Pages

Monday, 5 August 2013

చతుర్విధ పురుషార్థాలు


సంప్రదాయ హిందూధర్మము ప్రకారము మనిషి యొక్క జీవిత కాలమును నాలుగు ఆశ్రమాలుగా విభజిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే చతుర్వర్ణాల భేదము లేకుండా ఎవరైనను వీటిని పాటించి మోక్షము పొందవచ్చును. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమాలు. బ్రహ్మచర్య ఆశ్రమము నందు మనిషి గురువు వద్ద సకల విద్యలను అభ్యసించుట, గురువునకు సేవలు చేయుట, పెద్దలను గౌరవించుట, ఇంద్రియ నిగ్రహము పాటించుట  తమ కర్తవ్యముగా భావించాలని చెబుతున్నది. తరువాత సకల విద్యా పారంగతులై వివాహము చేసుకుని గృహస్థ ఆశ్రమము నందు ప్రవేశించాలి. ఇక ఈ ధర్మము యొక్క ముఖ్య లక్షణములు ఏకపత్నీ వ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, అనాథల యందు ఆదరణ, బీదలకు సహకారము. పిమ్మట వానప్రస్థుడై ధర్మ వ్యవహార బద్ధుడై స్వార్థమును వీడి సంతానమునకు వ్యవహారములు అప్పగించి ధర్మపత్ని తో కలిసి కందమూలాదులు భుజిస్తూ తపమాచరించ వలెను. చివరకు వైరాగ్యము కలిగి ధర్మపత్ని ని సంతానమునకు అప్పగించి కామక్రోధాదులను జయించి శేష జీవితమును లోకోద్ధారణకై లక్ష్యిస్తూ, ఆత్మ సాక్షాత్కారంతో సన్యసించుట సన్యాస ధర్మము.
          ఇందులో గృహస్థ ధర్మము నాలుగు విధాల పురుషార్థాలను భోధిస్తుంది. "పురుషార్థములు" అనగా పురుషుడు (ఇక్కడ పురుషుడు అంటే మానవుడు అని అర్థం)  అర్థించేవి (కోరుకునేవి) అని అర్థం. ఇవి నాలుగు గనుక వీటినే "చతుర్విధ పురుషార్థాలు" అని కూడా అంటారు. అవి :
ధర్మము : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము
అర్థము: ధన సంపాదన మరియు కీర్తి
కామము: శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు
మోక్షము: పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల
             మనిషి గృహస్థు ఆశ్రమం లోనికి ప్రవేశించిన పిమ్మట ధర్మముతో కూడిన ధనమును సంపాదిస్తూ, ధర్మముతో కూడిన కామము (అనగా ఏకపత్నీ వ్రతము) తో సంతానమును పొందవలయును. ఎందుచేతనంటే మోక్షమును పొందాలంటే కామము మరియు ధనసంపాదన ధర్మయుక్తముగా ఉండాలి. అర్థమును, కామమును ఎల్లప్పుడూ ధర్మముతో ముడి వేయాలి. సన్యాస ధర్మము అనగా మోక్షమును మాత్రము కోరుతూ మిగిలిన మూడు పురుషార్థాలను త్యాగము చెయ్యడము. గృహస్థుడు కూడా కాలాంతరములో దీనిని పొందుతాడు. అంతేగాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వలన ప్రస్తుతము ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాస స్థితిని పొందుతారు.