Pages

Saturday, 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పందొమ్మిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
అథాదీక్షత రాజా తు హయమేధశతేన సః
బ్రహ్మావర్తే మనోః క్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతీ

నూరు అశ్వమేధ యాగాలు చేసాడు. మనువు యొక్క క్షేత్రమైన బ్రహ్మావర్తములో

తదభిప్రేత్య భగవాన్కర్మాతిశయమాత్మనః
శతక్రతుర్న మమృషే పృథోర్యజ్ఞమహోత్సవమ్

పృధు చక్రవర్తి ఇలా యజ్ఞ్యం చేస్తుంటే, నూరు యజ్ఞ్యాలు దగ్గరకు వచ్చాయి. నూరు యాగాలు చేస్తే ఇంద్రపదవి వస్తుంది. ఇంద్రుడు దాన్ని సహించలేదు

యత్ర యజ్ఞపతిః సాక్షాద్భగవాన్హరిరీశ్వరః
అన్వభూయత సర్వాత్మా సర్వలోకగురుః ప్రభుః
అన్వితో బ్రహ్మశర్వాభ్యాం లోకపాలైః సహానుగైః
ఉపగీయమానో గన్ధర్వైర్మునిభిశ్చాప్సరోగణైః
సిద్ధా విద్యాధరా దైత్యా దానవా గుహ్యకాదయః
సునన్దనన్దప్రముఖాః పార్షదప్రవరా హరేః
కపిలో నారదో దత్తో యోగేశాః సనకాదయః
తమన్వీయుర్భాగవతా యే చ తత్సేవనోత్సుకాః
యత్ర ధర్మదుఘా భూమిః సర్వకామదుఘా సతీ
దోగ్ధి స్మాభీప్సితానర్థాన్యజమానస్య భారత


యజ్ఞ్యపతి అయిన పరమాత్మ యజ్ఞ్యము మొదలైనప్పటినుండీ బ్రహ్మ రుద్రులతో, లోకపాలకులతో దిగ్పాలకులతో వారి అనుచరులతో గంధర్వులతో యక్షులతో పరమాత్మ ద్వారపాలకురైన నంద సునందులూ, ఋషులూ యోగులూ సిద్ధేశ్వరులూ అక్కడకి వచ్చి ఉన్నారు. ఈయన రాజ్యములో భూమి ఏది కావాలంటే అది ఇస్తోంది. యజ్ఞ్య సంబారాలన్నీ భూమే ఇస్తోంది.

ఊహుః సర్వరసాన్నద్యః క్షీరదధ్యన్నగోరసాన్
తరవో భూరివర్ష్మాణః ప్రాసూయన్త మధుచ్యుతః

చెట్లు అన్ని రసాలనూ ఇస్తున్నాయి. పాలూ పెరుగూ వెన్నా మొదలినవి చెట్లే ఇస్తున్నాయి. పళ్ళనీ రసలానూ ఇస్తున్నాయి. మకరందాన్నిస్తున్నాయి.

సిన్ధవో రత్ననికరాన్గిరయోऽన్నం చతుర్విధమ్
ఉపాయనముపాజహ్రుః సర్వే లోకాః సపాలకాః

సముద్రములు అన్న రాశులనిస్తున్నాయి. పర్వతాలు చతుర్విధాన్నాన్ని ఇస్తున్నయి. లోకపాలకులు కానుకలు తెచ్చి ఇస్తున్నారు

ఇతి చాధోక్షజేశస్య పృథోస్తు పరమోదయమ్
అసూయన్భగవానిన్ద్రః ప్రతిఘాతమచీకరత్

చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిమ్
వైన్యే యజ్ఞపశుం స్పర్ధన్నపోవాహ తిరోహితః

తనకంటే మించిన అతిశయాన్ని చూచి అసూయ పడి విఘ్నం కలిగించాలనుకొని, ఇంద్రుడు యజ్ఞ్యాశ్వాన్ని చివరి నూరవ యజ్ఞ్యములో అపహరించుకుని వెళ్ళాడు.

తమత్రిర్భగవానైక్షత్త్వరమాణం విహాయసా
ఆముక్తమివ పాఖణ్డం యోऽధర్మే ధర్మవిభ్రమః

అది అత్రి మహర్షి తన యోగ దృష్టితో చూచాడు. ఆయన పాఖణ్డ (పాపానికి గుర్తయిన) వేషములో వెళుతున్నాడు. అది పృధు పుత్రునికి చెప్పాడు. అతను ధనుర్భాణాలు తీసుకుని

అత్రిణా చోదితో హన్తుం పృథుపుత్రో మహారథః
అన్వధావత సఙ్క్రుద్ధస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్

తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరిణమ్
జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం న ముఞ్చతి

ఇంద్రుని వెనక "ఆగమంటూ " వెళ్ళాడు. ఇంద్రుని వేషం చూచాడు. జటలున్నాయి బూడిద పూసుకున్నాడు. అది చూచి బాణం వేయలేదు

వధాన్నివృత్తం తం భూయో హన్తవేऽత్రిరచోదయత్
జహి యజ్ఞహనం తాత మహేన్ద్రం విబుధాధమమ్

మళ్ళీ అత్రి మహర్షి ప్రోత్సహించాడు బాణముతో కొట్టమని.

ఏవం వైన్యసుతః ప్రోక్తస్త్వరమాణం విహాయసా
అన్వద్రవదభిక్రుద్ధో రావణం గృధ్రరాడివ

ఇలా పృధు చక్రవర్తి పుత్రుడు అత్రి మహర్షి మాట విని రావణున్ని జటాయువు వెంటాడినట్లు వెంటాడాడు..

సోऽశ్వం రూపం చ తద్ధిత్వా తస్మా అన్తర్హితః స్వరాట్
వీరః స్వపశుమాదాయ పితుర్యజ్ఞముపేయివాన్

ఆ గుర్రాన్ని వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు ఇంద్రుడు. ఆ గుర్రాన్ని తీసుకుని తండ్రి వద్దకు వచ్చాడు

తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయః
నామధేయం దదుస్తస్మై విజితాశ్వ ఇతి ప్రభో

ఆ పృధు కుమారుడు చాలా గొప్పవాడని ఎరిగిన యజ్ఞ్యము వద్ద ఉన్న వారందరూ ఇంద్రున్ని ఓడించి గుర్రాన్ని తీసుకు వచ్చినందుకు విజితాశ్వుడని పేరు పెట్టారు

ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరిః
చషాలయూపతశ్ఛన్నో హిరణ్యరశనం విభుః

మళ్ళీ ఇంద్రుడు వచ్చి మొత్తం చీకటి చేసి బంగారు స్తంభానికి కట్టి ఉన్న గుర్రాన్ని బంగారు గొలుసుతో సహా తీసుకుని వెళ్ళాడు

అత్రిః సన్దర్శయామాస త్వరమాణం విహాయసా
కపాలఖట్వాఙ్గధరం వీరో నైనమబాధత

అత్రి మళ్ళీ తన దృష్టితో చూసి పట్టుకోమని చెప్పాడు. పృధు చక్రవర్తి దగ్గరకు వెళ్ళగా ఈ సారి ఇంద్రుడు ఒక చేతిలో పుర్రె ఇంకో చేతిలో కట్టే పట్టుకుని నించున్నాడు.

అత్రిణా చోదితస్తస్మై సన్దధే విశిఖం రుషా
సోऽశ్వం రూపం చ తద్ధిత్వా తస్థావన్తర్హితః స్వరాట్

వీరశ్చాశ్వముపాదాయ పితృయజ్ఞమథావ్రజత్
తదవద్యం హరే రూపం జగృహుర్జ్ఞానదుర్బలాః

ఆ రూపమును చూపించి మళ్ళీ ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు.
జ్ఞ్యాన దుర్బలులైన వారు ఈ వ్రతాన్ని తీసుకున్నారు. ఎవరికి జ్ఞ్యానము లేదో వారు ఈ వేషాన్ని తీసుకున్నారు. దొంగతనం చేసిన వస్తువును కాపాడుకోవడానికి వేసిన వేషం ధర్మం అనుకున్న వారు.

యాని రూపాణి జగృహే ఇన్ద్రో హయజిహీర్షయా
తాని పాపస్య ఖణ్డాని లిఙ్గం ఖణ్డమిహోచ్యతే

అశ్వమును దొంగిలించడానికి ఇంద్రుడు ఏ ఏ రూపాలని స్వీకరించాడో అవి అన్నీ పాపముల యొక్క గుర్తులూ. పాపము చేయడానికి వెశిన వేషం పాపానికి గుర్తే కదా.

ఏవమిన్ద్రే హరత్యశ్వం వైన్యయజ్ఞజిఘాంసయా
తద్గృహీతవిసృష్టేషు పాఖణ్డేషు మతిర్నృణామ్

పరమోత్తములు అత్యుత్తమ కార్యము చేస్తున్న సందర్భములో వారాచరించే ఉత్తమ కార్యాలని భంగం చేయడానికి వచ్చేవారు ఆచరించే పనులు వేసే వేషాలు జ్ఞ్యాన బలహీనులని బాగా ఆకర్షిస్తాయి. ఈ ఉత్తమ కార్యాలను గాక, వాటిని చూచి అలాంటి వాటికి ఆకర్షితులవుతారు. భగవంతుడు యజ్ఞ్యము చేస్తున్నాడు, అక్కడే త్రిమూర్తులూ యోగులూ ఉన్నారు. ఇందరు ఉండి, మంచి వాడే తన పదవిని కాపాడుకోవడానికి అతని యొక్క పనిని విఘ్నం చేయడానికి కొన్ని వేషాలేస్తే, చూచిన వారికి ఆ వేషాలు నచ్చాయి గానీ యజ్ఞ్యం నచ్చలేదు. ఇంద్రుడు స్వీకరించి విడిచిపెట్టిన పాప లింగములైన వేషముల యందు మానవులకు మనసు కలిగింది

ధర్మ ఇత్యుపధర్మేషు నగ్నరక్తపటాదిషు
ప్రాయేణ సజ్జతే భ్రాన్త్యా పేశలేషు చ వాగ్మిషు

ధర్మముల లాంటివైన దిగంబరముగా ఉన్న, నల్లబట్టలు, ఎర్రబట్టలూ, తెల్ల బట్టలూ, వేసుకుని ఇదంతా వ్రతమూ, ఇదంతా ధర్మమూ అంటున్నారు. కానీ ఇదంతా పాఖణ్డములూ. ప్రజలు ఇలాంటి వాటి వెంట ఎక్కువ ఎందుకు వెళతారంటే ఆకర్చిందే వాటి యందు మనసు త్వరగా లగ్నమవుతుంది. అంతే కాక మాటకారులు చెప్పినవాటిని త్వరగా నమ్ముతారు

తదభిజ్ఞాయ భగవాన్పృథుః పృథుపరాక్రమః
ఇన్ద్రాయ కుపితో బాణమాదత్తోద్యతకార్ముకః

ఇదంతా చూసాడు పృధు చక్రవర్తి. ధనువు తీసుకుని బాణం ఎక్కుపెట్టాడు.

తమృత్విజః శక్రవధాభిసన్ధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్యరంహసమ్
నివారయామాసురహో మహామతే న యుజ్యతేऽత్రాన్యవధః ప్రచోదితాత్

మహోగ్రముగా ఉన్నవాడినీ, చూడ శక్యముగాని వాడినీ చూచి "దీక్షలో ఉన్నవాడు దేన్ని వధించమని యజ్ఞ్య శాస్త్రం చెప్పిందో దాన్నే వధించాలి, తక్కిన వాటి వధ శాస్త్ర విహితము కాదు"

వయం మరుత్వన్తమిహార్థనాశనం హ్వయామహే త్వచ్ఛ్రవసా హతత్విషమ్
అయాతయామోపహవైరనన్తరం ప్రసహ్య రాజన్జుహవామ తేऽహితమ్

ఇంద్రున్ని వధించాలని నీకుంటే మాకు చెప్పు. అతని పేరుతో పిలిచి "స్వాహా" అంటాము. నీ కోపముచేతనే ఆయన తేజస్సు చాలా పోయింది.  మొదలు ఈ పని పూర్తి చేసి నీ యజ్ఞ్యానికి అడ్డుగా వస్తున్న వాడిని కూడా హోమము చేస్తాము

ఇత్యామన్త్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజో రుషా
స్రుగ్ఘస్తాన్జుహ్వతోऽభ్యేత్య స్వయమ్భూః ప్రత్యషేధత

ఇలా పృధు చక్రవర్తిని ఆపి సృక్కును తీసుకుని ఇంద్రున్ని హోమములో వేయడానికి ఉద్యుక్తులవగా బ్రహ్మగారు వారించారు. యజ్ఞ్యము పరమాత్మ స్వరూపమే. ఇంద్రుడు కూడా పరమాత్మ స్వరూపమే.

న వధ్యో భవతామిన్ద్రో యద్యజ్ఞో భగవత్తనుః
యం జిఘాంసథ యజ్ఞేన యస్యేష్టాస్తనవః సురాః

యజ్ఞ్యం ఎవరికోసం చేస్తున్నరో వారిని చంపుతారా? ఇదెక్కడి ధర్మం. దేవతలందరూ ఎవరికి ఇష్టమో ఆయనని చంపాలనుకోవడం ధర్మవ్యతికరం

తదిదం పశ్యత మహద్ ధర్మవ్యతికరం ద్విజాః
ఇన్ద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసతా

ఇంద్రుడు రాజు యజ్ఞ్యాన్ని భంగం చేయడానికి చేసిన ప్రయత్నము నీవు వంద యజ్ఞ్యాలు చేయకుండా ఉండటానికి. నీవు తొంభై తొమ్మిది యజ్ఞ్యాలు చేసినవాడన్న పేరు చాలదా? ఆ ఇంద్రునికి స్వర్గము కూడా నీవిచ్చిన పదవే కదా.

పృథుకీర్తేః పృథోర్భూయాత్తర్హ్యేకోనశతక్రతుః
అలం తే క్రతుభిః స్విష్టైర్యద్భవాన్మోక్షధర్మవిత్

మోక్షం వద్దన్నవాడు యజ్ఞ్యాలు చేస్తాడు.

నైవాత్మనే మహేన్ద్రాయ రోషమాహర్తుమర్హసి
ఉభావపి హి భద్రం తే ఉత్తమశ్లోకవిగ్రహౌ

ఇంద్రుడి మీద నీవు కోపించరాదు. ఆయన లోకాలు ఆయనకున్నాయి. నీ రాజ్యము నీకున్నది, నీ తేజస్సుతోన్ గెలిచిన లోకాలూ నీకున్నాయి. ఇదరూ గొప్పవారే, మహానుభావులచే స్తుతింపబడే శరీరములు కలవారే

మాస్మిన్మహారాజ కృథాః స్మ చిన్తాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మా
యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోऽతిరుష్టం విశతే తమోऽన్ధమ్

ఈ విషయములో ఎలాంటి దిగులూ పెట్టుకోకూ. మా మాట విను. భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలి అనుకున్నవారికి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బుద్ధి పాడవౌతుంది జ్ఞ్యానం నశిస్తుంది. ఆ పని కాలేదంటే "ఇది పరమాత్మకు ఇష్టం లేదేమో" అని పరమాత్మకు నమస్కరించాలి.
పరమాత్మ చెడగొట్టిన దాన్ని గురించి చేయడానికి ఆలోచించేవాడికి మనసు కోపాక్రాంతమవుతుంది. అజ్ఞ్యానములో చేరుతుంది. భగవంతుడు చెడగొట్టిన పని గురించి ఆలోచించవద్దు

క్రతుర్విరమతామేష దేవేషు దురవగ్రహః
ధర్మవ్యతికరో యత్ర పాఖణ్డైరిన్ద్రనిర్మితైః

ఈ యజ్ఞ్యము చాలు. యజ్ఞ్య ధర్మాన్ని దాటుతోంది. దేవతల మీద కోపం తెప్పించే యజ్ఞ్యం ఆపు. అంతటితో ఆగక ఇంద్రుడు వేసిన వేషాలని బలహీనులు చూచి వాటి వైపు ఆకర్షితులయ్యారు. దేవతలను దూషించి యజ్ఞ్యం చేస్తే ధర్మం వృద్ధి పొందదు సరి కదా అధర్మం పుడుతుంది.

ఏభిరిన్ద్రోపసంసృష్టైః పాఖణ్డైర్హారిభిర్జనమ్
హ్రియమాణం విచక్ష్వైనం యస్తే యజ్ఞధ్రుగశ్వముట్

ఇంద్రుడు సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు పారిపోతున్నాడు. యజ్ఞ్యానికీ ద్రోహం చేసాడు అశ్వాన్నీ దొంగిలించాడు కొన్ని అధర్మ మార్గాలూ చూపాడు.

భవాన్పరిత్రాతుమిహావతీర్ణో ధర్మం జనానాం సమయానురూపమ్
వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణుకలాసి వైన్య

ఆయా కాలానుగుణముగా ప్రజలకు ధర్మాన్ని బోధించడానికీ ఆచరించడానికీ నీవు పుట్టావు. వేనుడు చేసిన అపచారాన్ని ప్రక్షాళన చేసి లోకములో ధర్మాన్ని ఉద్ధరించడానికి నీవు పుట్టావు

స త్వం విమృశ్యాస్య భవం ప్రజాపతే సఙ్కల్పనం విశ్వసృజాం పిపీపృహి
ఐన్ద్రీం చ మాయాముపధర్మమాతరం ప్రచణ్డపాఖణ్డపథం ప్రభో జహి

నీవెందుకు పుట్టావో ఇంద్రున్ని ఎందుకు ఏర్పరచావో ఆలోచించు. ప్రజాపతులా ధర్మ రక్షకులా సంకల్పాన్ని పోషించాలి నీవు. యజ్ఞ్యము కన్నా నీవు ముందు చేయాల్సింది, ఇంద్రుడు బోధించిన ఉపధర్మాల ప్రచారాన్ని ఆపాలి. ఆ ఉపధర్మ ప్రవర్తకులను ద్వేషించూ వధించూ.

మైత్రేయ ఉవాచ
ఇత్థం స లోకగురుణా సమాదిష్టో విశామ్పతిః
తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సన్దధే

ఇలా బ్రహ్మ గారు ఆజ్ఞ్యాపిస్తే ఇంద్రుని మీద వాత్సల్యాన్ని చూపి ఇంద్రునితో సంధి చేసుకున్నాడు.

కృతావభృథస్నానాయ పృథవే భూరికర్మణే
వరాన్దదుస్తే వరదా యే తద్బర్హిషి తర్పితాః

హవిస్సుతో తృప్తి పొందిన దేవతలు అవభృత స్నానం పూర్తి చేసుకున్న పృధు చక్రవర్తికి వరాలు ఇచ్చారు. బ్రాహ్మణులు శ్రద్ధగా యజ్ఞ్యము చేసారు. యజమాని వారికి శ్రద్ధగా దక్షిణలు ఇచ్చాడు.

విప్రాః సత్యాశిషస్తుష్టాః శ్రద్ధయా లబ్ధదక్షిణాః
ఆశిషో యుయుజుః క్షత్తరాదిరాజాయ సత్కృతాః

పృధు చక్రవర్తికి బ్రాహ్మణులు ఆశీర్వాదాన్నిచ్చారు

త్వయాహూతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః
పూజితా దానమానాభ్యాం పితృదేవర్షిమానవాః

"యజ్ఞ్యము చేయాలనుకుని నీవు పితృ దేవతలనూ దేవతలనూ ఋషులనూ మానవులనూ ఎవరిని పిలిచావో వారందరూ వచ్చారు. వారికి గౌరవ పూర్వకముగా నీవు దానం చేసావు." అని బ్రాహ్మణులందరూ పృధు చక్రవర్తికి ఆశీర్వాదాలు అందించారు.