సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Tuesday, 17 December 2013
గణపతి ఆరవ అవతారము: వికటావతారము
గణపతి ఆరవ అవతారము: వికటావతారము
ధ్యానశ్లోకం: వికటో నామ విఖ్యాత: కామాసురవిదాహక:,
మయూరవాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మృత:.
ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: `వికట ' నామంతో విఖ్యాతుడైన ఈ గణపతి నెమలివాహనముగా గలవాడై సౌరబ్రహ్మగా కీర్తింపబడినాడు.
శ్రీమహావిష్ణువు జాలంధరుని సంహరించడానికై వృందాయొక్క తపస్సు భంగంచేసినపుడు అతని
తేజస్సునుండి ఉద్భవించిన అత్యంత తేజశ్శాలి అయిన రాక్షసుడు `కామాసురుడు '. ఇతనుకూడా శుక్రాచార్యునియొద్ద మంత్రదీక్షతీసుకుని అరణ్యానికిపోయి ఘోరమైన తపస్సుప్రారంభించాడు. అన్నము, జలము కూడా త్యజించి, బ్రొటనవ్రేలిపై నిల్చుని అనేక సంవత్సరములు తపస్సుచేసేడు. ఆ తపస్సుతో అతని శరీరము శుష్కించినా తేజస్సు పెరిగి పెరిగి కైలాసములోని పరమేశ్వరుని రప్పించినది. ఆశుతోషుడైన పరమేశ్వరుడు కామాసురుడు కోరినట్లుగా తన తప:ప్రభావం వలన ఇవ్వవలసి వచ్చినది. శుక్రాచర్యుని వద్దకు వచ్చి వరప్రదానము గురించి చెప్పెను. అంతట శుక్రాచార్యుడు సంతుష్టుడై మహిషాసురుని కూతురైన `తృష్ణ 'ని ఇచ్చి కామాసురునికి వివాహం చేసేడు. అదేసమయంలో సమస్త రాక్షసులకు కామాసురుని అధిపతిగా ప్రకటించాడు. కామాసురుడు అత్యంత సుందరమైన `రతిద ' అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. రావణుడు, శంబరుడు, మహిషుడు, బలి, దుర్మదుడు అనేవారిని సేనానాయకులుగా నియమించాడు. ఆ రాక్షసుడు భూమిపైన అందరు రాజులను జయించి, స్వర్గలోకాదులను కూడా తనవశమొనర్చుకొనెను. తన రాజ్యములో సమస్త ధర్మ కర్మలకు నష్టము వాటిల్లెను. అన్నివైపులా అసత్యము, కపటము రాజ్యమేలుతున్నాయి. దేవతలు, మునులు, ధర్మపరాయణులైన వారు భయంకరమైన కష్టములను అనుభవించసాగారు. అంతట `ముద్గల ' మహర్షి దేవతలను, మునులను ప్రేరేపించి మయూరేశ్వర క్షేత్రమునకుపోయి అచ్చట గల మయూరేశ్వరుని ఉపాసించమని చెప్పెను. వారు అదేవిధంగా ఉపాసించగా గణేశ భగవానుదు ప్రసన్నుడై మయూరవాహనముపై `వికట ' నామక గణపతిగా వచ్చి కామాసురుని నియంత్రించుటకు అభయమిచ్చి అంతర్ధానమయ్యెను. తరువాత కొన్ని దినములకు నెమలి వాహనారూఢుడై `వికట ' గణపతిగా వచ్చి దేవసేనలతోకూడినవాడై కామాసురునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఇరువురిమధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కామాసురుని పుత్రులైన `శోషణుడు ' , `దుష్పూరుడు ' వధింపబడ్డారు. అంతట వికటుడు కామాసురునితో..."నువ్వు శివవర ప్రభావంతో ఎన్నో అధర్మాలు చేస్తున్నావు. నీకు జీవించాలని ఉంటే దేవతలపై ద్రోహాన్ని విడిచిపెట్టి నన్నుశరణుపొందు 'మని చెప్పెను. ఆ మాటను పెడచెవిని పెట్టి కామాసురుడు వికటునిపై తనగదను విసిరెను. అది భగవానుడైన వికటుని స్పర్శించలేక మధ్యలోనేచూర్ణమైపోయెను. దానితో కామాసురుడు మూర్ఛపోయెను. వికటుని దృష్టి మాత్రముచేత కామాసురుని శక్తి అంతా క్షీణింపతొడగెను. కామాసురుడు అప్పుడు ఆలోచింపనారంభించెను.."ఈ అద్భుతమైన దేవుడు అస్త్రములు ప్రయోగించకుండానే నాకు ఈ దుర్దశ ప్రాప్తించినది. ఇక అస్త్రములు పట్టిన నా గతి యేమి '. ఈ విధంగా అలోచించి భగవానుడైన వికటుని శరణువేడుకొనెను. మయూరేశుడు కామాసురుని క్షమించెను. దేవతలందరూ భయముక్తులై భగవానుని స్తోత్రించి కామాసురుని బాధలు లేక విశ్వమును నిర్వహింపతొడగిరి.
మనము కూడా వికటుడు, మయూరేశుడునైన గణేశుని ప్రార్థించి కామాసురునినుండి విముక్తి పొందెదముగాక. శ్రీ వికటాయ నమ:, శ్రీ మయూరేశాయ నమ:.