Pages

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
ఏవమావిష్కృతాశేష గుణకర్మోదయో మునిమ్
సవ్రీడ ఇవ తం సమ్రాడుపారతమువాచ హ

కొంచెం సంకోచించి సిగ్గుపడుతున్నవాడిలా అడగడం ఆపిన ఋషితో ఇలా అన్నాడు

మనురువాచ
బ్రహ్మాసృజత్స్వముఖతో యుష్మానాత్మపరీప్సయా
ఛన్దోమయస్తపోవిద్యా యోగయుక్తానలమ్పటాన్

పరమాత్మ తన స్వస్వరూపాన్ని చూచుకోవడానికి మిమ్ములను తన ముఖము నుండి సృష్టించాడు. సకల వేద స్వరూపుడు పరమాత్మ. బ్రాహ్మణులంటే తపస్సు విద్యా యోగమూ ఉండాలి. అంతకన్నా ముఖ్యముగా లంపటము లేకుండా ఉండాలి. అంటే ఆశలేకుండా ఉండాలి. 

తత్త్రాణాయాసృజచ్చాస్మాన్దోఃసహస్రాత్సహస్రపాత్
హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమఙ్గం ప్రచక్షతే

మిమ్మలని కాపాడటానికి తన వేయిబాహువులనుండి సృష్టించాడు. శరీరం బాగుంటేనే హృదయం బాగుంటుంది.  అలాగే హృదయం బాగుంటేనే శరీరం బాగుంటుంది. ఇలా పరస్పర రక్ష రక్షక భావం ఉంది మనకు

అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మ క్షత్రం చ రక్షతః
రక్షతి స్మావ్యయో దేవః స యః సదసదాత్మకః

ఉన్నట్లూ లేనట్లూ కూడా కనపడే పరమాత్మ మనను కాపాడుతున్నాడు

తవ సన్దర్శనాదేవ చ్ఛిన్నా మే సర్వసంశయాః
యత్స్వయం భగవాన్ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోః

మిమ్మలని దర్శించడం వలన ఉన్న సంశయాలన్నీ తొలగిపోయాయి. మీరే స్వయముగా రక్షించవలసినవాడు ఆచరించ వలసిన ధర్మాన్ని చెప్పారు. 

దిష్ట్యా మే భగవాన్దృష్టో దుర్దర్శో యోऽకృతాత్మనామ్
దిష్ట్యా పాదరజః స్పృష్టం శీర్ష్ణా మే భవతః శివమ్

మీలాంటి వారు మనో నిగ్రహం లేని వారికి కనపడరు. ఎదురుగా ఉన్నా పరిశుద్ధి లేనివారికి కనపడరు.

దిష్ట్యా త్వయానుశిష్టోऽహం కృతశ్చానుగ్రహో మహాన్
అపావృతైః కర్ణరన్ధ్రైర్జుష్టా దిష్ట్యోశతీర్గిరః

మీరు కనపడ్డారు. మిమ్ములని తాకనిచ్చారు. మీ మంగళ కరమైన పాదధూళి మా శిరసు మీద పడింది. మీ మాటలు కూడా విన్నా. కళ్ళూ చెవులూ శరీరమూ పవిత్రమైంది. ధ్యానముతో మనసూ పవిత్రమయ్యింది

స భవాన్దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ
శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే

పుత్రిక యందు ప్రేమతో ఆర్ధ్రమైన మనసు కల నేను చెప్పేది దయతో వినండి. 

ప్రియవ్రతోత్తానపదోః స్వసేయం దుహితా మమ
అన్విచ్ఛతి పతిం యుక్తం వయఃశీలగుణాదిభిః

ప్రియవ్రత ఉత్తానపాదుడనే కుమారులు నాకు గలరు. వారికి చెల్లెలు ఈమె. వయసు శీలము గుణము గల వానిని భర్తగా పొందాలని కోరుకున్నది

యదా తు భవతః శీల శ్రుతరూపవయోగుణాన్
అశృణోన్నారదాదేషా త్వయ్యాసీత్కృతనిశ్చయా

నారద మహర్షి వచ్చి నీ రూప గుణము తపస్సు చెప్పాడు. అది విని నీవు భర్త కావాలని సంకల్పించుకుంది. ఆమెను శ్రద్ధగా అర్పిస్తాను. నీవు స్వీకరించవలసింది

తత్ప్రతీచ్ఛ ద్విజాగ్ర్యేమాం శ్రద్ధయోపహృతాం మయా
సర్వాత్మనానురూపాం తే గృహమేధిషు కర్మసు

గృహస్తాశ్రమము వారు ఆచరించవలసిన కర్మలయందు అనుకూలముగా ప్రవర్తిస్తుంది

ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే
అపి నిర్ముక్తసఙ్గస్య కామరక్తస్య కిం పునః

నీకు ధర్మం చెప్పవలసిన వాడిని కాదు గానీ, ఎంత నిర్ముక్త సంగుడైనా సరే, కొన్ని కొన్ని సందర్భములలో కామోపహతుడవుతాడు. అలాంటి వారికి ప్రతిక్రియగా వివాహము తప్పదు. సంసారము వద్దు అనుకుంటున్నవాడు కూడా కాలవశములో కర్మ వశములో కామాసక్తుడైనపుడు తృప్తి అనేది కామసేవనముతో తప్ప మరొకదానితో లేదు. ముక్త సంగుడికే లేనప్పుడు, వివాహం కావాలి అనుకున్నవాడి గురించి చెప్పేదేముంది. 

య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే
క్షీయతే తద్యశః స్ఫీతం మానశ్చావజ్ఞయా హతః

అన్నం పెట్టడానికి వచ్చినవాడిని తిరస్కరించి రైతు వద్దకు వెళ్ళి వ్యవసాయము చేయై ఆకలేస్తోందని అడిగి ప్రయోజనం లేదు. ఈ తపనతో ఆయాసముతో కీర్తి తరగిపోతుంది. 

అహం త్వాశృణవం విద్వన్వివాహార్థం సముద్యతమ్
అతస్త్వముపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణ మే

నీవు వివాహం చేసుకోవాలనుకుంటున్నావని విన్నాను. నీ కోరిక తీర్చడానికి నీకు ఇచ్చుటకు నిర్ణయించబడిన కన్యను నీకు ఇస్తున్నాను. (ఒకరికి ఇస్తానని అన్న అమ్మాయిని వేరొకరికి ఇవ్వడం వ్యభిచారముతో సమానం. ఇంకొకరికి ఇస్తా అన్న అమ్మయిని వివాహం చేసుకోకూడదు అని శాస్త్రం) 

ఋషిరువాచ
బాఢముద్వోఢుకామోऽహమప్రత్తా చ తవాత్మజా
ఆవయోరనురూపోऽసావాద్యో వైవాహికో విధిః

అది విన్న కర్దముడు. "నిజమే,, నేను వివాహం చేసుకోవాలనే అనుకున్నాను. అలాగే నీ పుత్రికను కూడా ఎవరికీ ఇవ్వలేదు. కాబట్టి మా ఇద్దరికీ వివాహం అనురూపమే (యోగ్యమే). ఇది మొదటి వైవాహిక విధి. 

కామః స భూయాన్నరదేవ తేऽస్యాః పుత్ర్యాః సమామ్నాయవిధౌ ప్రతీతః
క ఏవ తే తనయాం నాద్రియేత స్వయైవ కాన్త్యా క్షిపతీమివ శ్రియమ్

తన దివ్య శరీర కాంతితో లక్ష్మీదేవి శొభను ప్రకటిస్తున్నట్లు ఉన్న నీ పుత్రికను ఎవరు చేసుకోరు

యాం హర్మ్యపృష్ఠే క్వణదఙ్ఘ్రిశోభాం విక్రీడతీం కన్దుకవిహ్వలాక్షీమ్
విశ్వావసుర్న్యపతత్స్వాద్విమానాద్విలోక్య సమ్మోహవిమూఢచేతాః

నారదుడు నాకు చెప్పాడు. మిద్దె మీద బంతి ఆడుతూ తిరుగుతున్న మీ అమ్మయిని విమానము నుంచి చూచి విశ్వావసుడు అనే గంధర్వుడు మూర్చపోయాడు.

తాం ప్రార్థయన్తీం లలనాలలామమసేవితశ్రీచరణైరదృష్టామ్
వత్సాం మనోరుచ్చపదః స్వసారం కో నానుమన్యేత బుధోऽభియాతామ్

ఎలా ఐతే నేను మనో నిగ్రహం తపస్సిద్ధి పవిత్ర అంతఃకరణం లేని వారికి కనపడనో, అమ్మవారిని స్వామినీ సేవించని వారికి కనపడదు. అందులో ఉత్తానపాదునికి చెల్లెలు, మనువుకి పుత్రిక అయిన ఈమెను ఎవరు కాదంటారు.

అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్తేజో బిభృయాదాత్మనో మే
అతో ధర్మాన్పారమహంస్యముఖ్యాన్శుక్లప్రోక్తాన్బహు మన్యేऽవిహింస్రాన్

నేను వివాహము చేసుకుంటాను. సంతానము కలిగేంతవరకు మాత్రమే నేను ఆమెను దగ్గర ఉంచుకుంటాను. తరువాత నేను సన్యాసాశ్రమానికి వెళ్తాను. నా తేజస్సుని ధరించేంతవరకూ ఉంటాను. దాని తరువాత పరమహంసలు ఆచరించే పరమాత్మ బోధించే అహింసా ప్రధానమైన ధర్మాలను ఆచరిస్తాను.

యతోऽభవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వావతిష్ఠతే
ప్రజాపతీనాం పతిరేష మహ్యం పరం ప్రమాణం భగవాననన్తః

వివాహం చేసుకున్న వెంటనే కామాసక్తుడనై ప్రవర్తించను. వివాహం తరువాత కూడా యోగి ధర్మాలు ఆచరిస్తాను. పిల్లలు పుట్టాక సన్యాస ధర్మాలు ఆచరిస్తాను. ఈ జగత్తు ఎవరి వల్ల పుట్టిందో, ఉంటుందో,నశిస్తుందో, అలాంటి ప్రజాపతికి (బ్రహ్మ)పతి అయిన భగవంతుని మీదే నా మనసు ఉంటుంది. నాకు పరమ ప్రమాణము పరమాత్మ. నా ఆచరణ అతను బోధించిన ధర్మాలే. నా ప్రవృత్తి అహింసా పరాయణత్వం. 

మైత్రేయ ఉవాచ
స ఉగ్రధన్వన్నియదేవాబభాషే ఆసీచ్చ తూష్ణీమరవిన్దనాభమ్
ధియోపగృహ్ణన్స్మితశోభితేన ముఖేన చేతో లులుభే దేవహూత్యాః

ఆయన ఇంతే మాట్లాడాడు. మాట్లాడి ఊరుకున్నాడు. దేవహూతి మనసును లోభింపచేసే చిరునవ్వుతో ఉన్నాడు. 

సోऽను జ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితుః స్ఫుటమ్
తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః

అతను చెప్పిన మాటను భార్యతో కూడా సంప్రదించి. అలాంటి ఉత్తమ గుణ సంపన్నుడికి శతరూపని ఇచ్చి దానము చేసాడు. 

శతరూపా మహారాజ్ఞీ పారిబర్హాన్మహాధనాన్
దమ్పత్యోః పర్యదాత్ప్రీత్యా భూషావాసః పరిచ్ఛదాన్
ప్రత్తాం దుహితరం సమ్రాట్సదృక్షాయ గతవ్యథః
ఉపగుహ్య చ బాహుభ్యామౌత్కణ్ఠ్యోన్మథితాశయః

ఉభయులకూ వస్త్రములూ ఆభరణములూ కానుకలూ సంపదలూ ఇచ్చి. యోగ్యుడైన వాడికి అమ్మాయిని ఇచ్చాను అని సంతృప్తి చెంది, 

అశక్నువంస్తద్విరహం ముఞ్చన్బాష్పకలాం ముహుః
ఆసిఞ్చదమ్బ వత్సేతి నేత్రోదైర్దుహితుః శిఖాః

ఎడబాటును సహించలేక, ఆమె శిరస్సును కన్నీళ్ళతో తడిపారు.

ఆమన్త్ర్య తం మునివరమనుజ్ఞాతః సహానుగః
ప్రతస్థే రథమారుహ్య సభార్యః స్వపురం నృపః

ఇలా వివాహం పూర్తి చేసి రాజు తన భార్యతో నగరానికి చేరాడు. 

ఉభయోరృషికుల్యాయాః సరస్వత్యాః సురోధసోః
ఋషీణాముపశాన్తానాం పశ్యన్నాశ్రమసమ్పదః

దారిలో కనపడుతున్న అనేక ఋషులు ఆశ్రమాలను సేవిస్తూ ఉన్నాడు

తమాయాన్తమభిప్రేత్య బ్రహ్మావర్తాత్ప్రజాః పతిమ్
గీతసంస్తుతివాదిత్రైః ప్రత్యుదీయుః ప్రహర్షితాః

మళ్ళీ నగరానికి వస్తున్న రాజుని ప్రజలు గీత వాద్యాలతో బ్రహ్మావర్త రాజ్య రాజధాని అయిన బర్హిష్మతికి ఆహ్వానించారు. వరాహ అవతారములో రోమములు అక్కడ పడ్డాయి కాబట్టి దానికి బర్హిష్మతి పేరు వచ్చింది

బర్హిష్మతీ నామ పురీ సర్వసమ్పత్సమన్వితా
న్యపతన్యత్ర రోమాణి యజ్ఞస్యాఙ్గం విధున్వతః

కుశాః కాశాస్త ఏవాసన్శశ్వద్ధరితవర్చసః
ఋషయో యైః పరాభావ్య యజ్ఞఘ్నాన్యజ్ఞమీజిరే

అవే ఆకుపచ్చరంగులో కుశములుగా పెరిగాయి.ఈ దర్భలతోటే ఋషులు యజ్ఞ్యములకు ఆటంకం కలిగించే రాక్షసులను పారద్రోలారు

కుశకాశమయం బర్హిరాస్తీర్య భగవాన్మనుః
అయజద్యజ్ఞపురుషం లబ్ధా స్థానం యతో భువమ్

బర్హిష్మతీం నామ విభుర్యాం నిర్విశ్య సమావసత్
తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయవినాశనమ్

అలాంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆ మహరాజు పరిపాలిస్తున్నాడు. తాపత్రయ వినాశనమైన రాజభవనములో ప్రవేశించాడు.

సభార్యః సప్రజః కామాన్బుభుజేऽన్యావిరోధతః
సఙ్గీయమానసత్కీర్తిః సస్త్రీభిః సురగాయకైః
ప్రత్యూషేష్వనుబద్ధేన హృదా శృణ్వన్హరేః కథాః

భార్యతో సంతానముతో కలిసి అన్ని కామ భోగాలను ఇతరులకు (ఇతరములకు) విరోధము కాకుండా సేవించాడు (గీతలో చెప్పినట్లు సకల ప్రాణులలో ధర్మానికి విరోధము కాని కామము నేను అని స్వామి అన్నాడు. ధరమార్ధ మోక్షములకు విరోధం కాని విధముగా కామాన్ని అనుభవించాడు). దేవతా స్త్రీలు గానము చేస్తూ నాట్యము చేస్తున్నాడు. ప్రతీ ప్రాతః కాలం సాయం కాలం పరమాత్మ కథలను వింటూ ఆ నృత్య గీతాలను అనుభవించాడు. ప్రత్యూష అంటే ప్రాతః కాలానికి ముందు వచ్చేది, ఉషః కాలం. ఈ రెండు సంధ్యలలో పరమాత్మ కథలు వింటూ మిగతా పురుషార్ధాలను ధర్మబద్ధముగా సేవించాడు 

నిష్ణాతం యోగమాయాసు మునిం స్వాయమ్భువం మనుమ్
యదాభ్రంశయితుం భోగా న శేకుర్భగవత్పరమ్

మనువు యోగములో నిష్ణాతుడు. ఈ మనువుకు ఉజ్జ్వలమైన భోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా పరమాత్మ యందు ఉన్న మనసును తప్పించలేకపోయాయి. 

అయాతయామాస్తస్యాసన్యామాః స్వాన్తరయాపనాః
శృణ్వతో ధ్యాయతో విష్ణోః కుర్వతో బ్రువతః కథాః

ప్రతీ యామము (ఝామూ) గడిచిపోలేదు (అయాత). రెండవ ఝాము వచ్చినపుడు మొదటి ఝామును మరచిపోతే గడిచిపోయినట్టు. భగవంతుని గుణమూ గానము ధ్యానమూ ఆరాధనా లేకుండా ఏ క్షణమూ గడపలేదు. అందుకు ఆయనకు ఒకే కాలం ఉన్నట్లు ఉంది. 

స ఏవం స్వాన్తరం నిన్యే యుగానామేకసప్తతిమ్
వాసుదేవప్రసఙ్గేన పరిభూతగతిత్రయః

డెబ్బై యొక్క మహాయుగాలు ఒక మన్వంతరం. ఇలా తన కాలమును గడిపాడు. పరమాత్మ కథా వ్యవహారముతో గడిపాడు. గతి త్రయం - ధర్మార్థకామములనే గతులని తప్పించాడు. వాటికి లొంగకుండా వాటిని లొంగదీసుకున్నాడు. 

శారీరా మానసా దివ్యా వైయాసే యే చ మానుషాః
భౌతికాశ్చ కథం క్లేశా బాధన్తే హరిసంశ్రయమ్

శరీర మానసిక దివ్య భావాలు, దైవిక మానసిక భావాలు, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములు అతన్ని ఏ మాత్రం బాధించలేదు

యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్నానావిధాన్ఛుభాన్
నృణాం వర్ణాశ్రమాణాం చ సర్వభూతహితః సదా

అతను ఋషులని సేవించాడు. ఋషులకు కూడా ధర్మాన్ని చెప్పాడు. మనువంటే బ్రహ్మ యొక్క అంశే కాబట్టి అందరికీ ఎన్నో రకాల ధర్మాలని బోధించాడు. మానవ ధరమాలు వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, సకల ప్రాణుల హితమును కోరి చెప్పాడు 

ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతమ్
వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు

ఈ ప్రకారముగా ఆది రాజైన మనువు చరిత్రను , వర్ణించదగిన చరిత్ర అయిన దాన్ని నీకు వివరించాను. ఇప్పుడు వారి సంతానం గురించి విను.