Pages

Friday, 27 September 2013

ధర్మం అంటే ? 'వేదోఖిలో ధర్మ మూలం' (What Is the meaning Of Dharmam)



 'వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది. అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు. విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ఈ ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.