Pages

Wednesday, 10 April 2013

ఉగాది - భావం,ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:

ఉగాది - భావం

హైందవశాస్త్రం ప్రకారం అరవై తెలుగు నామసంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక క్రమంగా వస్తాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడు. ఆ రోజు యుగమునకు ఆది - యుగాది, నేటి ఉగాది. భారతీయ గణితవేత్త శ్రీ భాస్కరాచార్యులవారి గణనం ప్రకారం ఈ రోజున సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చని పంటపొలాలు, ఏపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి. ఇది తెలుగు వారి కొత్త సంవత్సరాది.

ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక - 

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం

ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం

వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు

చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు

పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు

మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.