Pages

Sunday, 24 March 2013

దీపారాధన పద్ధతులు (Rules For Deeparadhana)

దీపారాధన పద్ధతులు (Rules For Deeparadhana)
మనం ఏ దేవతనైనా పూజించేటపుడు దీపారాధన చేయడం సాధారణ విషయం. ఏ పూజలోనైన దీపారాధన ఒక ముఖ్యమైన అంశం. ధార్మిక గ్రంథాల ప్రకారం విభిన్న దేవతల పూజ, సిద్ధి సాధన చేసేటప్పుడు దీపం స్థానం విశిష్టమైనది. ఎలాంటి దీపం వెలిగించాలి? దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలి? ఏ విధమైన నూనె లేదా నెయ్యి ఉపయో గించాలి? ఇత్యాది అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. దేవతను ప్రసన్నం చేసుకుని, దైవకృప పొందడానికి ఇవి ముఖ్యాంశాలుగా నిలుస్తాయి.
ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమ పూర్వకంగా ఇంట్లో, లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడ కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దెెవి కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి.
పరమశివుని కటాక్షానికై ఎనిమిది లేక 12 వత్తుల దీపం, దానితో పాటు పసుపురంగు ఆవాల నూనె దీపం వెలిగించాలి. విష్ణుమూర్తి ఆరాధనలో 16 వత్తుల దీపం, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుందేకు ఏడు ముఖాలుగల నేతి దీపం వెలిగించాలి. విష్ణుమూర్తి దశావతార ఆరాధన చేసేటపుడు 10 ముఖాలున్న దీపం వెలిగించాలి. మనోభీష్ట సిద్ధికోసం, జ్ఞాన ప్రాస్తి కోసం పూజించేటపుడు గుండ్రంగా, లోతుగా ఉన్న దీపం వెలిగించాలి. శత్రు నాశనం, క్రోధం, ఆపదలు నివారణ కోసం పూజ చేసేటపుడు మధ్య నుంచి పైకి లేచిన దీపం వెలిగించాలి. లక్ష్మీకటాక్షం కోసం వెలిగించే దీపం సామాన్య మైన లోతు (మధ్యస్తం)లో మాత్రమే దీపారాధన కుంది ఉండాలి. హనుమంతుని ప్రసన్నం కోసం త్రికోణ దీపం వెలిగించాలి. అందులో మల్లెనూనె ఉపయోగించాలి. దీపాల (కుందులు) ను అనేకమైన ముడి సరుకులతో తయారుచేస్తారు. మట్టి, పిండి, రాగి, వెండి, ఇనుము, ఇత్తడి, బంగారంతోను, ప్రమిదలు తయారుచేస్తారు. పెసలు, బియ్యం, గోధుమలు, మినుములు, జొన్నలు సమపాళ్లలో కలిపి పిండి పట్టించి ఆ పిండితో ప్రమిద తయారు చేయించి వెలిగించడం అన్నిటిలోను శ్రేష్ఠం. కొన్ని పూజల సందర్భంగా అఖండ దీపం వెలిగించే పద్ధతి ఉంటుంది. ఈ అఖండ దీపాలను శుద్ధమైన ఆవు నెయ్యి, లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తారు. ఆశ్రమాలు, దేవాలయాల్లో ఎక్కువగా అఖండ దీపాలు వెలిగిస్తారు.