Pages

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం - కపిల గీత ప్రారంభం


శౌనక ఉవాచ
కపిలస్తత్త్వసఙ్ఖ్యాతా భగవానాత్మమాయయా
జాతః స్వయమజః సాక్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్

భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుట్టి తత్వములను నిరూపించాడు. మానవులకు ఆత్మ బోధ చేయడానికి ఏ పుట్టుకా లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు

న హ్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్ణః సర్వయోగినామ్
విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యన్తి మేऽసవః

వర్షంఅ - ఉత్తముడు, ఈయన పురుషోత్తముడు, యోగులలో శ్రేష్టుడు, పురుషులలో ఉత్తముడు, ఇలాంటి పరమాత్మ జన్మ కర్మ చరితములు వింటూ ఉంటే నా మనో ఇంద్రియములకు తృప్తి కలుగుటలేదు.

యద్యద్విధత్తే భగవాన్స్వచ్ఛన్దాత్మాత్మమాయయా
తాని మే శ్రద్దధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ

ఇతను స్వచ్చందాత్మ (ఇక్కడ ఆత్మ అంటే శరీరం), ఈయన దేహం సంకల్పాధీనం (మన దేహం కర్మాధీనం), తన సంకల్పముతో ఏ ఏ పనులు చేస్తున్నాడో, అలాంటి కీర్తించదగిన పరమాత్మ చరిత్రను వివరించు.

సూత ఉవాచ
ద్వైపాయనసఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా
ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదితః

శౌంకౌడు సూతున్ని అడిగితే, సూతుడు విదుర మైత్రేయ సంవాదాన్ని మళ్ళి చెప్పాడు.
భగవానుడైన మైత్రేయుడిని విదురుడు పరమతత్వాన్ని చెప్పమని ప్రేరేపిస్తే ఇలా చెప్పాడు

మైత్రేయ ఉవాచ
పితరి ప్రస్థితేऽరణ్యం మాతుః ప్రియచికీర్షయా
తస్మిన్బిన్దుసరేऽవాత్సీద్భగవాన్కపిలః కిల

కర్దముడు తన అనుమతితో అరణ్యానికి వెళ్ళగా, తల్లికి ప్రీతి కలుగచేయ దలచి, బిందు సరస్సు వద్దనే నివసించాడు

తమాసీనమకర్మాణం తత్త్వమార్గాగ్రదర్శనమ్
స్వసుతం దేవహూత్యాహ ధాతుః సంస్మరతీ వచః

దేవహూతి, ఆశ్రమములో కూర్చుని ఉన్నా, ఏ కర్మ ఫలమునూ ఆశించకుండా ఉన్న,  తత్వ సమూహం తెలిసిన వాడైన కొడుకుని దేవహూతి అడిగింది. కపిలుడిని పుత్రునిగా పొందనపుడే, బ్రహ్మ వచ్చి "నీ గర్భములో ఉండి అవతరించబోతున్న పరమాత్మ నీకు తత్వము చెప్పి బంధము తొలగిస్తాడు"అని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆ వాక్యాన్ని స్మరించి కపిలుడిని ప్రశించింది

దేవహూతిరువాచ
నిర్విణ్ణా నితరాం భూమన్నసదిన్ద్రియతర్షణాత్
యేన సమ్భావ్యమానేన ప్రపన్నాన్ధం తమః ప్రభో

అంతటా వ్యాపించి ఉండే మహానుభావా, నేను పూర్తిగా చింతా క్రాంతనయి ఉన్నాను, బాధలో ఉన్నాను, చెడు ఇంద్రియములను తృప్తి కలిగించేట్లు ప్రవర్తించుట వలన నేను బాధలకు గురవుతున్నాను (మనిషి పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఇంద్రియ తృప్తి కోసమే ప్రయత్నిస్తాడు. అవి మంచిగానే ఉంటాయి అన్న నియమం లేదు. శాస్త్ర నిషేద విషయాన్ని అనుభవించడానికే ఇంద్రియాలు ముందుకొస్తాయి. మన మనో బుద్ధి ఇంద్రియాలు పక్కదారి పట్టడానికే ప్రేరేపించబడతాయి.  )
ఇలాంటి ఇంద్రియాలను తృప్తి పరచడములో నా మనసు పరమ అజ్ఞ్యానాన్ని పొందింది. నేను అజ్ఞ్యానమనే చీకటిని పొంది ఉన్నాను

తస్య త్వం తమసోऽన్ధస్య దుష్పారస్యాద్య పారగమ్
సచ్చక్షుర్జన్మనామన్తే లబ్ధం మే త్వదనుగ్రహాత్

నాకు నేనుగా ఈ అజ్ఞ్యానాన్ని దాటలేను. అది దాటి తీరమును చేర్చే నిన్ను పొందాను. ఎన్నో జన్మల తరువాత ఇంత కాలానికి ఒక చక్కని నేత్రం దొరికింది. (చూడవలసిన దాన్ని చూపితే మంచి కన్ను, చూడకూడని దన్ని చూపితే చెడ్డ కన్ను). ఇన్ని జన్మల తరువాత చక్కని నేత్రం లభించింది. నా గొప్పదనముతో కాదు. నీ అనుగ్రహం వలన. ఈ నేత్రము నీవే. నీవే ప్రసాదించావు.

య ఆద్యో భగవాన్పుంసామీశ్వరో వై భవాన్కిల
లోకస్య తమసాన్ధస్య చక్షుః సూర్య ఇవోదితః

లోకములో ఉన్న అన్ని బ్రహ్మాండములలో ఈశ్వరుడూ (ఐశ్వర్య కలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే లోపల ఉండి శాసించే వాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి, తెలుసుకుని వాటిని తొలగించగలగాలి. ఈ రెండూ చేయగలవాడు ఈశ్వరుడు.) భగవంతుడూ ఆది పురుషుడూ నీవే కదా. అజ్ఞ్యానమనే చీకటిలో ఉన్న ఈ లోకానికి కన్ను వంటి వాడివి. సూర్యుడు ఎలా ఐతే లోకానికి వెలుగో అలాగే నీవు కూడా ఈ లోకానికి వెలుగు. (సూర్య చంద్రాగ్ని నేత్రవాన్ అని పరమాత్మకి పేరు. ఈ మూడు కళ్ళతో పరమాత్మ చూస్తాడు )

అథ మే దేవ సమ్మోహమపాక్రష్టుం త్వమర్హసి
యోऽవగ్రహోऽహం మమేతీత్యేతస్మిన్యోజితస్త్వయా

నాలో ఉన్న సమోహాన్ని ( చక్కని  మోహాన్ని) తొలగించాలి. వర్షం రాకుండా ఆపే పాపాన్ని అవగ్రహం అంటారు. అలాగే నేనూ నాది అనే అవగ్రహాన్ని నీవు పోగొట్టాలి . ఎందుకంటే ఇది నువ్వేర్పరచినదే కదా.

తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్యసంసారతరోః కుఠారమ్
జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్

అన్ని  లోకాలకు రక్షకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. భక్తుల యొక్క సంసారమనే వృక్షాన్ని కూలగొట్టడానికి గొడ్డలి వంటి వాడవు. ప్రకృతి యొక్క పురుషుడి యొక్క తత్వం తెలుసుకోవాలని, సద్ధరం తెలుసుకోవాలి.

మైత్రేయ ఉవాచ
ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ధనమ్
ధియాభినన్ద్యాత్మవతాం సతాం గతిర్బభాష ఈషత్స్మితశోభితాననః

ఇలా కల్మషం లేని (నిరవద్యం) తల్లి కోరికను విన్నాడు. మోక్ష జ్ఞ్యానాన్ని పెంచే ఆ కోరిక విని అభినందించి కొద్దిగా చిరునవ్వుతో (ఈషత్స్మిత) ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
యోగ ఆధ్యాత్మికః పుంసాం మతో నిఃశ్రేయసాయ మే
అత్యన్తోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ

శరీరము కన్నా భిన్నమైన ఆత్మ ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం జ్ఞ్యాన యోగం. ప్రతీ జీవికి ఉపయోగించేది ఇదే. జ్ఞ్యాన యోగం మాత్రమే జీవునికి మోక్షం రావడానికి ఉపయోగిస్తుందని నా సిద్ధాంతం. ఇలాంటి జ్ఞ్యాన యోగాన్ని అభ్యసిస్తే కలిగే లాభం, దుఖఃఅమూ సుఖమూ ఉండదు. సుఖాభిలాష దు@ఖాభిలాషా రెండూ ఉండవు.

తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురానఘే
ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాఙ్గనైపుణమ్

దీన్నే జ్ఞ్యాన యోగమని అంటారు. నేను ఇది వరకే ఈ జ్ఞ్యాన యోగాన్ని, వినాలని ఋషులందరూ అడిగితే వారికి బోధించాను. సర్వాఙ్గనైపుణమ్ - సావయవం (అవిహితము, అనిషిద్ధము నిషిద్ధము: వేదమూ శాస్త్రమూ వేటిని చేయమని చెప్పదో అవి అవిహితములు. ధర్మం చరా సత్యం వదా అని కాకుండా, వేటిని విధించలేదో అవి అవిహితములు. వేటిని నిషేధించలేదో అవి అనిషిద్ధములు. వేటిని నిషేధించారో అవి నిషేధములు. ఇంచుమించు మూడూ నిషేధములు. నకళంజం భక్షయే. కానీ కొన్ని తినమనీ చెప్పలేదూ, తినవద్దనీ చెప్పలేదు. ఈ మూటిలో ఏది చేసినా పాపమే. మనసు యొక్క స్థిరత్వం ఆహారం బట్టి వస్తుంది. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్. జాతి దుష్టం, ఆశ్రయ దుష్టం నిమిత్త దుష్టం. ఉల్లిగడ్డ లాంటివి, మాన్సం లాంటివి జాతి దుష్టం. శ్మశానములో పండినది ఆశ్రయ దుష్టం. ఒక వేళ ఇంటిలో చేసినా దానిలో వెంట్రుకపడితే అది నిమిత్త దుష్టం. ఈ మూడూ కానీ ఆహారముతో కాయ శుద్ధి. శరీరము శుద్ధికానంతవరకూ మనసు శుద్ధి పొందదు. ఈ శరీరములో రజస్సు తమస్సు గుణాలను పెంచే ఆహారములని సేవిస్తే, మంచివారికైన చేడు ఆలోచనలు వస్తాయి. కాయ శుద్ధిని బట్టి మనశ్శుద్ధి. మనశ్శుద్ధి బట్టే ఆత్మ పవిత్రత. జ్ఞ్యాన కర్మ భక్తి యోగములతో నిండి ఉన్న యోగాన్ని చెబుతాను

చేతః ఖల్వస్య బన్ధాయ ముక్తయే చాత్మనో మతమ్
గుణేషు సక్తం బన్ధాయ రతం వా పుంసి ముక్తయే

మోక్షం రావాలన్నా నరకము రావాలన్నా, మనసే కారణము. గుణములయందు ఆసక్తమయిన మనసు నరకాన్నిస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాల యందు లగ్నమయిన మనసు సన్సారాన్ని (నరకాన్ని) ఇస్తుంది. పరమాత్మ యందు ఆసక్తమైతే ముక్తినిస్తుంది. మనసు మురికి లేనిది కావాలి. అరిషడ్వర్గాలనే ఆరు మలాలు మనసుకు ఉన్నాయి. మరి మనసు మొదటి నుండీ మురికేనా? మనసు సహజముగా మంచిదే. దానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు

అహం మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః
వీతం యదా మనః శుద్ధమదుఃఖమసుఖం సమమ్

అహంకారం మమకారమనే ఇద్దరు శత్రువులు మనసుకు ఉన్నారు. ఆత్మ కానిదానిని ఆత్మ అనుకొనుట, నాది కాని దాన్ని నాది అనుకొనుట. ఈ రెండు అభిమానములతో ఎర్పడిన కామ లోభములనే కల్మషములు ఎపుడైతే మనసు తొలగి ఉంటుందో, అప్పుడు మనసు  శుద్ధం. అలా ఉన్న మనసుని ఎలా గుర్తించాలి? సంతోషాన్ని కలిగించే సంఘటనలను కలిగినపుడు ఆనందించకుండా, బాధ కలిగే సంఘటనలు కలిగితే దుఃఖించకుండా ఉన్నవాడు. పూర్వ జన్మలో శరీరాన్నే ఆత్మ అనుకొని, శరీరం కోసం పొందే సుఖదుఖాలన్ని ఆత్మవనుకుని చేసిన కర్మల వలన కలిగిన అభిమానానికి శిక్షగా ఈ దేహాన్ని ఇచ్చాడు. ఆత్మకు శుద్ధి కలగాలంటే దేహం పోవాలి. పోవాలంటే అది ఇచ్చినవాడే తొలగించాలి. అంత వరకూ వేచి ఉండాలి. పరమాత్మ సంకల్పం కోసం మనం ఎదురుచూడాలి. ఎపుడైతే దుఖాన్ని సుఖాన్ని సమముగా మనసు చూస్తుదో అప్పుడు మనసు శుద్ధమైనదని తెలుసుకో

తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్
నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్

మనసు పరిశుద్ధమైతే కలిగే లాభం ఏమిటి? పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యాన వైరాగ్యాలు లభిస్తాయి. దేన్ని జ్ఞ్యానమంటాం? ప్రకృతి వివిక్త ఆత్మ పరిజ్ఞ్యానం. శరీరము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఈ శరీరములో ఉన్నాడు అన్నది జ్ఞ్యానం. ప్రకృతి కంటే వేరుగా ఉన్న పురుషున్ని చూడగలగడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ, జీవాత్మ అంతర్యామిగా ఉన్న ప్రకృతి. ప్రకృతి పురుషులు పరమాత్మ విధేయులు.
ఇది తెలుసుకున్న వాడికి వెంటనే కలిగేది వైరాగ్యం. ఆత్మ స్వరూపం తెలిసిన వాడికి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. ఈ రెండూ కలిగితే భక్తి కలుగుతుంది.

జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా
పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసమ్

జ్ఞ్యాన యోగం వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం పరమాత్మ మీద భక్తినీ కలిగిస్తుంది. వైరాగ్యానికి భక్తికీ సంబంధం ఏమిటి? వైరాగ్యం అంటే ప్రకృతి మీద కోరిక లేకుండుట. మనసుకు ఏదో ఒక ఆలంబనం ఉండాలి. ప్రకృతి మీద విరక్తి కలగడం వలన ప్రకృతి మీద నుంచి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది మనసు. దాన్నే భక్తి అంటాము. పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యానమూ వైరాగ్యమూ భక్తీ కలుగుతాయి. ఈ మూడు కలిగితే,  పరమాత్మను సాక్షాత్కరించుకోగలుగుతాడు. (పై శ్లోకం: తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్ , నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్)ఆయన కేవలుడు ( దేనితోనూ సంబంధము లేని వాడు, సుఖ దుఖములూ ప్రకృతీ అంటని వాడు). ప్రతీ వానిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మకు వీరిలో ఉన్న మురికి అంటుతుందా? బురదలో సూర్యుని ప్రతిబింబం కనపడితే ఆయన ప్రతిబింబానికి మురికి అంటుతుందా? అలాగే మనలో కూడా పరమాత్మ అంశ ఉంది. ఆయన ఎప్పుడు "నాది" అనుకోడు. ఆయన అంతరము లేని వాడు. సంబంధం లేని వాడు, అన్ని సంబంధములూ కలవాడు.  ఆయన ప్రకృతిలో ఉంటాడు, ప్రకృతికంటే వేరుగా ఉంటాడు. నిరంతరుడు. ఆయన స్వయం జ్యోతిః. సంబంధం ఉన్నవారెవరూ స్వయం ప్రకాశకుడు కాలేరు. ఆయన స్వయం జ్యోతి. అణిమా: అతి సూక్షమైన వాడు. ఆవు తోకకున్న వెంట్రుక చివర ఉన్న దానిలో వెయ్యో వంతు ఉంటాడు జీవాత్మ. పరమాత్మ ఆ జీవాత్మలో ఉంటాడు. కాబట్టి ఆయన అన్నిటికన్నా సూక్ష్మం. మరి ఆయన తనను తాను ఖండించుకొని అణువుగా అయ్యాడా అంటే? ఆయన అఖండితం.

పరమాత్మ ఇంత గొప్పవాడైనా ఆయన ఉదాసీనుడు. ఏదీ కావాలనుకోడూ, ఏది వద్దనుకోడు. అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. సంబంధములేకుండా. "నా స్వరూపం బాగా తెలుసుకున్న వాడి కర్మలచే బద్ధుడు కాలేడు. ". కోరిక లేకుండా ఆచరించిన ఏ కర్మ బంధించదు. "నేను చేస్తున్న పని యొక్క ఫలితం నాకు రావట్లేదని తెలియుటే".

ఎపుడైతే ఇలాంటి పరమాత్మ స్వరూపం తెలుసుకుంటామో అప్పుడు ప్రకృతి తన ప్రభావాన్ని కలిగించదు. ప్రకృతి తన మాయా వ్యాపారాన్ని సంకోచిమప్చేస్తుంది. జ్ఞ్యాన వైరాగ్య భక్తులు కలిగిన వాడికి పరమాత్మ స్వస్వరూప జ్ఞ్యానం కలుగుతుంది.  అది కలిగిన వాడిని ప్రకృతి మోహించలేదు. ఇదంతా కలగాలంటే ఎన్ని పనులు చేసినా ఫలితాన్ని ఆశించకుండా ఉండుటే. అలా చేయుట వలన తెలుసుకున్న పరమాత్మ స్వరూపానికి కైంకర్యం చేయుటే జీవుని స్వరూపం. "నాలో పరమాత్మ అంతర్యామిగా ఉండి తనకోసం తన పనులను నా చేత చేయించుకుంటున్నాడు. నేను చేసే ప్రతీ పనీ ఆయన కోసమే. "

న యుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని
సదృశోऽస్తి శివః పన్థా యోగినాం బ్రహ్మసిద్ధయే

యోగులు పరమాత్మను పొందడానికి ఉత్తమ సాధన భక్తి. అఖిలాత్మ అయిన పరమాత్మ యందు కూర్చబడిన భక్తి  కన్నా వేరే మార్గం లేదు.

ప్రసఙ్గమజరం పాశమాత్మనః కవయో విదుః
స ఏవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతమ్

దుర్మార్గల యందు సంబంధము పెంచుకోవడమే పెంచబడిన పాశమని పండితులు చెబుతున్నారు. ఇదే సంబంధాన్ని సజ్జనులయందు పెట్టుకుంటే అదే మోక్షాన్ని ఇస్తుంది. పైన చెప్పినవేమీ లేకపోయినా అవి ఉన్న వారిని పట్టుకుంటే సులభముగా మోక్షం వస్తుంది. మోక్ష ద్వారం తెరిచి ఉంటుంది (మోక్షద్వారం అపావృతమ్). మనసు ఒక దాని మీద లగ్నమయ్యే ఉంటుంది. ఏ విషయములతో తగులుకోకుండా మనసు ఉండలేదు. దానినే సంగం అంటారు. అందుకే సంగాన్ని విడిచిపెట్టాలనుకున్నా విడిచిపెట్టలేము. అందుకే సత్సంగము చేయమని చెబుతుంది శాస్త్రం. సజ్జనులయందు సద్విషయముల యందు మనసు లగ్నం చేస్తే మోక్ష ద్వారం తెరుచుకుంటుంది.

తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినామ్
అజాతశత్రవః శాన్తాః సాధవః సాధుభూషణాః

తితిక్షవః - ఓర్పు, క్షమ. ఎదుటివారి దుఃఖాలను చూచి సహించలేకపోవుట కరుణ అంటాము. శత్రువు లేని వారు, అనతరింద్రియ నిగ్రహం కలిగిన వారు సాధువులు, సజ్జనులందరికీ అలంకారము.

మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వన్తి యే దృఢామ్
మత్కృతే త్యక్తకర్మాణస్త్యక్తస్వజనబాన్ధవాః

కొంతమంది నా కొరకు వారి పనులన్నీ మానుకుంటారు. నా కోసం తన వారినీ బంధువులనీ వదిలిపెట్టాలి (లక్ష్మణుడు ప్రహ్లాదుడూ దృవుడూ వృత్తాసురుడూ పుండరీకుడు భీష్ముడూ లాగ)

మదాశ్రయాః కథా మృష్టాః శృణ్వన్తి కథయన్తి చ
తపన్తి వివిధాస్తాపా నైతాన్మద్గతచేతసః

నాకు సంబంధించిన కథలను చెబుతూ వింటూ కాలం గడుపుతారు. చెబితే వింటారు. వింటే చెబుతారు. వీరిని అధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు తపింపచేయవు.

త ఏతే సాధవః సాధ్వి సర్వసఙ్గవివర్జితాః
సఙ్గస్తేష్వథ తే ప్రార్థ్యః సఙ్గదోషహరా హి తే

ఇలాంటి వారు సాధువులు. అన్ని రకముల సంగతినీ విడిచిపెడతారు. అలాంటి వారి విషయములో నీ మనసు సంగతి పొందాలని ప్రార్థించు. భగావంతుని మనం అడగాల్సినది ఇదొక్కటే. దుష్ట సంగం వలన కలిగిన పాపాన్ని ఈ సత్సంగం తొలగిస్తుంది

సతాం ప్రసఙ్గాన్మమ వీర్యసంవిదో భవన్తి హృత్కర్ణరసాయనాః కథాః
తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి

వారు చెప్పే నా కథలు మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రం నుండి లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న దోషాన్ని పోగొడతాయి. ఇలా వారు చెప్పే కథలను వినడం వలన మోక్ష మార్గం తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. వారి యందు ప్రీతి కలుగుతుంది, నాయందు (పరమాత్మ యందు) భక్తి కలుగుతుంది. శ్రద్ధ కథల మీద, రతి చెప్పేవారి మీద, భక్తి పరమాత్మ మీద కలుగుతుంది.

భక్త్యా పుమాన్జాతవిరాగ ఐన్ద్రియాద్దృష్టశ్రుతాన్మద్రచనానుచిన్తయా
చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః

నాయందు కలిగిన భక్తితో జీవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఇంద్రియములకు సంబంధించిన విషయాలయందు, చూచినా విన్నా ఆసక్తి కలుగదు. వాడి మనసు ఎప్పుడూ నా కథలను గూర్చి చింతిస్తూ ఉంటాడు. నిరంతరం నా కథలనే చెబుతూ వింటూ ఉండే వాడు సాంసారిక భోగములయందు విరక్తి కలిగి ఉంటాడు. అతను యోగములో ఉండి మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగితే వారికి చక్కటి దారి దొరుకుతుంది. దానితో నన్ను సాక్షాత్కరింపచేసుకోవడానికీ, మనసుని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాడు

అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్యవిజృమ్భితేన
యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహావరున్ధే

పరమాత్మ యందు మనసు లగ్నం చేసిన వారు పొరబాటున కూడా ప్రకృతి గుణాలను సేవించడానికి ప్రయత్నించకూడదు. ప్రకృతి గుణములని సేవించకుండుట వలన, బాగా పెరిగిన వైరాగ్యం వలన, నాయందు అర్పించిన యోగముతో, నిరంతరమూ నాయందు భక్తితో, అందరికీ (అన్ని ఆత్మలకూ) ఆత్మగా ఉన్న నన్ను తన దగ్గరనుండి బయటకు పోకుండా ఉంచుకుంటాడు. నన్ను ఇక్కడే నిర్భందిస్తాడు. అలా చేయడానికి 1. ప్రకృతి గుణాలని సేవించకుండా ఉండటం 2. వైరాగ్యము నిండిన జ్ఞ్యానము కలిగి ఉండాలి 3. భక్తి కూడా నాకే అర్పించాలి ( అంటే భక్తి కూడా కృష్ణార్పణం) . భగవంతుడు మాత్రమే ఉపాయము. మనము చేసేవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చేస్తే ఆ జీవాత్మ హృదయములో ఉండి అక్కడే ఉంటాను

దేవహూతిరువాచ
కాచిత్త్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా
యయా పదం తే నిర్వాణమఞ్జసాన్వాశ్నవా అహమ్

నీయందు చేయవలసిన భక్తి ఎలాగ ఉండాలి? నవ విధ భక్తులలో ఏది నిన్ను చేరుస్తుంది. నీ విషయముకో ఎలాంటి భక్తి చేయాలి. దేనితో నేను నిన్ను చేరుతానో అది చెప్పు. నాకు ఎలాంటిది అర్థమవుతుందో అది చెప్పు. దేని వలనైతే బాధపడుతున్న నేను నిన్ను చేరగలనో అది చెప్పు

యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మంస్త్వయోదితః
కీదృశః కతి చాఙ్గాని యతస్తత్త్వావబోధనమ్

ఆనందస్వరూపా, భగవంతుని చేర్చగల సాధనముగా ఉండే యోగమేదో చెప్పు. నీవు చెప్పిన యోగము ఎలాంటిది, దానికి ఎన్ని అంగాలు ఉన్నాయి. 

తదేతన్మే విజానీహి యథాహం మన్దధీర్హరే
సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్

మందురాలినైన నాకు ఉన్నవాటన్నిటిలో ఏది నిన్ను చేరుస్తుందో అది చెప్పు. తెలియశక్యం కానివి కూడా సులభముగా చెప్పు. నేను స్త్రీని. 

మైత్రేయ ఉవాచ
విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః
తత్త్వామ్నాయం యత్ప్రవదన్తి సాఙ్ఖ్యం ప్రోవాచ వై భక్తివితానయోగమ్

కపిల మహర్షి, తల్లి మనసులో ఉన్న దాన్ని తెలుసుకున్నాడు. ఏ శరీరము నుండి పుట్టాడో, ఆ శరీరం ఉన్న ఆమె యందు ప్రేమ పుట్టింది. ఇప్పటిదాకా భక్తిని చెప్పాడు. ఏ యోగముతో భక్తి వ్యాప్తి (వితానం) చెబుతుందో ఆ యోగమైన సాంఖ్య యోగాన్ని చెప్పాడు. పేరుకు సాంఖ్య (జ్ఞ్యాన) యోగమైనా, పరమాత్మ చివరకు భక్తిలోకే తీసుకు వస్తాడు. దీన్ని పెద్దలు సాంఖ్యం అంటారు. ఇది భక్తిని విస్తరించే యోగం.

శ్రీభగవానువాచ
దేవానాం గుణలిఙ్గానామానుశ్రవికకర్మణామ్
సత్త్వ ఏవైకమనసో వృత్తిః స్వాభావికీ తు యా

మనం ఏ పొరపాటు చేయడానికైనా కారణం మనస్సే. మనసు అలా చేయడానికి కారణం ఇంద్రియాలు. ఇంద్రియములే మనసును లాగుకొని పోతాయి. మనసే ఇంద్రియమును ప్రవర్తింపచేస్తుంది. ఒక దానిని చూస్తేనే దాని యందు రుచి పుడుతుంది. దానిని చూడమని చెప్పేది మనసు. 
గుణలిఙ్గానామానుశ్రవికకర్మణామ్- గుణములకు లింగములు (చిహ్నములు) జ్ఞ్యానేంద్రియములు. ఆనుశ్రవికకర్మణామ్ - అంటే కర్మేంద్రియములు (కర్మలు అనుక్షణం చేయడానికి ఉపకరించేవి) . ఫలానా చోటికి వెళ్ళాలి అన్న సంకల్పం మనసు చేస్తుంది. మనసు చెబితే కాళ్ళు వెడతాయి. ఫలానా విషయం చూడాలి అని మనసు సంకల్పిస్తే, మనసు చెప్పిన రూపాన్ని జ్ఞ్యానేంద్రియం వెళ్ళి చూడటానికి ప్రయత్నిస్తే, దాని మీద కోరిక పుడితే, దాని దగ్గరకు వెళ్ళాలి అన్న ప్రయత్నం జరుగుతుంది. అందుకు మొట్టమొదట జ్ఞ్యానేంద్రియము, తరువాత కర్మేంద్రియము. వీటికి ప్రేరకం మనసు.

మన ప్రవృత్తికీ, నివృత్తికీ మూలం మన మనస్సు. ఆ మనసు కూడా తనకు తానుగా ఏ పనీ చేయలేదు. ఉదా: మనసే వెళ్ళి చూడలేదు, మనసే ఎక్కడికీ వెళ్ళలేదు. మనసులో జరిగే సంకల్ప వికల్పాలకే ఇంద్రియాలు అని పేరు. (బృహదారకములో "మనసుకే పనిని బట్టి పేరు మారుతుంది, చూడాలనుకున్నప్పుడు చక్షురింద్రియం అవుతుంది." అని). మనస్సే ఏ పనీ చేయలేదు. కంటికి కనపడితే, కనపడిన కంటి వెంట తాను ఉండి చూస్తే, అది నచ్చితే "బాగుందీ మళ్ళీ చూడు " అంటుంది. 

ఇది అర్థం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం ఎందుకో తెలుస్తుంది. మనసే కోరుతుంది భావిస్తుంది. కానీ ఇంద్రియ సహకారము లేకుండా అది చేయలేదు. మనసుకి అందించేది ఇంద్రియములు (కర్మేంద్రియాలు జ్ఞ్యానేంద్రియాలు)

మనసుని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అందుకు ప్రధానమైనది కర్మేంద్రియ జ్ఞ్యానేంద్రియములు. 

రాజస తాపస ప్రవృత్తులను వదిలిపెట్టి సాత్విక ప్రవృత్తిని ఇందిర్యాలకు అంటిస్తే, ఆ ఇంద్రియాలు అదే భావాన్ని మనసుకు అంటిస్తాయి. మనసునూ జ్ఞ్యాన కర్మేంద్రియాలను సత్వము యందు ఉంచు. ఇలా ఈ మూడిటినీ పరమాత్మ యందు లగ్నం చేసి, సాంసారిక ప్రవృత్తిని మానేస్తే, పరమాత్మ మన వశం అవుతాడు. అలా కావడాన్ని, పరమాత్మ యందు ఉండే అనిమిత్తమైన (కారణము లేని, ప్రయోజనాన్ని ఆశించని భక్తి) భక్తి. 

అనిమిత్తా భాగవతీ భక్తిః సిద్ధేర్గరీయసీ
జరయత్యాశు యా కోశం నిగీర్ణమనలో యథా

ఇలాంటి భక్తి మోక్షము కన్నా గొప్పది. ఇలాంటి భక్తి మనకు ఉన్న హృదయ గ్రంధిని చేధింపచేస్తుంది, కాలుస్తుంది. పనికి రాని వస్తువులను అగ్ని ఎలా కాల్చి పారేస్తుందో పరమాత్మ యందు భక్తి అన్ని పాపాలను ధ్వన్సం చేస్తుంది.

నైకాత్మతాం మే స్పృహయన్తి కేచిన్మత్పాదసేవాభిరతా మదీహాః
యేऽన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయన్తే మమ పౌరుషాణి

నిరంతరం నా పాదములనే సేవించాలని కోరుకున్న వారు నాతో ఐక్యం కావాలని కూడా కోరుకోరు. నన్ను మాత్రమే కోరేవారు మోక్షాన్ని కూడా కోరరు. తనలాంటి వారితో కూర్చుని నా కథలు చెప్పుకుంటారు. పరమ భాగవతులు ఒకరితో ఒకరు కలిసి నా ప్రతాప చిహ్నములైన అవతరాల లీలను చెప్పుకుంటారు. 

పశ్యన్తి తే మే రుచిరాణ్యమ్బ సన్తః ప్రసన్నవక్త్రారుణలోచనాని
రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదన్తి

అమ్మా! నా సౌందర్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని వారు చూస్తారు చక్కని ముఖారవిందం, ఎర్రని నేత్రాలు, దివ్యమైనటువంటివి (ప్రకృతి సంబంధమూ కాల సంబంధమూ లేనిది. కాలముతో వికారం ఏర్పడుతుంది) , వరములిచ్చేటువంటివి,  నా రూపాలనూ చూస్తారు, నా వాక్కును (వేద మంత్రాన్ని) పఠనం చేస్తారు. నేనే వెళితే ఆరాధిస్తారు. వారు అన్య ప్రసంగాలు చేయరు. 

తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః
హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తిరనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుఙ్క్తే

ఇలా సుందరమైన దివ్య మంగళ విగ్రహం, విలాసముతో కూడిన చూపులు, తీయని మాటలు, మనసు హరించబడి, పైప్రాణం పైనే పోతుంది అనిపించేవారు  నేను ఇవ్వాలనుకునే మోక్షాన్ని కూడా వారు కోరరు. 

అథో విభూతిం మమ మాయావినస్తామైశ్వర్యమష్టాఙ్గమనుప్రవృత్తమ్
శ్రియం భాగవతీం వాస్పృహయన్తి భద్రాం పరస్య మే తేऽశ్నువతే తు లోకే

ఇలాంటి యోగముతోటీ ధ్యానముతోటీ భావముతోటీ నన్ను మాత్రమే చేరి , కొలిచి స్తుతించి, ఇంతకన్నా వేరే విషయాలను చూడకుండా ఉన్నప్పుడు, ఇంతటి పరమభక్తునికి కోరకున్నా అష్ట సిద్ధులూ వస్తాయి. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అప్రయత్నముగా వచ్చినా ఈ అష్ట సిద్ధులని కూడా నా భక్తులు కోరరు. భగవత్భక్తులు కోరే మంగళకరమైన సంపద (కైవల్యం) కూడా వారు కోరరు.

న కర్హిచిన్మత్పరాః శాన్తరూపే నఙ్క్ష్యన్తి నో మేऽనిమిషో లేఢి హేతిః
యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురుః సుహృదో దైవమిష్టమ్

నేనిచ్చేవాటిని గానీ, లోకములో లభించే ప్రాకృతికమైన భోగములు కోరని వారికి నాశము లేదు. కర్మ ప్రకృతి సంసారము అనే తీక్షణమైన ఆయుధాలు. ఈ పదునైన ఆయుధాలను వారు (సామాన్యజనులలాగ) నాలికతో స్పృశించరు.  నేను వారికి ప్రియున్ని, ఆత్మను, పుత్రున్ని, మిత్రున్ని, గురువునీ సుహృత్, ఇష్ట దైవాన్ని 

ఇమం లోకం తథైవాముమాత్మానముభయాయినమ్
ఆత్మానమను యే చేహ యే రాయః పశవో గృహాః
విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశ్వతోముఖమ్
భజన్త్యనన్యయా భక్త్యా తాన్మృత్యోరతిపారయే

ఈ  లోకమూ పరలోకమూ, ఈ శరీరం వెంట లభించే పశువులు భార్య పిల్లలూ సంపదలూ అన్నిటినీ విడిచిపెట్టి, అంతటా వ్యాపించి ఉన్న నన్ను అనన్యమైన భక్తితో సేవిస్తారు. 
అటువంటి వారిని నేనే దగ్గరుండి సంసారాన్ని దాటిస్తాను.

నాన్యత్ర మద్భగవతః ప్రధానపురుషేశ్వరాత్
ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే

సంసారం వలనా,  ప్రకృతి వలనా,  విషయభోగముల వలన సుఖేచ్చల వలన కలిగే భయమూ సంతాపమూ, నన్ను తప్ప మిగతా దేనిని సేవించినా తొలగదూ. అన్ని ప్రాణులకూ ప్రకృతి వలన సహజముగా కలిగే భయము నా వలననే పోతుంది. భయము కలిగించే వాడినీ నేనే. భయము తొలగించే వాడినీ నేనే. అందరూ నా వలననే భయపడతారు. నన్ను స్మరించే భయాన్ని పోగొట్టుకుంటారు 

మద్భయాద్వాతి వాతోऽయం సూర్యస్తపతి మద్భయాత్
వర్షతీన్ద్రో దహత్యగ్నిర్మృత్యుశ్చరతి మద్భయాత్

నాకు భయపడే సూర్యుడూ, ఇంద్రుడు అగ్ని మృత్యువూ వారి వారి పనులు చేస్తున్నారు. 

జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః
క్షేమాయ పాదమూలం మే ప్రవిశన్త్యకుతోభయమ్

బుద్ధిమంతులైన వారూ, జ్ఞ్యానమున్న వారూ, వైరాగ్యం ఉన్నవారూ, వాటితో కూడిన భక్తి ఉన్న యోగులూ, తాము బాగుండాలంటే నా పాద మూలాన్ని ఆశ్రయిస్తారు. 

ఏతావానేవ లోకేऽస్మిన్పుంసాం నిఃశ్రేయసోదయః
తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరమ్

ఈ ప్రపంచములో నిజమైన సర్వోత్తమమైన శ్రేయస్సు కలిగేది తీవ్రమైన (అనన్యమైన ) భక్తి యోగముతో నాయందు మనసు నిలుపుటే.