Pages

Wednesday, 30 October 2013

మంగళసూత్రం వెనుక ఉన్న శాస్త్రీయత


భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.
పవిత్రమైన సూత్రం

'మంగళసూత్రం' అనగా 'పవిత్రమైన సూత్రం' (దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారు చేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్ధతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారు చేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసేందుకు వారు నియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల, అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.

భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.