Pages

Sunday, 31 March 2013

సూర్య నమస్కారం చేస్తే.. రోగాలు, దారిద్ర్యం మాయమైపోతాయట!

సూర్య నమస్కారం చేస్తే.. రోగాలు, దారిద్ర్యం మాయమైపోతాయట!

శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. 

సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.