Pages

Thursday, 26 September 2013

వినాయకుడు అంటే- నాయకుడు లేనివాడు అని అర్థం.(Meaning about The Word Of Lord Ganesha)


వినాయకుడు అంటే- నాయకుడు లేనివాడు అని అర్థం. అంటే తనకుతనే నాయకుడు! ‘త్వమేవాహమ్’, ‘అహంబ్రహ్మోసి’ అన్న భావ సూచకమే అది. ఏ ఆరాధనా పద్ధతుల వారయినా, ముందు గణపతినే పూజిస్తారు. ఏ గణానికైనా- అతడే ‘పతి’. జగత్తు అంతా‘గణ’మయమే! వివిధ గణ సమాహారమే విశ్వమంతాను! ‘గ’అనే అక్షరంనుంచే- మనోవాణీయమైన జగత్తు జనించింది. కరచరణాద్యనయన విన్యాసం మొదలుకుని, ఎలాంటి శబ్దమయమైందయినా- భాష, భాషాత్మకమైన జగత్తు అంతా- ‘గ’శబ్ద వాచ్యం. దీన్ని సగుణానికి సంకేతం అంటారు. ‘ణ’కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే ‘గణేశుడు’. అతడే ‘గణపతి’.

ప్రధానంగా షోడశ గణపతులు- సకల ప్రజాగణారాధకులుగా విలసిల్లుతున్నారు.

బాలగణపతి
తరుణగణపతి
భక్తగణపతి
వీరగణపతి
శక్తి గణపతి
ధ్వజ గణపతి
పింగళ గణపతి
ఉచ్ఛిష్ట గణపతి
విఘ్న గణపతి
క్షిప్ర గణపతి
హేరంబ గణపతి
లక్ష్మీగణపతి
మహాగణపతి
భువనేశ గణపతి
నృత్త గణపతి
ఊర్ధ్వగణపతి.
ఇలా సమస్త శుభకార్యాలు సిద్ధించడానికి గణపతి షోడశంగా ప్రాతఃస్మరణీయుడిగా వున్నాడు.

‘‘శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే’’

ఈ గణపతి శ్లోకంలో- వినాయక తత్త్వం దాగుందని మీకు తెలుసా? శుక్లాంబరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు అనే ధావళ్యత- సత్త్వగుణ ప్రతీక. ‘శుక్లాంబరధరం విష్ణుం’ అంటే- సత్త్వగుణమైన ఆకాశాన్ని ధరించినవాడని. శశివర్ణం అంటే చంద్రునివలె కాలస్వరూపుడని. అంటే లోక పాలకుడని. చంద్రమానమే కాలానికి ప్రధానమైన కొలబద్ద. ‘చతుర్భుజం’అంటే ధర్మార్ధకామమోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్దబ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నది సకల గణాధిపతి అయిన వినాయకుడే మరి! మరి వినాయకుడుకాక ‘గణపతి’గా ఆరాధ్యుడు మరెవ్వరు కాగలుగుతారు?