Pages

Saturday, 22 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
అథ తస్మాత్పరతస్త్రయోదశలక్షయోజనాన్తరతో యత్తద్విష్ణోః పరమం పదమభివదన్తి యత్ర
హ మహాభాగవతో ధ్రువ ఔత్తానపాదిరగ్నినేన్ద్రేణ ప్రజాపతినా కశ్యపేన ధర్మేణ చ సమకాలయుగ్భిః
సబహుమానం దక్షిణతః క్రియమాణ ఇదానీమపి కల్పజీవినామాజీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణితః

ఋషిమండలానికి పదమూడు లక్షల యోజనాల దూరములో ద్రువమండలం ఉంటుంది. అందరూ ద్రువునికి గౌరవముతో ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. బ్రహ్మ కల్ప కాలం బతికిన వారితో ఇప్పటికీ ద్రువుడు ఆరాధించబడుతూ ఉన్నాడు. ద్రువుడే జీవనాధారం. ఆయన వలనే ఈ జీవులు తృప్తి పొందుతారు. ఆ ద్రువ చరిత్ర చెప్పుకుని ఉన్నాము. 

స హి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహనక్షత్రాదీనామనిమిషేణావ్యక్తరంహసా భగవతా కాలేన
భ్రామ్యమాణానాం స్థాణురివావష్టమ్భ ఈశ్వరేణ విహితః శశ్వదవభాసతే

ఇంతవరకూ చెప్పిన అన్ని రాశులూ నక్షత్రాలూ తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్య ఉన్న ద్రువుడు చలనం లేకుండా స్థిరముగా ఉంటాడు. ఈ ఏర్పాటు చేసింది పరమాత్మ. రెప్పపాటు లేని పరమాత్మ చేసిన ఏర్పాటు వలన స్థాణువులా ఉంటాడు. ద్రువమండలం ప్రకాశిస్తూ ఉంటుంది

యథా మేఢీస్తమ్భ ఆక్రమణపశవః సంయోజితాస్త్రిభిస్త్రిభిః సవనైర్యథాస్థానం మణ్డలాని
చరన్త్యేవం భగణా గ్రహాదయ ఏతస్మిన్నన్తర్బహిర్యోగేన కాలచక్ర ఆయోజితా ధ్రువమేవావలమ్బ్య
వాయునోదీర్యమాణా ఆకల్పాన్తం పరిచఙ్క్రమన్తి నభసి యథా మేఘాః శ్యేనాదయో వాయువశాః కర్మసారథయః
పరివర్తన్తే ఏవం జ్యోతిర్గణాః ప్రకృతిపురుషసంయోగానుగృహీతాః కర్మనిర్మితగతయో భువి న పతన్తి

అన్నీ తిరుగుతూ ఉంటే ఆయన ఎందుకు తిరగదు. గానుగ స్తంభములో మేడీ స్తంభం తిరగకుండా ఉంటుంది. దన్ని ఆశ్రయించుకుని మిగతావన్నీ వేగన్ని పెంచుకుంటాయి. ద్రువుడు అలాంటి వాడు. ఇరుసు తిరుగుతున్నట్లు కనపడుతుంది గానీ అది తిరగదు. కాల చక్రం నక్షత్రం రాశులూ సూర్యాది మండలాలూ ద్రువమండలాన్ని ఆధారముగా చేసుకుని సంచరిస్తూ ఉంటాయి. వాయువు లేకుండా కదలిక ఉండదు కాబట్టి అంత వేగ్ముగా వాయువు వీచాలి. ఆకాశములో మబ్బులు వాయువశమై తిరుగుతున్నట్లు ఆకల్పాంతం తిరుగుతూ ఉంటాయి. గ్రహములూ నక్షత్రాలూ రాశులూ కర్మసారధులు. ప్రకృతి పురుష సమ్యోగము వలనే నక్షత్రాలూ రాశులూ పుడతాయి (ప్రకృతి నుండి మహత్ తత్వం పుట్టింది, ఆ ప్రకృతిని పరమాత్మ క్షోభింపచేసాడు), వారు వారు ఆచరించిన కర్మ చేతనే వారి (నక్షత్ర రాశుల) గమనం ఏర్పడింది. గ్రహాలూ రాశులూ నక్షత్రాలూ కూడా కర్మబద్దులైన జీవులే. కర్మ అనే దారముతో కట్టబడి ఉన్నాయి. అవి కిందపడకుండా గుద్దుకోకుండా బద్దమై ఉంటాయి. 

కేచనైతజ్జ్యోతిరనీకం శిశుమారసంస్థానేన భగవతో వాసుదేవస్య యోగ
ధారణాయామనువర్ణయన్తి

ఈ శింశుమారమంతా పరమాత్మ వాసుదేవుని యోగధారణలో ఉంటుంది

యస్య పుచ్ఛాగ్రేऽవాక్శిరసః కుణ్డలీభూతదేహస్య ధ్రువ ఉపకల్పితస్తస్య లాఙ్గూలే
ప్రజాపతిరగ్నిరిన్ద్రో ధర్మ ఇతి పుచ్ఛమూలే ధాతా విధాతా చ కట్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్తకుణ్డలీ
భూతశరీరస్య యాన్యుదగయనాని దక్షిణపార్శ్వే తు నక్షత్రాణ్యుపకల్పయన్తి దక్షిణాయనాని తు సవ్యే యథా
శిశుమారస్య కుణ్డలాభోగసన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవయవాః సమసఙ్ఖ్యా భవన్తి పృష్ఠే
త్వజవీథీ ఆకాశగఙ్గా చోదరతః

శరీరం మొత్తం గుండ్రముగా ఉంటుంది. తోక కొసకు శిరసు ఉంటుంది.ఆ కుండలిలా గుండ్రముగా ఉన్నది ద్రువ మండలం.  శింశుమారం యొక్క లాంగూలములో ప్రజాపతీ అగ్నీ ఇంద్రుడూ ధర్మం ఉంటారు. మొదటి భాగములో ధాతా విధాతా ఉంటారు. నడుములో సప్తఋషులు ఉంటారు. శింశుమారం కుండలిగా ఉంటుంది, దక్షిణ భాగం తిరిగి ఉంటుంది. అలాగే శంఖాలలో కూడా దక్షిణావర్తనం, వామావర్తమూ ఉంటాయి. వామావర్తం లభించడం కష్టం. ఉత్తరాయణములు దక్షిణ భాగములో ఉంటాయి, దక్షిణాయనములు ఉత్తరభాగములో ఉంటాయి. దానికి దక్షిణావర్తం మనకు ఉత్తరావర్తం. అందుకే ఉత్తరాయణం ప్రశస్తమైనది. రెండు పక్కలా గల నక్షత్రాల గ్రహాల సంఖ్యా సమానముగా ఉంటాయి. అజ వీధి అంటే పాలపుంత. బ్రహ్మదారి అంటారు. శింశుమారం యొక్క ఉదరస్థానములో ఆకాశగంగ. పునర్వసూ పుష్యమీ నక్షత్రాలు దక్షిణ వామ పార్శ్వాలు. ఆర్థ్రా ఆశ్లేషలు దక్షిణ (వెనక భాగములో), అభిజిత్ ఉత్తరాషాడలు దక్షిణ వామ నాసికలలో

పునర్వసుపుష్యౌ దక్షిణవామయోః శ్రోణ్యోరార్ద్రాశ్లేషే చ దక్షిణవామయోః పశ్చిమయోః
పాదయోరభిజిదుత్తరాషాఢే దక్షిణవామయోర్నాసికయోర్యథాసఙ్ఖ్యం శ్రవణపూర్వాషాఢే దక్షిణ
వామయోర్లోచనయోర్ధనిష్ఠా మూలం చ దక్షిణవామయోః కర్ణయోర్మఘాదీన్యష్ట నక్షత్రాణి దక్షిణాయనాని
వామపార్శ్వవఙ్క్రిషు యుఞ్జీత తథైవ మృగశీర్షాదీన్యుదగయనాని దక్షిణపార్శ్వవఙ్క్రిషు ప్రాతిలోమ్యేన
ప్రయుఞ్జీత శతభిషాజ్యేష్ఠే స్కన్ధయోర్దక్షిణవామయోర్న్యసేత్

కుడి ఎడుమ కన్నులలో శ్రవణమూ పూర్వాషాడ. మఖా నుంచీ జ్యేష్ఠా వరకూ దక్షిణ పార్శ్వములో ఉంటాయి. మృగశీర్షా ఆర్థ్రా దక్షిణాయనం. శతబిష జ్యేష్టలు స్కంధములు. ముఖములో అంగారకుడు, ఉపస్థలో శనైశ్వరుడు, కకుది (వీపు) బృహస్పతి, వక్షములో బృహస్పతి, హృదయములో నారాయణుడు, మనసులో చంద్రుడు, నాభిలో శుక్రుడు, అశ్వనీ దేవతలు రెండు స్తనములలో. ప్రాణాపానములలో బుధుడు, రాహువు మెడలో ఉంటాడు, 

ఉత్తరాహనావగస్తిరధరాహనౌ యమో ముఖేషు చాఙ్గారకః శనైశ్చర ఉపస్థే బృహస్పతిః కకుది
వక్షస్యాదిత్యో హృదయే నారాయణో మనసి చన్ద్రో నాభ్యాముశనా స్తనయోరశ్వినౌ బుధః ప్రాణాపానయో
రాహుర్గలే కేతవః సర్వాఙ్గేషు రోమసు సర్వే తారాగణాః

కేతువులు ప్రతీ అవయవములోనూ ఉంటాయి. రోమములో నక్షత్రాలు. రోమకూపాన్ని వక్షస్థలాన్ని కళ్ళనూ పరిశీలించి, ఒక్కో కూపములో రెండు ఉంటే సంపత్తూ, ఒకటి ఉంటే బిక్షుకుడు, రెండు కంటే ఎక్కువ ఉంటే దరిద్రుడు. గళము నుంచి వక్షస్థలానికి ఒక రేఖ ఉంటుంది. అది మూడు భాగాలలో ఉంటుంది. తాడు, సర్పమూ గొళుసుగా ఉండి దక్షిణ స్థనం (శని) నుండి ఉత్తర స్థనం (గురువు) వరకూ వస్తే విద్యావంతుడు అవుతారు. దానికి వ్యతిరేకముగా వస్తే దౌర్భాగ్యుడు. భగవదారాధనతో రేఖలు కూడా మారుతాయి. 

ఏతదు హైవ భగవతో విష్ణోః సర్వదేవతామయం రూపమహరహః సన్ధ్యాయాం ప్రయతో వాగ్యతో
నిరీక్షమాణ ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయానిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహీతి

ఈ శిశుమార చక్రం వాసుదేవుడే. విశ్వం విష్ణుః. పరమాత్మ యొక్క సర్వ దేవతా స్వరూపము ఇది.  పరమాత్మ యొక్క స్థూల రూపం, పధ్నాలుగు లోకాలూ పరమాత్మ అవయవాలే. మనమారాధించే దేవత పరమాత్మ శరీరములో ఏ భాగమో తెలుసుతుంది. రాహు దోషమున్న వారు పూల మాల తయారు చేసి పరమాత్మ మెడలో వేయాలి. రాహువు పరమాత్మ యొక్క మెడ. కేతు దోషముంటే తులసితో పూజ చేయి. పరమాత్మ రోమాలను కప్పిపుచ్చేది తులసి. కేతువు పరమాత్మ రోమాలు. ఏ దేవత పరమాత్మకు ఏ అవయవమో ఆ ఆరాధన పరమాత్మ యొక్క ఆ అవయవానికి చెందుతుంది. చెట్టు బాగా ఉండాలంటే చెట్టు యొక్క ప్రతీ ఆకుకీ నీరు పోయక్కరలేదు. మూలానికి నీరు పోస్తే చాలు. ఈ అధ్యాయాన్ని ప్రతీ రోజు సంధ్యాకాలములో శ్రద్ధగా మాటను నియంత్రించుకుని చూస్తూ "నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహీ" అనే మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రాన్ని సర్వదా చదువుతూ ఉండాలి. ఇందులో ప్రణవం లేదు, బీజాక్షరం లేదు. సర్వ దేశ సర్వ కాలాలలో అవస్థలలో చదువుకోవచ్చు. ప్రకృతి వలన వచ్చే ఉత్పాతాలకు గురికాడు. ధీమహీ అంటే గాయత్రీ మంత్రం. 

గ్రహర్క్షతారామయమాధిదైవికం పాపాపహం మన్త్రకృతాం త్రికాలమ్
నమస్యతః స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాలజమాశు పాపమ్

ఆది దైవికం అంటే గ్రహస్థ నక్షత్ర తారామయం (తొంభై వంతులు పుణ్యం ఉన్నవారు నక్షత్రాలవుతారు. ఇంకొంచెం పుణ్యం తక్కువ ఉన్నవారు తారలు అవుతారు. అష్టకోణం నక్షత్రం, షట్ కోణం తార).  ఈ ఆది దైవికం మంత్రములను జపం చేసే వారి పాపాలను పోగొడుతుంది. పెద్దలు మనకుపదేశించిన మత్రాన్ని జపిస్తూ ఉండగా వచ్చే తప్పులను ఈ మంత్రం పోగొడుతుంది. ఆయా మంత్రములను జపించేవారు తాము జపించిన మంత్రములలో కలిగిన లోపాలను పోగొడుతుంది. అంతే కాక ఈ మంత్రాన్ని జపించిన వారికి నమస్కరించినా వారి పాపం వెంటనే పోతుంది.