Pages

Wednesday, 27 March 2013

సంతోషాల రంగుల హోలీ

సంతోషాల రంగుల హోలీ 

మనం ఈ ఏడాదిలో చలికి, పొగమంచుకు వీడ్కోలు చెప్పి, వెచ్చదనాన్నిచ్చే వసంతానికి స్వాగతం పలికే పండగే హోలీ. మొఘల్‌ పరిపాలనా కాలంలో హోలీ పండగ హిందువులు, ముస్లింల మత సమైక్యతకు సంకే తంగా జరుపుకునేవారు. ఏడాదిలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఫాల్గుణ పూర్ణిమని హోళికాపూర్ణిమ అనీ, మహా ఫాల్గుణి అని పిలుస్తారు. 14 మన్వంతరాల్లో ఒకటైన బ్రహ్మ సావర్ణి హోలీ నుంచే ప్రారంభమయిందని పురాణాలుచెబుతున్నాయి అసలీ ప్రపంచమే రంగులమయం. మన జీవనవిధానమే రంగులతో మమేకమై ఉంది.ఇంద్రధనస్సు లో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రకాల రంగులు న్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవిత తత్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే వేడుకే హోలీ. గతం లో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొనిసంతోషిం చేవారు. 

జానపద పాటలు పాడుకుంటూ, ఆనందంగా ఆడుకుంటూ తరతమ భేదాలు మరిచి ఆనందాన్ని ఆస్వాధించేవారు. ఈ వసంతోత్సవమంతా ప్రజలందర్నీ సామాజికంగా ఏకం చేసేది. అదే సమయంలో ఆకులు రాల్చిన చెట్లు కొత్త చిగుళ్లతో వసంత లక్ష్మికి ఆహ్వానం పలికేవి. ప్రకృతికాంత నూతన శోభను సింగారించుకొని కన్నుల పండువైనప్పుడు ఆమెకు స్వాగతం పలకడం భారతీయులు అనాదిగా అనుసరిస్తున్న ఆచారం. ఈ ఆచారపు ఆనంద స్వరూపమే ‘హోలీ’. అమితోత్సాహంతో జరుపుకొనే హోలీని ‘ఫాల్గుణో త్సవం’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ ఉత్సవాన్ని మదనోత్సవంగా, వసంతోత్సవంగా వ్యవహ రిస్తారు.