మన పెరడులో, ముంగిట్లో, తోటల్లో విస్తృతంగా లభించే బొప్పాయి పైసా ఖర్చులేకుండా శరీరాన్ని అదుపులో ఉంచే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఈ పళ్లు వేడి చేస్తాయి కనుక, గర్భవతులకు ఇస్తే గర్భస్రావం అవుతుందని మన దేశంలో చాలా చోట్ల విశ్వసిస్తారు. కానీ ఇది వట్టి అపోహ మాత్రమే. ఇందులోని పోషకతత్వాల వల్ల గర్భిణికే కాక, గర్భస్థశిశువుకూ మేలే జరుగుతుంది. కనుక అందరూ నిర్భయంగా మిగతా అన్ని పళ్లలాగే బొప్పాయినీ, అన్ని వేళల్లోనూ తీసుకోవచ్చు.
ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకూ, ఆదర్శ భోజనం తీసుకునే వారికీ, ఇది మంచి ఆహారం, ప్రతీ రోజూ ఓ బొప్పాయి పండు తింటే స్థూలకాయం బాగా తగ్గిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. మామూలుగా బొప్పాయికాయతో పప్పు, పులుసు, కూర, పచ్చడి, హల్వా చేసుకోవచ్చు.
ఈ నాడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్న పలురకాల సౌందర్య సాధనాల్లో, ముఖ్యంగా ఫేషియల్ క్రీములు, షాంపూలలో బొప్పాయి పళ్ల గుజ్జునే వాడుతున్నారు, పచ్చి బొప్పాయి నుంచి తెల్లని పాల వంటి రసం స్రవిస్తుంది. 'పాపైన్ ' అనే పేరున్న ఈ ఎంజైమ్ వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.
బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్ సి) ఎక్కువగా ఉంటుంది.