Pages

Sunday, 9 June 2013

నా జీవనగమనంలో ..... 'శ్రీ రమణమహర్షి'





తమను తాము తెలుసుకున్న మహాత్ములందరూ - ఏం చేసినా,అది సమస్త ప్రాణికోటి పురోభివృద్ధి కోసమే, సర్వుల ఉద్ధరణకే! ఏం చెప్పినా, అది పరమాత్మ సిద్ధి కోసమే, సర్వ జనావళిని తరింపజేయడానికే!
అటువంటి మహాత్ములు ఈ అవనిపై అప్పుడప్పుడు అక్కడక్కడా సకల ప్రాణికోటి శ్రేయస్సుకై దేహదారులై గురువులుగా , జ్ఞానులుగా , మహర్షులుగా , ప్రవక్తలుగా , సంతులుగా అవతరిస్తునే ఉంటారు. అటువంటివారిలో ఒకరు "శ్రీ రమణమహర్షి". 
వీరు నా జీవనగమనంలో నాకెలా మార్గదర్శకులయ్యారంటే -


భగవంతునికై ప్రార్ధన, సాధన ఉండాలి అంటారే ..... అసలు ప్రార్ధనంటే ఏమిటి? సాధన అంటే ఏమిటన్న నా మొదటి సందేహానికి సమాధానం భగవాన్ రమణ మహర్షి ఇలా తెలియజేశారు -

"భగవత్ ప్రార్ధన అంటే మాటలు జపించడం కాదు, భగవంతునికై పరితపించడం. సాధన అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహించడం. సాధన అంటే వికాసంతో కూడిన ఒక సజీవమైన సంగతి. ఎదుగుదల, పెరుగుదలతో కూడిన విషయమిది. మొగ్గ పువ్వుగా విచ్చుకున్నట్లు, జీవుడు ఈశ్వరుడుగా ఎదగడం. మొగ్గ సూర్యుని వైపు తిరగడం వంటిది సాధన. అంటే జీవుడు ఈశ్వరుడు వైపు దృష్టి మరల్చడం. విగ్రహారాధన, దైవపూజ, శరణాగతి, భక్తి, విశ్వాసం, తన్మయత్వం, ఆరాధన అవసరమే గానీ, నామరూపరహితమైన పరమాత్మే అన్నింటిలోనూ అంతర్భూతంగా వున్న ఆత్మ అని అనుభవపూర్వకంగా గుర్తించడం నిజమైన సాధన". 
                                                     * * *
ఒకానొకసారి నేను అనుకున్నది ఒకటి, జరిగినది వేరొకటి, అన్న రీతిలో ఉండేది నా పరిస్థితి. ఏమిటిది? ఎందుకిలా జరుగుతుందని చాలా కలత చెందుతున్న తరుణంలో శ్రీ రమణుల బోధ ఒకటి యాదృచ్చికంగా నా కంట బడింది. నాకు జవాబు దొరికింది., కలతా తీర్చింది, ఆ బోధ ఇదే -
"వారి వారి ప్రారబ్ధకర్మానుసారం విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరగవలసింది, ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. కనుక ఊరికే వుండటం మంచిది". 
(ఇది శ్రీరమణులు ప్రపంచానికి ఇచ్చిన ప్రధమోపదేశం)
                                                        * * *
భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడై, ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు. అంటే సన్యసించినవారికి, సర్వం పరిత్యజించినవారే పరమాత్మను తెలుసుకోగల్గుతారా? మరి, కర్మానుసారం ఏర్పడే కర్తవ్యాన్ని గాలికొదిలేయడం తప్పు కాదా? ఇవన్నీ ప్రారబ్ధసారం వచ్చేవే కదా, ప్రారబ్ధాన్ని అనుభవించి అధిగమించాలంటారే... అటువంటప్పుడు ఈ బంధాలను, బాధ్యతలను పరిత్యజించడం పాపం కాదా????? ... ఇత్యాది ప్రశ్నలతో మనసంతా గజిబిజిగా అయినప్పుడు - 'దేనినీ పరిత్యజించనవసరం లేదు, కానీ; దేని యందు తాదాత్మ్యం ఉండకూడద'ని అంటూ, అసలు సన్యాసమంటే ఏమిటో తెలియజెప్పిన రమణమహర్షి వాక్కులివే ... 
"సన్యాసమంటే - కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన. 
సన్యాసమంటే - ప్రపంచం నుంచీ, మరి దేనినుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలివేయడం కాదు. సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం. ఆ ఆలింగనంలో సంసారం అన్నీ వుంటాయి. 
సన్యాసమంటే - అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దానిపట్ల అనురక్తిని త్యజించడం.
సన్యాసమంటే - పరిశుద్ధ జ్ఞానం. 
                             ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం. నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి, సన్యసించించాలి అని అనుకోరు. నిజమైన సంసారం మనస్సంసారం. దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు. సర్వకర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్నవారే నిజమైన సాధకులు. విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం".  
                                                  * * *
ఇంట్లో ఏకాంతం లేదు, బయట సత్సంగంకు వెళ్ళడానికి వీలు కుదరడం లేదు, ఇలా అయితే నా సాధన సాగేదేలా? తీవ్ర సాధన చేస్తేనే కదా, పరమాత్మను కాంచగలం ... ఓహో ... ఇలాగైతే ఎలా ... లోలోన ఏదో వేదన ...!
ఈ విధంగా వేదన పడుతున్న నాకు అవగాహన కల్పించి స్వాంతన చేకూర్చిన  శ్రీ రమణుల వాక్కులివే-
"ఏకాంతమంటే - బైట ప్రపంచం నుంచి విడినివాసం కాదు. 
ఏకాంతమంటే - ఆలోచనారహిత స్థితి. 
ఏకాంతమంటే - ఆత్మలో స్థిరంగా నిలవడం.
                                 మనల్ని తరిమేది మన మనస్సే. ముందు దాన్ని సిద్ధం చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా హాయిగా ఉండవచ్చు. ఉన్నచోట నిశ్చలమనస్సుతో శ్రద్ధగా సాధన చేయవచ్చు. బైట సత్సంగం వుంటుందంటున్నావు, అది సరే, అసలైన సత్సంగం నీలోనే యుంది. అదే నిజమైన గుహవాసం. ఏకాంతం మనస్సులోని సంగతి. మనష్యుల మద్య మసలినా, మనోపవిత్రతను నిలుపుకున్నవాడు ఏకాంతవాసే. అడవిలో, నిర్జన ప్రదేశంలో వుండి, ఆలోచిస్తూ వుంటే, అది ఏకాంతవాసమా? అనాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసే". 
                                                  * * *
జీవితమన్నాక కష్టసుఖాలు తప్పవు. ఒకసారి ఒకదాని వెంబడి ఒకటిగా సంభవిస్తున్న ఆపద్కాలములో మానసికంగా బాగా అలసిపోయి, ఇక భరించలేను రామా! ఎందుకీ పరీక్షా? ఏమిటీ కష్టాలని రాముని చిత్రాన్ని చిత్తానికి తాకించుకొని బాధపడగా, ఆ రోజు సాయంత్రమే నా మిత్రురాలు యాదృచ్ఛికంగా రమణమహర్షి పుస్తకం ఇచ్చారు. తను వెళ్ళాక, రామున్ని ధ్యానించి పుస్తకం తెరవగా, తెరిచినా పుటలో ఉన్నది చదివాక, ఎప్పటిలా ప్రశాంతత వచ్చేసింది.  నేను ఆ క్షణంలో చదివింది ఏమిటంటే - 
"ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు. ఆయనే భగవంతుడు. పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే. మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం. పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు. కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు. నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి, నీవు నిశ్చింతగా వుండు". 
                                                * * *
ఎన్ని చదివినా, ఎప్పటికప్పుడు ప్రతీది కొత్తగానే ఉంటుంది. ఒకానొక కష్టసమయంలో రామా! నిన్ను ఇంతలా నిరంతరం స్మరిస్తానే, మరి ఇదా నీ అనుగ్రహం అని అజ్ఞానంతో బాధగా అనుకుంటూ ఎప్పటిలా పుస్తకం తీసి, (నాకు కోపం, బాధ, ఆనందం, ఉద్వేగం, ఉక్రోషం, అసహనం, అశాంతి ... ఇత్యాది ఏ భావాలు కల్గిన మౌనంగా ఏదో ఒక పుస్తకాన్ని తీసి చదవడం అలవాటు) రాముణ్ణి ధ్యానించి ఓ పుటను తెరిచి చదవగా, మూడు ముక్కల్లో నా అజ్ఞానాన్ని నేను గుర్తించేటట్లు చేశారు శ్రీ రమణులు.   
"మనం భగవంతున్ని స్మరించాం, అంటే అది భగవంతుడు అనుగ్రహించినవరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు. అనుగ్రహమే భగవంతుడు. దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం". 
                                                * * *
తనే కరెక్ట్ అని, ఎదుటివార్ని అర్ధం చేసుకోకుండా కించపరిచే తనమాటలతో ఓసారి విభేదించానని, కొన్నేళ్ళ స్నేహాన్ని మరిచి, అరిచి, విడిచి, అహాన్ని అడ్డుగోడగా కట్టేసి,  నిందిస్తూ, నిష్టూరాలు ఆడిన ఓ ఆత్మీయనేస్తం ప్రవర్తన నన్ను కలచివేస్తున్నప్పుడు మౌనమయ్యాను. బాహ్యమున మౌనంగా ఉన్నా, అంతరాన్న ఆవేదన. ఆ తరుణంలో రామానుగ్రహంతో రమణుల బోధ నాచెంత చేరి నాలో చింతను పూర్తిగా మాయం చేసింది. ఒకప్పుడు ఎప్పుడూ కదిలాడే తన జ్ఞాపకాలతో మనస్సు బాధతో భారమయ్యేది, ఏ పనియందైన పరధ్యానమే! మరి ఇప్పుడు ఎప్పుడైనా తను జ్ఞాపకం వచ్చినా, దుఃఖస్పర్శ లేశమాత్రమైన ఉండక, దైనందికకార్యక్రమాల్లో ప్రశాంతంగా నిమగ్నురాలినౌతున్నాను. ఆమెకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 
"మనల్ని ఎవరైతే ఖండిస్తారో, కాదంటారో, తిడతారో, నిందిస్తారో, నిరాకరిస్తారో వారు మన మిత్రులు. ఎందుకంటే, మన శత్రువైన దేహాన్ని (దేహాత్మభావాన్ని) వారు నిందిస్తున్నారు. మన మనోశత్రువునకు శత్రువైన దేహానికిశత్రువు అయినవారు మనకు ఆప్తమిత్రుడు కావాలి కదా"? 
                                                * * *
కొందరు భక్తిమార్గం గొప్పదని, మరికొందరు ధ్యానయోగమని, మరికొందరు జ్ఞానమార్గమని, మరికొందరు కర్మయోగం గొప్పదని అంటుంటారు. నిజానికి ఏ యోగం గొప్పదన్న సందేహం కలిగి, నాలో నేనే... ఇదనీ, అదనీ విశ్లేషించుకుంటూ సతమతమౌతున్న తరుణంలో రమణుల పుస్తకం చేతికి రావడం, అందులో సమాధానం వుండడం ... ఒకింత అవగాహనై ఉపశమించాను. 
"ఏ యోగవిధానం మంచిదంటే ... అది వ్యక్తి అభిరుచి మీద ఆధారపడి వుంటుంది. ఒకరికి ఒక పద్ధతి, ఒక తీరు, ఒక విధానం సులభంగా వుంటే; మరొకరికి మరొక పద్ధతి సులువుగా వుంటుంది. అంతా, అన్నీ ఒకటే, సమానమే. 
జీవుడు జనన, మరణవలయం నుంచి విముక్తి కావడానికి చేసే కర్మాచరణే - "కర్మయోగం".
అంతా దైవమే అయినా, తాను పరబ్రహ్మ నుంచి విడివడ్డాననే తపనతో, నిజమైన భక్తి విశ్వాసాలతో వుండుటే - "భక్తియోగం". 
అజ్ఞానమనే తిమిరంలో పడి కొట్టుకునే జీవుడు, కాంతికోసం విమోచన కోసం ప్రయత్నించుటే - "జ్ఞానయోగం". 
జీవుని స్వభావం విచారణ ద్వారా తెలుసుకోవడమే మహాయోగం ... అదే విచారణ మార్గం. పరిపూర్ణభక్తితో భక్తుడు శరణాగతి అవ్వడాన్నే విచారణ మార్గమును అనుసరించేవారు జ్ఞానమంటారు. అన్నిమార్గాలు అహంకారాన్ని ఆత్మలో లయింపజేయడమే గమ్యంగా కలిగియుంటాయి". 
                                         * * *
లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమయిన కుట్టదంటారే ...  అన్నీ ప్రారబ్ధసారం జరుగుతుందంటారు కదా, మరి ప్రత్యేకంగా ఈ దుర్గుణాలు, దురభ్యాసాలూ పోగొట్టుకోవాలనటం ఎందుకు? అన్న సందేహానికి సమాధానం - శ్రీ రమణభాషణంలో ... 
ఎందుకా? చెబుతాను విను. శరీరం వుంది, దానికెక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో, డాక్టరు వచ్చి, కత్తితో ఆ భాగం కోసి, చెడురక్తం తీసివేసి, మంచిరక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అట్లాగే యిదీనూ! ఆ వ్రణం కోయకుండా వదిలితే,లోపలంతా కుళ్ళుతుంది. కోసిన వెనుక కట్టు కట్టకుంటే, చీముపడుతుంది. మానవుని నడవడిక లోనూ అంతే. దుర్గుణాలు, దురభ్యాసాలూ వ్రణం లాంటివి. కోసివేయకుంటే అదఃపతితుడౌతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి. 
                                                 * * * 
గురుసన్నిధిలో నిరంతరసాధన చేస్తున్న సత్యాన్వేషకులుకే తప్ప నేను చేయగలనా ఈ ఆధ్యాత్మికమార్గంలో పయనాన్ని..... అన్న వెరపు నాలో కల్గినప్పుడు నాలో ధైర్యాన్ని పెంచడానికి శ్రీ రమణానుగ్రహంతో నా కంటబడిన శ్రీరమణులు వివరించిన కధ ఇది - 
ఒక పిచ్చుక గ్రుడ్డు సముద్రంలో జారి పడిపోతే, ఆ గ్రుడ్డును బయటికి తీసి రక్షించాలని పట్టుదలతో సముద్రంలో నీళ్ళన్నీ బయటపోస్తానని, విసుగు విరామం లేకుండా సముద్రలో మునిగి, ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం, ముక్కుతో బయటపోయడం చేస్తుండగా, ఇది చూసిన నారదులవారు, విషయం అడిగి తెలుసుకొని, ' వెఱ్ఱిపిచ్చుకా! నీకిది సాధ్యమా?' అని అడగగా, 'సాధ్యమా? అసాధ్యామా? అన్న చింత నాకు లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను, పైన దైవమున్నాడు' అని అన్నదట ఆ పిచ్చుక. నారదుడు పిచ్చుక శ్రద్ధకు ఆనందంచి, గరుడుని వద్దకు వెళ్ళి, ఈ విషయమంతా వివరించి, 'ఏమోయ్, నీ జాతిపక్షి అంతశ్రద్ధతో పని చేస్తుంటే నీవు ఊరకే వుండటం ధర్మమా? సహాయపదరాదా?' అని అన్నాడట. ఆ మాటలు విన్న గరుడుడు పరుగుపరుగున వచ్చి రెండు రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా రెండు పాయలై చెదిరి గ్రుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆనందంతో ఆ గ్రుడ్డును తీసుకుందట. అదేవిధంగా ఆత్మచింతన కలవారూ, సత్కార్యాచరణపరులూ... ఈ పని పెద్దదే, మనకు ఈ పని చేయడం సాధ్యమా అని జంకి విడవక శ్రద్ధతో పాటుపడితే దైవసహాయం దానంతట అదే వస్తుంది. 
ఈ కధే కాకుండా ఒకరికి వచ్చే సందేహాలను శ్రీ రమణులు ఎలా తీర్చారో...  క్రింద సంభాషణను చదివి, తద్వారా నా సందేహానికి కూడా సమాధానం తెలుసుకున్నాను. 
పృచ్ఛకుడు: భగవాన్! మీరు చెప్పినట్లు 'అహం' వృత్తియొక్క మూలమును, బుద్ధికుశలత వలన 'ఆత్మ' అని గ్రహించినను, మనస్సందు ప్రవేశింపకున్నది. కారణమేమి?
రమణమహర్షి : ఏమి అడ్డు వచ్చుచున్నదో చెప్పుడు?
పృచ్ఛకుడు : జన్మాంతర సంస్కారములు, మనస్సు తాను పుట్టినచోట చేరకుండా అడ్డు తగులుచున్నవేమో!
రమణమహర్షి: అది నిజమే! ఆ సంస్కారములను పోగొట్టుకొనుటకై మనం చేయు సాధన?
పృచ్ఛకుడు : మన ప్రయత్నమెంత తీవ్రమైనను, జన్మజన్మాంతరములుగా మనస్సులో నాటిన సంస్కారములను నిర్మూలింపలేము. భగవంతుని కృప ఒక్కటే, దీనికి సమర్ధమైనదని నా అభిప్రాయం. దేవుని కృప లేనిదే మనమెంత సాధన చేసినను లాభం లేదు. 
రమణమహర్షి : మీరు చెప్పినది అంతయూ నిజమే. ఇందు మూడు విషయములు ఉన్నవి. 1. స్వప్రయత్నం 2. కాలపరిపాకం 3. ఈశ్వరకటాక్షం. మనం సాధన చేయుచుండగా, సమయం వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి కటాక్షం దానంతట అదే లభించును. దానికై దేవునికి జ్ఞాపకం చేయనవసరం లేదు. ఆయన మనం చేస్తున్నదంతా చూస్తూనే వున్నాడు. తగినసమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం దొరుకును. సాధకులు సామాన్యముగా దేవునికృపకై చూస్తూ తమసాధనలో అశ్రద్ధ వహిస్తారు. అందువలన వారు గమ్యస్థానం ఎప్పటికీ చేరలేరు.