Pages

Thursday, 30 May 2013

మంత్రానికి నియమం......



పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.
మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే  మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.