Pages

Monday, 2 September 2013

రాముడు రావణుడి కాళ్ళకి నమస్కరించాడా?


శ్రీ రామచంద్రుడు రావణుడి కాళ్ళకి నమస్కరించిన ఘటన బహుశా యే కొద్ది మందికో తెలిసి ఉండవచ్చు . ఒకసారి ఆ సంఘటన గురించి చర్చిద్దాం. సీతమ్మవారిని వెదుకుతూ బయలుదేరిన రాముడు అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్టించి పూజలు చేసుకుంటూ బయలుదేరాడు అంటారు. ఆలా వారధి కట్టిన ప్రాంతం వరకు రాముడు ప్రతిష్టించిన ఆలయాలు ఉన్నాయి. అయితే చివర్లో వారధి కట్టిన తర్వాత యుద్ధానికి బయలుదేరే ముందు అక్కడ సముద్రపు ఒడ్డున శ్రీరాముడు ఇసుకతో ఒక పెద్ద శివలింగం తయారు చేశాడట. ఆ శివలింగానికి ప్రాణ ప్రతిష్ట చేయాల్సిందిగా నారద మహర్షి ని ఆహ్వానిస్తే అయన " రామా ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ట చేయగల సమర్ధత , శివభక్తి ఒక్క రావణాసురుడికే ఉంది కనుక నీవు ఆయన్ని ఆహ్వానించు " అన్నాడట. "మనం పిలిస్తే ఆయన ఎలా వస్తాడు అయినా అతని మీదకి యుద్ధానికి వెళుతూ మళ్లా అయన చేత పూజ చేయించుకోవడం ఏమిటి" అని రామచంద్రుడు ప్రశ్నిస్తే " నీ బాద్యత గా నీవు పిలువు అయన వస్తే వస్తాడు లేకుంటే లేదు " అన్న నారద మహర్షి మాట ప్రకారం రావణుడికి ఆహ్వానం పంపాడట రామచంద్రుడు.

అపర శివభక్తుడు అయిన రావణుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ ప్రాంతానికి విచ్చేసి ఆ శివలింగానికి పూజచేసి ప్రాణప్రతిష్ట చేశాడట. పూజ అంతా అయ్యాక ధర్మం ప్రకారం పూజారి కాళ్ళకి మొక్కాలి , అ పూజారి ఆశీర్వదించాలి . ఈయన ఏమని సంకల్పం చెప్పి మొక్కాలి , ఆయన ఏమని అశీర్వదించాలి ? నిన్ను చంపడానికి వస్తున్నాను నన్ను దీవించు అనుకుని ఈయన మొక్కాలి అయన తధాస్తు అనాలి . రామ చంద్రుడు రావణుడి కాళ్ళకి మొక్కితే ఆయన అభీష్ట ఫలసిద్ధిరస్తు అని దీవించాడట.

శత్రువైనా రమ్మన్న ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మరీ తన చావుకి తానే వరం ఇచ్చి వచ్చిన రావణుడి అంతరంగం ఏమిటి ? రావణుడిని చంపడానికి రావణుడి చేతే తధాస్తు అనిపించడానికే నారదుడు ఈ ఎత్తుగడ వేశాడా? ఈ రెండు ధర్మ సందేహాలు ఎవరైనా పెద్దలు వివరిస్తే సంతోషిస్తాను.