Pages

Friday, 5 July 2013

జనన మరణాల మధ్య అంతా మిథ్య

F156

మాతా నాస్తి పితా నాస్తి
నాస్తి బంధు సెదరః
అర్ధం నాస్తి గృహం నాస్తి
తస్మాత్‌ జాగ్రత జాగ్రతాః
ఇది శంకర భగవత్పాదులు బోధించిన జీవిత సత్యం. భూమి మీద మనం జన్మించడానికి ఒక మార్గం కావాలి. పూర్వజన్మ పాపపుణ్యాల్ని అనుభవించి, తిరిగి వచ్చినచోటేక చేరుకుంటాం. అలా మనకి సాయపడుతున్న జన్మకారకులు తల్లిదండ్రులు. మనతోపాటు మరికొన్న జీవాలు ఋణానుబంధాలననుసరించి అదే గర్భవాసాన జన్మిస్తూవుంటారు. వారే మనకు సోెదరులు అవుతారు. ఫలానా వారు మనకి సోెదరిగా జన్మిస్తుందనిగానీ, సెదరుడుగా పుడతాడని గానీ మనకు ముందుగా తెలియదు. అదే జన్మరహస్యం.

ఇలా జన్మించిన మనకి తల్లి, తండ్రి, అక్కా, అన్నా, చెల్లెలు, తమ్ముడు అనే బంధాలు ఏర్పడతాయి. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు వీరెవరూ మనతోపాటు రారు. అలాగే మనం మరణించేటప్పుడు తిరిగి ఈ తల్లి గర్భానికి చేరం. తల్లిదం డ్రులూ మనతో రారు. జన్మించడానికి, మరణించడానికి మధ్య నున్న వ్యవధిలో మనకి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు బుద్దిపూర్వకంగా పుడుతూవుంటాయి. పెళ్ళి, పిల్లలు, సంసారం అనే సడిగుండంలో చిక్కుకుని, జీవితకాలంలో మనం కూడబె ట్టుకున్నది ఉన్నవారికి వదిలి తిరుగు ప్రయాణం అవుతాం. అప్పుడు మన సంసారంలో భార్యగానీ, పిల్లలుగానీ మనతో పాటు రారు. అందుకే వీటిమీద వ్యామోహాన్ని పెంచుకోకూ డదు. ఈ సంసార సాగరంలో పడితే పుడుతూ, మరిన్ని పాపకర్మలు చేస్తూ మరణిస్తూ తిరిగి వాటిని అనుభవించడానికి మరో గర్భాన జన్మిస్తూ ఇలా అంతులేని భవసాగరాన్ని జననమరణాలతో ఈదులాడుతూనే ఉండాలి. 
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్సారే
కృపయాపారే పాహి మురారే 

అన్నారు శంకరభగవత్పాదులు. మరి మనకి తోడుగా, నీడగా ఉండేది ఏదీ..? అనే సంశయా నికి సమాధానంగానే శంకరులవారు ప్రబోధించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరమేశ్వరుని శరణాగతి ఒక్కటే మార్గం అని. అన్ని జన్మల్లోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మ. జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇదే చక్కని చుక్కాని. పుట్టుక వల్ల ఏర్పడిన భవబంధాల మీద అనురక్తిని పెంచుకోకుండా, భగవంతుని అన్వేషించి పట్టుకుంటే ఈ జననమరణ చక్రంలో పడి కొట్టుకుపోకుండా ఆ పరమేశ్వరుడే మనల్ని ఒడ్డుకి చేరుస్తాడు. 

ఎవరూ మనతో రాకపోయినప్పటికీ, నీడలా మనని అంటిపెట్టుకు వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే అన్న విషయం విజ్ఞులందరికీ తెలిసినదే. పుణ్యచరణ వలన ఉత్తమగతులు కలుగుతాయన్నదే వేదవాక్కు. అందుకు ఈశ్వరుడు అనుగ్రిహంచిన ఈ జన్మని, తిరిగి పరమేశ్వరార్పణమే చేయాలి. బ్రహ్మాండం నుంచి పుట్టిన అణువులు, పరమాణువులు మళ్ళీ బ్రహ్మాండంలోనే విలీనం కావాలి. అదే ప్రకృతి. దానిననుసరించి వర్తించడమే మానవ ధర్మం. అందుకు తగిన సాధన ప్రతి మానవుడు చేయాలి. అప్పుడే జన్మరాహిత్యం కలుగుతుంది. మనసా, వాచా, కర్మణా భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకునే ప్రతీ మానవుడు ఆయనలోనే లీనమవుతాడు. 

ఆయనే జన్మాంతరాన మనతో పాటు నడిచే, నడిపించే బాంధవుడు. మనం మమకారం పెంచుకున్నవా రెవ్వరూ మనతో ఉండరు, రారు.అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. మంచి జన్మ లభించినందుకు ఈ జన్మలోనే పాప పరిహారం చేసుకుని, సకల బంధాలనూ విడనాడి, ఆ పరమే శ్వరుని పాదాలచెంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడానికి అహర్నిశలూ కృషిచేయాలి. ధర్మ పథంలో పయనిస్తూ, ఆ పరమపథాన్ని చేరుకోవడానికి భగవన్నామాన్ని జీవిత నౌకగా చేసుకుని నవవిధ భక్తిమార్గాలలో ఈ భవ సాగరాన్ని దాటాలి. 
రామ హరే కృష్ణ హరే
తవ నామవధామి సదానుహరే
నామస్మరణా ధన్యోపాయం
నహి పశ్యామో భవతరణే 

ఈ భవబంధాల్నించి మనల్ని విముక్తుల్ని చేసేది ఈ కలియుగంలో నామస్మరణ ఒక్కటే.అందుకే ‘కలియుగే స్మరణాన్ముక్తిః’ అని శాస్తవ్రచనం. ఈ కలియుగంలో విషయానురక్తులైన మానవులకు భక్తి, ముక్తి దాయకం ఈ నామస్మరణ. అనుక్షణం భగవంతుని స్మరిస్తూ, ప్రతిచర్యా, ప్రతి క్రియా ఆ భగవంతుని ప్రేరణగానే భావించి తరించడం కంటే సూక్ష్మమైన సాధన మరొకటి లేదు.