Pages

Monday, 1 April 2013

గురువెలా ఉండాలి?

గురువెలా ఉండాలి?
సూర్యుడిని చూడడానికి టార్చిలైట్ అవసరం లేదు. క్రొవ్వొత్తిని వెలిగించ నక్కరలేదు. నిజం తన బలమైన పునాదుల మీద నిలుస్తుంది. గురువు ఈ సత్య సిద్ధాంతం మీద ఆధారపడి పవిత్రత కలిగి జ్ఞాన పిపాస కలిగి ఉంటాడు. పవిత్రత అన్నింటిలో అవసరం. జ్ఞానం ఎవరు కోరుకుంటారు? మనం ఏది కావాలంటే అది లభిస్తునుకోవడం పాతమాట. మతం అందరికీ లభిస్తుందా? అది చాలా కష్టసాధ్యం. మనం అనుకున్నంత సులభం కాదు. మతం ప్రసంగాల వల్ల, పఠనం వల్ల రాదు. అదో నిరంతర పోరాటం. మనదైన ప్రకృతిలో సాధించాల్సింది. విజయం లభించేదాకా ఇది జరుగుతుంది. కేవలం రోజులు, సంవత్సరాలు కాదు, జన్మలు కూడా పట్టవచ్చు. ఆ స్ఫూర్తితో కూర్చుంటే విజయం లభిస్తుంది.


మన పవిత్ర గ్రంథాల్లోని రహస్యాన్ని గురువు గ్రహించటం మనం తెలుసుకోవాలి. అది కేవలం అక్షర సమన్వయాలే కాదు, వాటి వెనుక తత్త్వం ఉంది. అక్షరాలనే చూడడం అడవిలో చిక్కుకుని దారి తెలియని వైనమవుతుంది. పదబంధాలను, భాషా ప్రావీణ్యతను ప్రదర్శించడమే చదువుకున్న వారికి ఆనందం కల్గిస్తుంది. వారిది  పూర్వత్వం కాదు. వారు ప్రతిభను చూపించేందుకు తాపత్రయ పడతారు. ప్రజలు, ప్రపంచం వారిని అభినందిన్స్తుంది. వాళ్ళు గొప్ప వాళ్ళని కీర్తిస్తుంది. ప్రపంచంలో గొప్ప గురువెవరూ ఈ తరహా విషయ విశ్లేషణలు, ప్రసంగాలలో పడి కొట్టుకుపోలేదు. రామకృష్ణుల వారు చెప్పినట్లు మామిడి వనంలోకి వెళ్లి, అక్కడ చెట్ల ఆకులను, రంగును, కొలతలను, శాఖల సంఖ్యను లేక్కపెట్టేవారు ఎక్కువగా ఉండగా, నిజంగా మామిడిపండును రుచి చూసే వారి సంఖ్య తక్కువగా ఉన్నది. కనుక ఈ తరహా పద్ధతిలో మనుషులు ఆధ్యాత్మికతను సంతరించుకోలేరు. గురువు పాపరహితుడయి ఉండాలి. 'గురువు వ్యక్తిత్వాన్ని ఎందుకు చూడాలి? అతను ఏం చెబితే అది వింటే సరిపోతుంది కదా' అని ఇంగ్లండులో నన్ను ప్రశ్నించారు. ఇది కేవలం భౌతికవాద శాస్త్రాలకు సరిపోతుంది. ఆధ్యాత్మిక వాదికి తను ఏం చెప్పినా మొదటి నుండి చివరి వరకు అంతఃకరణ శుద్ధి అవసరం. అలా కాని వాడు ఆధ్యాత్మిక జ్యోతినెలా వెలిగించగలడు ? ఆధ్యాత్మిక సత్యమంటే పవిత్రత. కనుక ఇది తప్పనిసరిగా గురువుకు ఉండాలి. అతనేమిటో చూశాక అతనేం చెబుతాడో వినాలి. మూడవ విషయం ఉద్దేశ్యం. అతను ఏం చెప్పినా పేరు ప్రఖ్యాతుల కోసం కాదని, కేవలం ప్రేమను పంచేందుకే నన్నది తెలుసుకోవాల్సిన విషయం. ఆధ్యాత్మిక భావ తరంగాలు ప్రేమతోనే ప్రసారం కాగలవు. ప్రభావం చూపగలవు. కనుక మనం గురువుగా స్వీకరించేందుకు ప్రబోధనం గావింపబడేందుకు కొన్ని పరిమితులున్నాయి.