Pages

Monday, 24 June 2013

పౌరుషానికి ప్రతీక రాయలు

భూమిని ఎనిమిది దిక్కులు అనే ఏనుగులు నిరంతరం మోస్తూ ఉంటాయని భారతీయ సంప్రదాయం చెబుతుంది. అదేవిధంగా అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది మహాకవులు తెలుగు సాహిత్యాన్ని మోస్తూ ఉంటారని శ్రీకృష్ణదేవరాయలు భావించి ‘‘భువన విజయం’’ అనే సభా మంటపంలో తెలుగు సాహిత్య చర్చలు చేసేవారు. అల్లసాని పెద్దన, నందితిమ్మన, మాదయ్యగారి మల్లన, ధూర్జటి, పుత్తేటి రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, కందుకూరి రుద్రకవి, రాధామాధవకవి అనే ఎనిమిది మంది అష్టదిగ్గజాలు ఆయన సాహిత్య పోషణలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

ఆయన పరిపాలిం చిన కాలాన్ని తెలుగు భాషా సాహిత్య చరిత్రలో తెలుగు సాహిత్యానికి సువర్ణయుగంగా పేర్కొంటారు. ఎందుకంటే, ఎనిమిది మంది జాతి గర్వించే మహాకవులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టమైన శైలి. సంగీత సాహిత్యాలను సమన్వయం చేసిన కాలమది. ఎనిమిది మంది కవులకు మైసూరు ప్రాంతం లోని నందిదుర్గలో సోమేశ్వరాలయంలోని శ్రీకృష్ణదేవరాయల శాసనం ప్రకారం మణిమాన్యాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోగటం, తనైంపూడి అగ్రహారాలు ఇవ్వడమే కాక, కరవాచి సీమను నాయంకరంగా ఇచ్చి, స్వయంగా ఆయన కుడికాలుకు గండపెండే రాన్ని తొడిగి, పెద్దనను పల్లకిలో కూర్చోబెట్టి తనే బోయిగా మోసారు శ్రీకృష్ణదేవరాయలు. ఇది కేవలం అల్లసాని పెద్దనకు మాత్రమే కలిగిన గౌరవం కాదు. తెలుగు భాషా సరస్వతికి కలిగిన గౌరవం.

ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇటువంటి మహోన్నతమైన ఘట్టం మరొకటి కానరాదంటే రాయలుకున్న భాషాభిమానం ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా రాయలు యుద్ధాలకు, జైత్రయాత్రలకు వెళ్లినప్పుడు కూడా తన వెంట అష్ట దిగ్గజ కవులను వెంట తీసుకెళ్లేవా రని రాయల దినచర్య అయిన ‘రాయవాచకము’ చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయలు తుళువ జాతీయుడని, తుళు మాతృభాషగా కలిగినవాడని చాలా మంది భావిస్తారు. అయితే రాయలు అచ్చమైన తెలుగువారని, ఆయన మాతృభాష కూడా తెలుగేనని డాక్టర్‌ సంగనభట్ల నరసయ్య వంటి పరిశోధకులు తేల్చి చెప్పారు. అందుకే...

‘‘ తెలుగదేయన్న దేశంబు తెలుగేను
ఏను తెలుగు వల్లభుండ, తెలుగోకండ
యెల్ల నృపుల గొలువ యెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స’’.

అని తన మాతృభాషాభిమానాన్ని వేనోళ్ల చాటుకున్నారు. ఆయన రచించిన తెలుగు ప్రబంధం ఆముక్తమాల్య దలో స్వచ్ఛమైన తెలుగు నుడికారం తెలుగు జాతీయాలతో రచించిన అపూర్వమైన కావ్యం ఆయన వేయించిన శాసనాలు తెలుగుభాషలోనే రచించడం తెలుగుపట్లఉన్న మమకారాన్ని తెలియ జేస్తుంది.