Pages

Wednesday, 23 October 2013

ఓంకారాన్ని కర్మార్థం ప్రయోగించేటప్పుడు మూడు మాత్రలుగాను, ధ్యానకాలంలోను, ఆత్మోపాసనలోను అర్థమాత్ర అధికంగా పల్కాలి.


ఓంకారాన్ని కర్మార్థం ప్రయోగించేటప్పుడు మూడు మాత్రలుగాను, ధ్యానకాలంలోను, ఆత్మోపాసనలోను అర్థమాత్ర అధికంగా పల్కాలి. అంటే మామూలుగా పూజాది కర్మలలో పల్కే దానికంటే అర్థమాత్రకాలం ఎక్కువగా ప్రత్యేక ప్రణవధ్యానంలో, ప్రణవ రూపమైన ఆత్మోపాసనలో పల్కాలి. ఓంకారాన్ని తన ఎదుట వ్రాసుకొని ఆ అక్షర స్వరూపాన్ని ధ్యానిస్తూ దానియందు లగ్నుడై ఉంటే సమస్త ధర్మశాస్త్రాలూ పఠించినట్లే అని చెప్పబడింది. ప్రతి ప్రాణిలో ప్రణవ ధ్వని స్వాభావికంగా ఉంటుంది. అంతఃకరణ నివాసియగు ఆత్మయే బ్రహ్మము. అదే ఓంకారము. కాబట్టి అందరిలోను ఆత్మరూపమగు ఓంకారం ఉంది. దానిని ప్రత్యక్షంగా భావన చేయగల్గుటే ధన్యత. ఓంకార జపధ్యానాదుల వలన ఆ ధన్యత చేకూరుతుంది. మనలోని ప్రాణ నాదం ఓంకారమే. అదే సోహం. అదే హంస; పరమహంస. ఓంకారం యొక్క రూప నిష్పత్తి గూర్చి ప్రపంచసారంలో మంత్ర సృష్టి ప్రకరణంలో ఇలా చెప్పబడింది. "యోయం పరమ హంసాఖ్య - మంత్ర స్సోహ మితీరితః సహోర్లోపే కృతే పూర్వ - సంధ్యా ఓమితి జాయతే| అంటే "సోహం" అనే పరమ హంసాఖ్య మంత్రం నుండి సకారహకారముల లోపంతో "ఓం" అనేది ఏర్పడుతున్నది. ఓంకార ధ్యానం వలన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గం జయింప బడుతుంది. అమాత్రము, అనంత మాత్రము, ఏకత్వాన్ని భాసింపజేసేది, మంగళ ప్రదమైనది అయిన ఓంకారాన్ని గుర్తించిన వారే మునులు అనబడతారు. స్థూల దేహానికి సూక్ష్మదేహం కారణమని, సూక్ష్మదేహానికి కారణదేహం కారణమని, దానికి పరబ్రహ్మ కారణమని గ్రహించి, స్థూలదేహాన్ని సూక్ష్మదేహమునందు, సూక్ష్మదేహాన్ని కారణ దేహమునందు, కారణ దేహాన్ని పరమాత్మయందు లయం చేయుచు నాల్గు దళాల ప్రణవాన్ని భావనచేసి ఆ పరబ్రహ్మమే తానని గ్రహించుటే ప్రణవోపాసన తాత్పర్యం. "ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్ధింతరిష్యతి" అని సంసార సముద్రం దాటాలంటే ముఖ్యమైన నావ ఓంకారమే. ఓంకారం లేని స్థానం, ఓంకారం లేని క్షణము, ఓంకారం వ్యాపించని జీవకణము జగత్తున లేదు. వేదశాస్త్రాది విద్యలన్నీ వాచ్యార్థాలైతే వాటి లక్ష్యార్థం ఓంకారం. ఓంకారంలోని అకారము నందు నరులు, ఉకారము నందు దేవతలు, మకారమున రాక్షసులు, అర్థమాత్రమున తత్వవేత్తలు పుట్టారని కూడా వేదం చెప్తోంది. ముక్కుపై దృష్టిని నిల్పి, కరచరణాది అవయవాలను దగ్గర చేసికొని, మనసును ఇతరములపైకి పోనీయక ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మభావన చేయాలి. "ప్రణవోహి పరబ్రహ్మా - ప్రణవః పరమం పదం; ప్రణవం సర్వవేదాద్యం - సర్వదేవ మయం విదుః" ప్రణవమే పరబ్రహ్మము. ప్రణవమే ముక్తి, ప్రణవమే సర్వవేదాలకు మూలం. ప్రణవమే సకల దేవతల మయమైనది కాబట్టి "అనయా సదృశీ విద్యా - అనయా సదృశీ జపః అనయా సదృశం పుణ్యం - న భూతో న భవిష్యతిః|" ఓంకారంతో సమానమైన విద్య లేదు. దానితో సమానమైన జపం లేదు. దానితో సమానమైన పుణ్యము కూడా మరొకటి లేదు. ఉండబోదు అని కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ ఒక్క అక్షరంతో మనం సమస్తం సాధింపగల్గినందున అనుక్షణం ప్రతి చర్యయందూ ఆ ఓంకారాన్ని సద్వినియోగం చేసుకుందాము.