Pages

Wednesday, 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పదహేడవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
నిశమ్యాత్మభువా గీతం కారణం శఙ్కయోజ్ఝితాః
తతః సర్వే న్యవర్తన్త త్రిదివాయ దివౌకసః

బ్రహ్మగారు చెప్పిన మాట విని శంక తొలగిన వారై దేవతలు వారి లోకాలకు వెళ్ళిపోయారు 

దితిస్తు భర్తురాదేశాదపత్యపరిశఙ్కినీ
పూర్ణే వర్షశతే సాధ్వీ పుత్రౌ ప్రసుషువే యమౌ

భర్త ఆజ్ఞ్యాపించేంత వరకూ గర్భాన్ని దాచుకుంది దితి, తన సంతానానికి హాని జరుగుతుందేమో అని అనుమానముతో. నూరు సంవత్సరాల తరువాత భర్త ఆజ్ఞ్య ప్రకారం కవల పుత్రులని ప్రసవించింది. 

ఉత్పాతా బహవస్తత్ర నిపేతుర్జాయమానయోః
దివి భువ్యన్తరిక్షే చ లోకస్యోరుభయావహాః

వీరు పుడుతుంటే మూడు లోకాల్లో దివిలో భువిలో అంతరిక్షములో ఉత్పాతాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తానికి గొప్ప భయాన్ని కలిగించే ఉత్పాతాలు అవి.

సహాచలా భువశ్చేలుర్దిశః సర్వాః ప్రజజ్వలుః
సోల్కాశ్చాశనయః పేతుః కేతవశ్చార్తిహేతవః

పర్వతములతో సహా భూమి కంపించింది. అన్ని దిక్కులూ మండిపోతున్నాయి. అశుభమైన ఉల్కలూ తోక చుక్కలూ పడ్డాయి. 

వవౌ వాయుః సుదుఃస్పర్శః ఫూత్కారానీరయన్ముహుః
ఉన్మూలయన్నగపతీన్వాత్యానీకో రజోధ్వజః

తాకితే ఒళ్ళంతా మండే గాలి వీచింది. పెద్దగా ఊదితే వచ్చే ధ్వనిలాగ సుడిగాలి వచ్చింది. వృక్ష రాజాలని పెకిలించుకుంటూ వాయువు వీచింది

ఉద్ధసత్తడిదమ్భోద ఘటయా నష్టభాగణే
వ్యోమ్ని ప్రవిష్టతమసా న స్మ వ్యాదృశ్యతే పదమ్

ఉరుములూ మెరుపులతో కూడిన మబ్బుల వలన చంద్ర సూర్యులు కనపడలేదు. మొత్తం ఆకాశం చీకటి వ్యాపించడం వలన నక్ష్త్ర మార్గం కనపడుటలేదు

చుక్రోశ విమనా వార్ధిరుదూర్మిః క్షుభితోదరః
సోదపానాశ్చ సరితశ్చుక్షుభుః శుష్కపఙ్కజాః

సముద్రము కూడా తరంగములు పైకి వస్తూ, ఉద్ఘోషతో సముద్రమూ, సరసులు నిష్కారణముగా ఎండిపోయాయి, పద్మములు నీటిలో ఉండి కూడా ఎండిపోయాయి 

ముహుః పరిధయోऽభూవన్సరాహ్వోః శశిసూర్యయోః
నిర్ఘాతా రథనిర్హ్రాదా వివరేభ్యః ప్రజజ్ఞిరే

సూర్యుని చుట్టు పరివేషం ఏర్పడింది, (చంద్రుని చుట్టు  వలయం (వరదగూడు ) వర్షాన్ని సూచిస్తుంది, అది దగ్గరగా ఉంటే వర్షం దగ్గరలో లేదని, దూరముగా ఉంటే వర్షం వస్తుంది అని అర్థం). పర్వత గుహల నుండీ పిడుగుపాటు పడుతున్నట్లు ధ్వని వస్తోంది

అన్తర్గ్రామేషు ముఖతో వమన్త్యో వహ్నిముల్బణమ్
సృగాలోలూకటఙ్కారైః ప్రణేదురశివం శివాః

నక్కలు ఊరిలోకి అరుస్తూ వచ్చాయి. (నక్క కనపడితే మంచి, అరుపు వినపడకూడదు. గాడిద అరుపు వినపడకూడదు, గాడిద కనపడితే మంచి). ఆ నక్కలు నిప్పులు గక్కుతూ వచ్చాయి. కుక్కలు తలను పైకి పెట్టి ఏడుస్తున్నట్లుగా 

సఙ్గీతవద్రోదనవదున్నమయ్య శిరోధరామ్
వ్యముఞ్చన్వివిధా వాచో గ్రామసింహాస్తతస్తతః

గాడిదల గిట్టల నుండి దుమ్ము రేగుతోంది (మేకల దుమ్మూ ఊడుస్తుంటే వచ్చే దుమ్ము గాడిదల దుమ్ము శ్మశానములో దుమ్మూ అపశకునాలు)

ఖరాశ్చ కర్కశైః క్షత్తః ఖురైర్ఘ్నన్తో ధరాతలమ్
ఖార్కారరభసా మత్తాః పర్యధావన్వరూథశః

భయంకరముగా అరుస్తూ గాడిదలు గుంపులుగా పరిగెడుతున్నాయి. ఈ ధ్వనులని విని పక్షులు గూడు నుంచి పారిపోయాయి. 

రుదన్తో రాసభత్రస్తా నీడాదుదపతన్ఖగాః
ఘోషేऽరణ్యే చ పశవః శకృన్మూత్రమకుర్వత

పల్లెల్లో అడవుల్లో పశువులు మల మూత్రాలు విడిచిపెడుతున్నాయి

గావోऽత్రసన్నసృగ్దోహాస్తోయదాః పూయవర్షిణః
వ్యరుదన్దేవలిఙ్గాని ద్రుమాః పేతుర్వినానిలమ్

పాల బదులు ఆవులు నెత్తురుని ఇచ్చాయి, మేఘములు మలాన్ని వర్షించాయి. దేవాలయములో విగ్రహాల వెంట నీరు స్రవించింది గాలి లేకుండా చెట్లు  పడిపోయాయి

గ్రహాన్పుణ్యతమానన్యే భగణాంశ్చాపి దీపితాః
అతిచేరుర్వక్రగత్యా యుయుధుశ్చ పరస్పరమ్

ఆకాశములో పాప గ్రహాలు శుభ గ్రహాలను బాధించడం మొదలుపెట్టాయి. బాధపెట్టడం అంటే మంచి గ్రహాలను దాటిపోతున్నారు. దీన్ని జ్యోతీషములో అతిచారము అంటారు. ఒక రాశిలోకి వెళ్ళాల్సినది రెండు రాశుల్లోకి వెళ్తారు. ఆకర్షణం అంటే వెనక్కు నుంచి ముందుకు లాగడం. ముందు నుంచి వెనక్కు లాగడం వక్రం అంటారు. ఒకే రాశిలోకి రెండు గ్రహాలు వచ్చి కొట్టుకుంటే యుద్ధం. శుభ గ్రహం గెలిస్తే అది శుభం. మనం పుట్టే సమయములో పాప గ్రహం శుభ గ్రహం మీద గెలిస్తే వాటి ప్రభావం మన మీద కూడా ఉంటుంది. అతిచారం, ఆకర్షణ, వక్రం యుద్ధం పరాజయం ఈ ఐదు గ్రహచారములో సంభవించే మహాదోషాలు. వీటి వలన వ్యక్తులకే కాదు దేశములకి కూడా అరిష్టము.
అలా వక్ర గతితో శుభ గ్రహాలని పాప గ్రహాలు దాటిపోతున్నాయి

దృష్ట్వాన్యాంశ్చ మహోత్పాతానతత్తత్త్వవిదః ప్రజాః
బ్రహ్మపుత్రానృతే భీతా మేనిరే విశ్వసమ్ప్లవమ్

ఇవి చూచి, తత్వం తెలియని ప్రజలు ప్రళయం వచ్చేస్తుంది అనుకున్నారు, సనక సనందనాది నలుగురు తప్ప 

తావాదిదైత్యౌ సహసా వ్యజ్యమానాత్మపౌరుషౌ
వవృధాతేऽశ్మసారేణ కాయేనాద్రిపతీ ఇవ

ఇలా పుట్టారు, తమ పౌరుషాన్ని ప్రకటించే విధముగా పెరిగారు. వజ్ర శరీరాలతో పర్వతాలలాగ పెరిగారు.

దివిస్పృశౌ హేమకిరీటకోటిభిర్నిరుద్ధకాష్ఠౌ స్ఫురదఙ్గదాభుజౌ
గాం కమ్పయన్తౌ చరణైః పదే పదే కట్యా సుకాఞ్చ్యార్కమతీత్య తస్థతుః

స్వర్గాన్ని అంటుకుంటున్నంత ఎత్తు పెరిగి కిరీటములతో అంతా కప్పేస్తున్నారు. ప్రతీ అడుగుకూ భూమిని కంపింపచేస్తున్నారు. బంగారపు మొలత్రాడుతో సూర్య భగవానున్ని అతిక్రమించారు (వీరి నడుము సూర్యభగవానుని పైకి ఉంది)

ప్రజాపతిర్నామ తయోరకార్షీద్యః ప్రాక్స్వదేహాద్యమయోరజాయత
తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజా యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః

కశ్యపుడు ఇద్దరికీ పేర్లు పెట్టాడు. తన నుండి ముందు పుట్టాడో వాడి పేరు హిరణ్య కశిపుడు, ఆమె నుండి మొదలు పుట్టినవారికి హిరణ్యాక్షుడు (ఇది కవల పిల్లల వయసు నిర్దేశించడములో విధానం). మొదలు ఆమె ప్రసవించినవాడు హిరణ్యాక్షుడు. హిరణ్య కశిపుడు అంటే భోగ వ్యామోహం. హిరణ్యాక్షుడంటే ఇంద్రియ వ్యామోహం. ప్రపంచం వేరు పరమాత్మ వేరు అనుకున్న వారికి ఈ రెండూ ఉంటాయి

చక్రే హిరణ్యకశిపుర్దోర్భ్యాం బ్రహ్మవరేణ చ
వశే సపాలాన్లోకాంస్త్రీనకుతోమృత్యురుద్ధతః

హిరణ్య కశిపుడు, మూడులోకములను లోకపాలకులతో సహా తన వశం చేసుకున్నాడు, ఎందుకంటే మృత్యుభయం లేకుండా వరం పొందాడు కాబట్టి. 

హిరణ్యాక్షోऽనుజస్తస్య ప్రియః ప్రీతికృదన్వహమ్
గదాపాణిర్దివం యాతో యుయుత్సుర్మృగయన్రణమ్

అన్న దారిలోనే తమ్ముడైన హిరణ్యాక్షుడు నడిచాడు. అన్నకు ప్రతీ రోజూ ప్రీతిని కలిస్తున్నాడు. గదపట్టుకొని స్వర్గానికి వెళ్ళాడు బాహు బలం బాగా ఎక్కువై. 

తం వీక్ష్య దుఃసహజవం రణత్కాఞ్చననూపురమ్
వైజయన్త్యా స్రజా జుష్టమంసన్యస్తమహాగదమ్

ఆభరణాలు పెట్టుకుని భయంకరముగా ఉన్న వాడిని చూచి, వాడి మనసు శరీరమునకూ ఉన్న బలాన్ని చూచి దేవతలందరూ దాక్కున్నారు.

మనోవీర్యవరోత్సిక్తమసృణ్యమకుతోభయమ్
భీతా నిలిల్యిరే దేవాస్తార్క్ష్యత్రస్తా ఇవాహయః

గరుత్మంతుని చూచిన పాములాగ దాక్కున్నారు

స వై తిరోహితాన్దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్
సేన్ద్రాన్దేవగణాన్క్షీబానపశ్యన్వ్యనదద్భృశమ్

అది అర్థమయ్యింది. వారిని అవహేళన చేసి గర్జించి, 

తతో నివృత్తః క్రీడిష్యన్గమ్భీరం భీమనిస్వనమ్
విజగాహే మహాసత్త్వో వార్ధిం మత్త ఇవ ద్విపః

బాగా గర్జిస్తున్న సముద్రుడు కనపడ్డాడు. మదించిన ఏనుగులాగ సముద్రములోకి ప్రవేశించాడు

తస్మిన్ప్రవిష్టే వరుణస్య సైనికా యాదోగణాః సన్నధియః ససాధ్వసాః
అహన్యమానా అపి తస్య వర్చసా ప్రధర్షితా దూరతరం ప్రదుద్రువుః

అది చూచిన వరుణ గణాలు, హిరణ్యాక్షుడు ఏమీ అనకపోయినా, అతని దివ్య తేజస్సుతో కొట్టబడి దాక్కున్నారు

స వర్షపూగానుదధౌ మహాబలశ్చరన్మహోర్మీఞ్ఛ్వసనేరితాన్ముహుః
మౌర్వ్యాభిజఘ్నే గదయా విభావరీమాసేదివాంస్తాత పురీం ప్రచేతసః

అలా కొన్ని పది సంవత్సరాలు తిరిగి వరుణ నగరమైన విభావరిని చేరి తన గదతో ఆ నగరప్రాకారాన్ని కొట్టాడు 

తత్రోపలభ్యాసురలోకపాలకం యాదోగణానామృషభం ప్రచేతసమ్
స్మయన్ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవజ్జగాద మే దేహ్యధిరాజ సంయుగమ్

వరుణుడు ఒక్కడూ కనపడ్డాడు. అతను సకల యాదో గణముకులకూ రాక్షసులకు అధిపతి. ఎలా ఐతే ఎవరూ దొరకని జూదరి దారినపోయే వారిని దండం పెట్టి జూదానికి రమ్మంటారో అలా అతనికి దండం పెట్టి

త్వం లోకపాలోऽధిపతిర్బృహచ్ఛ్రవా వీర్యాపహో దుర్మదవీరమానినామ్
విజిత్య లోకేऽఖిలదైత్యదానవాన్యద్రాజసూయేన పురాయజత్ప్రభో

నీవు లోకపాలకుడవు, వీరుడవూ, గొప్పకీర్తి కలవాడవు,  పరాక్రమవంతుల అందరి గర్వాలను అంతమొందించిన వాడవు. దైత్యులనూ దానవులనూ ఓడించి రాజసూయం చేసావు

స ఏవముత్సిక్తమదేన విద్విషా దృఢం ప్రలబ్ధో భగవానపాం పతిః
రోషం సముత్థం శమయన్స్వయా ధియా వ్యవోచదఙ్గోపశమం గతా వయమ్

అతని మదం చూచి కోపం వచ్చి "నీవన్నది నిజమే గానీ ప్రస్తుతం మేము శాంతిని వహించి ఉన్నాము. సన్యాసులలాగ అస్త్ర సన్యాసం చేసాము"

పశ్యామి నాన్యం పురుషాత్పురాతనాద్యః సంయుగే త్వాం రణమార్గకోవిదమ్
ఆరాధయిష్యత్యసురర్షభేహి తం మనస్వినో యం గృణతే భవాదృశాః

ఐనా నిన్ను నేను నిరుత్సాహపరచను. నేను శాంతించినా,నీ గ్రవాన్ని బలాన్ని అణచేవాడి గురిచి చెబుతాను. సనాతనపురుషుడైన అతనొక్కడే నిన్ను తృప్తి పరచగలడు. నీలాంటి పౌరుషం గలవారు అతనికోసమే వెతుకుతూ ఉంటారు.

తం వీరమారాదభిపద్య విస్మయః శయిష్యసే వీరశయే శ్వభిర్వృతః
యస్త్వద్విధానామసతాం ప్రశాన్తయే రూపాణి ధత్తే సదనుగ్రహేచ్ఛయా


అతనితో యుద్ధం చేసి నీ గర్వం బలం తొలగిపోయి,ఓడిపోయిన వీరులు పడుకునే దగ్గర కుక్కలతో సహా పడుకుంటావు. నీలాంటి దుర్మార్గులని శమింపచేయడానికి చాలా రూపాలు ధరిస్తాడు. నీవు అక్కడికి వెళ్ళు