Pages

Thursday, 6 June 2013

ఆపదమొక్కులవాని నిత్యార్చన




కలియుగప్రత్యక్షదైవమైన శ్రీవెంకటేశుని ప్రతినిత్యం ఎన్నో రకలైన సేవలతో కొలుచుకుంటూ పునీతులయ్యే భక్తులకు, స్వామివారి ఆలయం తెరిచే విధానం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత సహజంగానే కలుగుతుంటుంది.  భక్తుల పాలిటి కొంగుబంగారం, ఆపదమొక్కులవాడు, ఆర్తత్రాయణప్రాయణుడు,  అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ పుణ్యఫలమే తప్ప,  మరేమీ కాదు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం, ప్రతిరోజూ సుప్రభాతమనే మేలుకొవుపు సేవతో ప్రారంభమై బంగారువాకిళ్ళు తెరవబాతాయి. తిరుమలలో ప్రప్రథమంగా శ్రీవారి దర్శనభాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి  సన్నిధిగొల్ల. శ్రీస్వామి సన్నిధిసేవతో సంబంధించిన వ్యక్తి ఆబట్టి ఈయన్ని సన్నిధిగొల్లని పిలుచుకుంటాం.

ప్రతిరోజూ బ్రాహ్మీముహూర్తంలో  సన్నిధిగొల్ల దివిటీని పట్టుకుని తిరుమల ఉత్తరమాడ వీధిలోనున్న వైఖానసులైన అర్చకుల తిరుమాళీగకు (ఇంటికి) వెళ్ళీ, ఆరిని ఆలయానికి రమ్మని ఆహ్వానించడాం జరుగుతుంది. వెంటనే అర్చక స్వాములు, జియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు శ్రీవైష్ణవస్వాములు, వేదవేత్తలు, భాగవతోత్తములు, భక్తులు, అధికారులు, పరిజనం బయలుదేరుతారు. అర్చకస్వాములు కుంచెకోల (ఇనుపకొక్కెం) ను భుజంపై పెట్టుకుని, తాళం చెవులగుత్తిని తీసుకుని సన్నిధిగొల్ల వెంట బయలుదేరుతారు.
అనంతరం వీరంతా దారిలో శ్రీభూవరాహస్వామివారి ఆలయానికి ఆత్మ ప్రదక్షణం చేసి నమస్కరించుకుని శ్రీవారి ఆలయం పడికావలి (మహాద్వారం) వద్దకు చేరుకుంటారు.

అప్పుడు ఆలయగోపురానికి ఎదురుగానున్న మెట్లకు దక్షిణంవైపు మేడ మీద ఉన్న నగారామంటపంలో (నౌబత్ ఖానా) శ్రీవారి అర్చకుల రాక తెలియజేయడానికి అన్నట్లుగా పెద్ద పలక గంటను మోగిస్తారు. అప్పుడు గోవిందనామ స్మరణతో మహాద్వారం తెరువబడుతుంది. సన్నిధిగొల్ల ముందు పోతుండగా, ప్రధాన ద్వార దేవతలకు నమస్కరించి, ధ్వజ ప్రదక్షిణ పార్శ్వం  నుంచి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణంగా శ్రీ స్వామివారి సువణద్వారం దగ్గరున్న ద్వారపాలకుల పురోభాగానికి చేరుకుంటారు.

అర్చకస్వాములు శ్రీవారి బంగారు తలుపులకుగల లోపలి గడియను మంత్రపూర్వకంగా కుంచెకోలతో తీస్తారు. ఆ తలుపులకు బయట సీలు చేసిన చిన్న సంచి (తిత్తి) లోని తాళాలతో బంగారు వాకిలి తలుపులను తీస్తాడు సన్నిధిగొల్ల. వెంటనే అర్చక స్వాములు, కౌసల్యా సుప్రజా రామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ  నర శార్దూలా, కర్తవ్యం దైవమాహ్నికం  అని సుప్రభాతాన్ని పఠిస్తుండగా, అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తారు.

అనంతర ద్వారాలను కూడా తెరచి, శ్రీవారి సన్నిధానానికి చేరి, శ్రీవారి ఆజ్ఞ గైకొని,   నిద్రిస్తున్న శ్రీభోగ శ్రీనివాసవామీఅరి సన్నిధానానికి వచ్చి, కరతాళ ధ్వానాలు చేసి, ప్రణవపూర్వకంగా, మంత్ర పూర్వకంగా శ్రీవారిని నిదుర లేపి, శ్రీవారి సన్నిధానాన, వారి స్వస్థానంలో వేంచేపు చేస్తారు. అనంతరం దీపోద్దీపనం, గర్భాలా సమార్జనం చేస్తారు. పరిచారకులు తెరను వేయగా, అర్చకుడు స్వామివారికి వెన్న, పాలు, పంచదార నివేదనం చేస్తారు. కర్పూరైలాలవంగ  జాజీక్రముకాది చూర్ణంతో కూడిన సుగంధి తాబూలాన్ని సమర్పించి నీరాజనం చేస్తారు.

అర్చకుడు తాను తీర్థస్వీకారం చేసి శఠారి తీసుకుని, అక్కడున్నవారికి కూడ తీర్థం శాఠారీ చేయిస్తాడు.

సువర్ణద్వారం ముందున్న భక్తులు చేసే మంగళశాసనం పూర్తికాగానే సువర్ణద్వారం తలుపులు తెరువబడతాయి. అప్పుడు శ్రీవారికి కర్పూరహారతి చేయబడుతుంది. ఇక భక్తులకు స్వామి దర్శనం లభిస్తుంది.
అలా స్వామివారి నిత్యారాధన కోసం ఆలయ ద్వారాలు తెరవబడతాయి. అనంతరం స్వామివారికి వివిధ సేవలు చేయబడతాయి. ఇందులో నిత్యసేవలు, ఆర్జితసేవలు అంటూ స్వామివారికి భక్తుల సేవ కొనసాగుతుంది. ఆయన భక్తులకు తనకు సేవలు చేసుకునే అవకాశాన్నిచ్చి ఆయా భక్తుల జీవితాలలో కొత్త వెలుగులను నింపుతున్నాడు. ఎంతయినా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్త జనవరదుడుకదా!