Pages

Wednesday, 23 October 2013

హిందూ దేవతల నారాధించే వారంతా ధనంలేని వారు కారు, అన్యమతాల వారు అంతా ధనవంతులూ కారు.


అమాంతం ధనికులం కావాలనే ఆశతో మతం మారేవారున్నారు. వారికి ధనయోగం ఉన్నప్పుడు ఏదోవిధంగా వారేపని చేసినా కలిసి వచ్చి సంపద చేరుతుంది. హిందూ దేవతల నారాధించే వారంతా ధనంలేని వారు కారు, అన్యమతాల వారు అంతా ధనవంతులూ కారు. ధన, దరిద్రాలు వారి వారి ప్రారబ్ధం బట్టి ఎక్కడున్నా వచ్చి తీరుతాయి. కాని ముక్తి మాత్రం ఓంకారాత్మక దేవతా ఆరాధనతోనే లభిస్తుందనేది సత్యం. ఈ మహత్తరావకాశం కోల్పోవటం దురదృష్టం. ఈ అదృష్టం కోసం అన్యమతాల విజ్ఞులంతా ఇటు వైపు చూస్తుంటే దీనిని వదలుకొనటం ఎంత దురదృష్టం? హిందూ దేవతలు ముప్పది మూడు కోట్లనటం సింబాలిజం మాత్రమే. ఋగ్వేదంలో ప్రధానంగా 33 దేవతలు స్తుతింపబడ్డారు. దాని ఆధారంగా 33 కోట్లు అంటున్నారు తప్ప అది నిజ సంఖ్యకాదు. ఏ స్వభావం కలవారికి వారికి తగిన రీతిగా ఈ ఓంకార మూలం నుండి సకల దేవతలూ ఉద్భవించి భుక్తి ముక్తి ఫలాలిస్తున్నారు. తుదకు సమస్తం లీనమయ్యేది ఓంకారంలోనే.

సృష్టి అంతా లయం అయిన పిదప మిగిలేది నాదబ్రహ్మం మాత్రమే. పంచభూతాలలో సూక్ష్మాంశ అయిన ఆకాశం యొక్క శక్తి నాద బ్రహ్మము. సృష్టికి ఆదియందు మూలకారణంగా ఉన్నదీ నాదబ్రహ్మమే. ఆ నాదబ్రహ్మమే ఓంకారం, బ్రహ్మాండము, దిక్కులు, రాత్రింబవళ్ళు ఏవీలేని సృష్ట్యాది దశలో ఒక అవ్యక్త నాదం వినవచ్చింది. అదే ఓంకారం. దాని ధ్వనితరంగాలు క్రమంగా వ్యాపించి దిక్కులు ఏర్పడ్డాయి. ఆయా దిక్కుల నుండి భిన్న ఛందస్సులు, వేదాలు క్రమంగా దాని ఆధారంతో సృష్టి ఏర్పడింది. సృష్ట్యారంభంలో ఒక అవ్యక్త నాదం ఏర్పడిన విషయం అన్యమతాలూ అంగీకరిస్తున్నాయి. అదే మన ఓంకారమనే యదార్థ విషయం అంగీకరిస్తే తమ మత వ్యాప్తికి భంగమని దానిని చెప్పరు. మాండూక్యకారికలలో "సర్వస్య ప్రణవోహ్యాదిః - మధ్యమన్త స్తథైవచ| ఏవం హి ప్రణవం జ్ఞాత్వా - వ్యశ్నుతే తదనంతరమ్" అని చెప్పబడింది. అది ప్రపంచమంతకూ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే అని, దానిని తెలిసికొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడని చెప్తోంది. "ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్యహృది సంస్థితం; సర్వ వ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి|" అంటే సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహింపగల్గితే ఇకవానికి శోకం అనేది ఉండదు.

మనం ముందు చెప్పుకున్న బ్లడ్‌ప్రెషర్, ఆవేశాదులు తగ్గటం వంటివే కాక ఓంకారంతో లౌకిక ప్రయోజనాలూ ఎన్నో చెప్పారు. నల్లని మందమైన "ఓం"కార చిత్తాన్ని అరచేతిలో ఉంచుకొని నిశ్చల దృష్టితో చూస్తూ ఊయలవలె కదిలించటం ద్వారా దృష్టి మెరుగవటం, తలనొప్పి తగ్గటం వంటివి జరుగుతాయని చెప్తారు. ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించటం వలన నాడీమండలం నిశ్చలమై, నిర్మలమై ఉండి అంతర్గత ఉద్వేగాలు తొలగి ప్రశాంతత సిద్ధిస్తుంది. నిత్యం ఉదయం, సాయంకాలం మూడు నుండి పదకొండు సార్లు దాకా ఓంకారోచ్చారణ చేస్తే దానివలన చేకూరే స్వస్థత జీవితంలోని ఒడిదుడుకులను క్రమపరచి ప్రశాంత జీవితాన్ని అందిస్తుంది. నాడీమండలం శక్తి ప్రేరకం. మన సకల చర్యల ద్వారా అనేక నాడులందు చలనమేర్పడుతుంది కాని సూక్ష్మ నాడులు మాత్రం చలించవు. సూక్ష్మనాడీమండల చలనానికి భ్రుకుటి, వెన్నుపూసలలో విశాల వాయుతరంగాలు సృష్టింపబడాలి. ఓంకారాన్ని సక్రమ విధానంలో ఉచ్చరించటంలోనే అలాంటి సూక్ష్మనాడులు ప్రేరేపింపబడతాయి. ఆ సూక్ష్మనాడుల ప్రేరణ వ్యక్తికి అనేక శక్తులను ప్రసాదిస్తుంది. ఆ క్రమంలోనే అతీత జ్ఞానము, అతీత శక్తులు సాధింపగల్గుతారు. అలా ఓంకారం మనుజునిలో నిద్రాణమై ఉన్న అనేక శక్తులను వెలుగులోకి తేగలదు. మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. ఓంకారం నిత్యం ఆరంభిస్తే మీలో క్రమంగా వచ్చే మానసిక పరిణామం మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. పరిణామ సిద్ధాంతంలో కూడా నరాల చర్యలు అభివృద్ధి అయ్యేకొలది జంతువుల తోక చిన్నదౌతూ మెదడు పెరుగుతూ వచ్చింది. శిరస్సు దిశగా నరాలు చైతన్యాభివృద్ధి గాంచటం పరిణామంలో గుర్తింపదగిన లక్షణం. ఆ క్రమంలోనే మానవుని స్థాయికి చేరేసరికి తోక అదృశ్యమయింది. బుద్ధి శక్తి పెరిగింది.

ఎంతో వైవిధ్యం కల ప్రకృతిలో ఏకత్వాన్ని నిరూపించేదే బ్రహ్మము. అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మమునకు ఏకైక ప్రతీక ఓంకారం. అదే అక్షర పరబ్రహ్మం. అక్షర నిర్మాణానికి మౌలికంగా ఎనిమిది అంశాలుంటాయి. అడ్డగీత, నిలువుగీత, వృత్తరేఖ, చుక్క, అథోరేఖ, ఊర్ధ్వరేఖ, ఎడమకు గీత, గాడికి గీత అనేవి. ఈ ఎనిమిది అంశాల సమ్మిశ్రితం ఓంకారం. స్థూలం నుండి సూక్ష్మాంశకు పురోగమించటమే లక్ష్యం. అదే వ్యక్తియందలి జీవాంశ ప్రాధాన్యతకు, పదార్థమునందలి పరమాణు ప్రాధాన్యతకు సూచకము. అట్లే ఓంకారం స్థూలాంశతో ఆరంభమయి సూక్ష్మాంశ అయిన చుక్కతో ముగుస్తుంది. ఓంకార లేఖన నియమాలు ముఖ్యంగా అనేదానికే అన్వయించాలి. ఇతర అక్షరాలలా ఇది కలిపి వ్రాయదగినది కాదు. నాల్గంచెలలో క్రమంగా స్థూలం నుండి సూక్ష్మాంశకు నడుస్తాము.

స్థూల సూక్ష్మ కారణావస్థలు మూడూ భ్రాంతివలన ఏర్పడినవే తప్ప నిజంగా అవి లేవు. ఉన్నది పరబ్రహ్మమొక్కటే. ఆ మూడు అవస్థలూ అసత్యాలు అనే విషయం ప్రణవంలోని అకార ఉకార మకారాల ద్వారా గ్రహించి తానే పరబ్రహ్మము అనే జ్ఞానం పొంది అఖండ ఆనందమయుడై నిల్చునట్లు ఆ ప్రణవం చేస్తుంది. అదే జీవన్ముక్తి, కైవల్య మోక్షము, జీవ బ్రహ్మైక్యము, పరబ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞాని కోరవలసింది ఆ అవస్థే. కలకంటూ అది యధార్థమనుకొన్నట్లు అజ్ఞానికి ఈ లోకమే శాశ్వతం. అలా అనుకొంటూనే కలకరిగి పోయినట్లు తాను, తనలా లోకంలో సమస్తమూ తొలగిపోతూ ఉండటం ఆలోచించలేడు. జ్ఞానికే సరియైన ఆ జ్ఞానం కలుగుతుంది. అందుకు తోడ్పడేదే ఓంకారం.