Pages

Thursday, 16 May 2013

ఈశావాస్య ఉపనిషత్తు (Eesavasya Upanishathu)





జ్ఞానాదేవతు కైవల్యమ్ - జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. అటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలను ప్రధానంగా బోధిస్తాయి ఉపనిషత్తులు. వేదాలలోని 1180 శాఖల్లో ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు చొప్పున మొత్తం 1180 ఉపనిషత్తులు వున్నాయంటారు. కానీ వెలుగులోకి వచ్చినవి మాత్రం రెండు వందలు వుంటాయేమో. అందులో 108 చాలా ముఖ్యమైనవి. అందులో కూడా 10 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవని తాత్త్వికులు భావించారు. ఈశ , కేన , కఠ , ప్రశ్న , ముండక , మాండూక్య , తైత్తరీయ , ఐతరేయ ,ఛాందోగ్య , బృహదారణ్యకా లే ఆ పది ఉపనిషత్తులు. శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఈ ఉపనిషత్తులకు తమతమ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ భాష్యాలు రాశారు.
ఈ దశోపనిషత్తుల్లో మొదటిది ఈశావాస్యం. ఇది శుక్ల యజుర్వేద సంహితలోని చివరి అధ్యాయంలో వుంది. ఇందులో మొత్తం 18 మంత్రాలున్నాయి.
ఈశావాస్యమిదగ్ సర్వం యత్కించ జగత్యాం జగత్

తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్యస్విద్ధనమ్
అనేది మొదటి మంత్రం. ఈ మంత్రంలోని మొదటి పదంతోనే ఈ ఉపనిషత్తు పిలువబడింది. ఇది పూర్తిగా మంత్రరూపంలో వుండడంవల్ల దీనిని మంత్రోపనిషత్తు అని కూడా పిలుస్తారు. ఇందులోని విశేషమేమంటే - జ్ఞానమార్గంలో నడిచేవారికి జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది (మం. 1, 4, 5, 6, 7, 8) ఆ మార్గాన్ని అనుసరించే అర్హత పొందనివారికి నిష్కామ కర్మాచరణాన్ని బోధిస్తుంది (మం. 2, 3).
ఈ ఉపనిషత్తులోని మొదటి మంత్రం జ్ఞానులనుద్దేశించి ఇలా అంటుంది - ఈ ప్రపంచం అనిత్యం. ఎప్పుడూ పరివర్తన చెందుతూ వుంటుంది. ఆత్మ శాశ్వతం. ఆత్మయే భగవంతుడు. ఆయన ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి వుంటాడు. ఆత్మధ్యానం ద్వారా సత్యాన్ని గ్రహించాలి. అనిత్యమైన ప్రాపంచిక వాంఛల్ని పరిత్యజించాలి. త్యాగభావాన్ని అలవరచుకోవాలి. పరుల ధనాన్ని ఆశించకూడదు. అలాగే 4 నుంచి 8వ మంత్రం వరకు చెప్పిన విషయాలు కూడా జ్ఞానమార్గానికి సంబంధించినవే.
4, 5 మంత్రాలు ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. ఆత్మ సర్వశక్తి సమన్వితమైనది. దానికి చలనం లేదు. కానీ మనస్సుకంటే వేగంగా పయనిస్తుంది. అందువల్ల మనస్సు దానిని అందుకోలేదు. మనస్సుకే అందనప్పుడు ఇంద్రియాలకు ఎలా అందుతుంది? ఆత్మ అచంచలం. ఎప్పుడూ స్థిరంగా వుంటుంది. అయినప్పటికీ పరుగెత్తేవాటిని కూడా అధిగమిస్తుంది. కేవలం తన ఉనికిచేతనే జీవుల కార్యకలాపానికి ప్రాణశక్తినిస్తుంది. (4 మం.). ఆత్మ చలించదు. అది దాని నిజస్థితి. అయితే ఒక శరీరాన్ని (ఉపాధిని) ఆశ్రయించి వుంటుంది కాబట్టి చలించినట్లు కనిపిస్తుంది. అది ఉపాధిని ఆశ్రయించి వుంటుంది. ఉపాధి లేకుండానూ ఉంటుంది. ఉపాధి యుతమైనప్పుడు లోపల వుంటుంది. ఉపాధి రహితమైనప్పుడు బయట ఉంటుంది. అది జ్ఞానులకు దగ్గరగా వుంటుంది - వారికి ఆత్మ సంగతి తెలుసు కాబట్టి. అజ్ఞానులకు దూరంగా వుంటుంది - వారు దానిని తెలుసుకోలేరు కాబట్టి (మం.5). జీవులందరిలోనూ వున్న ఆత్మ ఒక్కటే కాబట్టి తన ఆత్మకంటే జీవులందరూ వేరు కాదనే సత్యాన్ని జ్ఞాని గ్రహించాలి. అప్పుడు స్వార్థం దరికి చేరదు. స్వార్థం లేనప్పుడు ద్వేషమూ ఉండదు. జ్ఞాని గ్రహించాలి. అప్పుడు స్వార్థం దరికి చేరదు. స్వార్థం లేనప్పుడు ద్వేషమూ ఉండదు. జ్ఞాని ఇలాంటి లక్షణాలు కలిగి వుండాలంటుంది 6వ మంత్రం. ఇలా జీవులందరినీ తన ఆత్మగా భావించే వారికి శోకమోహాలుండవు. ఎందుకంటే అందరిలో తానున్నాడు. తనలో అందరూ వున్నారు (మం. 7). ఈ 6, 7 మంత్రాలు సర్వమానవ శ్రేయాన్ని, సమదర్శన భావాన్ని, సమానత్వాన్ని బోధిస్తాయి. ఆత్మజ్ఞానం ద్వారానే ఇటువంటి మానసిక స్థితి లభిస్తుంది. ఈనాటి సమాజానికి ఇది చాలా అవసరం.
8వ మంత్రం ఆత్మయొక్క పరిపూర్ణత్వాన్ని చక్కగా వ్యాఖ్యానిస్తుంది. ఇప్పుడు మనం పరిశీలించిన మంత్రాలు జ్ఞానుల కోసం చెప్పబడ్డాయి. కాని 2, 3 మంత్రాలు సంసారయాత్ర సాగించే కర్మిష్టులనుద్దేశించి చెప్పబడ్డాయి. 'కుర్వస్నేవేహ కర్మాణి ' అనే రెండవ మంత్రం ప్రకారం మనిషి ధర్మకర్మల్ని జీవితాంతమూ నిష్కామంగా చెయ్యాలి. ఆత్మధ్యానం అలవడని వారికి ఈ కర్మాచరణమే చిత్తశుద్దిని ప్రసాదించి, జ్ఞానమార్గ ప్రవేశానికి సహకరిస్తుంది. అయితే ఆత్మజ్ఞానమనే అంతిమ లక్ష్యాన్ని విస్మరించి, కేవలం కర్మల కోసమే కర్మలు చేస్తూ పోయేవాడికి జననమరణ రూపమైన పతనం తప్పదంటుంది మూడవ మంత్రం.
9వ మంత్రం నుంచి 14వ మంత్రం దాకా కర్మ - ఉపాసనల సమన్వయం చెప్పబడింది. ఆత్మజ్ఞానం లేని కర్మాచరణం వల్ల ప్రయోజనం వుండదు. అలాగే కర్మలను గురించిన సిద్ధాంత జ్ఞానంతో కర్మలు చెయ్యడం మాని ఉపాసన చేసినా ప్రయోజనం వుండదు. కాబట్టి ఆత్మజ్ఞాన సాధనలో కర్మ, ఉపాసన రెండూ ముఖ్యమే (మం.9). కేవలం కర్మ విధుల విజ్ఞానంతో (విద్య) ఒక ఫలితం లభిస్తుంది. అంటే దేవలోక ప్రాప్తి. అవిద్యతో (అజ్ఞానం, కేవలం కర్మ) వేరే ఫలితం లభిస్తుంది. అంటే కర్మఫలానుభవం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు (మం.10). కాబట్టి విద్యను గురించి అవిద్యను గురించి బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు అవిద్య (కర్మ) చేత మృత్యువును జయిస్తాడు. విద్య (యజ్ఞతత్త్వ విజ్ఞానం, సాధన) చేత అమృతత్వాన్ని పొందుతాడు. అటువంటిది 11వ మంత్రం. (10,11 మంత్రాలలో చెప్పబడిన విద్య, అవిద్య అనే పదాలు పరస్పర విరుద్ధంగా అస్పష్టంగా వున్నాయి).
12, 13, 14 మంత్రాలు జ్ఞాన కర్మలను గురించి, సగుణ నిర్గుణోపాసన గురించి, వాటి ఫలితాలను గురించి ప్రస్తావిస్తాయి. ఈ మూడు మంత్రాలకు "సరియైన అర్థాన్ని గ్రహించడం చాలా కష్టం" అంటారు స్వామి శర్వానంద. ఈ కారణంగానే వ్యాఖ్యాతలు, భాష్యకారులు తమకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేశారు.
15, 16 మంత్రాలు సత్యదర్శనం కోసం ప్రత్యక్షదైవమైన సూర్యుణ్ణి గురించి సాధకుడు మరణసమయంలో చేసే ప్రార్థనలు.
'ఓ సూర్యుడా! నీలోని సత్యాన్ని నీ బంగారు బింబం మూసివేసింది. సత్యదర్శనార్థుడనైన నాకోసం ఆ మూతను తొలగించు' (మం. 15).

'నీ నిజస్వరూపాన్ని దర్శించడానికి వీలుగా నీ తేజాన్ని, కిరణాల్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించు. నీలోని పురుషుడూ నేనూ ఒకటే'(మం. 16).
ఈ రెండు మంత్రాలలో ఎన్నో అంతరార్థాలు ఇమిడివున్నాయి.
17వ మంత్రంలో 'నువ్వు చేసిన పుణ్యకర్మల్ని స్మరించుకో' అని మనస్సును ప్రార్థిస్తాడు. ఇటువంటి అంత్యకాల స్మరణం మరణానంతర స్థితిని, గతిని నిర్ణయిస్తుంది. 'యంయంవాపిస్మరన్' అనే గీతాశ్లోకం ఈ మంత్రానికి వ్యాఖ్యానమే.
18వ మంత్రంలో తనను కాంతిమార్గం* ద్వారా (దేవయానం) తీసుకువెళ్ళమని అగ్నిని అర్థిస్తాడు.
* శరీర పతనానంతరం జీవులు కర్మఫలాన్ని అనుభవించడానికి రెండు మార్గాలలో ప్రయాణం చేస్తారు. ఒకటి దేవయానం లేక అర్చిర్మార్గం. ఇది కాంతిమార్గం. ఈ మార్గంలో పయనించే వారికి బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. రెండవది పితృయానం లేక ధూమమార్గం. ఇది చీకటితో నిండి వుంటుంది. ఈ మార్గంలో పయనించేవారు చంద్రలోకానికి వెళ్ళి కర్మఫలానుభవం అయిపోగానే తిరిగి జన్మిస్తారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే - ఈశావాస్యోపనిషత్తు ప్రధానంగా జ్ఞానమార్గాన్ని ఉపదేశిస్తూ, కర్మప్రబోధం కూడా చేసి, జ్ఞానకర్మల సమన్వయాన్ని సాధిస్తుంది.