Pages

Saturday, 26 October 2013

నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ


మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ఈ యాత్రాస్థలం ఒక మండల కేంద్రం కూడా.నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది.

ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. చ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము అణగి వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట జలమే ఒక విశేషం.  శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. ఇక్కడి కోనేర్లు (పుష్కరిణిలు) విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క అత్యద్భుత పనితనాన్ని తెలియజేస్తాయి.
ప్రధాన ఆలయానికి రాజ గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల నుంచి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదుఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. ఆ బావులు  అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. మరో గొప్ప విశేషం. ఈ మహనంది క్షేత్రంలో ఊరే ఊట నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తోంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కోనేర్ల రూపంలో ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు ఇక్కడ ఉన్నాయి. కాగా  మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పిలుస్తారు. అన్నిటినీ దర్శిస్తే గొప్ప పుణ్య ఫలితం కలుగుతుంది.
నంద్యాల నుండి మహానందికి నేరుగా బస్సు సౌకర్యము కలదు. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఈ శివ క్షేత్రానికి సమీప రైల్వే స్టేషను.