Pages

Friday, 11 October 2013

పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుడిని వదించినది

devi-durga
దేవీ నవరాత్రులు
ఆశ్వయుజ మాసం వచ్చిదంటే ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. అందుకు కారణం ‘అమ్మ’ గుర్తుకు రావడమే. అమ్మ అంటే ఎవరో కాదు... ఆ జగన్మాత, ఆ ముగ్గురమ్మల తల్లి, అమ్మలగన్న అమ్మ, ఆ నవ దుర్గాస్వరూపిణి.ఎందరో మహా యోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నింటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టియందు గల జ్యోతిర్మండలాలు, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయమే. ఆ శక్తినే మహేశ్వరి శక్తిగానూ, పరాశక్తి గాను, జగన్మాత శక్తిగానూ పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాల్లో ఏ నోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాం. 

శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే


ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే ‘దుర్గ’ అని ఆదిశంకరాచార్యుల వారు అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమౌతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్య్సపురాణం మనకు తెలియచెప్తోంది.దేవతలు భండాసురుడనే రాక్షసుడి బారి నుంచి రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమంది వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టం నెరవేర్చింది.

ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుడిని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుంచి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా పేరొందాయి. నవదుర్గలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఈ రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది.తొలుత ఈ దేవదేవి ‘శ్రీకృష్ణ పరమాత్మ’చే గోకులం, బృందావనంలలో పూజలందు కుంది. కైటభుల బారి నుంచి రక్షణకై బ్రహ్మ ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు. త్రిపురాసుర సంహారమందు పరమేశ్వరుడు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొంది నాడు. దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలసిపోగా దేవేంద్రుడు ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగాడు. 


ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్షానికి పాత్రులవుతున్నారు.ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఆ రోజు నుంచి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. అందు మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి అని పెద్దలు చెబుతారు.నవరాత్రి ఉత్సవాలలో దేవి నవాంశల పూజలు చేస్తారు. రెండేళ్ళ నుంచి పదేళ్ళ బాలిక వరకు అనేక రూపాల్లో వారిని పూజిస్తుంటారు. కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసింది.