Pages

Saturday, 17 August 2013

పెండ్లి ముహూర్త విషయాలు

పెండ్లి ముహూర్త విషయాలు

ఏక నక్షత్ర వివాహ విషయము :

రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్రముల విషయంలో వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు. అశ్వని, భరణి, ఆశ్రేషా, పుబ్బ, స్వాతీ, మూల శతభిషం యివి మధ్యమములు తక్కిన నక్షత్రములు దోషములు.

అయితే 27 నక్షత్రములలో కూడా ఒకే నక్షత్రము అయినప్పటికీ భిన్న పాదములు అయినచో దోషం లేదు.

ఏకోధర వివాహము :

' పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్పువో ద్వివాహశ్శుభో, న్యాఅన్యత్పుత్ర కరగ్రహత్తునక మప్యుద్వాహ ఏవవ్రతత్' అనే కాలమృత శ్లోకాధారముగా ఏక కాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయములో పుత్రిక వివాహానంతరము పుత్ర వివాహము ముఖ్యమ్ననియు పుత్ర వివాహానంతరము పుత్రికా వివాహమునకు పుత్ర ఉపనయనము అయిన చేయ కూడదనియు పుత్ర ఉపనయనాంతరము పుత్రికా వివాహము శుభకరమనియు పుత్ర వివాహము చేసిన సంవత్సరమ్మునందు ఆరు నెలల పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు అశుభకరములు. " ఫాల్గుణే చైత్ర మాసేతు పుత్రోద్వాహోపనయనాయనే అబ్ద భేదాత్ర్పకుర్వీత ఋతుత్రయ విడంబన" అనగా ఫాల్గుణ మాసంలో ఒకరికి చైత్రమాసంలో మరొకరికి సంవత్సరము భేధం ఉన్నందున వివాహ, ఉపనయనాదులు చేయ వచ్చును.

కన్యాదాతల నిర్ణయం :

కన్యాదానము చేయు అధికారము తండ్రికి, త్యండ్రి కానిచో పితామహుడు, సోదరుడు, పిన తండ్రి, పెత్తండ్రి మెదలగు పితృవంశస్థులు వారు కానిచో స్వగోత్రీకులు కానిచో ఎవరైనను చేయ వచ్చును.

కుజదోష నివారణ :

పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్ఠమేకుజే

స్థితః కుజః పతింహంతి నచేచ్ఛు భయతేక్షితః

ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమోధవాశనిః

పతిహంతాస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః

(బృహతృరాశరీరాశాస్త్రం)

జన్మలగ్నము -

చంద్రలగ్నముల లగాయతు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నయెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికి వున్నను లేక ఇరువురికి లేకున్నను వివాహం చేసుకొనవచ్చును. ఈ దోషం ఒకరికుండి మరొకరికి లేకున్నను వైవాహిక జీవితం కలహ ప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు. కావున పైన చెప్పిన విధానంలో శని దోషం కూడా చూడవలెను అని పరాశర మతం " నచేచ్ఛభయతేక్షితః" అనివున్న కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహ వీక్షణ వున్నచో దోషం వుండదు. కేవలం ఆడవారి జాతకంలో వుంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవారికి ఇబ్బంది.ద్వితీయ స్థితియే భౌమదోషస్తు యుగ్మ కన్యక యోర్వినా! ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా! చతుర్ధేభౌమ దోషస్తు మేష వృశ్చికయోర్వినా! సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా! అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా! కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే || ద్వితీయ స్థితి కుజదోషం మిధున కన్యలకు లేదు. ద్వాదశ స్థితి కుజదోషం వృషభ తులలకు లేదు. చర్తుర్ధస్థితి కుజదోషం మేషవృశ్చికములకు లేదు. సప్తమ స్థితి కుజదోషం ధనుస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయినచో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నములవిషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త, నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.

నిశ్చితార్ధం :

నిశ్చితార్ధమునకు పెండ్లితో సమానమైన, సమాన బలమైన ముహూర్తం చూడవలెను. కారణం నిశ్చితార్ధంతోనే వధూవరులు భంధం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండ జాతక ప్రభావాలు వారిరువురికి ఒకరి ప్రభావం మరొకరి మీద చూపుతుండి. వివాహమునకు సంభంధించిన తిధి వార నక్షత్ర లగ్నములు చూడవలెను. అయితే నిశ్చితార్దం రోజున గణపతి పూజ చేయవలెను. కావున భోజనానంతరం పూజ పనికి రాదు. కావున ఉదయ సమయంలోనే నిశ్చితార్ధం చేయవలెను.

నూతన వధూవాస దోషములు :

" వివాహాత్ప్రమే పౌషే ఆషాఢే చాధి మాసకే. నసా భర్తృగృహే తిష్ఠే చ్ఛైత్రే పితృగృహే తధా" వివాహం అయిన ప్రథమ సంవత్సరం ఆ వధువు అత్తవారింట ఉన్నచో ఆషాఢమాసంలో అత్తగారికి గానీ, అధిక మాసం అందు భర్తకును, పుష్య మాసంలో మామగారికి గానీ గండము. మొదటి సంవత్సరము చైత్ర మాసంలో తండ్రి యింట ఉన్న ఎడల తండ్రికి హాని అని వున్నది కానీ ఈ ఒక్క విషయము ఆచారం లేదు.

పునర్వివాహము :

ప్రమదామృతి వాసరాదితుః పునరుద్వాహ విధిర్వరస్యద విషమే పరివత్సరే శుభోయుగళేచాపి మృతిప్రదోభవేత్" అనగా పూర్వ భార్య మృతి నొందిన దిన ప్రభృతి బేసి సంవత్సరముల యందు పునర్వివాహము చేసుకొనుటకు శుభము. సరిసంవత్సరములందు అశుభము." తృతీయా మానుషీకన్యా నోద్వాహ్యా మ్రియతేహిసాః విధవా వాభవేత్తస్మాత్ తృతీయేర్కం సముద్వహేత్" మూడవ వివాహము మనుష్య కన్యకు చేసుకొనుట పనికిరాధు అట్లైనచో భార్యకు మృతి కలుగును, విధవ అయిన అగును. కావున తృతీయము అర్క వివాహము చేయునది.

పెండ్లి చూపులకు :

సోమ, మంగళ వారములు కాకుండాను భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పుర్వాభద్ర, నక్షత్రములు కాకుండా, వ్యర్జ దుర్ముహర్తములు లేకుండాను, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య కాకుండా శుభగ్రహ హోరాలయందు పగటి సమయమున పెండ్లి చూపులఏర్పాటు చేయవలెను.

పెండ్లి పనులు ప్రారంభించుటకు :

సోమ, మంగళ వారములు విడువవలెను అశ్వని, రోహిణి మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉషా, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, నక్షత్రములయందు విదియ, తదియ, పంచమి సప్తమి, దశమి ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ, బహుళ పాడ్యమి తిధుల యందు, శుభగ్రహ హోరాల యందు వర్జ్యం దుర్ముహర్తం వదలి పెండ్లి పనులు ప్రారంభించాలి.

వధూప్రవేశము :

" వివాహ మారభ్య వధూప్రవేశో యుగ్మేదినే షోడశవాసంరాంతే" వివాహ దిన ప్రభృతి పదహారు రోజుల లోపల ఎప్పుడైననూ సరిదినముల యందునూతన గృహప్రవేశం చేయవచ్చును. వధూ ప్రవేశోనది వాప్రశస్తుః నూతన వధువు అత్తవారింట అడుగు పెట్టవలెను అంటే పగలు పనికి రాదు. సూర్యాస్తమయాత్ పరం, సూర్యోదయాత్ పూర్వము ప్రసస్తము. షష్ఠేష్టమేవా దశమే దినేవా వివాహ మారభ్య వధూ ప్రవేశః పంచాంగ శుద్ధంచ దినం వినాపి తిధౌన సద్గోచరకేపికార్యః అనగా వివాహము అయినది మొదలు ఆరు, ఎనిమిది, పది దినములందు వధువు ప్రవేశించిన ఎడల ఆ దినములు తిధి వారనక్షత్ర యోగకరణములచే శుద్ధము కాకపోయినప్పటికీ శుభ ప్రదముగానే వుంటుంది.ఒక వేళ మొదటి నెలలో వదూ ప్రవేశం జరగనిచో మెదటి సంవత్సరంలో బేసి నెలలో స్థిర, క్షిప్ర, మృదు, శ్రవణ, ధనిష్ఠ, మూల, మఘ, స్వాతీ, నక్షత్రదినములందు రిక్త తిధులను విడచి నూతన వధూ ప్రవేశం చేయ వలెను. ఎప్పుడు వధూ ప్రవేశం చేసిననూ వర్జ్య దుర్ముహోర్త కాలములు విడువవలెను.

వివాహ ప్రయత్నం ఎప్పుడు ప్రారంభించాలి?

వివాహము చేయవలెను అని తలచినప్పుడు ఎవరు వివాహ ప్రయత్నములు చేయదలచారో వారికి నక్షత్రం తారాబలం కుదిరిన రోజున, భరణి, కృత్తి, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రేష, పుబ్బ, చిత్త, విశాఖ, జేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలను విడచి, మంగళ, సోమ వారములు కాకుండా, వర్జ్య దుర్ముహూర్తములు లేని సమయంలో గణపతిని ప్రార్ధించి తదుపరి యిష్టదైవమును ప్రార్ధించి వివాహప్రయత్నము చేయ వలెను.

వివాహం :

భరణి, కృత్తిక, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్ర నక్షత్రములు పనికిరావు. చిత్త పనికి వస్తుంది అని కొందరి వాదన. బుధ, గురు, శుక్ర, శని, ఆది వారములు పనికి వస్తాయి. అయితే అన్ని గ్రంధాలలో శుభగ్రహవారములు అన్ని వున్న కారణముగా క్షీణ చంద్రుడు కాని సమయములో వున్న సోమవారాం పనికి వస్తుంది. "మాసంతే దిన పంచకే పితృతిధౌ" బహుళ ఏకాదశి నుండి అయిదు రోజులు, పితృతిధులు వున్నరోజులలో వివాహం పనికి రాదు. పాపగ్రహ వీక్షణ వున్న సమయంలో సప్తమంలో అష్టమంలో పాపగ్రహములు వున్న లగ్నములు పనికిరావు మాఘ, ఫాల్గుణ, చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజంలో దసరా తర్వాత కార్తికం, మార్గశిరంలో ధనుర్మాసం ముందర వివాహములు చేయుట ఆచారంగా వున్నది. మధ్యాహ్నం 12 లోపల, మరల సూర్యాస్తమయం తర్వాత వివాహం చేయవచ్చు.

వివాహం -ఆబ్దికం :

వివాహమునకు ముందురోజు ఆబ్దికం వున్నచో ఆ ముహుర్తం పనికిరాదు. ఇది కన్యాదాత విషయంలోను వరుడు, వరుని తండ్రి ఆబ్దీకములు పెట్టవలసినవిషయంలో మాత్రమే. వివాహం చేసిన నెలలోపుగా వధూవరుల యిండ్ల వారి పైతలరాలవారి ఆబ్దీకములు రాకుండా చూసుకుని వివాహముహోర్తం నిర్ణయించాలి.