Pages

Sunday, 4 August 2013

ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారా?

ఆఫీసులో పని చేయడం, టివి, కంప్యూటర్‌ల ముందు కూర్చోవడం ఇలా రోజుకి 11 గంటలకు పైగా కూర్చొని ఉండడం ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తోంది ఆస్ట్రేలియా పరిశోధన. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శటీ పరిశోధన నిపుణులు హిడ్డీ వేండర్ బ్లాక్ ఈ మధ్య ఒక పరిశోధన జరిపారు. అందులో 45 లేదా అంతకు మించిన వయసు కలిగిన 2.22 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని అనుసరించి పరిశోధన జరపడం జరిగింది.

ఆ పరిశోధన ఫలితాలు ఇలా ఉన్నాయి:
రోజూ వ్యాయామం, వాకింగ్, సక్రమమైన డయట్... ఇవన్నీ ఒక ప్రక్కన పెడితే.....ఆఫీసులో టివి, కంప్యూటర్‌ల ముందు ఇలా రోజుకి 11 గంటలకు పైగా మీరు కూర్చునే ఉంటారా? ఐతే ఇంకో మూడు సంవత్సరాలలో మీరు హఠాత్తుగా మరణించే అవకాశం ఎక్కువగా ఉంది. అధిక సమయం కూర్చునే ఉండి, మిగతా సమయాల్లో వ్యాయామం చేయకుండా, సరైన డయట్ తీసుకోకుండా ఉంటే గనక ఈ ప్రమాదానికి రెట్టింపు అవకాశం ఉంది.

ఎక్కువ సమయం కూర్చోవడానికీ, జీవిత కాలం తగ్గిపోవడానికీ దగ్గరి సంబంధం ఉందని చెప్పొచ్చు. చక్కని ఆరోగ్యంతో ఉండడానికీ, గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, అధిక బరువు మొదలైన సమస్యల వల్ల బాధ పడకుండా ఉండడానికీ, కూర్చునే సమయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఆఫీసుల్లో కంప్యూటర్‌ల ముందు, టివిల ముందు కూర్చోవడం, బస్సు, టూ-వీలర్ లాంటి వాహనాల మీద ప్రయాణించడం లాంటి విషయాల్లో కూర్చునే సమయాన్ని తగ్గించండి.

వీలైనంతవరకూ నిలబడండి. ఎక్కువగా నడిచి వెళ్ళండి. మిగతా సమయాల్లో వ్యాయామం, మిగతా పనులు చేయడం అలవర్చుకోండి. ఈ విధంగా పరిశోధన రిపోర్టులో చెప్పబడింది.

ఆస్ట్రేలియాలోని హార్ట్ డిసీజ్ ఇన్వస్టిగేషన్ నెట్ వర్క్ మరియు నేషనల్ హార్ట్ ఫౌండేషన్‌ల సహాయంతో ఈ పరిశోధన చేయడం జరిగింది.