Pages

Saturday, 30 November 2013

వినాయకుడిని ప్రార్థించే శ్లోకం తాత్పర్యము

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 

అయితే వినాయకుడిని ప్రార్థించే శ్లోకం లో విష్ణుం అని అంటామేమిటి? అని చాల మంది అనుకోవచ్చు. కాని ఇక్కడ 'విష్ణుం' అంటే విష్ణుమూర్తి కాదు. విష్ణుం  అంటే సర్వం వ్యాపించి యున్నవాడు అని అర్థం. అలాగే కొంతమంది శుక్లాంబరధరం ను పిల్లలకు నేర్పేటప్పుడు 'శుక్లాం ..బరధరం' అని చెబుతుంటారు. ఇది సరి కాదు. 'బరధరం' అన్న మాటకి అర్థం లేదు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని దిగువన వివరిస్తున్నాను.

శుక్ల = తెల్లని; అంబర = వస్త్రం (ఆకాశం అని ఇంకొక అర్థం); ధరం = ధరించిన వాడు;  విష్ణుం = సర్వాంతర్యామి; శశి* = చంద్రుడు.  వర్ణం = రంగు; చతుర్ = నాలుగు; భుజం = భుజాలు గల; ప్రసన్న = చిరునవ్వు తో కూడిన; వదనం = ముఖము; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని, సమస్త; విఘ్న = అడ్డంకులు; ఉపశాన్తయే = తొలగించు. 

*శశి అంటే అసలు అర్థం కుందేలు రూపం గల అని. మనం చందమామను, పౌర్ణమి దగ్గరలో చూస్తే కుందేలు ఆకారం కనిపిస్తుంది. ప్రముఖ పిల్లల కథల పుస్తకమైన 'చందమామ' లో, చందమామ బొమ్మ మధ్యలో కుందేలు బొమ్మ వేసి ఉండడం మీరు గమనించే ఉంటారు.
 
తాత్పర్యము:

తెల్లని వస్త్రమును ధరించి, చంద్రుని వలె తెల్లని రంగు తో వెలుగుతూ, సర్వాంతర్యామి యై, నాలుగు భుజములు కలిగిన వానిని (గణేషుని), అన్ని అడ్డంకులు తొలగించమని ప్రార్థించెదను.