారతః,
న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాంగతిమ్‌‌‌.


ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని సుఖమునుగాని ఉత్తమగతియగు మోక్షమును గాని పొందనేరడు.

******************************************************************************************* 23

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే
కార్యాకార్యవ్యవస్థితౌ,
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం
కర్మకర్తుమిహార్హసి‌‌.


కావున నీవు చేయదగినదియు,చేయరానిదియు నిర్ణయించునపుడు శాస్త్రము ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలిసికొని దాని ననుసరించి నీవీ ప్రపంచమున కర్మమును జేయదగును.

******************************************************************************************* 24


ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, దైవాసురసంపద్విభాగయోగోనామ, షోడశోధ్యాయః


Popular Posts