Pages

Thursday, 19 September 2013

మనసే దైవం -జీవుడి మనసు శక్తిమంతమైన దేవత. దానిలో పుట్టే ప్రతి ఆలోచనా దేవతే



జీవుడి మనసు శక్తిమంతమైన దేవత. దానిలో పుట్టే ప్రతి ఆలోచనా దేవతే. ఆలోచనలు అనంతం. కనుక దేవతలు, ఆలోచనా రూపంగా అసంఖ్యాకం. జీవుడు తన మనసును లొంగదీసుకోగలిగితే, దేవతలను జయించినట్లే. దేవతలను శాసించగలిగినవాడు, నిలువరించగలిగినవాడు, సిద్ధ, శుద్ధ మనస్వియై దివ్యమనస్కుడై ఉంటాడు. కనుక మనసు దైవమేనంటుంది, బృహదారణ్యకోపనిషత్. ఈ పని సాధించుకోని మనసు దయ్యమే! అంటే దయలేనిదన్నమాట. ఆలోచనను యధాతథంగా అనుభవించటం వలన, పరిణామము, సంస్కారము ఎరుగని ఆలోచనలన్నీ విపరీత మనసుగా రూపొంది, దయారహితంగా ఆవిష్కృతమౌతుంది. అది చేసే, చేయించే పనులన్నీ అర్థరహితంగా, వ్యధాభరితంగా వుంటయ్.

అమ్మ పలుకులు కలకండలై...
అమ్మ అడపాదడపా అన్న మాటలన్నీ తేటగా, తెల్లంగా, అచ్చు తెలివిని తెలుపుతుంటయ్. మనసును జయించిన, మనోతీత స్థాయిలో అమ్మ పలుకులన్నీ కలకండలై ఆపాతమాధుర్యాన్ని, ఆలోచనామృతాన్ని అందిస్తయ్. "ఏడుస్తూ అనుభవించేవాడు, నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు సలహా కోసం వస్తాడు'' అంటుంది అమ్మ. అంటే అనుభవించటంలో తేడా వున్నదే కానీ, అనుభవించటం యిద్దరికీ వుందని స్పష్టం చేస్తూ, యిద్దరి మనఃస్థితులను తెరిచి చూపిస్తుంది. ఇద్దరికీ మనసుంది. కాకపోతే ఒకరు ఎరిగీ, మరొకరు ఎరుగకా అనుభవిస్తున్నారు.

ఎరిగిన వాడు ఎదురొడ్డటం లేదు. ఎదిరించటం లేదు. ఆదమరచటం లేదు. అప్రమత్తంగా వున్నాడు. దైవీమయమైన మనసుతో అనుభవిస్తూనే, అనుభవాన్ని సాక్షిగా చూస్తున్నాడు. మనసుపరంగా దివ్యత్వాన్ని, అనుభవపరంగా నిరామయంగా, సాక్షీభూతంగా నిలవటంతో నిర్వికారంగా వుండగలుగుతున్నాడు.

కనుక ఆ స్థితిలో ఆనందమూ లేదు, ఆవేదనా లేదు. ఎరగని వాడు సమస్త అవస్థలకు లోఐ, దేనినీ పూర్తిగా అనుభవించలేని స్థాయిలో సంచరిస్తాడు. వైపరీత్యం, ఉద్వేగం, బాధ, భయం, దుఃఖం, పట్టరాని ఆనందం, గట్టు తెలియని మమకారం, అణచుకోలేని అహంకారం, అంతమెరుగని అసూయ, అస్పష్టత, అనాచారం వంటి ప్రతికూల శక్తులకు లోనై మనసు దయ్యమై నిరంతర చింతకు గురౌతాడు.

సంకల్పరాహిత్యం ఎక్కడ?
ఎరిగినవాణ్ణి ఎరగని వాడు కలుసుకున్నప్పుడు మొదటివాడు రెండోవాడికి ఉపశమనం కలిగిస్తాడు, దారి చూపిస్తాడు, క్షణకాలమైనా దుఃఖం నుండీ దూరం చేయగలుగుతాడు. "అమ్మా! సంకల్పరాహిత్యమంటే ఏమిటి?'' అని అడిగినపుడు "అంటే సంకల్పంలోంచే పుడుతున్నపుడు, ఆ సృష్టంతా ఆగకుండా జరుగుతున్నపుడు, సంకల్పము-సృష్టి ఎడతెగకుండా అవుతున్నపుడు, సంకల్పరాహిత్యానికి అవకాశం లేదు. కనుక సృష్టిస్తున్న వాడికి వున్నదంతా సంకల్పసాహిత్యమే. ఎందుకంటే వాడు, వాడి మనసు దైవతం కాబట్టి. అందునా వాడి సృష్టంతా నిస్వార్థం. 

జీవుడి మనసు ఆ స్థాయిది కాదు కనుక, ఆలోచనలన్నీ స్వార్థపరం, స్వగతం కనుక, సాధనాక్రమంలో జీవుడు మనసును నిగ్రహించుకుని, నెమ్మదించుకుని, వేగ ఆవేగాలను తగ్గించుకుని, స్వార్థాన్ని త్రుంచుకుని, ఆలోచనలను పరగతం చేయగలిగితే, సంకల్పరాహిత్యం కలుగుతుంది. 

అది ఒక సిద్ధి. దానిని అన్ని వేళలా అస్పృహతో నిలబెట్టుకోగలిగితే, సంకల్పరాహిత్యం స్థిరమౌతుంది. ఇదంతా అనుకునే వేదాంతం కాదు. మనసును దాటిన నిర్మల భావనా స్థితి. పరిమిత మమకారమే మానవత్వం. మితి ఎరుగనిదే అమిత మనసే భగవంతుడు. అంతా తానే అయినపుడు, తనకేంటే భిన్న వస్తువు మరొకటి లేదన్నపుడు, మనసు దైవమౌతున్నది.

భిన్నత్వంలో చలించే మనసే మానవత్వం. భిన్నత్వం నుండి ఏకత్వంలోకి జరిగే ప్రయాణమే సాధన. ఆ ప్రయాణం సజావుగా సాగాలంటే మనసు, దైవీ సంపదను పొందాలి. ధైర్యం, అంతశ్శుద్ధి, తత్త్వజ్ఞానం, దాతృత్వం, నిగ్రహం, త్యాగం, స్వాధ్యాయం, తపస్సు, అహింస, అపరిగ్రహం, సత్యవాక్కు, ధర్మాచరణ, అక్రోధం, ప్రశాంతత, ప్రసన్నత, దయ, అనాసక్తి, మృదుత్వం, నిశ్చలమనసు, తేజస్సు, క్షమ, సహనం, సమభావం, సమన్వయం, కృతజ్ఞత...వంటి దైవీగుణాలను నియమం చేసుకోవాలి. అపుడు దైవీమయ మనసు, రాహిత్యం వైపు తొంగిచూస్తుంది. ఎందుకంటే, ఎంత సాధన చేసినా, కదంవనం వరకు వెళ్లగలిగిన స్థితి ఏర్పడ్డా, మనోమృగం తన కదలికలను ఆపదు.

మనసు దైవీకం
అంతా చూడటంలోనే వున్నది. అనుకోవటంలోనే వున్నది. ఈ రెండూ మనసుతో ముడిపడే వున్నయ్. కాబట్టి మనసుని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంటికి తాళం సరిగా వేయకుండా దొంగలు పడ్డారంటే ఎట్లా? మనసును సరిచేసుకుండా, మనసు స్థితిని తెలుసుకోకుండా, మనసును దైవంగా మార్చుకోకుండా, దైవం కనబడటం లేదనుకోవటం సరైనదేనా? జరగవలసినదంతా లోపల జరగవలసి వుండీ, బయటే వెదుకులాట ఆపకుండా ఆడుతుంటే జరిపిస్తున్నవాడు దొరికేనా? మూలంలో మనసును కలిపి వుంచగలిగితే, మూలం తెలిసి, లీల, లయం, మహిమ, అనుగ్రహం ఒక్కటిగా అనిపిస్తయ్