Pages

Sunday, 8 September 2013

మహాగణపతి శబ్దం బ్రహ్మస్వరూపం. అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలకు ముందు ఓంకారం ఎలాగైతే ఉంటుందో, అలాగే, అన్ని శుభకార్యాలకు ముందు గణపతి పూజ తప్పనిసరిగా ఉంటుంది. వినాయకుడు ఆదిదేవుడు. సకలదేవతాస్వరూపుడు. ఆందుకే ఆయనకు ప్రథమపూజ.


మహాగణపతి శబ్దం బ్రహ్మస్వరూపం. అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలకు ముందు ఓంకారం ఎలాగైతే ఉంటుందో, అలాగే, అన్ని శుభకార్యాలకు ముందు గణపతి పూజ తప్పనిసరిగా ఉంటుంది. వినాయకుడు ఆదిదేవుడు. సకలదేవతాస్వరూపుడు. ఆందుకే ఆయనకు ప్రథమపూజ.

ఎవరు ఏ దేవతను ఉపాసించినప్పటికీ, ముందుగా గణపతిని పూజించవలసిందేనని నియమం. ఆయన సర్వదేవతాస్వరూపుడు. మంత్రశాస్త్రాలు, ఆ స్వామిలో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, రతీమన్మథులను, భూమీవరాహులను, మిథున దేవతలు ఉన్నారని చెబుతున్నాయి. ఇక, వేదాలకు ఆదిస్వరమైన ఓంకారమే గణపతి గణాలు. వాటి నాయకుడు గణపతి.

గణమయమైన ఈ విశ్వానికి ఆయన అధిపతి కనుక గణపతి. గజ వదనునికి ‘గ’ వర్ణం ప్రీతిపాత్రం. ‘గ’ అనే అక్షరం నుండి మనోవాణీమయమైన ఈ సమస్త జగత్తు ఆవిర్భవించింది. అందుకే భావాత్మకమైన ఈ జగత్తంతా ‘గ’ శబ్దవాచ్యం. ‘ణ’కారం పరతత్త్వానికి సంకేతం. ‘గ’కారం సగుణ సంకేతమైతే, ‘ణ’కారం నిర్గుణ సంకేతం. ఆయన రూపం మనకు ఎన్నో నిగూఢమైన సత్యాలను బోధ పరుస్తుంటుంది.

భారీకాయం

గణ + ఈశః = గణేశః ఈ సమస్త విశ్వానికి పతి కనుక గణపతి. ప్రకృతిలో చరాచరాత్మక సృష్టి మొత్తం ఉన్నట్లుగా లెక్కింపబడి (గణింపబడి) ఎవరైతే పాలిస్తున్నారో ఆ పరమేశ్వరునే ‘గణపతి’ అని అన్నారు. ఆ స్వామి ఈ సమస్త విశ్వమంతటా వ్యాపించి వున్నాడు.

లంబోదరుడు

లంబమైన ఉదరంగలవాడు లంబోదరుడు. ఈ అండపిండ బ్రహ్మాండమంతా ఆయన బోజ్జలోనే నిక్షిప్తమై ఉంది. అందుకే ఆ స్వామికి ఆ పెద్ద పొట్ట. మరొక కథనం ప్రకారం, విష్ణుదత్తమైన నైవేద్యాలతో, శివుడు ఇచ్చిన నైవేద్యాలతో నిండిన పెద్ద పొట్టగలవాడని చెప్పబడుతోంది.

ఏకదంతుడు

‘దంత’ శబ్దం బలవాచకం. ‘ఏక’ అంటే ప్రధానమని అర్థం. ఈ ఏకశబ్దం విశ్వమంతా ఏకస్వరూపంలో వ్యాపించిన మాయాశక్తికి సంకేతం. అదేవిధంగా ఆయన దంతం త్యాగానికి ప్రతీక. ఓ సత్కార్యం కోసం, తనకు చెందిన దానిని త్యాగం చేయడం గొప్ప గుణం. ఆ స్వామి పరశురామునితో జరిగిన ఓ యుద్ధంలో దంతాన్ని ఆయుధంగా ప్రయోగించాడని ఓ కథ. మరొక కథ ప్రకారం, వ్యాసుడు భారతాన్ని చెబుతున్నపుడు, వ్యాసుడు చెప్పినంత వేగంగా భారతాన్ని లిఖిస్తున్న వినాయకుని ఘంటం విరిగిపోయిందట. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి ఘంటంగా ఉపయోగిస్తూ భారతాన్ని ముగించాడట.

చేటల వంటి చెవులు

చేటల వంటి చెవులు జ్ఞాన సంపదకు ప్రతీకలు. ఆయన తన విశాలమైన చెవుల ద్వారా భక్తుల కష్టాలను ఓపిగ్గా విని, వారికి ఎటువంటి కష్టనష్టాలు ఎదురుకాకుండా కాపాడుతుంటాడు. అదేవిధంగా అతి తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా వినమని ఆయన చెవులు మనకు చెబుతున్నాయి.

చతుర్భుజుడు

గణపతి అనంతమైన రూపాలను ధరించిన స్వామి. అందులో చతుర్భుజరూపం ఒకటి. ఆయన నాలుగు చేతులు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విథ పురుషార్థాలను సూచిస్తున్నాయి. గణపతి, దేవలోకం, మానవలోకం, అసురలోకం, నాగాలోకాలను నియమిస్తున్నాడని ప్రతీతి.

ఆయుధధారి

అదేవిధంగా ఆయా సందర్భాలనుబట్టి ఎన్నో రూపాలను ధరించిన గణేశుడు రకరకాల ఆయుధాలను ధరించి మనకు దర్శనమిస్తుంటాడు. ఆయన చేతులలోని ఆయుధాలు కూడ ఎన్నో లోలైన విషయాలను విడమరచి చెబుతున్నట్లుగా గోచరిస్తుంటాయి.

శ్లోకం:
తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య
నిను బ్రస్తుతి జేసెద నేకదంత మా
వలపలి చేతిగంటమున
వాక్కుననెప్పుడు బాయకుండు మా
తలపుల లోన నీవెగతి దేవ, 
వినాయక, లోకనాయకా

శివపుత్రుడా! అవిఘ్నమస్తు అంటూ మొట్టమొదటగా నీకు మొక్కుతున్నాను. నాకు చక్కని ఫలితాలను ఈయవయ్యా. నిన్ను పొగుడుతున్నాను. ఓ ఏకదంతా! నా కలంలో, వాక్కులో నువ్వే నెలకొని వుండు. నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఓ దేవా! వినాయకా! లోక నాయకా!!

పాశం: పాశాన్ని పై ఎడమ చేత్తో పట్టుకుని దర్శనమిస్తుంటాడు. రాగద్వేషాలను అదుపులో ఉంచుకోమని స్వామివారి చేతిలోనున్న పాశం మనకు అవగతపరుస్తోంది. ఈ పాశం మనకు ఆయన అవతారాలలో పలువిధాలుగా గోచరిస్తుంటుంది. కొన్ని విగ్రహాలలో నాగపాశంగా కనబడుతుంటుంది.

అంకుశం: స్వామి చేతిలో నున్న మనకు అంకుశం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంటుంది.

యుద్ధగొడ్డలి: ఇది మనలోని చెడుభావాలను దూరంగా ఉంచమని చెబుతోంది.

గండ్రగొడ్డలి: ఈ ఆయుధాన్ని గణేశునికి పరశురాముడు బహుకరించాడని ప్రతీతి. పరశురామునికి ఈ ఆయుధాన్ని శివుడు బహుకరించాడు. వీర, సిద్ధి, విఘ్న, హేరంబ, నృత్య గణపతుల చేతుల్లో ఈ గండ్రగొడ్డలి చూడగలం.

విల్లు: ఒకసారి పార్వతీదేవి దగ్గరనుంచి శివుని విల్లు పినాకమును తీసుకున్న గణపతి, దానిని భూమిపైకి విసిరేసాడని ఒక కథ. అలా ఆయన విల్లంబును ధరించాడని ప్రతీతి. ఒక్కొక్కసారి ఆయన చేతిలో చెఱకుగడ విల్లును కూడ చూడగలం. ఈ విల్లు చెడుకు దూరంగా ఉండమని మనకు చెబుతోంది.

బాణం: స్వామి చేతిలోని బాణం, మనలను చీకటి నుండి వెలుగులోకి పయనించమని చెబుతోంది. ఒకసారి త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి వెళ్ళిన శివుడు, గణపతిని స్మరించకుండానే ఆ పనికి ఉద్యుక్తుడయ్యాడు. ఫలితంగా ఎంతగా ప్రయత్నించినప్పటికీ శివుని చేతిలో త్రిపురాసురుడు హతమవడం లేదు. కొంతసేపటి తర్వాత విషయాన్ని గ్రహించిన శివుడు గణేశుని ప్రార్థించగా, ఆయన ‘ఓం’ అనే బీజమంత్రాన్ని బాణంపై వ్రాసి ప్రయోగించామన్నాడట. శివపరమాత్మ అలాగే చేయగా త్రిపురాసుర సంహారం విజయవంతంగా జరిగింది.

కత్తి: స్వామివారి గంధక ఖడ్గప్రియ అనే కత్తి మన మనసులోని తలెత్తే చెడు ఆలోచలనలను మొగ్గలోనే తుంచేయమని చెబుతోంది.

గునపం: వ్యవసాయదారులు ఉపయోగించే గునపం పలువిధాలుగా ఉపయోగపడుతుంది. తద్వారా పంటలు బాగా పండించుకునేందుకు వీలవుతుంది. అలాగే మనలోని భావనలను ఆలోచన అనే గునపంతో తిరగేసి జీవితంలో పురోభవృద్ధి సాధించమని గునపము పేర్కొంటుంది.

శతధరవరాయుధం: ఈ ఆయుధం మంచి చెడులను వేరు చేసి చూడమంటోంది.

గద: వినాయకుడు గణాధిపత్యం పొందకమునుపే పార్వతీదేవి ఆజ్ఞప్రకారం, ఆమె భవనానికి కాపలాకాస్తూ శివగణాలతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు ఆయన చేతిలో గదాయుధం ఉంది. ఈ ఆయుధం సమస్యలను ఎదిరించి నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.

త్రిశూలం: వీర గణపతి చేతిలో త్రిశూలాన్ని చూడగలం. ఈ త్రిశూలం ఆపదలు, లేక విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పోరాడమని మనకు సూచిస్తోంది.

డాలు: ఈ ఆయుధం ఇతరులు మనకు చేసే చెడు నుంచి రక్షించుకోమని సూచిస్తోంది.

మనకు వినాయకుడు మూశికవాహనుడుగానే తెలుసు. కానీ ఆయనకు తేలు, పాము, రథం,వంటి వాహనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

మూషికవాహనుడు

పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు సౌభారి అనే ముని ఆశ్రమానికి వచ్చి వెళ్తుండేవాడు. క్రౌంచునికి గంధర్వ లోకం కంటే సౌభారి ఆశ్రమమే చాలా బాగా నచ్చుతుండేది. అందుకు కారణం మున్యాశ్రమం కాదు. సౌభారి మహర్షి భార్య మనోమయి. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్న క్రౌంచుడు, సమయం, సందర్భం కోసం వేచి చూడసాగాడు. ఆ సమయము రానే వచ్చింది. ఒకరోజు ఆశ్రమమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రిస్తున్న మనోమయిని క్రౌంచుడు భుజాన వేసుకుని పరుగులు తీయసాగాడు. చటుక్కున మేల్కొన్న మనోమాయి కేకలు వేయడంతో, ఆశ్రమంలోని శిష్యగణమంతా ఒక్క ఉదుటున లేచి మనోమయిని కింద పడేసి పారిపోబోతున్న క్రౌంచిని పట్టుకుని గురువుకు అప్పగించారు. సౌభారి మహర్షికి జరిగిన సంగతి అంతా అర్థమైంది. గురుపత్నిని తల్లిలా భావించక, కామాంధ కారంతో ప్రవర్తించిన క్రౌంచుని గజముఖంతో నిశాచరుడవై బ్రతుకును వెళ్ళదీయమని శపించాడు. అప్పటికీ సౌభరి మహర్షి కోపం చల్లారక పోవడంతో రాక్షస జన్మనుంచి విముక్తి పొందినప్పటికీ ఎలుకవలె మిగతా జన్మలన్నీ వేల్లదీయక తప్పదని శపించాడు. గజముఖ రూపునిగా మారిన క్రౌంచుడు, శివుని ప్రార్థించి అనేక వరాలను పొంది, దేవతలను బాధించసాగాడు. దేవతలు విఘ్నవినాయనకుని దగ్గర మొరపెట్టుకోవడంతో గజముఖుని సంహరించాడు. అయినప్పటికీ గజముఖుని రూపం నుంచి విముక్తి పొందిన క్రౌంచుడు సౌభరి మహర్షి మరో శాపం ప్రకారం, ఎలుకగా మారి, వినాయకుని శరణు వేడి, ఆయన వాహనంగా స్వామి సేవను చేసుకుని, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఇంకా పలు పురాణాలలో ఈ మూషిక వాహనం కథ రకరకాలుగా గోచరిస్తుంటుంది. అణిగిమణిగి ఉండటమే అత్యుత్తమం అన్న విషయాన్ని వినాయకుని మూషికవాహనం మనకు తేటతెల్లం చేస్తోంది.

రథా రూఢుఢు

గణేశపురాణంలో వినాయకుడు రథంపై ఆసీనుడై ఉండగా, ఆ రథాన్ని ఎలుక లాగుతోందన్నట్లుగా ఉంది.

సింహవాహనుడు

పంచముఖ హేరంబ గణపతి సింహవాహనుడు.

మయూర వాహనుడు

ఓ రాక్షసుని నెమలివాహనంపై వచ్చి వినాయకస్వామి సంహరించాడు. అందుకే ఆయన్ని మయూరేశ్వరుడు అని కూడ పిలుచుకుంటారు.

సర్వవాహనుడు

అత్యంత కిరాతకుడైన ఓ రాక్షసుని సంహరించేందుకై వినాయకుడు సర్పవాహనంపై అరుదెంచాడని ముద్గలపురాణం తెలియజేస్తోంది.

ఆశ్వవాహనుడు

రాక్షస సంహారం కోసం ఒకానొకప్పుడు గణపతి గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చాడట.

గజవాహనుడు

ఒకానొక సమయంలో గణపతికి తండ్రి శివునీతోనే పోరు మొదలవుతుంది. అప్పుడా స్వామి గజవాహనంపై తండ్రి ఎదురుగా వచ్చి నిలబడ్డాడని కథ. ఇలా ఆ స్వామి పలురకాలైన వాహనాలపై ఆసీనుడై కనబడుతుంటాడు. తేలువాహనంపై, చిలుకవాహనంపై, మేషవాహనంపై కూడ ఆయన్ని దర్శించుకోగలరు.