Pages

Wednesday, 5 February 2014

సృష్టి విధానం - 2


ఈ సృష్టి తొమ్మిది రకాల సృష్టి. ప్రాకృత సృష్టి ఆరు. వైకృత సృష్టి మూడు. బ్రహ్మ కంటే ముందు ఉన్న సృష్టి ప్రాకృత సృష్టి. బ్రహ్మగారు చేసింది వైకృత సృష్టి
1. మొదటి సృష్టి మహత్ తత్వం 2. అహంకార తత్వం
సృష్టి గానీ ప్రళయం గానీ కావాలంటే కావలసినవి కాలమూ గుణమూ ద్రవ్యమూ. ప్రకృతి నుండి మొదలు ఏర్పడినది మహత్ తత్వం. ఇది గుణ వైశమ్యం. ప్రకృతిలో మూడు గుణాలూ ఉన్నా, అన్నీ సమానముగా ఉంటాయి. గుణ వైషమ్యం ఉండదు. సృష్టి కావాలంటే గుణ వైషమ్యం ఉండాలి. అందువలన మహత్ తత్వము వచ్చింది. ఆ మహత్ నుంచి అహంకారము వచ్చింది. ఈ అహంకారము నుండే ద్రవ్య (భూతములు) జ్ఞ్యాన (జ్ఞ్యానేంద్రియాలు) కర్మ (కర్మేంద్రియాలు)
3. మూడవ సృష్టి తన్మాత్ర సృష్టి. ఇక తన్మాత్ర సృష్టి. తన్మాత్ర అంటే శబ్ద స్పర్శ రూప రస గంధముల సూక్ష్మావస్థలు. వీటి నుండే పంచభూతాలు ఏర్పడతాయి. 
4. నాలుగవ సృష్టి ఇంద్రియములు. జ్ఞ్యాన కర్మేంద్రియాలు. 5. ఐదవది దేవ సృష్టి (మనః సృష్టి). ఇంతవరకూ ఏర్పడిన జ్ఞ్యాన కర్మేంద్రియాలకు అధిష్ఠాన దేవతలు ఏర్పడతారు. దేవతలు ఇంద్రియాలను నడిపిస్తుంటారు. కన్ను వేరు, కన్నులో ఉండే చూచే శక్తి ఇంద్రియం వేరు, దాన్ని నడిపించే (చూపించే) శక్తి దేవత.
6. ఆరవది అజ్ఞ్యానం. ఇది తమస్సు, చీకటి. ఇది అబుద్ధికృతం (బుద్ధి లేనందువలన ఏర్పడేది). ఈ ఆరు ప్రాకృత సృష్టి. 

ఇపుడు వైకృత సృష్టి
7. భగవంతుడు రజో గుణం స్వీకరించుట వలన సృష్టి జరుగ్తుంది. పరమాత్మ యొక్క సంకల్పము యొక్క లీల. ఇక ఏడవది ముఖ్య సర్గ. ఇది చేసినది బ్రహ్మ. ఇంతకుముందు చేసిన సృష్టి అంతా పరమాత్మ చేసినది. ముఖ్య సృష్టి ఆరు రకములు. దీనికే స్థావర సృష్టి అని పేరు. ముందు ఆహారం సృష్టించబడిన తరువాతే జీవు ఏర్పడతాడు (ఉదా: గర్భవతి అయిన తరువాత పిల్లవాడు పుట్టకముందే పాలు ఏర్పడతాయి).
ఈ ఆరు రకాల ముఖ్య సృష్టి - వనస్పతి (తైలమును ప్రసాదించేవి), ఔషధి (పైరులు, వరి, జొన్న..ఒకే పంటనిచ్చేవి ), లత, త్వక్ సార (అరటి మొదలైన చర్మ ప్రధానమైనవి), వీరుధ్ (పొదలూ తీగలూ, కందములూ), ధ్రుమాః. ఇవన్నీ క్రిందనుంచి పైకొచ్చేవి. తమః ప్రాయ: అజ్ఞ్యానం వీటికి ప్రధానం. ఇవి అంతః స్పర్శ. మనం స్పృశిస్తే వాటికి జరిగే అనుభూతి బయటకి కనపడదు. అనుభూతిని వ్యక్తీకరింపచేయలేవు. ఇవి విశేషణ కలవి ( స్పందన కలవి)

8. జంతువులు ఎనిమిదవ సృష్టి. ఇది ఇరవై ఎనిమిది రకాలుగా ఉంటుంది. జ్ఞ్యానము ఏమీ లేని సృష్టి. వాసన చూసి గుర్తుపట్టేవి. వీటి హృదయములో ఏవి తెలీదు (పగ, ద్వేషం లాంటివి). 

9. తరువాత నిలువుగా ఉండేవారు, మానవులు. మానవులు రజో గుణం ఎక్కువగా ఉన్నవారు. కోరికలే వీరికి ప్రాణము. ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. దుఃఖాన్ని సుఃఖం అని అనుకుంటూ ఉంటారు. ఇదే సృష్టిలో నరులూ దేవతలూ ఉంటారు. వీటిలోనే కౌమారులు (సనకాదులు) కూడా ఉన్నారు. ఈ కుమారులు ప్రతీ సృష్టిలోనూ ఉన్నారు కాబట్టి ప్రాకృతులు అవుతారు. బ్రహ్మగారు సృష్టిస్తున్నారు కాబట్టి వైకారికులు కూడా అవుతారు. కుమార సృష్టి ఉభయాత్మకః. దేవతలు పది రకాల సృష్టి. భూత ప్రేత పిశాచాలు కూడా దేవతా సృష్టే. వారిలో తమో గుణం అధికం. ఇవన్నీ బ్రహ్మగారు చేసినవి