Pages

Tuesday, 30 July 2013

శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దేవుడే!

రాముడు చెడ్డవాడంటూ ఇటీవల కాలంలో కొందరు కొన్ని వితండవాదాలు లేవదీస్తున్నారు. రాముడే కాదు లక్ష్మణుడూ అలాంటివాడేనని కూడా దబారుుస్తున్నారు. రాముడు మంచివాడైతే సీతా దేవిని అడవులెకందుకు పంపించాడని ప్రశ్న కూడా వేస్తున్నారు. వాటన్నిటికీ సమాధా నమే ఈ ప్రయత్నం. వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు.


అలా వచ్చిన నారదుడిని, గుణవంతుడు, అతివీర్యవం తుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారసంపన్నుడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్న వాడు, విద్వాంసుడు, ప్రియదర్శ నుడు, ఆత్మవంతుడు ,కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్న వాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరెైనా వున్నారా ఈ భూలోకంలో? అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి. నారదుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. బాల్యంలోనే శ్రీరాముడు గుహుడు లాంటి (నీచ) జాతి వారితో సహవాసం చేయడంతో, ఆయన గుణవంతుడు అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి వీర్యవంతుడు అయ్యాడు. గురు వాజ్ఞ మీరక పోవడం-జనకాజ్ఞ జవదాటక పోవడం-పరశు రాముడిని చంపక పోవడం లాంటివి ఆయన ధర్మజ్ఞుడు అని తెలుపుతాయి. 

అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా -సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను -సర్వ భూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ శర ణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడు తుంది. ఇంద్రజిత్తుపెై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధెైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడనీ- భయం కరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది. 

వాల్మీకి శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, రామా రామా రామా, అని లోకులు పొగిడే రామచందమ్రూర్తి అనే పేరుగలాయన మాత్రమే. అతివీర్యవంతుడాయన. అసమాన మైన-వివిధమైన-విచిత్రమైన శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందంగలవాడు. ఇంద్రి యాలను-సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపెై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్లవాడు.

శ్రీ రామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. దానధర్మాలు, స్వాశ్రీతరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వజ్ఞుడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. విష్ణువుతో సమానుడు. లోకాలను పాలించ సమర్థుడు. ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు. ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను ఎరిగినవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని తలచడం సరెైంది కాదు. పంచవటిలో సీతారామ లక్ష్మణులు న్నప్పుడు, రామ లక్ష్మణులిద్దరూ లేని సమయంలో ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతాడు రావణుడు. సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. 
ram2తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. రామచందమ్రూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు. రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచందమ్రూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే రాముడు శోకించాడు. 

అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందోనని రామచందమ్రూర్తి దుఃఖిం చాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు. పంపా తీరంలోని వనంలో హనుమంతుడిని చూసి, ఆయన మాటపెై గౌరవం వుంచి, సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు. తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు హీనజాతి వాడెైనా, పురుషు డెైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. హీన స్ర్తీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడెైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది. 

శ్రీరామచంద్రుడు వానర సేనలతో సముద్రం దాటి, లంకలో నిర్భయంగా ప్రవేశించి, యుద్ధభూమిలో రావణుడిని చంపి, సీతాదేవిని చూసి, ఇన్నాళ్ళూ పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి, సీతాదేవిని కఠినోక్తులాడుతాడు. పతివ్రతెైన సీత, తన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి, లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చి, సీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరనీ, ఆమెలో ఎట్టి లోపించలేదని, ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడామెను మరల స్వీకరించి, బ్రహ్మ రుదద్రిదేవ తలందరు మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు. 

దేవతా సమూహాల గౌరవం పొందిన శ్రీరామచంద్రమూర్తి, తను చేసిన పని, లోకోపకారం-లోక సమ్మతమైన పనెైనందున, సంతోషపడ్తాడు. సీతామహాలక్ష్మి తోడుండగా, శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు మిక్కిలి సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీ రామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, రుూతిబాధలుకాని లేవు.