Pages

Saturday, 1 February 2014

శ్రీమద్భాగవతం రెండవ స్కంధం ఆరవ అధ్యాయం

దీన్ని అహంకార నిరసాధ్యాయం అంటారు, ఇది శ్రద్ధతో పారాయణ చేస్తే అహంకారం తొలగుతుంది అని పెద్దల వ్యాఖ్యానం

మొత్తం ఇంద్రియాలకు పరమాత్మ అవయవమే మూలం. ఇంద్రియమూ, దాని శక్తి, దాని కర్మ, దాని అధిష్టానం తెలుసుకోవాలి. మనకి ఇంద్రియాలు వేరు ఇంద్రియ అధిష్టానములు వేరు. కన్నుని అక్షి అంటాం.  అందులో చూచే శక్తిని ఇంద్రియం అంటాం. కళ్ళలో కనిపించే శక్తిని ఇంద్రియం (కృష్ణతార అగ్రవర్తి - నల్లకన్ను చివరలో ఉంటుంది), కన్ను అధిష్టానం.  మన
ఒక్కొక్క ఇంద్రియానికి పరమాత్మ యొక్క ఒక్కో అధిష్టాంలో ఆ శక్తులున్నాయి.  పురుష సూక్తానికీ మంత్ర పుష్పానికీ అర్థం చెప్పే అధ్యాయం ఇది. ఇదంతా పురుషసూక్త మంత్ర పుష్పానికి వివరణ.
పరమాత్మ ప్రపంచం లోపలా బయటా ఉంటాడు. అయినా ఆయనకు ఇవేమీ అంటవు. ఎందుచేతనంటే ఆయన మహిమ చేత. అదే అచింత్యం (ఇంద్రియాలకు అందేది చింత్యం - కన్ను ముక్కు నాలుక మనసు బుద్ధి...వీటికి అందేది). అచింత్యమైన విషయాలకు తర్కం హేతుభావంతో అన్వయించలేము. అగ్నికే ఎందుకు కాల్చే స్వభావం అనేది హేతుభావ పరిధిలోకి రాదు. అన్నం తింటే కడుపు నిండుతుంది అనడానికి కారణమూ కార్యమూ ఉంది. కాని ఈ రెండూ లేనివి హేతువాదానికి అందదు.

బ్రహ్మోవాచ
వాచాం వహ్నేర్ముఖం క్షేత్రం ఛన్దసాం సప్త ధాతవః
హవ్యకవ్యామృతాన్నానాం జిహ్వా సర్వరసస్య చ

పరమాత్మ యొక్క ముఖంలో (నోరు) ఒక ఇంద్రియం ఉంటుంది ఒక దేవత ఉంటాడు: ఆ ముఖాధిష్టాన దేవత అగ్ని. వాక్కు అగ్ని , ఈ రెండూ ముఖంలో ఉద్భవించాయి
మనకి సత ధాతువులు ఉంటాయి. త్వక్ మాంసం రక్తం మేధ అస్తి మధ్య స్నాయు, ఈ ఏడూ సప్త ధాతువులు. ఇవి
సప్త చందస్సులకు నిలయం (గాయత్రీ, ఉష్ణిక్, అనుష్టుప్, త్రిష్టుప్, మహతి...ఉదాహరణకు రామాయణం అనుష్టుప్ చంద:)
పరమాత్మ నాలుక - సర్వ రసాలకు అదే నిలయం. వాటిలో హవ్యం (హోమ ద్రవ్యం - దేవతల
 అన్నం) కవ్యం(పితృదేవతల అన్నం) అమృతం అన్నం - ఈ నలిగింటివలన వచ్చే సర్వ
రసాలకు మూలం

సర్వాసూనాం చ వాయోశ్చ తన్నాసే పరమాయణే
అశ్వినోరోషధీనాం చ ఘ్రాణో మోదప్రమోదయోః

అన్ని రకముల ప్రాణములకు - ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన నాగ కూరం క్రకర దేవదత్త ధనంజయ.  మనం నోరు తెరిచినపుడు నోటినుండి వచ్చే వాయువు పేరు నాగం. కనులు తెరుస్తున్నపుడు వచ్చే వాయువు కూర్మ వాయువు. తుమ్మినపుడు వచ్చే వాయువు క్రకరం. ఆవలించినపుడు వచ్చేది దేవదత్తం. చైనిపోయినా కూడా వదిలిపెట్టని వాయువు ధనంజయం. అన్నీ ప్రాణములకూ వాయువులకూ కూడా పరమాత్మ నాసిక ఆధారం. అశ్వినీ దేవతలూ ఔషధులూ (ఔషధం అంటే ఒకే కానుపుతో ముగిసేవి ఔషధులు సకృత్ ప్రసూతా ఔషధి , అరటి, వరి గోధుమ. ఒక కానుపే ఇచ్చి విరమిస్తుంది. అందుకే రామయణంలో జటాయువు సీతమ్మ గురించి 'యాం ఔషధిమివ ఆయుష్మన్ ...' ఔషధిలాంటి సీతమ్మను (లేదా ఏ సీతమ్మను ఔషధిలాగ వెతుకుతున్నవో), సీతమ్మ కూడా ఒకే కనుపుతో అవతారాన్ని చాలించింది. ).
అశ్వనీ దేవతలకూ ఔషధులకూ నివాసం ఘ్రాణ: ఇక్కడ నాసిక అంటే అధిష్టానం, ఇంద్రియం కాదు. ఘ్రాణం ఇంద్రియం, ముక్కు దానికి ఆధారం. మోద ప్రమోదములకు కూడా ఘ్రానేంద్రియమే ఆధారం. అనుకూలస్య వస్తు దర్శనా జన్యమైన దాన్ని మోదం అంటారు. ఆ అనుకూల వస్తువులో స్వీయత్వ బుద్ధి ప్రమోదం. మనకు నచ్చినది మనదైతే కలిగేది ప్రమోదం. ఒక వస్తువును చూచుట, ఆ వస్త్
ఉవు మనకు నచ్చుట (మోదం), ఆ నచ్చిన వస్తువు మనదే అనుకొనుట (ప్రమోదం), మనదే అనుకొని దాన్ని అనుభవించుట (ఆనందం).
పరమాత్మ యొక్క ఘ్రాణ ఇంద్రియము అశ్వనీ దేవతలకూ ఔషధులకూ మోద ప్రమోదములకూ నిలయము

రూపాణాం తేజసాం చక్షుర్దివః సూర్యస్య చాక్షిణీ
కర్ణౌ దిశాం చ తీర్థానాం శ్రోత్రమాకాశశబ్దయోః
తద్గాత్రం వస్తుసారాణాం సౌభగస్య చ భాజనమ్

అన్ని రూపములకూ తేజస్సుకూ (పరమాత్మ యొక్క ) చక్సురింద్రియం ఆధారం. పరమాత్మ అక్షి  (గోళం) స్వర్గమునకూ ఆకాశానికీ. అంటే ఆకాశం సూర్యుడు పరమాత్మ కన్ను. తేజస్సు, రూపం పరమాత్మ ఇంద్రియం. పరాంత్మ కన్ను (గోలం) స్వర్గం లేద ఆకాశనికీ , సూర్యునికీ. దానికి మూలం అక్షిణీ.
ఒకటి అవయవం (అధిష్టానం), మరొకటి ఇంద్రియం (అధిష్టేయం) . కన్ను అవయవం చక్షువు ఇంద్రియం. నాసిక అవయవం, ఘ్రాణ ఇంద్రియం. శ్రోత్రం ఇంద్రియం, కర్ణం అవయవం.

అలాగే చెవులు అన్ని దిక్కులకూ అన్నీ తీర్థములకూ నిలయం. (మనం పాలు గానీ నీళ్ళు గానీ చెంబుతో పుచ్చుకున్నా, ఎత్తిపెట్టుకు తాగినా, మన చేతికీ చెంబుకూ, చెంబుకూ నీటికీ, నీటికీ నోటికీ స్పర్శ ఉండటం వలన, అది ఎంగిలి కిందే భావించి మన చేయి కడుక్కోవాలి. ఒక వేళ అక్కడ కడుక్కొనే అవకాశం లేకపోతే దక్షిణ కర్ణం స్పృష్ట్వా -  కుడిచెవిని స్పృశించమంటారు. అందులో అన్ని తీర్థాలు ఉంటాయి. అందుకే రోగికి దక్షిణ చెవి ముట్టుకుంటే స్నానం చేసినట్లు అవుతుంది. రుగ్న: దక్షిణ కర్ణం స్పృశేత్. వీరమిశ్రోదయం అనే గ్రంధంలో ఈ వివరాలన్నీ ఉంటాయి)
శబ్దమూ ఆకాశమూ పరమాత్మ శ్రోత్ర ఇంద్రియంలో ఉంటుంది.
సకల వస్తు సారం పరమాత్మ గాత్రంలో  (శరీరం) ఉంటుంది. అన్ని అందాలకూ మూలం ఆయన శరీరం.

త్వగస్య స్పర్శవాయోశ్చ సర్వమేధస్య చైవ హి
రోమాణ్యుద్భిజ్జజాతీనాం యైర్వా యజ్ఞస్తు సమ్భృతః

పరమాత్మ త్వగ్ ఇంద్రియం (ఈ త్వగ్ ఇంద్రియం ఎక్కడుంది ? చక్షురింద్రియం అంటే నల్లగుడ్డు చివరలో ఉంటుంది, నాసిక చివరలో ఘ్రానేంద్రియం, నాలుక చివరలో రసనేంద్రియం వాగేంద్రియం, చెవిలోపల చష్కుళిలో శ్రోత్రేంద్రియం ఉంటాయి. మరి త్వగ్ ఇంద్రియం ఎక్కడుంటుంది ? నఖం నుండి శరీరం వరకూ సర్వ శరీర వర్తి అంటారు. ). స్పర్శ గ్రాహకమైన త్వగ్ సర్వ శరీర వర్తి. అన్ని యజ్ఞ్యములూ పరమాత్మ శరీరంలోనే అర్పించబడతాయి. అన్ని యజ్ఞ్యాలకూ పూజలకూ మూలం అదే. మనం ప్రాణాయ స్వాహా అనే స్వాహాకారంతో తినే ఆహారం కూడా ఆయనకే వెళ్తుంది. అందుకే తినకూడన్ని తినకూడదు, చూడకూడని దాన్ని చూడకూడదు, వినకూడదు దాన్ని వినకూడదు, ముట్టుకోకూడని దాన్ని ముట్టుకోకూడదు, వెళ్ళకూడని దానికి వెళ్ళకూడదు. భోజనం చేసేప్పుడు కుడివైపు చెంబుపెట్టుకోవాలి. అన్ని ఆరాధనలకీ యజ్ఞ్యములకీ మూలం పరమాత్మ త్వక్ ఇంద్రియం.
పరమాత్మ రోమాలు ఉద్భిజ్జజాతీనాం (భూమిని  చేధించుకుని వచ్చేవి, మొక్కలు చెట్లు). ఆయన రోమాలు వీటికి మూలం. ఆ రోమాలు యజ్ఞ్యానికి మూలం (యైర్వా యజ్ఞస్తు సమ్భృతః).

కేశశ్మశ్రునఖాన్యస్య శిలాలోహాభ్రవిద్యుతామ్
బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమకర్మణామ్

పరమాత్మ నఖములు అన్ని శిలలకూ మూలము. పరమాత్మ మీసములూ గడ్డములు (శ్మశ్రు )అన్ని లోహములకూ మూలము. (అందుకే కొన్ని లోహములు కొన్ని పనులకి పనికిరావు. ఇనుముతో చేసినవి పరమాత్మ ద్రవ్యాలు పెట్టడానికి పనికిరావు. శిలాలోహాభ్రవిద్యుతామ్ - అభ్రం అంటే మేఘం, విద్యుత్ అంటే మెరుపు. మేఘములకూ మెరుపులకూ కేశములు మూలము. శ్మశ్రుకు లోహములూ. శిలలకు మూలం నఖములు. లోహములకు మూలం శ్మశ్రువులూ, మేఘమూ మెరుపులకు మూలం కేశములూ.
బాహువులు లోకపాలకులకు నిలయాలు. పరమాత్మ బాహువులే అన్ని లోకాలనూ కాపాడతాయి.

విక్రమో భూర్భువః స్వశ్చ క్షేమస్య శరణస్య చ
సర్వకామవరస్యాపి హరేశ్చరణ ఆస్పదమ్

పరమాత్మ కదలిక, పాదములు (వి అంటే పాదములు, క్రమ: అంటే అడుగు వేయుట), ఆయన గమనం భూ: భువ: స్వ:. అందుకే ఆయనను త్రివిక్రముడు అంటారు. పరమాత్మ పాదములే సకల రక్షణకు మూలం, సకల లోకానికి ఆధారం (శరణం)
చరణం అనేది ఇక్కడ ఇంద్రియం. ఈ చరణం మనకి కావలసిన అన్ని కోరికలనూ ఇచ్చేది (శ్రీమన్నారాయణ చరణఊ శరణం ప్రపద్యే - ద్వయ మంత్రం)

అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః
పుంసః శిశ్న ఉపస్థస్తు ప్రజాత్యానన్దనిర్వృతేః

ఆప (జలం), వీర్యం (రేతస్సు), సర్గ (సృష్టి), పర్జన్యుడు (వర్షాధిపతి), ప్రజాపతి (బ్రహ్మ) - ఈ ఐదింటికీ పురుషుని శిశ్న భాగం ఆధారం. ఆ శిశ్నంలో ఉండే ఇంద్రియం ఉపస్థ. సంతానమునకూ, ) వ్ర్తితృప్తికీ  (నిర్మూలం ఉపస్థ

పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద
హింసాయా నిరృతేర్మృత్యోర్నిరయస్య గుదం స్మృతః

యముడు మిత్రుడు విసర్జనానికి మూలం పరమాత్మ పాయువు. మలవిసర్జన ఇంద్రియానికి పాయువు అని పేరు. ఆ అవయవం హింసకూ
బ్రాహ్మే ముహూర్తే ఉద్ధాయ మైత్రం కర్మ సమాచరేత్ అంటారు. మైత్రం కర్మ అంటే మల విసర్జనం. మనకి ఆరోగ్యాన్ని కలిగించేది కాబట్టి మిత్రుడు.
రోగానికి ఆరు కారణాలు: అత్యంబు పానాత్ - ఎక్కువ నీరు త్రాగడం, అతి మైధునాచ్చ - ఎక్కువ స్త్రీ సంగం, ఉద్బంధనాత్ మూత్ర పురీషయోచ్చ - మూత్రాన్ని మలాన్ని ఆపుకోవడం, దివాత్ స్వపాత్ - పగలు నిద్ర, జాగరణాచ్చ రాత్రే - రాత్రి మెలుకువగా ఉండుట)
ఆ అవయవమే మనకు నిర్వృతీ మృత్యువు నరకం - వీటికి నిలయం.

పరాభూతేరధర్మస్య తమసశ్చాపి పశ్చిమః
నాడ్యో నదనదీనాం చ గోత్రాణామస్థిసంహతిః

పరాభూతి - దారిద్ర్యం, అధర్మం, చీకటి (లేదా అజ్ఞ్యాన) వీటికి పరమాత్మ పశ్చిమ (వీపు) నిలయం. నదములకు నదులకూ నరాలు మూలము. పర్వతములకు మూలం పరమాత్మ అస్థి (ఎముకలు) మూలము.

అవ్యక్తరససిన్ధూనాం భూతానాం నిధనస్య చ
ఉదరం విదితం పుంసో హృదయం మనసః పదమ్

అవ్యక్తం - ప్రకృతికీ రసములకూ సముద్రములకూ అన్ని ప్రాణముల మృత్యువులకూ మూలం పరమాత్మ ఉదరం. పరమాత్మ హృదయం మనసుకు నివాసం.

ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణాం భవస్య చ
విజ్ఞానస్య చ సత్త్వస్య పరస్యాత్మా పరాయణమ్

పరమాత్మ అంత: కరణం ధర్మానికి నాకు (బ్రహ్మకూ), నీకు (నారదునికీ) కుమారులకీ (సనకాదులకీ) శంకరౌనికీ, అన్ని విజ్ఞ్యానములకూ బలములకూ ఆధారం

అహం భవాన్భవశ్చైవ త ఇమే మునయోऽగ్రజాః
సురాసురనరా నాగాః ఖగా మృగసరీసృపాః
గన్ధర్వాప్సరసో యక్షా రక్షోభూతగణోరగాః
పశవః పితరః సిద్ధా విద్యాధ్రాశ్చారణా ద్రుమాః
అన్యే చ వివిధా జీవాజలస్థలనభౌకసః
గ్రహర్క్షకేతవస్తారాస్తడితః స్తనయిత్నవః

నేనూ నీవు మునులూ శంకరుడూ గంధర్వులూ, నీటిలో భూమిలో ఆకాశంలో ఉండేవారు, మెరుపులూ మేఘములూ అన్ని ఆయనే

సర్వం పురుష ఏవేదం భూతం భవ్యం భవచ్చ యత్
తేనేదమావృతం విశ్వం వితస్తిమధితిష్ఠతి

జరిగినది జరగబోయేది, సాకారములు నిరాకారములు, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివీ ఇదంతా పరమాత్మే.
పురుష ఏ వేదం సర్వం. వితస్తి - నాభినుంచి పైభాగంలో వితస్తి దూరంలో హృదయం ఉంటుంది. ఆ హృదయంలో అన్ని లోకాలు వ్యాపించి ఉంటాయి.

స్వధిష్ణ్యం ప్రతపన్ప్రాణో బహిశ్చ ప్రతపత్యసౌ
ఏవం విరాజం ప్రతపంస్తపత్యన్తర్బహిః పుమాన్

ఇదంతా ఆయన నివాసమే. ఆయనే లోపలా బయటా ఉండి తపింపచేస్తాడు. హృదయంలో అంతర్యామిగా ఉండి శరీర ఇంద్రియ అవయవాలకి కావల్సిన సర్వ విధ ప్రకాశ జ్ఞ్యాన ఆనదములనిస్తాడు. శరీరం వెలుపల ఉండి ఇంద్రియములకు కావల్సిన విషయములనిస్తాడు. కన్ను ముక్కూ మొదలైనవి బయటనుండే పని చేస్తాయి. రూప రస గంధాలు బయట ఉంటాయి. వీటిని అనుభవించడం వలన వచ్చే ఆనందం లోపల ఉంటుంది. ఇంద్రియములు లోపల, విషయములు బయట ఉంటాయి. బయట ఉన్న విషయముల వలన లోపల ఉన్న ఇంద్రియములకు ఆనదం కలుగుతుంది. పరమాత్మ లోపలా బయటా ఉండి ఆ ఆనందాన్ని అందిస్తాడు. బయట ఉన్నవాటిని గ్రహించి లోపల ఉన్న హృదయానికి అందించి ఆనందం కలిగిస్తాడు.
తన నివసాన్ని లోపలా బయటా ప్రకాశింప్చేస్తాడు. ఇలాంటి విరాట్ పురుషుడూ అంతటా వ్యవహరిస్తాడు

సోऽమృతస్యాభయస్యేశో మర్త్యమన్నం యదత్యగాత్
మహిమైష తతో బ్రహ్మన్పురుషస్య దురత్యయః

ఆ పరమాత్మ మోక్షానికి అభయానికి ఈశ్వరుడు. ఎలాంటి ఆపదా లేని స్థితికి ఆయనే కారణం. ఎవరు ఆయనను శరణ వేదతారో వాడికి భయం ఉండదు. వాడే అమృతాన్ని (మోక్షాన్ని) పొందుతారు. ఈయన మర్త్యం అన్నం యదత్యగాత్ - నశించేటువంటి భోగ్యవస్తువుని వదిలిపెట్టాడు. ఆయన నానవాప్తం అవాప్తవ్యం. ఆయన పొందేదీ కోరేదీ ఏదీ లేదు. అన్నీ ఆయనవే ఐనపుడు (అవయవాలు, ఇంద్రియాలు, అనుభవాలు, సంకల్పాలు) ఆయనకు రుచి ఎందుకు ఉండదు? అదే ఆయన మహిమ. ఇది మనము దాటలేనిది.

పాదేషు సర్వభూతాని పుంసః స్థితిపదో విదుః
అమృతం క్షేమమభయం త్రిమూర్ధ్నోऽధాయి మూర్ధసు

మూడు లోకాలు మూడు స్థానాలు - అమృతం (మోక్షం) క్షేమం (రక్షణ) అభయం (శంకా నివృత్తి). ఈ మూడు ఆయన శిరసు.
నిత్య విభూతి లీలా విభూతి అనే రెండు ఉంటాయి. అనంతకోటి బ్రహ్మానడాలు, మొత్తం పరమాత్మ విభూతలలో నాలుగవ భాగం. మోక్షములో ఇంతకంటే మూడు రెట్లు ఉంటారు (త్రిపాదాస్యమృతం దివి ). అది ఎందుకు మూడు పాదాలు అంటే అక్కడ మోక్షం ఉంది, రక్షణా ఉందీ, అభయం ఉంది. ఈ మూడూ ఉన్నది ఒక భాగం (నిత్య విభూతి), అది లేనిది ఇంకోభాగం (లీలా విభూతి - సమస్త లోకాలు)
పురుష సూక్త పాదం - ఏతావాన స్య మహిమా ఆతో జ్యాయాగ్ శ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని, త్రిపాద స్యా మృతం దివి.
లీలావిభూతిలో ప్రాణులు ఒక భాగమే (పాద). మిగతా మూడు అమృతం క్షేమమభయం

పాదాస్త్రయో బహిశ్చాసన్నప్రజానాం య ఆశ్రమాః
అన్తస్త్రిలోక్యాస్త్వపరో గృహమేధోऽబృహద్వ్రతః

పాదాస్త్రయో బహి - మిగతా మూడు ప్రాణాలు పుట్టుకలేని వారికి (అప్రజానాం య ఆశ్రమాః). గృహమేధులంతా ప్రకృతిని ఆరాధించేవారు -అబృహద్వ్రతః (అనిత్యమైన ధర్మం ఆచరించే వారు). లీలావిభూతులలో ఉండేవారు గృహమేధులు, సాంసారిక విషయభోగాలను ఆశించేవారు, అనిత్య ఫలాన్ని కోరేవారు

సృతీ విచక్రమే విశ్వమ్సాశనానశనే ఉభే
యదవిద్యా చ విద్యా చ పురుషస్తూభయాశ్రయః

మనకి రెండు మార్గాలు చెప్పాడు పరమాత్మ. ఒకటి అశన మార్గం అనశన మార్గం - సకామ, నిష్కామ కర్మలు. ఇవే ధూమ మార్గం అర్చి మార్గం అని కూడా అనొచ్చు. అశనార్థి అంటే భోగపరుడు, ఫలాకాంక్ష కలిగి ఉండేవాడు. నారయణ సమర్పయామి అనడం అనశన మార్గం
దీనికే అవిద్యా అని విద్యా అనీ పేరు. అవిద్య కమ్మిన వారు కామ్య కర్మలనాచరిస్తారు. విద్య ఉన్నవారు నిష్కామ కర్మలనాశ్రయిస్తారు. జీవులు ఉభయాశ్రయులు. కొందరు అశనపరులు, కొందరు అనశనపరులు.

యస్మాదణ్డం విరాడ్జజ్ఞే భూతేన్ద్రియగుణాత్మకః
తద్ద్రవ్యమత్యగాద్విశ్వం గోభిః సూర్య ఇవాతపన్

ఎందుకిలా అయ్యింది అంటే? ఇదంతా ఆయన సృష్టే కదా. విద్యా అవిద్యా రెండూ ఆయన నుంచే పుట్టాయి. రెండూ ఆయన స్వరూపాలే. పరమాత్మ నుండే ఇవన్నీ పుట్టాయి గానీ, ఆయన నుంచి పుట్టిన వీటన్నిటినీ పరమాత్మ దాటాడు, సూర్యుడు తన కిరణములతో అన్ని లోకాలనూ ఆక్రమించినట్లుగా, ఆక్రమించి కూడా ఆ దోషాలు సూర్యునికి అంటనట్లుగా

యదాస్య నాభ్యాన్నలినాదహమాసం మహాత్మనః
నావిదం యజ్ఞసమ్భారాన్పురుషావయవానృతే

పరమాత్మ నాభిపద్మము నుండి నేను (బ్రహ్మగారు) పుట్టాను. ణెను పుట్టినపుడు నాపుట్టుకకు ఎవరు కారణమో వారిని తెలుసుకుని ఆరాధించాలనుకున్నాను. కానీ ఆరాధించడానికి ఆయన అవయవాలు తప్ప మరేమీ కనపడలేదు.

తేషు యజ్ఞస్య పశవః సవనస్పతయః కుశాః
ఇదం చ దేవయజనం కాలశ్చోరుగుణాన్వితః
వస్తూన్యోషధయః స్నేహా రసలోహమృదో జలమ్
ఋచో యజూంషి సామాని చాతుర్హోత్రం చ సత్తమ
నామధేయాని మన్త్రాశ్చ దక్షిణాశ్చ వ్రతాని చ
దేవతానుక్రమః కల్పః సఙ్కల్పస్తన్త్రమేవ చ
గతయో మతయశ్చైవ ప్రాయశ్చిత్తం సమర్పణమ్
పురుషావయవైరేతే సమ్భారాః సమ్భృతా మయా

ఇతి సమ్భృతసమ్భారః పురుషావయవైరహమ్
తమేవ పురుషం యజ్ఞం తేనైవాయజమీశ్వరమ్

ఆ పరమాత్మ అవయములయందే యజ్ఞ్యములకు కావల్సిన దర్భలు దేవేజనం నెయ్యి రసాలు లోహములు మట్టి జలం చాతుర్హోత్రం (ఋతివ్క్కు హోత అధ్వర్యు...) పరమాత్మ పేర్లు కర్మల పేర్లు మంత్రములు దక్షిణ
యజ్ఞ్యానికి కావల్సిన అన్ని సంబారాలు ఆయన అవయములనుండే ఏర్పడ్డాయి. వాటితో ఆయనను ఆరాధించాను
యజ్ఞ్యముతో యజ్ఞ్యపురుషున్ని ఆరాధించడం అంటే ఇదే - యజ్ఞేన యజ్ఞమయజంత దేవా. యజ్ఞ్యపురుషుని వలన పుట్టిన ద్రవ్యములతో యజ్ఞ్యపురుషున్ని అయజంతా (పూజించారు). అందుకే "నేను సంపాదించిన ద్రవ్యముతో పరమాత్మను పూజిస్తున్నాను" అనే భావన సరి కాదు. శరీరం ఇంద్రియాలు బుద్ధి మనసు పూజా ద్రవ్యాలు అన్నీ ఆయన ఇచ్చినవే. ఇదే యజ్ఞేన యజ్ఞమయజంత దేవా. ఆరాధనలో మన కర్తృత్వం భోక్తృత్వం ఉండకూడదు. పరమాత్మ చేతనే పరమాత్మ ఆరాధించబడుతున్నాడు, పురుషసూక్తాన్ని మననం చేసుకోగలిగితే అహంకారం ఉండదు.

తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ
అయజన్వ్యక్తమవ్యక్తం పురుషం సుసమాహితాః

ఆ తరువాత నా సోదరులు తొమ్మిది మంది ఆ యజ్ఞ్యపురుషున్నే ఆరాధించారు. (అంటే పురుష సూక్తంలో "తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||")
యజ్ఞ్యమే యజ్ఞ్యముని ఆరాధిస్తున్నది. దాన్ని చూచే దేవతలు (నవ ప్రజాపతులు) ఆరాధించారు. వ్యక్తం అవ్యక్తం (స్థూల సూక్ష్మ) రూపాన్ని ఆరాధించారు, అంటే ప్రకృతినీ పురుషున్నీ సావధాన చిత్తులై ఆరాధించారు,

తతశ్చ మనవః కాలే ఈజిరే ఋషయోऽపరే
పితరో విబుధా దైత్యా మనుష్యాః క్రతుభిర్విభుమ్

దాని తరువాత అన్ని రకముల ప్రాణులూ ఈ మార్గాన్ని అవలంబించారు. ఇలా క్రతువులతోటి పూజలతోటీ ఆ పరమాత్మను ఆరాధించారు. అతని నుండి వచ్చిన జీవులు, అతనినుండి వచ్చిన లోకములో ఉండి అతని నుండి వచ్చిన ద్రవ్యములతో అతనినే ఆరాధిస్తున్నారు. ప్రపంచం, అన్ని లోకాలు, జీవులూ, ద్రవ్యములూ అన్నీ ఆయననుండే వచ్చాయి. ప్రపంచమంతా ఆయనలో ఉన్నది. పరమాత్మే పరమాత్మలో ఉన్నాడు. ఆయన కానిది ఏదీ లేదు. (ఏకమేవ అద్వితీయం...)

నారాయణే భగవతి తదిదం విశ్వమాహితమ్
గృహీతమాయోరుగుణః సర్గాదావగుణః స్వతః

జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనే ఆరు గుణాలకి భగము అని పేరు. పరమాత్మ సృష్టికి కంటే ముందు సత్వ రజ తమ గుణాలు ఆయనకు లేవు. సృష్టి చేయాలనుకున్నప్పుడు తన మాయ చేత ఆ గుణములను గ్రహించి సకల చరాచర సృష్టినీ సృష్టించాడు. పరమాత్మ సృష్టికి పూర్వం, తరువాతా, ప్రళయకాలంలోనూ కూడా అయనకి ప్రాకృతిక గుణాలు లేవు. ఆయన గుణాలను మాయద్వారా స్వీకరించి సృష్టి జరుపుతాడు,

సృజామి తన్నియుక్తోऽహం హరో హరతి తద్వశః
విశ్వం పురుషరూపేణ పరిపాతి త్రిశక్తిధృక్

ఆయన ఆజ్ఞ్యకి బద్ధుడై, నియోగించబడి సృష్టిస్తున్నను (తన్నియుక్తోऽహం ). శంకరుడు ఇంద్రుడు కూడా ఆయన ఆజ్ఞ్యా బద్ధులే. ఈ పరమాత్మే మూడు శక్తుల రూపంలో సృష్టి స్థితి లయాలను చేస్తాడు.

ఇతి తేऽభిహితం తాత యథేదమనుపృచ్ఛసి
నాన్యద్భగవతః కిఞ్చిద్భావ్యం సదసదాత్మకమ్

నాయనా! నీవడిగిందంతా నేను వివరించాను. పరమాత్మకన్నా భిన్నమైనది సత్ రూపంలో గానీ అసత్ రూపంలో గానీ ఉండటానికి లేదు.

న భారతీ మేऽఙ్గ మృషోపలక్ష్యతే న వై క్వచిన్మే మనసో మృషా గతిః
న మే హృషీకాణి పతన్త్యసత్పథే యన్మే హృదౌత్కణ్ఠ్యవతా ధృతో హరిః

నేను మాట్లాడిన మాట ఎప్పుడూ అబద్దం కాదు, నా సంకల్పం కూడా ఎపుడూ అబద్దం కాదు. నా ఇంద్రియాలు అడ్డదారిలో వెళ్ళవు ఎందుకంటే నేను పరిపూర్ణమైన భక్తితో పరమాత్మను ధారణం చేసాను. పరమాత్మ మీద ఆర్తితో కూడిన భక్తి వలన నా మనసులో అసత్ సంకల్పములు కలుగవూ

సోऽహం సమామ్నాయమయస్తపోమయః ప్రజాపతీనామభివన్దితః పతిః
ఆస్థాయ యోగం నిపుణం సమాహితస్తం నాధ్యగచ్ఛం యత ఆత్మసమ్భవః

ఇలా పరమాత్మను నా హృదయంలో నిలుపుకున్నా కాబట్టి తక్కిన ప్రజాపతులందరు నన్ను ఆరాధిస్తున్నారు, స్వామి నా హృదయంలో ఉండబట్టే అందరూ నన్ను వారాధిస్తున్నారు

నతోऽస్మ్యహం తచ్చరణం భవచ్ఛిదం స్వస్త్యయనం సుమఙ్గలమ్
యో హ్యాత్మమాయావిభవం స్మ పర్యగాద్యథా నభః స్వాన్తమథాపరే కుతః

వీరందరూ చేసే స్తోత్రాల వలన నాలో అహంకారం రాకూడదని నేను రోజూ ఆయన చరణాలనే శరణాన్ని వేదుతూ ఉంటాను. బాగా సేవిచగోరే వారికి సంసారాన్ని తొలగించేవి (సమీయుషాం భవచ్ఛిదం ), అన్ని కళ్యానాలకు ఆయన నివాసం (స్వస్త్యయనం).
పరమాత్మ యొక్క మాయా వైభవంగా గుర్తించాలంటే ఆకాశం తన అంతాన్ని తాను తెలుసుకోలేనట్లు మనం కూడా తెలుసుకోలేము

నాహం న యూయం యదృతాం గతిం విదుర్న వామదేవః కిముతాపరే సురాః
తన్మాయయా మోహితబుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే

పరమాత్మ అసలు స్వరూపం నేను గానీ మీరు గానీ (నారదుడు, సనకాదులు), వామదేవుడు గానీ (ఋషి వామదేవుడు అంటే శివుని అంశ. నా అంతటి వాడు వామదేవుడని స్వామే చెప్పాడు) తెలుసుకోలేరు.
ఆయన మాయచేత మా బుద్ధి ప్రేరేపించబడి ఈ ప్రపంచం మేము సృష్టించామని చెప్పుకుంటాము. అలా అనుకోవడానికి కారణం పరమాత్మ మోహితమైన మాయ,

యస్యావతారకర్మాణి గాయన్తి హ్యస్మదాదయః
న యం విదన్తి తత్త్వేన తస్మై భగవతే నమః

ఎవరి యొక్క అనంతమైన అవతారాలను తత్వములనూ మేము రోజూ గానం చేస్తున్నామో ఆయన ఎవరో మాకు తెలీదు

స ఏష ఆద్యః పురుషః కల్పే కల్పే సృజత్యజః
ఆత్మాత్మన్యాత్మనాత్మానం స సంయచ్ఛతి పాతి చ

ఈ ఆదిపురుషుడే ప్రతీ కల్పంలోనూ సృష్టిస్తాడు, కానీ ఈయనకు పుట్టుకలేదు (అజాయమానో బహుదా విజాయతే), ఈయన ఎప్పుడూ ఉంటాడు. పుట్టినవారి అందరికంటే ముందే ఉంటాడు.
ఆత్మాత్మన్యాత్మనాత్మానం - తాను తనను తనలో తనతో సృష్టిస్తాడు రక్షిస్తాడు సంహరిస్తాడు.

విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్సమ్యగవస్థితమ్
సత్యం పూర్ణమనాద్యన్తం నిర్గుణం నిత్యమద్వయమ్

పరమాత్మ అసలు స్వరూపం గుణత్రయరహితం, ఇతర సహకారంతో సంబంధం లేనిది (కేవలం), జ్ఞ్యానమునకు ఎదురు కూడా ఉంటుంది, అజ్ఞ్యానం. దీనికి ఆది అంతము లేదు త్రికాల బధితం కాదు, సత్వాది గుణ రహితం, అద్వయం (తనలాంటి ఇంకో వస్తువు లేనిది)

ఋషే విదన్తి మునయః ప్రశాన్తాత్మేన్ద్రియాశయాః
యదా తదేవాసత్తర్కైస్తిరోధీయేత విప్లుతమ్

ప్రశాంతాత్మ ఇంద్రియములు మనసు హృదయం కలవారు, పరమాత్మ ఇలా ఉంటాడని తెలుసుకుంటారు.
ఈ పరమాత్మ కుతర్కం చేస్తే అందడు. కుతర్కములతో ఆ తత్వం అంతర్థానం చేయబడుతుంది

ఆద్యోऽవతారః పురుషః పరస్య కాలః స్వభావః సదసన్మనశ్చ
ద్రవ్యం వికారో గుణ ఇన్ద్రియాణి విరాట్స్వరాట్స్థాస్ను చరిష్ణు భూమ్నః

బ్రహ్మ, విరాట్ పురుషుడు లేదా హిరణ్య గర్భుడు అనేది పరమాత్మ యొక్క మొదటి అవతారం. మనం ఎన్ని ద్రవ్యములుగా చెప్పుకుంటున్నామో స్వరాట్ విరాట్ అని, ప్రకాశించకుండా ఉన్నవాడు ఒక్క సారి విశేషంగా ప్రకాశించాడు - విరాట్. అలా ప్రకాశించడానికి ఆయనకు ఎమైనా సహరించాయా? లేదు. కాబట్టి ఆయనే స్వరాట్. ఆయనే స్తాస్ను (స్థిరంగా ఉండేవాడు), ఎప్పుడు సంచరించేవాడు. ఆయనే భూమ్న (సర్వ వ్యాపీ). ఆయనే కాల, స్వభావ, సత్, అసత్, మనసు, ద్రయ్వం...

అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశా దక్షాదయో యే భవదాదయశ్చ
స్వర్లోకపాలాః ఖగలోకపాలా నృలోకపాలాస్తలలోకపాలాః

గన్ధర్వవిద్యాధరచారణేశా యే యక్షరక్షోరగనాగనాథాః
యే వా ఋషీణామృషభాః పిత్ణాం దైత్యేన్ద్రసిద్ధేశ్వరదానవేన్ద్రాః
అన్యే చ యే ప్రేతపిశాచభూత కూష్మాణ్డయాదోమృగపక్ష్యధీశాః

యత్కిఞ్చ లోకే భగవన్మహస్వదోజఃసహస్వద్బలవత్క్షమావత్
శ్రీహ్రీవిభూత్యాత్మవదద్భుతార్ణం తత్త్వం పరం రూపవదస్వరూపమ్

నేను (బ్రహ్మ) శంకరుడు యజ్ఞ్యుడు, దక్షాది ప్రజాపతులు, నీలాంటి వారు (నారద, సనకాదులు), స్వర్గ పాలకులు, ఆకాశలోకం వాళ్ళు, నృలోకపాలకులూ, కింద ఉండేవాళ్ళు
ప్రపంచంలో కొద్దిగా ఏది ఉంది అనిపిస్తుందో, ఏది లేదు అనిపిస్తుందో, సర్వమూ ఆయనే. అంతా ఆయన మహిమే ఆయన ఓజస్సే ఆయన వేగం ఆయన బలమే.
శ్రీహ్రీవిభూత్యాత్మవదద్భుతార్ణం తత్త్వం పరం రూపవదస్వరూపమ్ - రూపవత్ గాని, నిరూపం గానీ, గుణవత్ గానీ నిర్గుణంగానీ, క్రియావత్ గానీ నిర్గుణం గానీ శక్తులుగా మహిమలుగా ప్రభావములుగా ఆశ్చర్యకరములుగా ఋషులు దేని నయితే చెప్పుకుంటున్నారో,

ప్రాధాన్యతో యానృష ఆమనన్తి లీలావతారాన్పురుషస్య భూమ్నః
ఆపీయతాం కర్ణకషాయశోషాననుక్రమిష్యే త ఇమాన్సుపేశాన్

పరమాత్మ ఏ ఏ లీలావతారాలను ఋషులు ధ్యానం చేస్తున్నారో , ఆ గానం చేస్తున్న దాన్ని వింటే చెవులకున్న రోగాలు పోతాయి (వినకూడని దాన్ని వినడం ). బాగా అంటుకొని ఉన్న సంస్కారాన్ని కర్మబలాన్ని నేను అతిక్రమిస్తాను. కర్మలు కర్మశేషములు సంస్కారములు వాసన్లు, ఇవన్నీ బంధములు. ఇవన్నీ మనల్ని కట్టేస్తాయి. వీటితో మనల్ని మనం విప్పుకోలేని విధంగా కట్టుకుంటాము, గానీ అవి బంధించి బాధపెట్టినపుడు మనం విప్పుకోలేము, ఆయనే వచ్చి విప్పాలి. అలాంటి బంధంలో నేను చిక్కుకోను.