Pages

Monday, 14 October 2013

యోగ మంటే ఏమిటి? యోగ శాస్త్ర ప్రాముఖ్యం.

information on yoga definition excellent yoga postures, yoga exercises, yoga positions and essential facts about yoga
యోగ మంటే ఏమిటి?

యోగ మంటే అదృష్టం, కూడిక, కలయిక, సంబంధం, ధ్యానం అనే అర్థాలు ప్రచారంలో వున్నాయి. అదృష్టం అనే అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ యోగం బాగుండటం వల్ల ఇంతవాడు అంత వాడైయ్యాడు అని అంటూ వుంటారు. కూడిన అనే అర్థంలో యోగశబ్దాన్ని వాడుతూ ఒకటి ప్రక్కన సున్నా చేరిస్తే పది, పది పక్కన ఆరు చేరితే పదహారు, నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది, ఎనిమిది అయిదు కలిపితే పదమూడు అని అనడం మనకు తెలుసు. కలయిక లేక సంబంధం అనే అర్థంలో యోగశబ్దాన్ని వాడుతూ తల్లి-కొడుకు, తల్లి-కూతురు, తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు, భార్యా-భర్త, అత్తా-కోడలు, గురువు-శిష్యుడు అని అంటూ వుంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆత్మ-పరమాత్మ కలయిక కోసం చేసే ప్రయత్నాన్ని ధ్యానం అని అంటారు. ఇది ఎకాగ్రతపై ఆధారపడి వుంటుంది. దీనికి విశ్వాసం, నమ్మకం చాలా అవసరం.

యోగశాస్త్రంలో ధ్యానం ఒక ప్రధానమైన అంశం. ధ్యానం దేని కోసం అని అడిగితే ఆత్మ-పరమాత్మల కలయిక లేక ఆత్మ సాక్షాత్కారం కోసం అని సమాధానం లభిస్తుంది. ఇది సాధ్యమా అని అడిగితే చిట్టా ప్రవృత్తుల్ని, ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని జయించగలిగితే  సాధ్యమేనని సమాధానం లభిస్తుంది. యోగశాస్త్ర ప్రణేత పతంజలి మహర్షి మాటల్లో యోగశ్చిత్త వృత్తి నిరోధః అంటే చిత్త ప్రవృత్తుల నిరోధమే యోగమన్న మాట.

యోగ శాస్త్ర ప్రాముఖ్యం.

 ఆది మానవుని జననంతోనే యోగ విద్య ప్రారంభమైంది. యోగం మనిషి జీవన విధానమని చెప్పవచ్చు. యోగాభ్యాసం మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం ప్రసాదించడమే గాక మనిషి జీవితంలో సుఖ, సంతోష, ఆనందాల్ని నింపుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే సిరిసంపదలు ఎన్ని వున్నా ఏం లాభం? పరమేశ్వరుడు యోగ విద్యకు ఆద్యుడు అని అంటారు. అనేకమంది యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మార్షులు యోగావిద్యను ప్రపంచానికి అందించారు. ఆనాడు ప్రచారంలో వున్న యోగ ప్రక్రియల్ని పరిశోధించి, స్వానుభవంతో పతంజలి మహర్షి రచించిన యోగాదర్శనం మహత్తరమైన యోగశాస్త్ర గ్రంథమని చెప్పవచ్చు. రాజయోగం, భక్తియోగం, జపయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, హఠయోగం మొదలుగా ఉన్న అన్నీ యోగాశాస్త్రానికి సంబంచించిన నిధులే.


ఫలితాన్ని పరమేశ్వరునికి వదిలి నిష్కామభావంతో కర్మ చేయడమే మనిషి కర్తవ్యమని గీతాకారుడు బోధించాడు. ఇడ, పింగళ, సుఘమ్నాడుళ సహకారంలో కుండలేనీ శక్తిని ఉత్తేజితం చేసి, మనిషిలో నిద్రాణమైయున్న దేవతాశక్తిని జాగృతం చేస్తే జన్మధన్యమవుతుందని బోధించి, అందుకు హఠయోగాన్ని మత్సేంద్రనాధుడు, గోరఖ్ నాథుడు ప్రతిపాదించారు. కాలక్రమేణతాంత్రికులు, కాపాలికులు ఈ రంగంలో ప్రవేశించి స్త్రీ పురుషుల సంభోగానికి ప్రాధాన్యం యిచ్చి, అదే యోగసమాధి అందించే పరమానందమని చెప్పి యోగవిద్యను దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. కాని సమాజం దాన్ని హర్షించలేదు.

 యోగశాస్త్రం మన భారతదేశంలో ఆధ్యాత్మికత్వాన్ని సంతరించుకొని మూడు పూవులు ఆరు కాయలుగా వర్థిల్లింది. ఈనాటి యుగంలో యోగవిద్యకు సైన్సుసాయం లభించింది. పలువురు మేధావులు, డాక్టర్లు, నిపుణులు ఈ రంగంలో ప్రవేశించి శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా యోగశాస్త్రాన్ని మలిచి యోగాచికిత్సా విధానం ప్రారంభించి మానవాళికి మహోపకారం చేశారు, చేస్తున్నారు.