Pages

Wednesday, 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పదమూడవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
నిశమ్య వాచం వదతో మునేః పుణ్యతమాం నృప
భూయః పప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవకథాదృతః

ఇది విదుర మైత్రేయ సంవాదం. కృష్ణభగవానుడు అవతారము చాలించేప్పుడు పక్కన ఉన్న ఉద్దవుడు మైత్రేయులకి కృష్ణుడు శ్రీమద్భాగవతాన్ని చెప్పాడు. అది విన్న ఉద్ధవుడు వస్తుంటే మైత్రేయుడు కలిసాడు. విదురుడు ఆ భాగవతం చెప్పమని అడిగితే ఉద్ధవుడు "నీవు అదృష్టవంతుడివి. నీకు భాగవతం చెప్పమని మైత్రేయున్ని పురమాయించాడు" అని చెప్పగా విదురుడు మైత్రేయుడిని కలిసాడు.
పరమాత్మ కథలయందు ఆసక్తి ఉన్న విదురుడు ఇలా చెబుతున్న మైత్రేయుడి వాక్కు విన్నాక, ఇలా అడిగాడు

విదుర ఉవాచ
స వై స్వాయమ్భువః సమ్రాట్ప్రియః పుత్రః స్వయమ్భువః
ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే

బ్రహ్మనుండి ఉదయించిన స్వాయంభువ మనువు, ప్రియురాలుగా శతరూపని పొంది ఏమి చేసాడు

చరితం తస్య రాజర్షేరాదిరాజస్య సత్తమ
బ్రూహి మే శ్రద్దధానాయ విష్వక్సేనాశ్రయో హ్యసౌ

మొట్టమొదటి రాజైన మనువు, కేవలం రాజే కాకుండా పరమాత్మని ఆశ్రయించిన భక్తుడు

శ్రుతస్య పుంసాం సుచిరశ్రమస్య నన్వఞ్జసా సూరిభిరీడితోऽర్థః
తత్తద్గుణానుశ్రవణం ముకున్ద పాదారవిన్దం హృదయేషు యేషామ్

ఇది సిద్ధాంత వాక్యం. మానవుడెంతో కష్టపడి సంపాదించిన శాస్త్రమునకు పరమప్రయోజనమేమిటో పండితులు చెప్పారు. ఎవరి హృదయములో పరమాత్మ యొక్క పాదారవిందములు ఉన్నాయో, వారి గుణములను వినుటే, ఎంతో కష్ట్పడి సంపాదించుకున్న శాస్త్ర జ్ఞ్యానానికి ప్రయోజనమని పండితులు చెప్పారు. ఉదంకుడు అరవైరెండు సంవత్సరాలు గురువు దగ్గరే ఉన్నాడు. ఇంత శ్రమపడి సంపాదించిన జ్ఞ్యానానికి పరమాత్మ పాదాలను తమ హ్ర్దయములో నిలుపుకున్నవారి కథలు వినుటే ప్రయోజనం. పాండిత్యము భగవత్కథా శ్రవణమందు రుచి పుట్టించడానికే తప్ప డబ్బు సంపాదించడానికో అహంకారం మదం పెంచడానికో పేరు సంపాదించడానికో కాదు. గురువారిని సేవించినా, గ్రంధాలు చదివినా, శాస్త్రమభ్యసించినా, జ్ఞ్యానం సంపాదించినా, పాండిత్యం వచ్చినా, భక్తుల కథలు వినుటే ప్రయోజనం. మనసులో అహంకారం మమకారం అసూయ ఈర్ష్యా వారి కథలు వింటే పోతాయి.

శ్రీశుక ఉవాచ
ఇతి బ్రువాణం విదురం వినీతం సహస్రశీర్ష్ణశ్చరణోపధానమ్
ప్రహృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట

ఇలా పలికిన వినయశీలుడైన, పరమాత్మ యందు పాదముల యందు ఉండే, విదురుని మాట విని, పరమాత్మ కథలయందు ప్రేరేపించబడిన మైత్రేయుడు పులకించిపోయాడు.

మైత్రేయ ఉవాచ
యదా స్వభార్యయా సార్ధం జాతః స్వాయమ్భువో మనుః
ప్రాఞ్జలిః ప్రణతశ్చేదం వేదగర్భమభాషత

భార్యతో కలిసి పుట్టిన స్వాయంభువ మనువు  (ప్రతీ వాడు తన దాంపత్య  భాగస్వామితో కలిపే పుడతాడు) చేతులు జోడించి బ్రహ్మతో ఇలా మాట్లాడాడు

త్వమేకః సర్వభూతానాం జన్మకృద్వృత్తిదః పితా
తథాపి నః ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్

సకల ప్రాణులనీ సృష్టించిన వారు, పోషించేవారూ మీరే. (తండ్రి శరీరాన్ని రోగాలు లేకుండా, మనసునీ అధర్మ సంకల్పాలు కలగకుండా, బుద్ధినీ దుష్ట ఆలోచచనలు రాకుండా కూడా పోషించాలి) . పుట్టిన మేము మీకు సేవించకుంటే మాకు సార్ధక్యము లేదు. (పెద్దలను (తల్లి తండ్రులను) సేవించుట పెద్దల కొరకు కాదు, మన కొరకే. మన సార్ధక్యం కొరకే). ఏమి చేస్తే మీ సేవ అవుతుందో చెప్పండి.

తద్విధేహి నమస్తుభ్యం కర్మస్వీడ్యాత్మశక్తిషు
యత్కృత్వేహ యశో విష్వగముత్ర చ భవేద్గతిః

నీకు నమస్కారము. స్తోత్రము చేయదగిన విశిష్టమైన ప్రభావము కల మీ సేవకు సంబంధించిన కర్మలలో మమ్ములను నియమించండి. ఏ పనికి నియమించినా, ఆ పని మీ అనంత గుణాలని స్తోత్రం చేసేలా ఉండాలి. అలాంటి పని చేయడం వలన మాకు కూడా కీర్తి వస్తుంది ఇహలోకములో పరలోకములో కూడా ఒకే రకమైన కీర్తి రావాలి. అలాంటి పని చెప్పాలి మీరు.

బ్రహ్మోవాచ
ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తి స్తాద్వాం క్షితీశ్వర
యన్నిర్వ్యలీకేన హృదా శాధి మేత్యాత్మనార్పితమ్

నాయనా, భూపతీ ( భూపతీ అని పిలవడంతో ఏమి అడగాలో సూచిస్తున్నట్లు ఉంది. అప్పటికి భూమి నీటిలో ఉంది), మీ మాటలకు సంతోషించాను. మీ ఇద్దరికీ శుభము కలుగుతుంది. నాకు నిన్ను నీవు అర్పించుకున్నావు కపటములేని హృదయముతో.

ఏతావత్యాత్మజైర్వీర కార్యా హ్యపచితిర్గురౌ
శక్త్యాప్రమత్తైర్గృహ్యేత సాదరం గతమత్సరైః

తండ్రులకు పుత్రులు ఈ మాత్రం సేవ చేయాలి. తండ్రి చెప్పిన మాటను ఆదరముతో మాత్సర్యము లేకుండా స్వీకరించాలి. తండ్రి చెప్పిన మాటను వినడమే ధర్మము.

స త్వమస్యామపత్యాని సదృశాన్యాత్మనో గుణైః
ఉత్పాద్య శాస ధర్మేణ గాం యజ్ఞైః పురుషం యజ

నీ భార్య యందు నీతో సమానమైన గుణములు గల సంతానమును పొందాలి, భూమిని ధర్మబద్దంగా పాలించాలి. పరమాత్మను యజ్ఞ్యములతో ఆరాధించాలి, పూజించాలి.

పరం శుశ్రూషణం మహ్యం స్యాత్ప్రజారక్షయా నృప
భగవాంస్తే ప్రజాభర్తుర్హృషీకేశోऽనుతుష్యతి

ఈ మూటిలో కూడా ధర్మ బద్దముగా ప్రజలను పరిపాలించడమే నా యొక్క ఉత్తమమైన సేవ (తోటి వారిని పూజిస్తే బ్రహ్మను ఆరాధించినట్లే, అందుకే బ్రహ్మకు ప్రత్యేకమైన దేవాలయము లేదు).

యేషాం న తుష్టో భగవాన్యజ్ఞలిఙ్గో జనార్దనః
తేషాం శ్రమో హ్యపార్థాయ యదాత్మా నాదృతః స్వయమ్

నా ప్రీతే కాదు, ప్రజలను బాగా పరిపాలిస్తే భగవానుడైన శ్రీమన్నారాయణుడు ప్రజా రక్షా, ధర్మ రక్షా చేస్తే సంతోషిస్తాడు. ఎవరు చేసిన కర్మల వలన యజ్ఞ్యరూపుడైన పరమాత్మ సంతోషించడో, అలాంటి వారి శ్రమ అంతా వ్యర్ధం. పరమాత్మను సంతోషింపచేయడం ఆదరించడం, అంటే తన ఆత్మను తాను చూచుకోవడమే కదా. భగవంతునికి సంతోషం కలిగించలేదంటే, తన ఆత్మను తాను ఆదరించుకోలేదు. తనను తాను ఆదరించుకోని వాడు చేసే పనులన్నీ వ్యర్థమే.

మనురువాచ
ఆదేశేऽహం భగవతో వర్తేయామీవసూదన
స్థానం త్విహానుజానీహి ప్రజానాం మమ చ ప్రభో

అమీవ + సూదన - సకల పాపములనూ నశింపచేసేవాడా, నేను నీ ఆజ్ఞ్యలోనే ప్రవర్తిస్తాను. మీరు చెప్పిన పనులు చేయాలంటే, నాకూ, ఆ ప్రజలకూ ఉండటానికి ఒక స్థానం ఉండాలి.

యదోకః సర్వభూతానాం మహీ మగ్నా మహామ్భసి
అస్యా ఉద్ధరణే యత్నో దేవ దేవ్యా విధీయతామ్

సకల ప్రాణులకూ ఏది నివాసమో అట్టి భూమి సముద్రములో మునిగి ఉన్నది. ఈ భూదేవిని పైకి తీసుకుని రావడానికి ప్రయత్నించండి. మేము మీ ఆజ్ఞ్యను శిరసా వహిస్తాము.

మైత్రేయ ఉవాచ
పరమేష్ఠీ త్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్య గామ్
కథమేనాం సమున్నేష్య ఇతి దధ్యౌ ధియా చిరమ్

ఈ సముద్రములో దాగి ఉన్న భూమిని నేను ఎలా బయటకు తీయగలనూ అని ధ్యాన నిమగ్నుడయ్యాడు

సృజతో మే క్షితిర్వార్భిః ప్లావ్యమానా రసాం గతా
అథాత్ర కిమనుష్ఠేయమస్మాభిః సర్గయోజితైః
యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతు మే

మొదలు ప్రకృతిలో ఉన్న జలాన్ని సృష్టి ప్రారంభములో పానము చేసాను. భూమ్యాకాశాలను సృష్టించాను. నేను సృష్టిలో ఉండగా ఈ భూమి నీటిలో మునిగి పోయింది. అంటే ఇది నా పని కాదు. నేను ఎవరి హృదయం నుండి వచ్చానో, ఆయన చేయవలసిన పని.

ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్సహసానఘ
వరాహతోకో నిరగాదఙ్గుష్ఠపరిమాణకః

ఇలా బ్రహ్మ పరమాత్మను ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఉండగా, ఆయన ముక్కు రంధ్రమునుండి అంగుష్ఠ ప్రమాణముతో చిన్న వరాహ శిశువు బయట పడ్డాడు

తస్యాభిపశ్యతః ఖస్థః క్షణేన కిల భారత
గజమాత్రః ప్రవవృధే తదద్భుతమభూన్మహత్

ఇలా తన నాసా రంధ్రం నుండి వెలువడిన ఈ చిన్న వరాహాన్ని అందరూ చూస్తుండగా అంగుష్ఠమాత్రుడు కాస్తా ఏనుగంత అయ్యాడు (గజమాత్రుడయ్యాడు). అందరూ ఆశ్చర్యముగా చూచారు.

మరీచిప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ
దృష్ట్వా తత్సౌకరం రూపం తర్కయామాస చిత్రధా

మరీచాదులు, మనువుతో కలిసి ఆ సూకర రూపాన్ని చూచి, పలు విధములుగా ఆలోచించసాగారు, ఊహించసాగారు.

కిమేతత్సూకరవ్యాజం సత్త్వం దివ్యమవస్థితమ్
అహో బతాశ్చర్యమిదం నాసాయా మే వినిఃసృతమ్

ఈ సూకరమనే మిషతో కనపడుతున్న ఈ దివ్యమైన ప్రాణి ఏమయ్యి ఉంటుంది. నా నాసికా రంధ్రమునుండి బయట పడ్డ ఈ శరీరం ఏమై ఉంటుంది.

దృష్టోऽఙ్గుష్ఠశిరోమాత్రః క్షణాద్గణ్డశిలాసమః
అపి స్విద్భగవానేష యజ్ఞో మే ఖేదయన్మనః

వచ్చినపుడు అంగుష్ఠమాత్రముగా ఉండి క్షణములో పర్వత శిల అంతగా పెరిగాడు. కొంచెం ఆలోచిస్తే, నా మనసులో ఉన్న బాధను తొలగించడానికి యజ్ఞ్యుడైన ఆ భగవానుడే వచ్చాడా

ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణః సహ సూనుభిః
భగవాన్యజ్ఞపురుషో జగర్జాగేన్ద్రసన్నిభః

ఇలా బ్రహ్మే కాకుండా, మరీచాదులు కూడా, ఈయన పరమాత్మే అయి ఉంటాడని ఆలోచిస్తూ ఉంటే, ఈ పరమాత్మ ఒక్కసారి పర్వత రాజులాగ, మహా ఏనుగులాగ గర్జించాడు

బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్
స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః

ఆ గర్జన విని అందరూ పరమానందాన్ని పొందారు. బ్రహ్మనూ ఋషులనూ సంతోషింపజేయడానికే ఈయన గర్జించాడు. తన గర్జనతో దిక్కులన్నీ ప్రతిద్వనించాయి

నిశమ్య తే ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణు మాయామయసూకరస్య
జనస్తపఃసత్యనివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయోऽగృణన్స్మ

అది విని, జనోలొకం వారు, తపో లోకం వారు, సత్య లోకము వారు, ఆయా లోకములలో ఉండే మునులు, పవిత్రమైన మూడిటితో (ఋక్ యజు సామ వేదములతో) స్తోత్రం చేసారు.

తేషాం సతాం వేదవితానమూర్తిర్బ్రహ్మావధార్యాత్మగుణానువాదమ్
వినద్య భూయో విబుధోదయాయ గజేన్ద్రలీలో జలమావివేశ

మూడు వేదములతో చేస్తున్న స్తోత్రమును విన్న పరమాత్మ "ఇదంతా సత్యమే " అని సూచించడానికా అన్నట్లు ఇంకోసారి గర్జించి, దేవతలందరకూ ఆనందం కలగడానికి, మనువుకూ బ్రహ్మకూ వృద్ధి కలగడానికి, ఏనుగులాగ సులభముగా నీటిలోకి ప్రవేశించాడు.

ఉత్క్షిప్తవాలః ఖచరః కఠోరః సటా విధున్వన్ఖరరోమశత్వక్
ఖురాహతాభ్రః సితదంష్ట్ర ఈక్షా జ్యోతిర్బభాసే భగవాన్మహీధ్రః

నీటిలోకి వెళుతూ తోకను పైకి ఉంచాడు. ఆ తోక ఆకాశములో సంచరిస్తూ ఉంది. మెడ చుట్టు ఉన్న కేశములను (సటలను) దులిపాడు. అది విదిలించి ఖఠినమైన తీక్షణమైన రోమములూ చర్మమూ కలిగినవాడు, లోపలికి వెళుతూ, ఆకాశములో అడ్డుగా ఉన్న మబ్బులను తన గిట్టలతో కుమ్ముతూ, తెల్లని కోరలు కలిగిన వాడు, భూమిని పైకి తేవడానికి, తన కనులనే వెలుగుతో ప్రకాశించాడు

ఘ్రాణేన పృథ్వ్యాః పదవీం విజిఘ్రన్క్రోడాపదేశః స్వయమధ్వరాఙ్గః
కరాలదంష్ట్రోऽప్యకరాలదృగ్భ్యాముద్వీక్ష్య విప్రాన్గృణతోऽవిశత్కమ్

భూమి యొక్క ప్రధాన లక్షణం గంధము. గంధవతీ పృధివీ. నాసికతో వాసన చూస్తూ వెళ్ళాడు. వరాహమనే మిషతో ఉన్న ఆ స్వామి యజ్ఞ్య మూర్తి. అతని దమ్ష్ట్రలు తీక్షణముగా ఉన్నా, ఆయన చూపు చాలా ప్రసన్నముగా ఉంది. స్తోత్రము చేస్తున్న వారిని ఒక సారి చూపుతో కటాక్షించి, జలములోకి ప్రవేశించాడు

స వజ్రకూటాఙ్గనిపాతవేగ విశీర్ణకుక్షిః స్తనయన్నుదన్వాన్
ఉత్సృష్టదీర్ఘోర్మిభుజైరివార్తశ్చుక్రోశ యజ్ఞేశ్వర పాహి మేతి

వజ్రములా ఉన్న శరీరము సముద్రములోకి దూకగా సముద్రము యొక్క కుక్షి చీలిపోతున్నట్లు కనిపించింది. ఆ బాధను తట్టుకోలేక సముద్రుడు ఘోషించాడు, తరంగములనే చేతులు జాస్తూ ముడుస్తూ ఘోషించాడు. చాలా పొడవైన గొప్ప తరంగములనే భుజములతో చూస్తున్నట్లుగా ఆర్తితో "యజ్ఞేశా పాహిమాం" అని అరిచాడు

ఖురైః క్షురప్రైర్దరయంస్తదాప ఉత్పారపారం త్రిపరూ రసాయామ్
దదర్శ గాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యధత్త
పాతాలమూలేశ్వరభోగసంహతౌ విన్యస్య పాదౌ పృథివీం చ బిభ్రతః
యస్యోపమానో న బభూవ సోऽచ్యుతో మమాస్తు మాఙ్గల్యవివృద్ధయే హరిః

అలా స్వామి పాతాళము వరకూ చాకులాంటి గిట్టలతో చీలుస్తూ పాతాళ లోకములో భూమిని చూచాడు. నీటిలోపల ఎక్కడో పడుకుని ఉన్న జీవధాని (జీవులకి నివాసమైన) అయిన భూమిని చూచాడు. చూచి తానే ఆమెను చేరాడు. పాతాళమునుండి భూమిని కోరలతో తీసుకుని పైకి లేచాడు.

స్వదంష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నాం స ఉత్థితః సంరురుచే రసాయాః
తత్రాపి దైత్యం గదయాపతన్తం సునాభసన్దీపితతీవ్రమన్యుః
జఘాన రున్ధానమసహ్యవిక్రమం స లీలయేభం మృగరాడివామ్భసి
తద్రక్తపఙ్కాఙ్కితగణ్డతుణ్డో యథా గజేన్ద్రో జగతీం విభిన్దన్

అలా తీసుకు వస్తూ ఉంటే అతని రాకను మొదటి రాక్షసుడు అడ్డుకున్నాడు. అతను గదను తీసుకుని మీదకు వస్తున్నాడు. తన పనికి అడ్డువచ్చిన వాడిని తన చక్రముతో లీలగా ఏనుగుని సిమ్హం అనాయాసముగా చంపినట్లు అతనిని చంపాడు. ఈ రాక్షసుడి రక్తము మూతి భాగానికి అంటిది ఎలా ఐతే ఏనుగు పర్వతాన్ని ఎత్తినపుడు మట్టి అంటినట్లు.

తమాలనీలం సితదన్తకోట్యా క్ష్మాముత్క్షిపన్తం గజలీలయాఙ్గ
ప్రజ్ఞాయ బద్ధాఞ్జలయోऽనువాకైర్విరిఞ్చిముఖ్యా ఉపతస్థురీశమ్

నీలమేఘశ్యాముడైన పరమాత్మ తెల్లని దంతాలకు ఎర్రని రక్తము అంటింది. ఇది చూచి చేతులు జోడించి వేద సూక్తములతో వరాహమూర్తిని స్తోత్రము చేసారు.

ఇది చాలా విశేషమైన స్తోత్రం. ఇది చదివితే చదువు బాగా వస్తుంది. దీనిలో యజ్ఞ్య్నమంటే ఏమిటొ చెబుతారు.

ఋషయ ఊచుః
జితం జితం తేऽజిత యజ్ఞభావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః
యద్రోమగర్తేషు నిలిల్యురద్ధయస్తస్మై నమః కారణసూకరాయ తే

నీవు గెలిచావు, గెలిచావు. నిన్నెవరూ గెలవలేరు. నీవు యజ్ఞ్య రూపుడివి, వేద రూపుడివి. నీవు ఒక ప్రయోజనాన్ని ఆశించి సూకర రూపాన్ని దాల్చిన నీకు నమస్కారం. పరమాత్మ ఏ రూపములో వచ్చినా అమ్మవారితో బాటు వేదాలన్నీ ఆయన శరీరములోనే ఉంటాయి. ఏ రూపములో వచ్చినా ఆయన పరిపూర్ణుడు. యజ్ఞ్యములన్నీ రోమకూప రంధ్రములలో ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయి.

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకమ్
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమస్వాజ్యం దృశి త్వఙ్ఘ్రిషు చాతుర్హోత్రమ్

పరమాత్మా, నీ రూపము పాపము చేసిన వారికి కనపడేది కాదు, చూడ శక్యం కాదు. నీ అనుగ్రహం ఉన్నవారు, పుణ్యాత్ములూ, నిన్ను వరాహముగా కాక, , నిన్ను యజ్ఞ్యముగా చూస్తారు.
నీ చర్మములో వేదములనీ ఇమిడి ఉన్నాయి. నీ రోమములు దర్భలు. నీ నేత్రములలో నేయి ఉంది. నాలుగు పాదములూ చాతుర్హోత్రము (హోత ఉద్గాత అధ్వర్యువు ఋత్విక్ - ఇలా నలుగురితో చేసేది చాతుర్హోత్రం. ).

స్రక్తుణ్డ ఆసీత్స్రువ ఈశ నాసయోరిడోదరే చమసాః కర్ణరన్ధ్రే
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రమ్

నీ మూతి భాగం స్రుక్, నాసికా రంధ్రాలు స్రువము. ఇడా (పాత్ర) ఉదరము. ఆధ్య పాత్ర (చమసాః) కర్ణ రంధ్రములు. సమిధలనూ ధర్భలను పెట్టే స్థానం (ప్రాశిత్రం) నోటి యందు, పాత్రలు (యజ్ఞ్య కుండము ముందర బంగారు పాత్ర వెనక వెండి, పక్క కాంస్య పాత్ర - వీటిని గ్రహములు  అంటారు) నోటిలో ఉన్నాయి. నీకు చర్వణం (నములుట) యజ్ఞ్యములో అగ్ని.

దీక్షానుజన్మోపసదః శిరోధరం త్వం ప్రాయణీయోదయనీయదంష్ట్రః
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సత్యావసథ్యం చితయోऽసవో హి తే

యజ్ఞ్య దీక్ష నీ పుట్టుక కంటే ముందు ఏర్పడే స్వరూపం. యజ్ఞ్య పాత్రకు ముందు ఉండే ప్రదేశాన్ని గ్రీవ (కంఠం), వరాహానికి ఉండే రెండు దమ్ష్ట్రలు ప్రారంభ హోమం(ప్రాయణీయ) సమాపన (ఉదయనీయ) హోమం. నీ జిహ్వ ఆహుతి ఇవ్వడానికి కావల్సిన పాత్ర. చితులు (హవిర్ ద్రవ్యాన్ని అర్పిస్తున్నపుడు ఉండే ఉచ్చారణ స్వరములు) నీ ప్రాణములు.

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః
సత్రాణి సర్వాణి శరీరసన్ధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబన్ధనః

సోమము నీ రేతస్సు. సవనాలు నీ ఉనికి. యజ్ఞములో ఉన్న ఏడు సంస్థలు నీ ఏడు ధాతువులు. అన్ని రకముల సత్రములూ నీ శరీర సంధులు. మొత్తం కలిపితే అన్ని రకముల యజ్ఞ్యముల రూపమే నీవు సత్రములూ, క్రతువులూ హోమములూ యజ్ఞ్యములూ ఇష్టులు సవనములు సంస్థానములు, ఇంకా యజ్ఞ్యములో ఎన్ని రకాల భేధాలు ఉన్నాయో అవి అన్నీ నీవే

నమో నమస్తేऽఖిలమన్త్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే
వైరాగ్యభక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమో నమః

అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ: అన్ని మంత్రములూ దేవతలూ ద్రవ్యములూ,క్రతువులూ,  పనులూ అన్నీ నీవే. ఇలాంటి పరమాత్మ దొరకాలంటే మాత్రం వైరాగ్యం కావాలి. సంసారం మీద ప్రీతి ఉన్నంత కాలం భగవంతుని మీద ప్రీతి కలగదు. వైరాగ్యమూ భక్తీ రెండూ కలిగితే పరమాత్మ జ్ఞ్యానం తెలుస్తుంది. తెలిసిన పరమాత్మను ఎలా సేవించాలో అర్థమవుతుంది. ఇవన్నీ రావాలంటే (విరక్తి రావాలన్నా, భక్తి కలగాలన్న) నీవే కలిగించాలి. ఇవన్నీ కలిగించే వాటిని కూడా నీవే కలిగించాలి. (యజ్ఞ్యము చేయాలంటే యజ్ఞ్య కుండములు వేరు, దర్భలు వేరు, హవిస్సులు  వేరు, యజ్ఞ్యానంగములూ, చేసేవారు, పాత్రలు, సాధనాలు, ఇవన్నీ వేరు. అదే పరమాత్మను పట్టుకుంటే, అన్నీ ఆయనే)

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా విరాజతే భూధర భూః సభూధరా
యథా వనాన్నిఃసరతో దతా ధృతా మతఙ్గజేన్ద్రస్య సపత్రపద్మినీ

నీ కోరల చివరతో భూమండలాన్ని పైకి తెచ్చావు. అలా తెచ్చిన నీవు ఎంత బాగా శొభిస్తున్నావంటే, ఎలా ఐతే జలమునుండి సరసులో ఉన్న పద్మమును తీసి దంతములకు తగిలించుకున్న ఏనుగులాగా ఉన్నావు.

త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమణ్డలేనాథ దతా ధృతేన తే
చకాస్తి శృఙ్గోఢఘనేన భూయసా కులాచలేన్ద్రస్య యథైవ విభ్రమః

భూమిని దమ్ష్ట్రలతో కదిలించిన నీ రూపం వేద స్వరూపం. మబ్బు తునక అంటుకున్న పర్వత శిఖరములా భూమిని కోరలపై నిలిపిన నీ రూపం ప్రకాశిస్తోంది.

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా
విధేమ చాస్యై నమసా సహ త్వయా యస్యాం స్వతేజోऽగ్నిమివారణావధాః

నీవు ఇలా సముద్రమునుండి ఉద్దరించిన భూమిని ఇక్కడ నిలపవలసింది. స్థావర జంగమములు నిలవడానికి నీవు తండ్రివైతే, ఆమె తల్లి. ఆమెతో కలిపి ఉన్న నీకు నమస్కారం. ఈమెలోనే నీ తేజస్సు అరణిలో అగ్ని ఉన్నట్లు ప్రకాశిస్తుంది.

కః శ్రద్దధీతాన్యతమస్తవ ప్రభో రసాం గతాయా భువ ఉద్విబర్హణమ్
న విస్మయోऽసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయయేదం ససృజేऽతివిస్మయమ్

పాతాళములో ఉన్న భూమిని పైకి తేగలరని ఎవైనా అనుకున్నార? ఎవరినా ఊహించారా? అది వేరే వారందరికీ ఆశ్చర్యం గనీ, నీకు ఆశ్చర్యం కాదు. నీవు వింతలలోకెల్లా పెద్ద వింతవు. అన్ని ఆశ్చర్యములకూ మూలైమైన ఈ ప్రపంచాన్ని మాయతో సృష్టించిన నీకు వేరే ఆశ్చర్యమేముంది.

విధున్వతా వేదమయం నిజం వపుర్జనస్తపఃసత్యనివాసినో వయమ్
సటాశిఖోద్ధూతశివామ్బుబిన్దుభిర్విమృజ్యమానా భృశమీశ పావితాః

సముద్రములోంచి పైకి వస్తూ నీ శరీరాన్ని విదిలించావు. సముద్ర జలం నీ కేశములకు అంటుకుని మా మీద పడింది. (అందుకే ఇప్పటికీ యజ్ఞ్యము పూర్తికాగానే కళశములో నీటిని ఉంచి వాటిని దర్భలతో ప్రోక్షిస్తారు. అపుడు మనకు భూమండలములో ఉన్న వరాహస్వామి తన కేశాలను విదిలించడం భావించాలి). కేశముల యొక్క చివరి భాగముల నుండి తుడవబడిన.

స వై బత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపారకర్మణః
యద్యోగమాయాగుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్విధేహి శమ్

పరమాత్మ అయిన నీ యొక్క యోగమాయతో మోహించబడుతున్న ఈ ప్రపంచానికి మనగళం కలిగించు

మైత్రేయ ఉవాచ
ఇత్యుపస్థీయమానోऽసౌ మునిభిర్బ్రహ్మవాదిభిః
సలిలే స్వఖురాక్రాన్త ఉపాధత్తావితావనిమ్

నిరంతర స్వాధ్యాయ పరాయణులైన మునులు చేసిన స్తోత్రముతో అవనిని తన గిట్టల చేత ఆక్రమించబడిన నీటి మీద నిలిపాడు అందరినీ కాపాడేవాడైన (అవితా)  పరమాత్మ. 

స ఇత్థం భగవానుర్వీం విష్వక్సేనః ప్రజాపతిః
రసాయా లీలయోన్నీతామప్సు న్యస్య యయౌ హరిః

విలాసముగా రసాతలం నుండి భూమి పైకి తెచ్చి నీటి మీద ఉంచి హరి వెంటనే వెళ్ళిపోయాడు

య ఏవమేతాం హరిమేధసో హరేః కథాం సుభద్రాం కథనీయమాయినః
శృణ్వీత భక్త్యా శ్రవయేత వోశతీం జనార్దనోऽస్యాశు హృది ప్రసీదతి

కథనీయమాయినః - చెప్పుకోదగినంత మాయ గల ఈ పరమాత్మ కథ, సకల మంగళములకూ మూలము అయిన పరమాత్మ యొక్క ఈ కథను భక్తితో విన్నవాడు వినిపించిన వాడి హృదయములోకి ప్రసన్నుడైన పరమాత్మ ప్రవేశించి నివసిస్తాడు. వరాహావతార కథ వినినందు వలన పరమాత్మ ప్రసన్నుడవుతాడు

తస్మిన్ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః
అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విధత్తే స్వగతిం పరః పరామ్

మనకు కావలసిన అన్ని కోరికలనూ ఇవ్వగల పరమాత్మ ప్రసన్నుడైతే మనకేమి దొరకదు. ప్రసన్నుడైన పరమాత్మను కోరికలు కోరడం మాకు వద్దు. అవి చాలు (తాభిరలం ). అవి అత్యల్పాలు (లవాత్మభిః). నశ్వరమైన అశాశ్వతమైన క్షుద్రమైన ఆ కోరికలతో ఏమి ప్రయోజనం. ప్రయోజనాన్ని ఆకాక్షించకుండా పరమాత్మ కాబట్టే పరమాత్మని ప్రార్థన్ చేస్తాము. అలా చేస్తే మన హృదయములోనే ఉన్న ఆయన తనలోకాన్ని తన స్థితినీ ఇస్తాడు. 

కో నామ లోకే పురుషార్థసారవిత్పురాకథానాం భగవత్కథాసుధామ్
ఆపీయ కర్ణాఞ్జలిభిర్భవాపహామహో విరజ్యేత వినా నరేతరమ్

ఇలాంటి పరమాత్మ కథలు వింటూ ఉంటే మనుషులకు విసుగూ విరామం ఉండదు. పురుషార్ధ సారమును తెలిసినవాడు సంసారముని దాటించేదైన, ప్రాచీన కాలము నుండీ వచ్చిన పరమాత్మ కథ అనే అమృతాన్ని చేవులనే దోసిల్లతో త్రాగినవాడు ఎవరైన విసుగు చెందుతాడా. మనిషి కంటే వేరైన వాడు తప్ప ఎవరు విసుగు పొందేది.