Pages

Wednesday, 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

                                                               ఓం నమో భగవతే వాసుదేవాయ 

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
సత్సేవనీయో బత పూరువంశో యల్లోకపాలో భగవత్ప్రధానః
బభూవిథేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్యభీక్ష్ణమ్

మీ పూరు వంశం సజ్జనులందరి చేతా సేవించదగినది  ఎందుకంటే లోలపాలకులైన (యముడు) మీరు పరమాత్మే ప్రధానంగా ఉండేవారు, అహంకార మమకార వర్జితులు మీరు. మీ వంశం ఎంత గొప్పది కాకుంటే మీ వంటివారు పుడతారు. ఎవరిచేతా గెలువబడైన (అజితుడైన) పరమాత్మ కీర్తి మాలను పదే పదే ప్రతీ క్షణం మాటి మాటికీ కొత్తగా చేస్తున్నావు. అందువలన నీవు పుట్టిన పూరు వంశం సజ్జనులందరి చేతా సేవించదగినది

సోऽహం నృణాం క్షుల్లసుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య
ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాద్భగవానృషిభ్యః

కొద్ది సుఖానికి ప్రయత్నించి పెద్ద దుఖాన్ని పొందుతునారు. అలాంటి వారి దుఃఖం తొలగించడానికి నీవడిగిన ప్రశ్నకు సమాధానం భాగవతం.

ఆసీనముర్వ్యాం భగవన్తమాద్యం సఙ్కర్షణం దేవమకుణ్ఠసత్త్వమ్
వివిత్సవస్తత్త్వమతః పరస్య కుమారముఖ్యా మునయోऽన్వపృచ్ఛన్

అన్నిటికన్నా కిందిలోకమైన పాతాళంలో ఉన్నవాడైన ఆదిశేషుడు (సంకర్షణుడు) శుద్ధ సత్వం కలవాడు. ఈయన వద్దకు సనకసనందాదులు వచ్చి ఒకరి వెంట ఒకరు అడిగారు

స్వమేవ ధిష్ణ్యం బహు మానయన్తం యద్వాసుదేవాభిధమామనన్తి
ప్రత్యగ్ధృతాక్షామ్బుజకోశమీషదున్మీలయన్తం విబుధోదయాయ

ఆ ఆదిశేషుడు తన మూలస్థానం (పర వాసుదేవ తత్వం) నిరంతరం( బహు మానయన్తం ) ధ్యానం చేస్తూ, ఏ నివాసాన్ని వాసుదేవా అంటారో, ఆ నివాసాన్ని ధ్యానం చేస్తూ, పరమాత్మను ధ్యానం చేస్తున్నందు వలన అంతర్దృష్టితో అర్థ నిమీలిత నేత్రంతో, త్రలకిందుగ పట్టుకున్న పద్మపు మొగ్గ వలే నేత్రములను లోపలికి ప్రసరింపచేస్తూ, జ్ఞ్యానుల సంతోషానికి కొరకు కొంచెం మళ్ళీ తెరుస్తూ ఉన్నాడు

స్వర్ధున్యుదార్ద్రైః స్వజటాకలాపైరుపస్పృశన్తశ్చరణోపధానమ్
పద్మం యదర్చన్త్యహిరాజకన్యాః సప్రేమ నానాబలిభిర్వరార్థాః

ఆకాశ గంగతో కొద్దిగా తడవబడిన జటలు కలవారు అయిన సనకాదులు , ఆ జటలతో ఆయన పాదప్రక్షాళణ చేస్తున్నారు. ఎంతో మంది సర్పరాజు భార్యలు తమకు కావల్సిన వరముల గురించి అర్చిస్తుంటారో అలాంటి పాదాలను స్పృశించారు

ముహుర్గృణన్తో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్జ్ఞాః
కిరీటసాహస్రమణిప్రవేక ప్రద్యోతితోద్దామఫణాసహస్రమ్

ఆయన లోకరక్షణకు ఏమేమి చేసాడో తెలిసినవారు కాబట్టి (తజ్జ్ఞాః) ఆయనను హద్దులేనంతా భక్తితో ప్రేమతో స్తోత్రం చేస్తున్నారు. ఆ ప్రేమతో గొంతు పూడుక  పోయి భావావేశంతో పదములు జారుతూ వణుకుతూ తొట్రుపడగా, ఆయన చేసిన లోకోపకారములు తెలిసినవారు కాబట్టి కీర్తిస్తున్నారు.
ఆయన శిరస్సు మీద వేయి కిరీటాలు (పాముల కన్నా నాగములూ, నాగముల కన్నా మహానాగములు శ్రేష్టులు. మామూలు మహాసర్పానికే ఒక మణి ఉంటే ఆది శేషుని వేయి పడగలకూ వేయి మణులు), ఆ ఆదిశేషుని శిరస్సు మీద ఉన్న మణుల కాంతితో ఆయంకున్న వేయి కిరీటములూ ప్రకాశిస్తున్నాయి. దిక్కులన్నీ వ్యాపించే కాంతులు వేయి కిరీటములే కావు. ఆ వేయి కిరీటములకు కాంతిని పెంచేవి ఆయన శిరసు మీద ఉన్న మణి.

ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్తిధర్మాభిరతాయ తేన
సనత్కుమారాయ స చాహ పృష్టః సాఙ్ఖ్యాయనాయాఙ్గ ధృతవ్రతాయ

వీరందరూ అడిగితే నివృత్తి ధర్మ పరివృత్తుడైన సనత్కుమారునికి ఈ భాగవతం వివరించారు. సంకర్షుని ద్వారా సనత్కుమారుడు భాగవతాన్ని విన్నాడు. ఆ సనత్కుమారున్ని సాంఖ్యాయన మహర్షి అడిగారు. ఆ పారమహంస ముఖ్యుడైన సాంఖ్యాయనుడు మా గురువు గారైన  పరాశరునికి చెప్పాడు.

సాఙ్ఖ్యాయనః పారమహంస్యముఖ్యో వివక్షమాణో భగవద్విభూతీః
జగాద సోऽస్మద్గురవేऽన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ

భగవత విభూతులు చెప్పాలనుకున్న పారమహంస్య ముఖ్యుడు మా గురువుగారైన పరాశరునికి, బృహస్పతికీ చెప్పాడు. ఆ పరాశరుడు పరమదయాళువు కాబట్టి నాకు చెప్పాడు. ఈ పరాశరుడు వశిష్టుడికి మనుమడు (వశిష్టుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు, ఒక రాక్షసుడు శక్తిని తినివేసాడు. ఆ విషయం తెలుసుకున్న పరాశరుడు రాక్షస వినాశానికి ఒక యజ్ఞ్యం చేసాడు. అప్పుడు పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వచ్చి వారించాడు. అప్పుడు పులస్త్యుడు సంతోషించి పురాణ కర్తవి అవ్వమని వరమిచ్చాడు. పురాణానికి ఆద్యం విష్ణు పురాణం), పులస్త్య బ్రహ్మ ఇచ్చిన వరము వలన మా గురువుగారు భాగవతాన్ని నాకు వివరించాడు. నేను నీకు దాన్నే చెప్పబోవుతున్నాను

ప్రోవాచ మహ్యం స దయాలురుక్తో మునిః పులస్త్యేన పురాణమాద్యమ్
సోऽహం తవైతత్కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ

శ్రద్ధతో అనుసరిస్తూ ఉండే వాడికి

ఉదాప్లుతం విశ్వమిదం తదాసీద్యన్నిద్రయామీలితదృఙ్న్యమీలయత్
అహీన్ద్రతల్పేऽధిశయాన ఏకః కృతక్షణః స్వాత్మరతౌ నిరీహః

కాలం చేత ప్రేరేపించబడి పరమాత్మ సంకలించి ప్రళయం చేయాలనుకున్నపుడు లోకం మొత్తం నీటితో ముంచబడింది. అపుడు పరమాత్మ నిద్రపోయినట్లు కనులు మూసుకోగానే జగత్తంతా నీటితో నిండింది. ప్రళయకాలంలో కూడా పరమాత్మ శేష శయ్య మీద ఉన్నాడు. దీన్నే ప్రకృతి అంటాం. ప్రకృతి మహత్ తత్వములే ఆదిశేషుని రూపంలో సేవిస్తున్ ఉంటాయి. ఒక్కడే ఉండి ,కోరిక లేని వాడై కూడా మళ్ళి జగత్తుని తన సంకల్పంతో సృష్టించాలనుకున్నాడు.

సోऽన్తః శరీరేऽర్పితభూతసూక్ష్మః కాలాత్మికాం శక్తిముదీరయాణః
ఉవాస తస్మిన్సలిలే పదే స్వే యథానలో దారుణి రుద్ధవీర్యః

పంచ్భూతములూ తన్మాత్రములు మొదలుకొని ఉన్న 24 తత్వాలు అన్నీ పరమాత్మ గర్భంలోనే సూక్ష్మావస్థలో దాగి ఉన్నాయి. వీటిలో మొదట కాల శక్తిని ప్రేరేపించాడు. అన్ని తత్వాలలో స్పందన కలిగించేది కాలం. తన నివాసం అయిన జలంలోనే చాలా కాలం నివాసమున్నాడు. కట్టెలో తేజస్సు దాచి ఉంచుకున్న అగ్ని లాగ ఉన్నాడు

చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్స్వయోదీరితయా స్వశక్త్యా
కాలాఖ్యయాసాదితకర్మతన్త్రో లోకానపీతాన్దదృశే స్వదేహే

అలా నాలుగు యుగాలు వెయ్యి సార్లు తిరిగే వరకూ ఉన్నారు (అంటే బ్రహ్మకు ఒక దినం) . తరువాత తన చేత ప్రేరేపించబడిన కాలంతో తాను చేయవలసిన కర్మను సంకల్పం చేసుకుని తన దేహంలో ఉన్న అన్ని లోకాలనూ చూచాడు. సూక్ష్మావస్థలో ఉన్న అన్ని అర్థముల మీద తన దృష్టి ఉంచాడు.

తస్యార్థసూక్ష్మాభినివిష్టదృష్టేరన్తర్గతోऽర్థో రజసా తనీయాన్
గుణేన కాలానుగతేన విద్ధః సూష్యంస్తదాభిద్యత నాభిదేశాత్

తనలో దాగి ఉన్న అన్ని లోకాలను రజో గుణంతో కాలానుగుణమైన గుణంతో క్షోభింపచేసాడు
తన గర్భంలో ఉన్న అన్ని తత్వములనూ బయటకు తెప్పించాలన్న సంకల్పం వలన నాభిని భేదించుకుని ఒక పద్మం ఆవిర్భవించింది.

స పద్మకోశః సహసోదతిష్ఠత్కాలేన కర్మప్రతిబోధనేన
స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః

కర్మగురించి కాలము జ్ఞ్యాపకం చేయగా తనలో ఉన్న భూత సూక్షములను బయటకు తేవాలని సంకల్పించి అంతర్దృష్టుడైన పరమాత్మ నాభి నుండి వేగంగా ఒక పద్మం ఆవిర్భవించింది. తన కాంతితో ఈ పద్మం చుట్టు వ్యాపించి ఉన్న జలమును ప్రకాశింపచేసింది. ఎలా ఐతే సూర్యుడు సకలలోకాలని ప్రకాశింపచేసాడో

తల్లోకపద్మం స ఉ ఏవ విష్ణుః ప్రావీవిశత్సర్వగుణావభాసమ్
తస్మిన్స్వయం వేదమయో విధాతా స్వయమ్భువం యం స్మ వదన్తి సోऽభూత్

ఆ పద్మంలోకి సకల తత్వాలూ ఆవిర్భవింప చేసేలాగ పరమాత్మ తానే ప్రవేశించాడు.
ఇలా ప్రవేశించిన ఆ పరమాత్మే వేద స్వరూపుడు. సకల జగత్తునీ సృష్టించేవాడు. ఆయనను స్వయంభూ (తనకు తానుగా పుట్టినవాడు) అంటారు. తన సృష్టికి తన సంకల్పమే కారణం.

తస్యాం స చామ్భోరుహకర్ణికాయామవస్థితో లోకమపశ్యమానః
పరిక్రమన్వ్యోమ్ని వివృత్తనేత్రశ్చత్వారి లేభేऽనుదిశం ముఖాని

ఎపుడైతే రూపం గుణం మారిందో తన స్వభావం కూడా మర్చుకున్నాడు. ఆ పద్మం యొక్క పుప్పొడిలో ఉండి ఏమీ కనపడక చుట్టు తిరిగాడు, అన్ని దిక్కులూ ఒకే సారి చూస్తే నాలుగు ముఖాలు వచ్చాయి (మొదలు ఆయనకూఇదు ముఖాలు వచ్చాయి ప్రతీ దిక్కుకూ ఒక ముఖం, పైకి ఒకటి, తరువాత అవి నాలుగయ్యాయి)

తస్మాద్యుగాన్తశ్వసనావఘూర్ణ జలోర్మిచక్రాత్సలిలాద్విరూఢమ్
ఉపాశ్రితః కఞ్జము లోకతత్త్వం నాత్మానమద్ధావిదదాదిదేవః
క ఏష యోऽసావహమబ్జపృష్ఠ ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు
అస్తి హ్యధస్తాదిహ కిఞ్చనైతదధిష్ఠితం యత్ర సతా ను భావ్యమ్

వాయువు చేత చెల్లా చెదురుగా ఉన్న ఆ జలాన్ని, నీటినుండి ఆవిర్భవించిన తన స్వరూపాన్ని, పద్మాన్ని ఆశ్రయించిన బ్రహ్మగారు, తన గురించి తానూ స్పష్టంగా తెలుసుకోలేకపోయాడు, ఆయన ఆవిర్భవించడానికి కారణం తెలియలేక "నేను ఎవరు,  ఈ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది ఈ నీరు ఏంటి, ఈ నీటి అడుగున ఏది ఉంది. ఏదో ఒకటి ఉండి ఉండాలి కదా?" అన్న ఆలోచనతో

స ఇత్థముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరన్తర్జలమావివేశ
నార్వాగ్గతస్తత్ఖరనాలనాల నాభిం విచిన్వంస్తదవిన్దతాజః

ఆ పద్మం కింద కాడ, అందులో రంధ్రం కనపడింది. ఆయన అందులో ప్రవేశించి, తిరిగి తిరిగి, వెతికి వెతికి దాని కింద ఏముందో తెలియలేకపోయాడు.

తమస్యపారే విదురాత్మసర్గం విచిన్వతోऽభూత్సుమహాంస్త్రిణేమిః
యో దేహభాజాం భయమీరయాణః పరిక్షిణోత్యాయురజస్య హేతిః

అలా వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా అంతా చీకటే. తన సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి వెతుకుతున్న స్వామి దగ్గరకు మూడు నేములు కలది (సత్వ రజ తమో గుణాలు గల ప్రకృతి) కనపడింది. ఈ ప్రకృతి (త్రినేమి) లేదా కాలం (కాలం కూడా త్రినేమి అంటారు; భూత భవిష్యత్ వర్దమాన). ఈ కాలం లేదా ప్రకృతి ప్రతీ ప్రాణికీ భయాన్ని ఇచ్చేది, ఆయువును తీసి పారేసేది, ఇది పరమాత్మ ఆయుధం (కాల చక్రం). ఆ సాక్షాత్కారం కలిగింది బ్రహ్మగారికి.

తతో నివృత్తోऽప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యమాసాద్య పునః స దేవః
శనైర్జితశ్వాసనివృత్తచిత్తో న్యషీదదారూఢసమాధియోగః

వెతికి వెతికి కోరిక తీరిక పద్మంలోకే వచ్చి, ఒక్క సారి ప్రాణాయామ పరాయణుడై, ఇంద్రియాలను గెలిచినవాడై సమాధి యోగంలో ఒకసారి తపసులో ప్రవేశించాడు.

కాలేన సోऽజః పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరూఢబోధః
స్వయం తదన్తర్హృదయేऽవభాతమపశ్యతాపశ్యత యన్న పూర్వమ్

ఒక ఆయుష్షు కాలం తపస్సు చేస్తే అప్పుడు జ్ఞ్యానం కలిగింది. ఇలా ధ్యాన యోగంలో కనులు మూసుకున్న బ్రహ్మ హృదయంలో ఒక అద్భుత రూపం కనిపించింది. అంతర్ముఖుడైన బ్రహ్మ దానిని చూచాడు

మృణాలగౌరాయతశేషభోగ పర్యఙ్క ఏకం పురుషం శయానమ్
ఫణాతపత్రాయుతమూర్ధరత్న ద్యుభిర్హతధ్వాన్తయుగాన్తతోయే

పద్మం యొక్క నాడంలోపలి దారము వంటి తెల్లని వర్ణం (అప్పటికి ఉన్నది పద్మమే కాబట్టి పద్మాన్నే ఉపమానంగా వేసారు) కల ఆదిశేషుని మీద పడుకుని ఉన్నాడు. పడగలు గొడుగులు గా కలిగి, పడగలమీద మణుల కాంతిచే తొలగించబడిన చీకటితో ప్రళయకాల జలంలో ఆదిశేషుని మీద పడుకున్న స్వామిని చూచాడు.

ప్రేక్షాం క్షిపన్తం హరితోపలాద్రేః సన్ధ్యాభ్రనీవేరురురుక్మమూర్ధ్నః
రత్నోదధారౌషధిసౌమనస్య వనస్రజో వేణుభుజాఙ్ఘ్రిపాఙ్ఘ్రేః

సంధ్యాకాల మేఘం వంటి కొన కలిగిన బంగారు రంగు కలిగిన (ఉరు రుక్మ మూర్ధ్న) శిరసు కలిగి , అనేక రత్నముల కాంతిచే ప్రకాశించే పాదములు కలిగిన వాడాఇ,

ఆయామతో విస్తరతః స్వమాన దేహేన లోకత్రయసఙ్గ్రహేణ
విచిత్రదివ్యాభరణాంశుకానాం కృతశ్రియాపాశ్రితవేషదేహమ్

మూడులోకాల పొడవూ వెడల్పు గల ఆకారం, ఆ మూడు లోకాల వరకూ వ్యాపించిన దేహంకలవాడు, దివ్యాభరణములూ వస్త్రములూ, వాటి శొభచే శరీరం మీద కొత్త కాంతిపడుతూ

పుంసాం స్వకామాయ వివిక్తమార్గైరభ్యర్చతాం కామదుఘాఙ్ఘ్రిపద్మమ్
ప్రదర్శయన్తం కృపయా నఖేన్దు మయూఖభిన్నాఙ్గులిచారుపత్రమ్

ఈయన  పాదాలు తమ తమ మనసులలో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి వేరు వేరు మార్గాలలో అందరిచేతా ఆశ్రయించబడే పాదాలు, అనంతమైన పాదాలు. దారులూ, కోరికలూ, ఆచరణ వేరు అయినా ఆశ్రయాన్నిచ్చే పాదాలు మాత్రం ఇవే. దయతో మనందరికీ చూపెడుతున్న పాదాల గోళ్ళు అనే చంద్రుని వెన్నెల చేత తన పాదపద్మములని అందరికీ చూపిస్తున్నారు

ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్కుణ్డలమణ్డితేన
శోణాయితేనాధరబిమ్బభాసా ప్రత్యర్హయన్తం సునసేన సుభ్ర్వా

లోకుల బాధను తొలగించే చిరునవ్వు కాంతి గల పరమాత్మ ముఖం, ఆ కాంతికి తోడు కుండలముల కాంతితో కలిసి, పెదవుల కాంతితో ఎర్రబడిన ముఖం, చక్కని ముక్కు కనులూ,

కదమ్బకిఞ్జల్కపిశఙ్గవాససా స్వలఙ్కృతం మేఖలయా నితమ్బే
హారేణ చానన్తధనేన వత్స శ్రీవత్సవక్షఃస్థలవల్లభేన

పీతంబరం ధరించి బంగారు మొలతాడుతో , శ్రీవత్సమనే (శ్రీ - లక్ష్మికి వత్సం - ప్రీతికలిగించేది శ్రీవత్సం) పుట్టుమచ్చ గలిగిన వక్షస్థాలనికి ప్రీతి కలిగించే హారముతో

పరార్ధ్యకేయూరమణిప్రవేక పర్యస్తదోర్దణ్డసహస్రశాఖమ్
అవ్యక్తమూలం భువనాఙ్ఘ్రిపేన్ద్రమహీన్ద్రభోగైరధివీతవల్శమ్

భుజాభరణాలు (కేయూరాలు) , వాటిలో ఉండే మణుల యొక్క కాంతిచే విస్తరించబడిన వేయి బాహువులు కలిగిన వాడు, కనపడుతున్నాడు గానీ ఆయన మూల తత్వం తెలియనటువంటి, సకల లోకములనూ పాదములను పవిత్రం చేసే, అఖిల లోకపాలకుల పాలకత్వం నిలిపే పాదములు

చరాచరౌకో భగవన్మహీధ్రమహీన్ద్రబన్ధుం సలిలోపగూఢమ్
కిరీటసాహస్రహిరణ్యశృఙ్గమావిర్భవత్కౌస్తుభరత్నగర్భమ్

సకల భూమండలమునకు మూలమైన జలము, అందులో వేంచేసిన పద్మానికి బందువైన వాడు (మహీధ్రమహీన్ద్రబన్ధుం) నీటితో కప్పిపుచ్చబడ్డవాడు, వేయి శిరస్సులకూ ఆ కిరీటములు గలిగిన మణులకూ, ఆ కాంతులతో

నివీతమామ్నాయమధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిమ్
సూర్యేన్దువాయ్వగ్న్యగమం త్రిధామభిః పరిక్రమత్ప్రాధనికైర్దురాసదమ్

పరమాత్మ వక్షస్థలంలో ఉన్న వనమాలతో (తొమ్మిది రకముల పుష్పములతో ఒక చోట కూరిస్తే వనమాల, నవ విధ భక్తులతో సేవించగల జీవులే వనమాల . వనమాల జీవతత్వం) , సూర్య ఇంద్ర వాయు అగ్ని,ఇలాంటి వాటికి చేరరానిది. ప్రకృతి మహత్ అహంకార తత్వాలకు అందుబాటులో లేనిది

తర్హ్యేవ తన్నాభిసరఃసరోజమాత్మానమమ్భః శ్వసనం వియచ్చ
దదర్శ దేవో జగతో విధాతా నాతః పరం లోకవిసర్గదృష్టిః

నాభిపద్మంలో ఉన్న బ్రహ్మగారికి ఈయన నిశ్వాసమే ఆకాశంగా సాక్షాత్కరించడం కనప్డింది. అలాగే కాలతత్వం (చక్రం) ప్రకృతి తత్వం ( ఆది శేషుడు) వనమాల (జీవ తత్వం) బ్రహ్మకు సాక్షాత్కరించాయి. ప్రపంచమంతా తన శరీరంలో బ్రహ్మగారికి చూపించాడు. ఇంతకంటే లోకాలను సృష్టించడానికి కావల్సిన దృష్టి అవసరంలేదు. పరమాత్మలోనే అన్ని లోకాలూ చూచాడు. అంతకంటే వేరే లోకాలను చూడలేకపోయాడు

స కర్మబీజం రజసోపరక్తః ప్రజాః సిసృక్షన్నియదేవ దృష్ట్వా
అస్తౌద్విసర్గాభిముఖస్తమీడ్యమవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా

రజోగుణముచే ఆక్రమించబడిన, కర్మ బీజమైన బ్రహ్మగారు, ఈయననే (పరమాత్మనే) చూచాడు. ఒక్క సారి ఈ దివ్యమంగళ విగ్రహం సాక్షాత్కరించగానే సృష్టి చేయాలనే కోరిక గలిగిన బ్రహ్మగారు, స్పష్ట పడని మార్గంలో బుద్ధి ఉంచిన వాడై (పరమాత్మ స్వరూపం పూర్తిగా తెలియనివాడై) తన మనసుని అక్కడే ఉంచి,  స్తోత్రం చేసాడు

                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు