Pages

Friday, 15 March 2013

బ్రాహ్మీ ముహుర్త ప్రాశస్త్యం(Brahmi Muhartham)



బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి. వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు.


బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ణ్జానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు. ఆ సమయంలో ఏ పనిచేసినా, ఆలోచన చేసినా, చదువుకున్నా బుద్ధి వికసించి సరియైన ఫలితం వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పూజలు, జపాలు, గాయత్రీ మంత్రోచ్ఛారణ చేయడం వలన వారికి తేజస్సు కలిగి, అద్భుతమైన శక్తి కూడా కలుగుతుందని వేదాలు, పురాణ గ్రంథాలలో తెలియ చేయబడింది.
ఆధ్యాత్మిక పరంగానే కాక, వైజ్ణ్జానిక పరంగాకూడా బ్రాహ్మీ ముహూర్తకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలకు మంచిది. రాత్రంతా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నవారు బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్రలేవడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బుద్ధి వికసించి, ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఆ సమయంలో వీచే చల్లని గాలి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. రక్తప్రసరణ శరీరమంతా చక్కగా జరుగుతుంది. చదువుకునే పిల్లలు తెల్లవారు జామునే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి చదువుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతతో చదువగలుగుతారు. అంతే కాకుండా ఆ చదువు వారి మెదడులో నిక్షిప్తమైపోతుమి. బ్రాహ్మి ముహూర్తకాలంలో నిద్రలేచేవారు ఎంతో హుషారుగా, చురుకుగా ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలానికి ఆధ్యాత్మికంగాను, శాస్తీయపరంగాను కూడా ఎంతో విశేషం, ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉన్నాయి.