Pages

Saturday, 29 June 2013

గణపతి పూజ, ఉపాసన...

గణపతి పూజ, ఉపాసన...
గణపతి పూజ ఉపాసన విధానాలు చాలా వున్నవి. గణపతి దీక్షను పొంది గణపతియే పరబ్రహ్మం అని  మొట్ట మొదటి గాణాపత్యులచే దీక్షను అందుకోవాలి. దీక్షా సంస్కారానంతరం గణపతి మంత్రోపదేశం పొంది, శ్రద్ధగా అనుస్ఠానం చేయాలి. గురుశిష్యులిద్దరూ శుద్ధాత్ములై వుండి, పరాన్న భోజనం చేయరాదు. త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అభ్యక్ష భోజనం నిషిద్ధం. గురుద్రోహి చింతన మనసులోకాని, కలలో కాని రారాదు.

గణాపత్యంలో ఆరు ముఖ్య భేదాలున్నవి. మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, స్వర్ణ గణపతి, నవనీత గణపతి, సంతాన గణపతుల్ని పూజిస్తారు. ఒక్కొక్క గణపతికీ ప్రత్యేక పూజా విధానాలున్నవి. తంత్రసారంలో ఈ పూజా విధానాలన్నీ వివరించబడ్డాయి.

గణపతిని లింగరూపంలోను, సాలిగ్రామ, యంత్ర, కలశ, లేదా విగ్రహ రూపంలోను పూజించే సంప్రదాయమున్నది. గణపతి సాలగ్రామాలు చాలా అరుదు. తంజావూరు జిల్లాలోని తిరునల్లూరులో గణపతి సాలగ్రామానికి పూజ జరుగుతున్నది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పూరులో గణేశ లింగం ఒకటి వున్నదని, డా.గురురాజ భట్టుగారు తెలిపారు. లింగంపై గణేశ యంత్రం చెక్కబడి యున్నది.

నిత్యదేవతార్చనలోను, పంచాయత తనంలో పూజించే గణపతి ప్రీతీకకు శోణభద్ర గణపతి అని పేరు. ఎరుపు వన్నె కలిగి ఎనిమిది కోణాల అంగుష్ఠ ప్రమాణం గల ఈ శిలాప్రతీక శోణభద్రా నదిలో లభిస్తుందని ప్రతీతి.

పంచాయతనం అంటే అయిదు దేవతల్ని ఏకంగా పూజించుట అని అర్థం. ఆదిశంకరులు వివిధ దేవతా పథములను అనుసరించే వారి మధ్యగల వైషమ్యాలను తుదముట్టించి, అన్ని పథముల వారు అనుసరించదగ్గ ఈ పూజా పద్ధతిని అమలు పరచినారు. విష్ణు, శివ, శక్తి, గణపతి, ఆదిత్యుడు, వీరే ఈ అయిదు దేవతలు. పంచాయతన పూజలో విష్ణువు ప్రధాన దేవత అయినప్పుడు మధ్యలో విష్ణు సాలిగ్రామాన్ని ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో ఆదిత్యుడు, వాయవ్యంలో అంబిక, నైరుతి భాగంలో గణపతి సంకేతాను ఉంచి పూజిస్తారు. ఈ రీతిగా ప్రధానదేవత ఏదియో ఆ దేవత సంకేత కేంద్రానికి వచ్చినప్పుడు కేంద్రంలో వున్నదేవతా సంకేతం, ఆ దేవత స్థానానికిపోతుంది.