Pages

Saturday, 1 February 2014

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం అష్టమాధ్యాయం

                               

                       ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం అష్టమాధ్యాయం

ఏడవ అధ్యాయంలో పరమాత్మ అవతారాలను వివరించారు. దాని వల్ల ఆయుష్షు సత్ వ్యయం అవుతుంది. దానికి ఫల శృతిగా మాయా స్వరూపుడైన పరమాత్మ లీలలను కథలను గుణములనూ కీర్తన చేసిన వారికీ, చేసిన కీర్తనను ఆమోదించిన వారికి పరమాత్మ మాయ వారి మీద పడదు. బ్రహ్మగారు నారదునితో భాగవతాన్ని విస్తరింపచేయమని చెప్పారు.

రాజోవాచ
బ్రహ్మణా చోదితో బ్రహ్మన్గుణాఖ్యానేऽగుణస్య చ
యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శనః

దేవదర్శనుడైఅన (పరమాత్మను సాక్షాత్కరించుకున్న) నారదుడు ఏ ప్రాకృతిక గుణములూ లేని వాడి గుణాలు కీర్తించడానికి బ్రహ్మగారిచేత ప్రేరేపించబడి అడిగిన వారికి నారదుడు ఎలా వివరించాడు

ఏతద్వేదితుమిచ్ఛామి తత్త్వం తత్త్వవిదాం వర
హరేరద్భుతవీర్యస్య కథా లోకసుమఙ్గలాః

వేదం తెలిసిన వారిలో ఉత్తముడైన శుకా, నాకు ఈ విషయం తెలుసుకోవాలని ఉంది. అద్భుతమైన వీరుడైన పరమాత్మ కథలను, లోకానికి శుభము కలిగించేటువంటి వాటినీ తెలుసుకోవాలనుకుంటున్నాను

కథయస్వ మహాభాగ యథాహమఖిలాత్మని
కృష్ణే నివేశ్య నిఃసఙ్గం మనస్త్యక్ష్యే కలేవరమ్

సకల జగత్స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యందు ప్రవేశింపచేసి, ఆ నిస్సంగమైన (సంసారం యందు ఆసక్తి లేని మనసును) మనసును ఆయన యందు ఉంచి, ఈ శరీరాన్ని విడిచిపెడతాను.

శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితమ్
కాలేన నాతిదీర్ఘేణ భగవాన్విశతే హృది

అలాంటి మనసును పరమాత్మ యందు ఉంచడం సాధ్యమేనా? మనం ఏమి చేస్తున్నా మన మనసు మాత్రం సంసారమ్యందే ఉంటుంది కదా? అలాంటి మనసులో పరమాత్మ ఉంటాడా? ఆయన లీలనూ గుణములనూ కథలను శ్రద్ధతో నిత్యమూ వింటూ కీర్తిస్తూ ఉన్నవారి హృదయంలోకి ఆయనే ప్రవేశిస్తాడు. మనం చేయవలసిన పని ఆయన కథలను విని గుణములను కీర్తించడమే, అతి త్వరలోనే ఆయన వస్తాడు. మనం వింటూ ఉంటే శబ్దములతో బాటు శబ్ద ప్రతిపాద్యుడైన పరమాత్మ కర్ణ రంధ్రములగుండా ప్రవేశిస్తాడు.

ప్రవిష్టః కర్ణరన్ధ్రేణ స్వానాం భావసరోరుహమ్
ధునోతి శమలం కృష్ణః సలిలస్య యథా శరత్

హృదయంలోకి ప్రవేశించి అంతవరకూ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తాడు ఎలాగంటే శరత్ కాలం నీటి మురికిని తొలగించినట్లు.

ధౌతాత్మా పురుషః కృష్ణ పాదమూలం న ముఞ్చతి
ముక్తసర్వపరిక్లేశః పాన్థః స్వశరణం యథా

ఎపుడైతే మనసు పరిశుద్ధి పొందిందో పరమాత్మను మనము విడిచిపెట్టలేము. ఆ మనసు పరిసుద్ధి కూడా మనము చేసుకోలేము, పరమాత్మే చేస్తాడు. హృదయమాలిన్యం తొలిగాక మనము ఇక ఆయనను విడిచిపెట్టము. తన ఇంటికి చేరగానే ఎలా బాటసారి కష్టాలు తొలగిపోతాయో, పరమాత్మ చేరగానే మన కష్టాలు తొలగిపోతాయి. మన ఇళ్ళు పరమాత్మ, సంసారం అంటే మహారణ్యం, కోరికలు అనే పెద్ద మృగాలు బాధిస్తున్నాయి. ఆ అరణ్యంలో కష్టాలు విడిచిపెట్టాలంటే మనం మన ఇంటికి వెళ్ళాలి. అదే పరమాత్మ.

యదధాతుమతో బ్రహ్మన్దేహారమ్భోऽస్య ధాతుభిః
యదృచ్ఛయా హేతునా వా భవన్తో జానతే యథా

పరమాత్మ 24 తత్వాలతో సృష్టి చేసాడని అన్నారు. ఇవన్నీ కలిసి ఒక ఆకారంగా ఏర్పడింది అని చెప్పారు. ఈ శరీరం ఏర్పడేది ఎవరికి ? శరీరం లేని వారికి. అంటే జీవుడికి. అంటే జీవుడు వాస్తవంగా శరీరంలేనివాడే. శరీరం ఏర్పడుట అంటే ఏడు ధాతువులు ఏర్పడటం. ఈ ఏడు ధాతువులూ లేనిది జీవుడు. ఈ శరీర సంబంధం జీవుడికి అకారణంగా ఏర్పడుతుందా, సకారణంగా ఏర్పడుతుందా? మీరెలా భావిస్తున్నారో అలా మాకు వివరిచండి.

ఆసీద్యదుదరాత్పద్మం లోకసంస్థానలక్షణమ్
యావానయం వై పురుష ఇయత్తావయవైః పృథక్
తావానసావితి ప్రోక్తః సంస్థావయవవానివ

వరాహ పాద్మ మొదలైన కల్పములలో సకల చరాచర జగత్తుకు ప్రతీకగా పరమాత్మ ఒక పద్మాన్ని సృష్టించాడు, అందునుండి బ్రహ్మ, అందునుండి లోకాలు ఏర్పడ్డాయి. అన్ని లోకములకూ పద్మమే ప్రతీక. అన్ని లోకాలు పద్మంలోనే ఉన్నాయి. ఎవరి హృదయం నుండి ఆ పద్మం వెలువడిందో, ఆ పద్మమునుండే పురుషుడు ఉద్భవించాడు. (సృష్టిలో భోగ్యములు (షడ్రసములు కలిగిన పదార్థములు, రూపములూ, గుణములు భోగ్యములు) , భోగ్యోపకరణములు (వాటిని అనుభవించే ఇంద్రియములు ), భోగస్థానములు (అనుభవించడానికి కావలిసిన స్థానములు). విషయములు, ఇంద్రియములు, శరీరము) పరమాత్మకు ఎలాంటి ఆకారాలు అవయవాలు లేవు, కానీ అవయవాలున్నవానివలే అవి అన్నీ ఉన్న వారిని (బ్రహ్మను) సృష్టించాడు.  పరమాత్మ నుండి వచ్చినవారికి అవయవాలుంటే ఆయనకు అవయవాలున్నట్లా లేనట్లా.

అజః సృజతి భూతాని భూతాత్మా యదనుగ్రహాత్
దదృశే యేన తద్రూపం నాభిపద్మసముద్భవః

అన్ని లోకాలను ప్రాణులను పరమాత్మ అనుగ్రహంతోటి బ్రహ్మగారు సృష్టించారు, ఆయన అనుగ్రహాన్ని పొందినట్లు గుర్తుగా బ్రహ్మగారు పరమాత్మ దివ్యమంగళరూపాన్ని సాక్షాత్కరించుకున్నాడు. పరమాత్మ నాభిపద్మం నుండి పుట్టిన బ్రహ్మ ఎవరి దయతో పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరించుకున్నాడో

స చాపి యత్ర పురుషో విశ్వస్థిత్యుద్భవాప్యయః
ముక్త్వాత్మమాయాం మాయేశః శేతే సర్వగుహాశయః

ఆ పరమాత్మ సకల చరాచర సృష్టి స్థ్తి లయములకూ మూలం అని చెప్పారు. ఈ పరమాత్మ తన మాయను విడిచిపెట్టి తానే వచ్చి ప్రతీ వారి హృదయంలో అంతర్యామిగా నివస్తూ ఉంటాడు అని చెప్పారు

పురుషావయవైర్లోకాః సపాలాః పూర్వకల్పితాః
లోకైరముష్యావయవాః సపాలైరితి శుశ్రుమ

ఈ పరమాత్మ అవయములతోటే అన్ని లోకాలు కల్పించబడ్డాయి అన్నారు. ఇంకోసారి పరమాత్మ నాభిపద్మంలోంచి వచ్చిన బ్రహ్మగారు లోకాలని సృష్టించాడని అన్నారు, మరోసారి పరమాత్మ తన సంకల్పంతో లోకాలని సృష్టించాడని చెప్పారు. ఇక్కడ పరస్పరం విరోధం కనపడుతున్నది. మరొక చోట పరమాత్మ అవయములే లోకములు అయ్యాయి అని చెప్పారు. లోకపాలకు లోకములూ కలిసే పరమాత్మ శరీరం అని చెప్పారు.

యావాన్కల్పో వికల్పో వా యథా కాలోऽనుమీయతే
భూతభవ్యభవచ్ఛబ్ద ఆయుర్మానం చ యత్సతః

తరువాత కల్పము (ప్రాకృతిక ప్రళయం, బ్రహ్మకు నూరేళ్ళు నిండుట) వికల్పము (నైమిత్తిక ప్రళయం), ఈ రెంటితోటే కాలమును ఊహిస్తున్నాము. జరబోయే కాలం, జరుగుతున్న కాలం, జరిగిపోయిన కాలం. దేవ గంధర్వ మాన్సవుల మొదలైన వారి ఆయువు.
(నిత్య ప్రళయం: ప్రపంచంలోనూ మన శరీరములోనూ ప్రతీక్షణం కలిగే మార్పు. శిశువు గర్భంలో పడినప్పటినుంచీ ప్రతీక్షణం కలిగే అన్ని అవస్థలూ శరీరానికి వస్తూనే ఉంటాయి. ఈ మార్పులే నిత్య ప్రళయం.
నైమిత్తిక ప్రళయం: బ్రహ్మకు ఒక పగలు అయితే వచ్చేది
ప్రాకృతిక ప్రళయం: బ్రహ్మకు నూరేళ్ళు వస్తే వచ్చేది
ఆత్యంతిక ప్రళయం: ఇది మోక్షం
)

కాలస్యానుగతిర్యా తు లక్ష్యతేऽణ్వీ బృహత్యపి
యావత్యః కర్మగతయో యాదృశీర్ద్విజసత్తమ

కాలం యొక్క మానం అతి సూక్ష్మమైన తృటి నుంచి అతి బృహత్ అయిన పరార్థం వరకూ జీవుల యొక్క కర్మలు స్వరూపములు ఎన్ని రకాలుగా ఉంటాయి

యస్మిన్కర్మసమావాయో యథా యేనోపగృహ్యతే
గుణానాం గుణినాం చైవ పరిణామమభీప్సతామ్

ఆచరించే అన్ని కర్మలూ ఎక్కడ చేరుతాయి. మనం చేస్తున్న కర్మలు ఎవరి స్వీకరిస్తారు (మనం ఆచారించే కర్మలు మనం ఆచరించట్లేదు, పరమాత్మ మనచే ఆచరింపచేస్తున్నారు, తోలుబొమ్మలాటలాగ మనకు దారాలు కట్టి తెరలోపల ఉండి ఆడిస్తూ ఉంటాడు), మన చేత కర్మలు ఎవరు చేయిస్తున్నారు. గుణపరిణామం ఏమిటి గుణి పరిణామము ఏమిటి, గుణముల వికారాలు (దంభమ్మ్ దర్పం క్రోధం), గుణములు లేని వారి వికారాలు

భూపాతాలకకుబ్వ్యోమ గ్రహనక్షత్రభూభృతామ్
సరిత్సముద్రద్వీపానాం సమ్భవశ్చైతదోకసామ్

సకలలోకముల భూతముల సృష్టి, ఆ లోకములలో ఉండేవారి వివర్ణ

ప్రమాణమణ్డకోశస్య బాహ్యాభ్యన్తరభేదతః
మహతాం చానుచరితం వర్ణాశ్రమవినిశ్చయః
యుగాని యుగమానం చ ధర్మో యశ్చ యుగే యుగే
అవతారానుచరితం యదాశ్చర్యతమం హరేః
నృణాం సాధారణో ధర్మః సవిశేషశ్చ యాదృశః
శ్రేణీనాం రాజర్షీణాం చ ధర్మః కృచ్ఛ్రేషు జీవతామ్

బ్రహ్మాండం లోపల ఎంత ఉంది, బయట ఎంత ఉంది. మహాత్ముల చరిత్ర వర్ణ ధర్మములూ, ఆశ్రంధర్మములూ, యుగాలూ, వాటి ప్రమాణాలు, యుగధర్మాలు, ఏ ఏ యుగములలో పరమాత్మ ఏ ఏ అవతారాలు ధరించి ఆశ్చర్యములు గొలిపే చర్యలు చేసాడో, మానవుల సాధారణ ధర్మాలు, విశేష ధర్మములు, రాజ ధర్మాలు, రాజ ఋషులలోని ధర్మాలు, ఆపద వచ్చినపుడు (ఆపదలలో బ్రతికేవారు) ఆచరించవలసిన ధర్మాలు

తత్త్వానాం పరిసఙ్ఖ్యానం లక్షణం హేతులక్షణమ్
పురుషారాధనవిధిర్యోగస్యాధ్యాత్మికస్య చ

తతవములూ వాటి లక్షణములూ, పరమాత్మ ఆరాధనా విధానం, యోగం, ఆధ్యాత్మ యోగం

యోగేశ్వరైశ్వర్యగతిర్లిఙ్గభఙ్గస్తు యోగినామ్
వేదోపవేదధర్మాణామితిహాసపురాణయోః

యోగీశ్వరుడైన పరమాత్మ శాసకత్వం ఎలా ఉంటుంది, యోగుల ప్రభావం ఏమిటి, యోగుల  శరీర నాశం (లింగభంగం) ఎలా జరుగుతుంది. వేదములూ, ఉపవేదములూ (ఆయుర్వేదం, ధనుర్వేదం, మొదలైనవి) ధర్మములూ, ఇతిహాస పురాణాలు

సమ్ప్లవః సర్వభూతానాం విక్రమః ప్రతిసఙ్క్రమః
ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః

అన్ని ప్రాణుల ప్రళయం, సృష్టి, ప్రళయం, దాని రక్షణ, ఇష్టములని (యజ్ఞ్య యాగాదులు) పూర్తములనే (నదులూ బావులూ దేవాలయాలు తోటలు చెరువులూ ఏర్పాటు చేయడం) కర్మలు, ఇష్టాపూర్తములలో కూడా కామ్యములూ నిష్కామ్యములూ, ధర్మార్థ కామముల యొక్క విధి,

యో వానుశాయినాం సర్గః పాషణ్డస్య చ సమ్భవః
ఆత్మనో బన్ధమోక్షౌ చ వ్యవస్థానం స్వరూపతః

పాఖండ ధర్మములూ, ఆత్మ ఎపుడు బంధిచబడుతుంది, ఎపుడు మోక్షం వస్తుంది, ఎపుడు స్వస్వరూపంతో ఉంటుంది  (కైల్వల్యం)

యథాత్మతన్త్రో భగవాన్విక్రీడత్యాత్మమాయయా
విసృజ్య వా యథా మాయాముదాస్తే సాక్షివద్విభుః

ఇవన్నీ నిజంగా మనము చేస్తున్నవేనా, మనకు వస్తున్నవా? మనకే వస్తున్నాయి. మనం అనుకుంటే వస్తున్నాయా, అనుకోకుండానే వస్తున్నాయా? సర్వతంత్ర స్వతంత్ర్యుడు ఐన పరమాత్మ ఆత్మ మాయ వలన ఆయన క్రీడలో భాగంగా ఇదంతా చేస్తూ మాయను విడిచి పెట్టి పరమాత్మ సాక్షిగా ఉండి తామరాకు మీద నీటిబొట్టులాగా అంటుకోకుండా, చూస్తూ ఉంటాడు

సర్వమేతచ్చ భగవన్పృచ్ఛతో మేऽనుపూర్వశః
తత్త్వతోऽర్హస్యుదాహర్తుం ప్రపన్నాయ మహామునే

నిన్నే ఆశ్రయించిన నాకు వీటన్నిటికీ ప్రశ్నానుగుణంగా, యధాక్రమంగా సమాధానం చెప్పవలసింది.

అత్ర ప్రమాణం హి భవాన్పరమేష్ఠీ యథాత్మభూః
అపరే చానుతిష్ఠన్తి పూర్వేషాం పూర్వజైః కృతమ్

సృష్టికి బ్రహ్మగారు ఎలా ప్రమాణమో నేనడిగిన అన్ని విషయాలకు మీరే ప్రమాణం. ఉన్నవారి అందరికంటే ముందు వారు ఏమి చేసారో తరువాతి వారంతా అదే చేస్తారు.

న మేऽసవః పరాయన్తి బ్రహ్మన్ననశనాదమీ
పిబతో ఞ్చ్యుతపీయూషమ్తద్వాక్యాబ్ధివినిఃసృతమ్

నా ప్రాణములకి ఏడు రోజుల దాకా ఎటువంటి ప్రమాదం లేదు, నీరసం గానీ ఆకలి గానీ దప్పి గానీ రాదు. మూర్చ కూడా రాదు. ఎందుకంటే నేను అమృతం త్రాగుతున్నాను. పరమాత్మ అనే అమృతాన్ని త్రాగుతున్నాను.

సూత ఉవాచ
స ఉపామన్త్రితో రాజ్ఞా కథాయామితి సత్పతేః
బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది

ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్
బ్రహ్మణే భగవత్ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే

ఇలా పరీక్షిత్తు (విష్ణురాతుడు) చేత ప్రేరేపించబడిన బ్రహ్మరాతుడు (శుకుడు) బ్రహ్మకల్పంలో శ్రీమన్నారాయణుడు చెప్పిన భాగవతాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు
భగవంతున్ని అందించేవాడు శుకయోగీంద్రుడు. భగవంతుని చేత కాపాడ బడిన వాడు పరీక్షిత్తు

యద్యత్పరీక్షిదృషభః పాణ్డూనామనుపృచ్ఛతి
ఆనుపూర్వ్యేణ తత్సర్వమాఖ్యాతుముపచక్రమే

పాండవ శ్రేష్టుడైన పరీక్షిత్తు ఏ ఏ వరుసలో అడిగాడో ఆ వరుసలోనే చెప్పడానికి ఉపక్రమించాడు


                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు