Pages

Saturday, 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
మౌక్తికైః కుసుమస్రగ్భిర్దుకూలైః స్వర్ణతోరణైః
మహాసురభిభిర్ధూపైర్మణ్డితం తత్ర తత్ర వై

యజ్ఞ్యము పూర్తి చేసుకుని వస్తున్న పృధు చక్రవర్తికి ప్రజలు ఘన స్వాగతం చెప్పారు, స్వర్ణ తోరణాలతో పట్టు వస్త్రాలతో పుష్ప మాలలతో ముత్యాలతో గొప్ప సువాసన గల ధూఒపాలతో అలంకరించి స్వాగతం చెప్పారు.

చన్దనాగురుతోయార్ద్ర రథ్యాచత్వరమార్గవత్
పుష్పాక్షతఫలైస్తోక్మైర్లాజైరర్చిర్భిరర్చితమ్

చందనం కస్తూరి అగరు పన్నీటి జలముతో నాలుగు దారుల కూడళ్ళనూ, అన్ని దారులకూ వెదజల్లి, పుష్పాలతో అక్షతలతో పళ్ళతో కొన్ని రకాల ఆకులతో దీపములల్తో పేలాలతో అలంకరించి, అరటి గెలలతో కూడిన స్తంభాలతో అలంకరించారు

సవృన్దైః కదలీస్తమ్భైః పూగపోతైః పరిష్కృతమ్
తరుపల్లవమాలాభిః సర్వతః సమలఙ్కృతమ్

పోక చెట్లతో అలంకరించారు. చెట్లూ చిగురుటాకులూ పుష్పమాలలతో అలంకరించి మంగళ హారతులు పట్టుకుని మంగళములు చేస్తూ ఎదురొచ్చారు ఆ పుర ప్రజలు.

ప్రజాస్తం దీపబలిభిః సమ్భృతాశేషమఙ్గలైః
అభీయుర్మృష్టకన్యాశ్చ మృష్టకుణ్డలమణ్డితాః

నగరాన్ని అలంకరించారు ద్వారాన్నీ వీధులనీ అలంకరించారు, వారిని వారు అలంకరించుకుని చెవులకు కుండలాలతో, కిరీటాలతో హారాలతో అలంకరించుకుని ఎదురు వెళ్ళారు

శఙ్ఖదున్దుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజామ్
వివేశ భవనం వీరః స్తూయమానో గతస్మయః

శంఖ నాదం దుందుభి నాదముతో వేద ఘోషతో అందరిచే స్తోత్రం చేయబడ్డాడు. ఏమాత్రమూ గర్వమూ లేకుండా వినయముతో నగరములోకి ప్రవేశించాడు. (స్మయమంటే గర్వం)

పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః
పౌరాఞ్జానపదాంస్తాంస్తాన్ప్రీతః ప్రియవరప్రదః

గొప్ప కీర్తి పొందిన వాడు కాబట్టి ప్రజలచే కీర్తించబడ్డాడు. తనని పూజించినవారిని పూజించాడు. పౌరలను జనపదములో ఉండేవారినీ సామంతులనూ వారికి కావలసిన కానుకలు వారికిచ్చి పూజించాడు

స ఏవమాదీన్యనవద్యచేష్టితః కర్మాణి భూయాంసి మహాన్మహత్తమః
కుర్వన్శశాసావనిమణ్డలం యశః స్ఫీతం నిధాయారురుహే పరం పదమ్

ఇలా పృధు చక్రవర్తి పది మంది చేత కీర్తించబడ్డ కార్యాలు చేసి మహానుభావుడేఉ గొప్ప పనులనూ చాలా పనులనూ చేస్తూ భూమండలాన్ని శాసించాడు. బాగా వృద్ధి పొందిన కీర్తిని అంతటా వ్యాపింపచేసి పరమపదాన్ని అధిష్ఠించాడు.

సూత ఉవాచ
తదాదిరాజస్య యశో విజృమ్భితం గుణైరశేషైర్గుణవత్సభాజితమ్
క్షత్తా మహాభాగవతః సదస్పతే కౌషారవిం ప్రాహ గృణన్తమర్చయన్

ఆది రాజైన అశేష గుణాలతో కీర్తి వ్యాపిప్మబడిన వాడు, గొప్ప గుణాలు కలవాడు కాబట్టి గుణములు కలవారిచేత కీర్తించబడిన వాడు. పరమభాగవతుడైన విదురుడు (క్షత్తా ) కథ చెబుతున్న మైత్రేయున్ని పూజిస్తూ ఇలా అడిగాడు

విదుర ఉవాచ
సోऽభిషిక్తః పృథుర్విప్రైర్లబ్ధాశేషసురార్హణః
బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్వోర్యాభ్యాం దుదోహ గామ్

పృధు చక్రవర్తి పెద్దల చేత రాజ్యాభిషేకం చేయించబడ్డాడు. దేవతల చేతా ఆరాధించబడ్డాడు. విష్ణువు యొక్క తేజస్సుని ధరించినవాడై ఆవు యొక్క పాలు పితికాడు.

కో న్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాః
లోకాః సపాలా ఉపజీవన్తి కామమద్యాపి తన్మే వద కర్మ శుద్ధమ్

ఏ కొంచమైన జ్ఞ్యానం ఉన్నవాడెవడైనా ఈయన కీర్తిని ఇంకా వినాలనుకోడు? ఏ మహానుభావుని పరాక్రమం చేత ఏర్పరచబడి, అతను అనుభవించిన తరువాత విడిచిపెట్టిన దాన్నే తక్కిన లోకపాలకులు అనుభవిస్తున్నారు, అతని పరాక్రమం యొక్క ఎంగిలే ఇదంతా. దీన్నే తక్కిన రాజులూ లోకపాలకులూ ఇప్పటికీ భుజిస్తూ బతుకుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఏమి చేసాడో చెప్పండి

మైత్రేయ ఉవాచ
గఙ్గాయమునయోర్నద్యోరన్తరా క్షేత్రమావసన్
ఆరబ్ధానేవ బుభుజే భోగాన్పుణ్యజిహాసయా

రాజధానిని గంగా ఎమునల మధ్య (ఆర్యావర్తః పుణ్యభూమి) క్షేత్రములో యజ్ఞ్య శాలనేర్పాటు చేసి, తాను సంపాదించిన సంపదలను బాగా అనుభవించాడు చేసిన పుణ్యం మొత్తం అనుభవించాలని. పుణ్యపాపాలు రెండూ పోతేనే మోక్షం వస్తుంది.

సర్వత్రాస్ఖలితాదేశః సప్తద్వీపైకదణ్డధృక్
అన్యత్ర బ్రాహ్మణకులాదన్యత్రాచ్యుతగోత్రతః

ప్రభువు ఆజ్ఞ్యను అందరూ అనువర్తించి ఉండేవారు. ఇతని ఆజ్ఞ్యను ఎవరూ తిరస్కరించే వారు కాదు. అలా సప్త్ ద్వీపాలనీ పరిపాలించాడు. ఏడు ద్వీపాలు గల భూమండలాన్ని పరిపాలించాడు. బ్రాహ్మణోత్తములని భగవత్భక్తులకూ తప్ప అందరినీ శాసించాడు,

ఏకదాసీన్మహాసత్ర దీక్షా తత్ర దివౌకసామ్
సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సత్తమ

ఒక మహా సత్ర దీక్షని ఏర్పాటు చేసాడు. దానికి దేవతలూ బ్రహ్మర్షులూ రాజర్షులూ వచ్చారు

తస్మిన్నర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్హతః
ఉత్థితః సదసో మధ్యే తారాణాముడురాడివ

వచ్చిన వారందరూ వారి వారి యోగ్యతలకనుగుణముగా ఆరాధించబడ్డారు. సభామధ్యములోంచి రాజు నక్షత్రాల మధ్య చంద్రుడి వలే లేచి నిలబడ్డారు

ప్రాంశుః పీనాయతభుజో గౌరః కఞ్జారుణేక్షణః
సునాసః సుముఖః సౌమ్యః పీనాంసః సుద్విజస్మితః

ఉన్నతుడు, ఎత్తైన్ భుజములు కలవాడు, ఎర్రటి వర్ణం కలవాడు, పద్మం వంటి నేత్రములు కలవాడు, కొనదేరిన ముక్కు కలవాడు చక్కని ముఖం కలవాడు చక్కని పలు వరుస కలిగి ఉన్న చిరునవ్వు కలవాడు.

వ్యూఢవక్షా బృహచ్ఛ్రోణిర్వలివల్గుదలోదరః
ఆవర్తనాభిరోజస్వీ కాఞ్చనోరురుదగ్రపాత్
సూక్ష్మవక్రాసితస్నిగ్ధ మూర్ధజః కమ్బుకన్ధరః
మహాధనే దుకూలాగ్ర్యే పరిధాయోపవీయ చ
వ్యఞ్జితాశేషగాత్రశ్రీర్నియమే న్యస్తభూషణః
కృష్ణాజినధరః శ్రీమాన్కుశపాణిః కృతోచితః

ఉన్నతమైన వక్షస్థలం గలవాడు. మూడు వల్గులు కల ఉదరం కలవాడు. సుడిలాంటి నాభి కలవాడు, ఓజోవంతుడు బంగారములాంటి తొడలూ ఉన్నతమైన పాదములూ కలవాడు, సూక్షమైనవీ వంకర తిరిగినా నల్లని దట్టమైన కేశములు కలవాడు. శంఖం వంటి కంఠం కలవాడు. విలువైన పట్టు పీతాంబరలాను కట్టుకున్నాడు. నియమే న్యస్తభూషణః - యజ్ఞ్య దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆభరణాలను విడిచిపెట్టాడు (కాబట్టి ఆభరణాలను విడిచిపెట్టిన ఆయన అవయవ సౌందర్యం అందరూ చూడగలుగుతున్నారు)
కృష్ణాగినాన్ని ధరించాడు, చేతిలో ధర్భాన్ని ధరించాడు. ఆచమనం చేసినవాడు

శిశిరస్నిగ్ధతారాక్షః సమైక్షత సమన్తతః
ఊచివానిదముర్వీశః సదః సంహర్షయన్నివ

ప్రేమతో నిండిన చల్లని చూపు కలవాడు. వచ్చిన వారిని చూచి ఈయన ఇలా పలికాడు

చారు చిత్రపదం శ్లక్ష్ణం మృష్టం గూఢమవిక్లవమ్
సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివ

అందమైన మాటలూ, వినగానే ఆనందం కలగాలి, వినయముతో ఉండాలి (శ్లక్ష్ణం ) , గంభీరముగా ఉండాలి, అర్థము పండితులకి మాత్రమే కావాలి, దైన్యము లేని మాటలు కావాలి. ఇవన్నీ కలిగి ఉన్న మాటలు మాట్లాడాడు. యజ్ఞ్యమునకు వచ్చిన వారందరికీ మేలు జరగడానికి, వారికి కావలసినవీ, వారు చేయవలసినవీ

రాజోవాచ
సభ్యాః శృణుత భద్రం వః సాధవో య ఇహాగతాః
సత్సు జిజ్ఞాసుభిర్ధర్మమావేద్యం స్వమనీషితమ్

సభకు వచ్చిన మహానుభావులారా, మీకు మంగళం కలుగు గాక, నేను చెప్పేది వినండి. ఇది సజ్జనులకోసము. తెలుసుకోవాలనే జిజ్ఞ్యాస ఉన్నవాడు తెలుపగల సజ్జనులు వచ్చి చేరినప్పుడు తన మనసులో ఉన్నదాన్ని వారికి నివేదించాలి. నేను జ్ఞ్యానిగా మాట్లాడటం లేదు. ఉపదేశం చేయుట లేదు. విజ్ఞ్యాపన చేస్తున్నాను.

అహం దణ్డధరో రాజా ప్రజానామిహ యోజితః
రక్షితా వృత్తిదః స్వేషు సేతుషు స్థాపితా పృథక్

నన్ను బ్రహ్మ (పరమాత్మ) ప్రజలను శాసించమని రాజుగా నియమించాడు. నా పని దండించడమే కాదు, వారిని కాపాడాలి కూడా. ఒక వేళ వారికి పని లేకపోతే వారికి వృత్తినివ్వాలి. వారి వారిని వారి వారి మర్యాదలలో నిలపాలి. ఎవరూ మర్యాదాతిక్రమణ చేయకుండా చూడాలి. విడి విడిగా వారి వారి ధర్మాలలో వారిని నిలిపేది నేనే. వారికి బ్రతుకు తెరువునివ్వాలి, వారిని కాపాడాలి. ధర్మాన్ని నియమించాలి.

తస్య మే తదనుష్ఠానాద్యానాహుర్బ్రహ్మవాదినః
లోకాః స్యుః కామసన్దోహా యస్య తుష్యతి దిష్టదృక్

పరమాత్మ నియమించిన పనిని సక్రమముగా చేసిన నాకు నేననుకున్న కోరికలు తీర్చే లోకాలు ఎలాగూ వస్తాయి. వీటి కన్నా నాకు కావలసినదేమిటంటే ఇలా అనుష్ఠించిన వాడిని చూచి పరమాత్మ సంతోషిస్తాడు. రాజు రాజ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే, దాని వలన స్వర్గములే కాక, అదృష్టాన్ని బాగా పరిశీలించే పరమాత్మ సంతోషించి మోక్షాన్నిస్తాడు.

య ఉద్ధరేత్కరం రాజా ప్రజా ధర్మేష్వశిక్షయన్
ప్రజానాం శమలం భుఙ్క్తే భగం చ స్వం జహాతి సః

ప్రజలను ధర్మములో ప్రవర్తింపచేయకుండా వారి నుండి పన్ను తీసుకున్నవాడు ప్రజలు చేసిన పాపాలను అనుభవించవలసి వస్తుంది. అంతే కాదు, తనకున్న జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులూ పోతాయి.

తత్ప్రజా భర్తృపిణ్డార్థం స్వార్థమేవానసూయవః
కురుతాధోక్షజధియస్తర్హి మేऽనుగ్రహః కృతః

నేను రాజును. మిమ్ములను పరిపాలిస్తున్న నాకు కృతజ్ఞ్యతగా అసూయ (ఎదుటివారిలో దోషాలు చూసే) లేకుండా మీ మీ ధర్మాలను ఆశ్రయించండి. నా కోసం, నా మీద కృతజ్ఞ్యతా బుద్ధితో ఆచరించండి. స్వార్థముతోనే చేయండి (స్వర్గాది లోకాలు వస్తాయని). కానీ అసూయ లేకుండా చేయండి. ఫలము మీద కోరికలేకుండా భగవంతుని ధ్యానిస్తూ చేయండి. నిజముగా త్యాగులైన వారు ఫలమును కోరక పరమాత్మకు అర్పిస్తారు. భోగులు  ఫలం కోరతారు. ఫలము కోరేవారు కూడా పరమాత్మ మీద ధ్యానముతో చేస్తే ఫలితాన్ని ఆయనే ఇస్తాడు. మనం చేరవలసినదీ అతన్నే, చేరచవలసినదీ అతనే. పరమాత్మని ఆరాధిస్తూ చేయడం వలన మనసు పరిశుద్ధిగా ఉంటుంది కాబట్టి రాగ ద్వేషాలు ఉండవు. నాకు కృతజ్ఞ్యత చెబుతున్నట్లుగా చేయండి. ఆచరించే ధర్మం పరమాత్మ కైంకర్యముగా చేయండి. ఇలా మీరు చేస్తే నన్ను దయ చూచిన వారవుతారు.

యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయోऽమలాః
కర్తుః శాస్తురనుజ్ఞాతుస్తుల్యం యత్ప్రేత్య తత్ఫలమ్

పితృదేవతలూ రాజర్షులూ మహర్షులూ మా వారు చేస్తున్న ధర్మాన్ని ఆమోదించండి. ధర్మమును ఆచరించిన వారికెంత ఫలమో ఆమోదించినవారికీ అంతే ఫలం.

అస్తి యజ్ఞపతిర్నామ కేషాఞ్చిదర్హసత్తమాః
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః

మొత్తం పధ్నాలుగు శాస్త్రాల యొక్క చర్చ ఉన్న శ్లోకం ఇది
మనమాచరించే యజ్ఞ్యమునకు ఒక అధిపతి ఉన్నాడు.
పరమాత్మను ఒప్పుకోని వారు కొందరుంటారు. భగవంతుడున్నాడని ఒప్పించడానికి "పరమాత్మ ఉన్నాడు" అని అన్నాడు పృధువు. పరమాత్మ లేడు అనే వారి ఉద్దేశ్యమేమిటి? పరమాత్మ ఉన్నట్లైతే వేటి వేటి వలన తెలియాలో వాటి వాటి వలన పరమాత్మ తెలియబడట్లేదు. ప్రత్యక్షం మనకు ఒక ప్రమాణం. కంటికి కనపడడు,  చెవికి వినబడడు. ప్రత్యక్షముతో తెలియబడడు. ప్రత్యక్షముతో తెలియబడనిది అనుమానముతో తెలియబడదు. ఉదా: అంతకు ముందు మనం నిప్పు వలన పొగ చూసిన వారే పొగను చూసి అక్కడ నిప్పు ఉందీఇ అనుకుంటారు. కాబట్టి ప్రత్యక్షముతో తెలియబడని వస్తువు అనుమానముతో తెలియబడదు. అలాగే ప్రత్యక్షముతో తెలియబడనిది ఉపమానముతో కూడా తెలియబడదు. ఇక మిగిలిన ప్రమాణం శబ్దము. ఇది రెండు రకాలు. లౌకిక శబ్దము మనము మాట్లాడుకునేది. వైదిక శబ్దాలు వేదాలు. లౌకిక శబ్దం ప్రమాణం కాదు. ఎందుకంటే వాటిలో భ్రమా పొరబాటూ ఉంటుంది. బాధితులూ స్వార్థులూ ఆశాపరులూ ఒక తీరుగా ఉన్న దానిని ఇంకో తీరుగా చెప్పవచ్చు. మరచిపోయీ చెప్పవచ్చు. శబ్దము మనకు అర్థమును తెలపాలంటే ఎలాంటిది కావాలి? ప్రపంచములో మాట్లాడేవారందరూ వ్యాకరణ శాస్త్రమూ వేదమూ తెలిసి మాట్లాడుకుంటారా? వారి వారి పెద్దల వలన వచ్చిన శాబ్ద బోధే వారు మాట్లాడుకుంటారు. వృధ్ధులూ పెద్దలూ చెప్పేవన్నీ అశాశ్వతములే అనిత్యములే. మన ఇంట్లో పెద్ద వారు వేద శబ్దాలను చెబుతున్నారా? లేదు. వృద్ధ వ్యవహారము కూడా నశించేవాటి గురించే చెబుతాయి. నశించని పరమాత్మ నశించే వస్తువులను కూర్చి చెప్పే ప్రమాణముతో వర్ణింపబడలేదు. శబ్దమూ ప్రమాణము కాదు. ఉపమానం అనుమానం ప్రత్యక్షం ప్రమాణం కాదు.
వేదములో ఉన్నవన్నీ అర్థవాదాలు. మరి జగత్తుకు కారణం అని దేన్నంటారు. మనకు ఆచరించే పనులకు రావలసిన ఫలాన్ని ఎవరిస్తారు? ప్రకృతే ఫలమిస్తుందని కొందరి వాదన. ఉదా: భూమిలో విత్తనం వేస్తే పంట వస్తోంది,  వాన పడితే భూమి పండుతోంది. దేశ కాల వస్తు విభాగాలను ముందు పెట్టుకుని అవే ఇస్తున్నాయి. ప్రకృతి కంటే జీవుని కంటే విలక్షణముగా పరమాత్మ ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవాలి. సృష్టి జీవులు చేస్తున్నాయి, ప్రకృతి ఫలితం ఇస్తోంది. కనుక పరమాత్మ లేడు. జీవుడే కర్త. అని ఒక వాదం.
ఈ వాదాలు చెప్పేవారందరికీ సమాధానముగా పృధు చక్రవర్తి "అస్తి యజ్ఞ్యపతి" అన్నాడు
కొందరి దృష్టిలో పరమాత్మ లేడు అంటున్నారేమో గానీ పరమాత్మ ఉన్నాడని చెప్పేవారి సంఖ్యే ఎక్కువ - కేషాఞ్చిదర్హసత్తమాః
మరి దానికి ప్రమాణమేమిటి? అన్ని లోకాలూ ఒక్క తీరులో ఉన్నాయా? విశేశముగా ప్రకాశించే లోకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని లోకాలు చీకటితో ఉన్నాయి.
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః -
కొన్ని లోకాలలో సుఖమూ కొన్ని లోకాలలో దుఃఖముంది. దుఃఖము కలిగేదాన్ని జీవుడెందుకు సృష్టించాడు. లోకాలను జీవుడెందుకు సృష్టించాడు. ఆ జీవుడు స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే యజ్ఞ్యం ఎందుకు చేస్తున్నాడు? అంటే జీవుడే స్వర్గాన్ని సృష్టించి, ఆ స్వర్గానికి వెళ్ళడానికి మళ్ళీ యజ్ఞ్యమెందుకు చేస్తున్నాడు? అంటే తన ఇంటికి తాను వెళ్ళడానికి ఇంకొకరి అనుమతి కావాలా?కాదు, ఈ లోకాలన్నీ ప్రకృతే సృష్టిస్తోందనుకుందాము. ప్రకృతే సృష్టిస్తోంటే ఇన్ని చిత్ర విచిత్రాలు ప్రకృతిలో ఉండకూడదు. ప్రకృతి పరిణామశీలము. ప్రకృతి స్తబ్ధముగా ఉండదు. మరి నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో ఏమి చేస్తుంది? నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో కూడా పరిణామశీలం కావాలి కదా. ప్రకృతి ప్రళయకాలములో స్తబ్ధముగా ఉంటుంది. అంటే ప్రకృతి సృష్టి చేయట్లెదు. జీవుడు సృష్టి చేసాడనుకుంటే నరకాన్నిచ్చే పాపాన్నెందుకు సృష్టిస్తాడు. సృష్టించిన పాపాన్ని తాను ఆచరిస్తాడా? తాను పాపాన్ని సృష్టించి దాని వలన బాధలు పడడానికి నరకాన్ని సృష్టించి దానిలో బాధపడతాడా?
కొన్ని జీవులు పురుగులుగా కొన్ని కీటకాలుగా ఎందుకు పుడుతున్నాయి. ఇన్ని రకాల జీవరాశులు ఎందుకుంటాయి. ప్రపంచములో ఏ జీవుడైనా అలాంటి జన్మ కావాలి అని కోరుకుంటారా?
అంటే జీవుడూ కాదు, ప్రకృతీ కాదు సృష్టి చేసేది. అందుకే ఈ రెంటికీ విలక్షణముగా ఒకడు సృష్టి చేస్తాడు. ఆచరించే పనులను రెండు భాగాలుగా విభజించాడు, మంచి కర్మలూ చెడు కర్మలూ అని.
ఆయన ఆజ్ఞ్యను శాస్త్రం అని చెప్పి, మన చేత చేయించాడు, వ్యవస్థలో పనీ, పనిని చేయించేవాడు, పని చేసేవాడు, చేసిన వాడు తప్పు చేస్తే శిక్షించేవాడు, ఒప్పు చేస్తే రక్షించేవాడు ఉండాలి. జీవుడే సృష్టించేవాడంటే, పని తానే సృష్టించి, దాని ఫలితాన్నీ తానే పొందుతాడా? అంటే తప్పు తానే చేసి తనను తానే కారాగారములో పెట్టుకుంటాడా? అంటే ఒక యజ్ఞ్యపతి ఉన్నాడు.
యజ్ఞ్యం అంటే కర్మ, యజ్ఞ్యము చేసేవాడు కర్త, చేయించే వాడు పరమాత్మ. ఒక శాసకుడూ ప్రభువూ, రక్షకుడూ ఉన్నాడు. పాపము చేస్తే ఒక లోకానికీ పుణ్యము చేస్తే ఒక లోకానికీ పముపుతాడు. కర్మా కర్తా శాసకుడూ ఉన్నారు. ఈ ప్రకృతినీ జీవాత్మనూ పరమాత్మ తన ఇష్టానుపూర్వముగా నడిపిస్తున్నాడు. చిత్ర విచిత్రములైన లోకములూ దేహములూ పనులూ, ఈ మూడూ ఉన్నాయంటే ఇవి మనకు మనముగా చేసుకునేవి కావు. ఎవరి మటుకూ వాడు కష్టపడేవాటిని సృష్టించుకోడు. దొంగా, కారాగారం, కారాగారములో వేసేవాడు ఈ ముగ్గురూ వేరు. మనకు ఇష్టము లేకుండా మనం బాధపడే లోకాలు ఉన్నాయి, మనను బాధపెట్టే పనులూ ఉన్నాయి. అంటే ఇది ఎవరి పని? ఎవరికి వారు వారిని వారు బాధించుకోడూ, శిక్షించుకోడూ కాబట్టి అవి ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. సృష్టించింది మానవుడే అయి ఉంటే ఎవరికీ రోగాలు రావు. అందుకే యజమాని ఒకడు ఉన్నాడు. కర్మ (యజ్ఞ్యము) ఉంది.
అందుకే పరమాత్మ ఉన్నాడు. ఎటువంటి సందేహము లేదు. భూలోకములో హిమాలయాది ప్రాంతాలూ ఉన్నాయి, నీటి చుక్కలు లేని ఎడారులూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఒకలా ఎందుకు లేవు. అలాగే పరలోకాలలో కూడా యమలోకం వరుణ లోకం పితృలోకం అని ఉన్నాయి. కర్మలను బట్టి ఆయా కర్మలను ఆచరించిన వారికి ఆయా లోకాలను పంపడానికి ఆ లోకాలు సృష్టించబడ్డాయి. పరమాత్మ ఉన్నాడు అనడానికి ఒక ప్రమాణం ప్రకృతే. కర్తా కారయితా, చేసే వాడు చేయించేవాడూ చేసే పనీ  పనికి ఫలితం, - ఈ నాలుగు ఒక తీరుగా ఉండవు. తర్క మీమాన్స (జైన) కార్తాంతికులనూ పృధువు ఈ విధముగా

మనోరుత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః
ప్రియవ్రతస్య రాజర్షేరఙ్గస్యాస్మత్పితుః పితుః

మరి ఈ వాదాన్ని ఇది వరకు ఒప్పుకున్నవారున్నారా? మనువూ, ఆయన కుమారుడు ఉత్తాన పాదుడూం, ధ్రువుడూ , ప్రియవ్రతుడు, మా తాతగారైన అంగుడూ ఒప్పుకున్నారు

ఈదృశానామథాన్యేషామజస్య చ భవస్య చ
ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతా

వీరందరినీ సృష్టించిన బ్రహ్మ ఒప్పుకున్నాడు. శంకరుడూ ఒప్పుకున్నాడు. ప్రహ్లాదుడూ బలీ కొడుకూ కూడా ఒప్పుకున్నారు. వీరందరికీ పరమాత్మతో పని ఉంది. (వారందరూ పరమాత్మ చేత ఆయన ప్రీతిని ఫలముగా పొందినవారే)

దౌహిత్రాదీనృతే మృత్యోః శోచ్యాన్ధర్మవిమోహితాన్
వర్గస్వర్గాపవర్గాణాం ప్రాయేణైకాత్మ్యహేతునా

అందరూ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ విడిగా ఎందుకు చెప్పాలి? అంటే భగవంతుడు లేడు అని అనే వారు ఉన్నారు. మరి లేని వారికి పేరు ఎలా వస్తుంది. ఉన్న వస్తువుకు పేరు ఉంటుంది కానీ లేని వస్తువుకు ఉండదు.
మా తండ్రి ( మృత్యువు కూతురి కొడుకు) భగవంతుడు లేడన్నాడు. అతను ధర్మము వలన మోహం పొందాడు.
వర్గస్వర్గాపవర్గాణాం  - (త్రి)వర్గమంటే ధర్మార్థ కామాలు. స్వర్గమటే దాని ఫలితం. ఫలితం వద్దంటే కలిగేది అపవర్గం. త్రివర్గం సృష్టించినవాడూ స్వర్గం సృష్టించిన వాడూ అపవర్గం సృష్టించినవాడూ ఒకడా వేరా? ధర్మార్థ కామాలు దాని ఫలితమూ మోక్షమూ, ఈ మూడిటికీ ఒకడే కర్త ఉండాలి కాబట్టి పరమాత్మ ఉన్నాడు. ధర్మార్థ కామములను సృష్టించినవాడే వాటి ఫలితముగా స్వర్గాన్ని, పరమాత్మ అర్పణ బుద్ధితో చేస్తే అపవర్గమునూ సృష్టించాడు. కర్మ ఒకటే గానీ సంకల్పమును బట్టి స్వర్గాన్ని కానీ అపవర్గాన్నీ గానీ పొందుతాడు. వీటిని సృష్టించినది పరమాత్మ. అచేతనమైన ప్రకృతికి భేధమూ వైచిత్రీ కుదరదు, చేతానున్ని శాసించజాలదు, ప్రకృతి ఇచ్చుటా పుచ్చుకొనుటా కాని పని. జీవుడు కోరి కోరి తనకు కష్టాలను కలిగించుకునే పనిని చేయడు. అంటే ప్రకృతీ జీవుడూ కాకుండా ఈ మూడింటికీ ఒకడే కర్త ఉండాలి. వాడే పరమాత్మ.
పరమాత్మ ఉన్నాడు అనడానికి ఇదే హేతువు.

యత్పాదసేవాభిరుచిస్తపస్వినామశేషజన్మోపచితం మలం ధియః
సద్యః క్షిణోత్యన్వహమేధతీ సతీ యథా పదాఙ్గుష్ఠవినిఃసృతా సరిత్

తపస్వులకీ మునులకీ పరమాత్మ పాద సేవ యందు అభిరుచి ఉంటుంది. అది రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది - అన్వహమేధతీ. ఒక్క నాడు అన్నం తింటే రోజూ ఎలా ఆకలి కాకుండా ఉంటుందో అలా. ఎన్నో జన్మలనుండీ కష్టపడి సంపాదించుకున్న బుద్ధికి పట్టిన మురికి (పాపం) పోగొడుతుంది ఎలా ఐతే పరమాత్మ పాదాంగుష్ఠమునుండి పుట్టిన గంగ లాగ.

వినిర్ధుతాశేషమనోమలః పుమానసఙ్గవిజ్ఞానవిశేషవీర్యవాన్
యదఙ్ఘ్రిమూలే కృతకేతనః పునర్న సంసృతిం క్లేశవహాం ప్రపద్యతే

అది పోతే ఏమవుతుంది? బుద్ధికంటిన మురికి పోవడం వలన వైరాగ్యం కలుగుతుంది. సంసారం మీద కోరికా అంటే బుద్ధికి పట్టిన మురికి. ఎపుడైతే అది పోయిందో విజ్ఞ్యానం కలుగుతుంది. దేహం వేరు ఆత్మ వేరనే వివేకం కలుగుతుంది. అలా వివేక వైరాగ్యాలు పుడతాయి. ఇల్లూ వాకిలీ అంతా పరమాత్మ పాదములని తెలుసుకుని అక్కడ నివాసమేర్పరచుకుని మళ్ళీ తిరిగి రాడు. అది కలగాలంటే దేహాత్మ వివేకమూ వైరాగ్యమూ కావాలి. అది కావాలంటే మురికి పోవాలి. అలాంటి వాడు కష్టాలకు పుట్టినిల్లు అయిన సంసారములో ప్రవేశించడు

తమేవ యూయం భజతాత్మవృత్తిభిర్మనోవచఃకాయగుణైః స్వకర్మభిః
అమాయినః కామదుఘాఙ్ఘ్రిపఙ్కజం యథాధికారావసితార్థసిద్ధయః

మీ మీ వర్ణాశ్రమ ఆచార అనుగుణ ధర్మముతో పరమాత్మను ఆరధించండి. మనో వాక్కాయ కర్మలతో భజించండి. మోసం చేయకండి. భగవంతున్ని ఆరాధిస్తున్నట్లు నటించకండి. బుద్ధితో కూడా పరమాత్మనే ధ్యానించాలి. ఆలోచనలో కూడా కాపట్యం ఉండకూడదు. ఎందుకంటే ఆయన కామదుఘ్ - అన్ని కోరికలనూ తీరుస్తాడు. కొలిచినా కొలవకున్నా ఆయన మన కోరికలను తీరుస్తాడు. యథాధికారావసితార్థసిద్ధయః - మీ మీ యోగ్యతలను బట్టి ఫల సిద్ధి లభిస్తుంది.

అసావిహానేకగుణోऽగుణోऽధ్వరః పృథగ్విధద్రవ్యగుణక్రియోక్తిభిః
సమ్పద్యతేऽర్థాశయలిఙ్గనామభిర్విశుద్ధవిజ్ఞానఘనః స్వరూపతః

యజ్ఞ్యమూ యజ్ఞ్య సంబారాలూ యజ్ఞ్య మంత్రాలు యజ్ఞ్య కర్తా యజ్ఞ్య యజమానీ యజ్ఞ్య ఫలితమూ , యజ్ఞ్య ఫలితాన్నిచ్చేవాడూ పరమాత్మే.
అసౌ - ఈయనే. అనేక గుణః - అనంతమైన కళ్యాణ గుణాలు కలవాడు. అగుణః - ప్రకృతి సంబంధమైన గుణాలు లేని వాడు. అధ్వరః - యజ్ఞ్య స్వరూపుడు. యజ్ఞ్యమే కాదు, యజ్ఞ్యానికి కావల్సిన ద్రవ్యములు కూడా పరమాత్మే. గుణాలు (ఉదా: లోహిత శుక్ల కృష్ణాం - ఎరుపూ తెలుప్పూ నలుపూ ఉండిం, ఒకే సంవత్సరం వయసు గల మేక కావాలి, ఇవన్నీ ద్రవ్యములో గుణాలు ), క్రియ (ఉదా: వడ్లను దంచితే వచ్చిన బియ్యమును పొడిగా చేసి, మళ్ళి వేచి అందులో నెయ్యి వేయాలి, ప్రోక్షణ చేయాలి, నెయ్యిపోసిన గిన్నెను అగ్ని దగ్గర పెట్టి దాన్ని కరిగించాలి, మంత్రాలు ఉండాలి. ఇవన్నీ క్రియలు)
అర్థ ఆశయ లింగ నామభిః - అర్థం (ఉదా: స్వర్గము), ఆశ్రయం (ఇంద్రుడు), ఆ రూపం ధరించినవాడు, ఆ పేరు గలవాడు అనే ఈ నాలుగూ పరమాత్మే. అంటే ఆయా లోకాలు లేదా ఫలములూ, ఆ లోకమునకు,లేదా ఫలమునకూ ఆశ్రయమూ, ఆ రూపము గలవాడూ, పేరు కలవాడూ పరమాత్మే. ఆ పరమాత్మకు ఎలాంటి గుణాలూ లేవు, పరిశుద్ధమైన విజ్ఞ్యానమే మూర్తీభవించినవాడు పరమాత్మ. ఆయనకు ఏ ఆకారమూ గుణమూ బాధా సంతోషమూ లేదు. ఆయన మనకోసం ద్రవ్యాలనూ గుణాలను క్రియలనూ మంత్రాలనూ ఫలితాలనూ లోకాలనూ అధిపతులనూ ఆకారాలనూ వారి పేర్లనూ సృష్టించాడు.

ప్రధానకాలాశయధర్మసఙ్గ్రహే శరీర ఏష ప్రతిపద్య చేతనామ్
క్రియాఫలత్వేన విభుర్విభావ్యతే యథానలో దారుషు తద్గుణాత్మకః

అంతెందుకు మనము కూడా ఆయనే. శరీరమూ మనసూ బుద్ధీ ఆత్మా అంతర్యామీ ఆయనే. దేన్ని బట్టి మనం వేరు వేరు అంటున్నాము? ఈ పృధక్ భావానికి బీజమేది? శరీరం. ఈ శరీరం ఎలా వచ్చింది. ప్రకృతీ కాలమూ (ప్రకృతిని క్షోభింపచేసేది),  బుద్ధి (ఆశయం - మహత్ తత్వం), దానితో ఆచరించే ధర్మములూ (కర్మలు) - వీటి ఫలితం శరీరం. ఈ శరీరములోకి జీవ రూపిగా పరమాత్మ ప్రవేశిస్తాడు. అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య వ్యాకరవాణీతి (చాంధోగ్యోపనిషత్తు)
కట్టెలలో ఉన్న అగ్ని ఆ కట్టెల రూపాన్ని పొందినట్లుగా ఈ పరమాత్మే ఆయా కర్మల రూపములో ఫలితాన్ని అనుభవిస్తాడు

అహో మమామీ వితరన్త్యనుగ్రహం హరిం గురుం యజ్ఞభుజామధీశ్వరమ్
స్వధర్మయోగేన యజన్తి మామకా నిరన్తరం క్షోణితలే దృఢవ్రతాః

ఎవరైతే తమ ధర్మాలను విశ్వ గురువైన పరమాత్మను నిరంతరమూ ఆరాధిస్తున్నారో వారు నా వారు.
నా ప్రజలు నన్ను అనుగ్రహిస్తున్నారు. శాసనముల వలన కార్యాలు జరుగవు. ప్రభువు శాసనాన్ని పాటించేవారంటే ప్రభువు మీద ప్రీతి ఉన్నవారు.

మా జాతు తేజః ప్రభవేన్మహర్ద్ధిభిస్తితిక్షయా తపసా విద్యయా చ
దేదీప్యమానేऽజితదేవతానాం కులే స్వయం రాజకులాద్ద్విజానామ్

బ్రహ్మ క్షత్రం ఒకరినొకరు ఆగ్రహించుకునేట్లుగానీ నిగ్రహించుకునేట్లుగానీ ఈ రాజ్యములో ఉండకూడదు
రాజకులాద్ద్విజానామ్ కులే స్వయం - క్షతిర్యులనూ బ్రాహ్మణులూ, బ్రాహ్మణులను క్షత్రియులూ ఒకరినొకరు ద్వేషించరాదు.
రాజులకు సంపదా అధికారం క్షత్రియమైన తేజస్సు ఉంటుంది. వాటితో అహంకరించి బ్రాహ్మణులను అవమానించే అవకాశముంది. కానీ వారికి వచ్చిన బలం తేజస్సూ అధికారం వచ్చింది బ్రాహ్మణుల వలనే.
రాజులకు సంపదా అధికారం పరాక్రమం. బ్రాహ్మణులకు తపస్సు విద్యా ఓర్పూ ఉన్నాయి. అందుకని వీరు పరస్పరం ఒకరినొకరు తిరస్కరించకూడదు.
అజితదేవతానాం కులే - పరమాత్మను మాత్రమే ఆరాధించే కులము వారు, బ్రాహ్మణులు. వారి తేజస్సు మమ్మల్ని కప్పిపుచ్చవద్దు.

బ్రహ్మణ్యదేవః పురుషః పురాతనో నిత్యం హరిర్యచ్చరణాభివన్దనాత్
అవాప లక్ష్మీమనపాయినీం యశో జగత్పవిత్రం చ మహత్తమాగ్రణీః

నిరంతరం బ్రాహ్మణుల పాద పరాగం ధరించి ఉంచుట వలనే లక్ష్మి నన్ను విడిచిపెట్టకుండా ఉంది అని పరమాత్మే చెప్పాడు. బ్రాహ్మణుల యందు అధికమైన  భక్తి కలవారికి (బ్రహ్మణ్యదేవః ) పరదైవమైన పరమాత్మ పురుషోత్తముడు, పురాతనుడు (కొలతకు ప్రమాణం దొరకని వాడు), బ్రాహ్మణుల పాద పద్మములకు నమస్కరించడం వలన నిత్యానపాయిని (ఎన్నడూ విడిచిపోని) లక్ష్మిని పొందాడు, గొప్ప కీర్తిని పొందాడు.

యత్సేవయాశేషగుహాశయః స్వరాడ్విప్రప్రియస్తుష్యతి కామమీశ్వరః
తదేవ తద్ధర్మపరైర్వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతామ్

బ్రాహ్మణులను సేవించడం వలన అందరిలో అంతర్యామిగా ఉన్న స్వరాట్ (తనను తాను ప్రకాశింపచేసుకునేవాడు), బ్రాహంఅనుల యందు అధిక ప్రీతి గలవాడు సంతోషిస్తాడు. కాబట్టి మీ మీ ధర్మాలు ఆచరించే వారు వినయముతో అన్ని విధాలా బ్రాహ్మణులను సేవించండి.

పుమాన్లభేతానతివేలమాత్మనః ప్రసీదతోऽత్యన్తశమం స్వతః స్వయమ్
యన్నిత్యసమ్బన్ధనిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజామ్

 బ్రాహ్మణులను ఆరాధిస్తే హద్దు అంటూ లేకుండా మనసు ప్రసన్నమవుతుంది. దాని వలన మనసులో బుద్ధిలో ఉండే ఉద్వేగం కొరత క్రోధం పోయి శాంతిని పొందుతారు. దీని కంటే కావలసినదేముంటుంది. బ్రాహ్మణులని సేవించడం వలన బ్రాహ్మణులను సేవించడం వలన వచ్చే ఫలితమే కాకుండా యజ్ఞ్య యాగాదులు ఆచరించడం వలన (అగ్నిహోత్రములో హవిస్సు ఇవ్వడం వలన) వచ్చే ఫలితం వస్తుంది, ఎందుకంటే అఖిల దేవతలు బ్రాహ్మణుల ముఖము. పరమాత్మకూ దేవతలకూ ముఖము వంటి వారు బ్రాహ్మణులు. అందుకని బ్రాహ్మణులని ఆరాధిస్తే దేవతలు కూడా సంతోషిస్తారు.

అశ్నాత్యనన్తః ఖలు తత్త్వకోవిదైః శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభిః
న వై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్యపర్యగుః

ఇంద్రుడనీ ఉపేంద్రుడనీ వరుణుడనీ ఏ బ్రాహ్మణులకు భోజనం పెడితే పరమాత్మ ఆరగిస్తాడో అగ్నిహోత్రుడలో వేస్తే అలా భుజించడు. అగ్నిహోత్రుడు చైతన్యం లేని వాడు. చైతన్యం లేని అగ్నిహోత్రునిలో వేయడం కంటే చైతన్యం కలిగిన బ్రాహ్మణులకు పెడితే పరమాత్మ ఆనందిస్తాడు. పరమాత్మ పరమహంసలచేత ఆరాధించబడతాడు. పరమహంసలున్న చోటికి పరమాత్మ వెళతాడు. బ్రాహ్మణులూ మునులూ యోగుల సమాగం ఉంటేనే అక్కడ పరమాత్మ ఉంటాడు.

యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధాతపోమఙ్గలమౌనసంయమైః
సమాధినా బిభ్రతి హార్థదృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే

పరమాత్మ చాలా పెద్దవాడు (యద్బ్రహ్మ ), పెద్దవాటన్నిటికంటే పెద్దవాడు, నాశం లేని వాడు, ఎలాంటి కల్మషములూ లేని వాడు, అనాధి నుండీ ఉన్నవాడు, అలాంటి పరమాత్మను ఆరాధించాలంటే శ్రద్ధా తపసు మౌనమూ మంగలమూ నియమమూ ఉండాలి. అలాంటి పరమాత్మ బ్రాహ్మణులలో అద్దములా ఉంటాడు. బ్రాహ్మణులు పరమాత్మకు అద్దము వంటి వారు. బ్రాహ్మణులను ఆరాధిస్తున్నామంటే పరమాత్మను ఆరాధిస్తున్నట్లే.

తేషామహం పాదసరోజరేణుమార్యా వహేయాధికిరీటమాయుః
యం నిత్యదా బిభ్రత ఆశు పాపం నశ్యత్యముం సర్వగుణా భజన్తి

నేను అలాంటి బ్రాహ్మణోత్తముల పాద పరాగం కిరీటము మీద ధరిస్తాను. ఇలా బ్రాహ్మణోత్తముల పాదపరాగాన్ని ధరించిన వారికి పాపం తొలగిపోతుంది. అలాంటి వారిని అన్ని ఉత్తమ గుణాలు వచ్చి పొందుతాయి

గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేऽను సమ్పదః
ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యమ్

సంపదలు ఎవరి దగ్గరకు వస్తాయి? అన్ని మంచి గుణములూ కలవాడికి, ఉత్తం శీలము కలవాడికి, చేసిన ఉపకారం మరచిపోని వాడికీ, పెద్దవారిని ఆశ్రయించి ఉన్నవాడికీ అన్ని సంపదలూ స్వయముగా వచ్చి వరిస్తాయి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు గోవులూ దేవతలూ పరమాత్మ నా విషయములో ప్రసన్నమవుదురు గాక.

మైత్రేయ ఉవాచ
ఇతి బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయః
తుష్టువుర్హృష్టమనసః సాధువాదేన సాధవః

ఈ మాటలు విన్న పితృదేవతలు పరమానందాన్ని పొందారు. పరమసతోషముతో రాజును "బాగా చెప్పవ" ని స్తోత్రం చేసారు

పుత్రేణ జయతే లోకానితి సత్యవతీ శ్రుతిః
బ్రహ్మదణ్డహతః పాపో యద్వేనోऽత్యతరత్తమః

మానవుడు అన్ని లోకాలనూ స్వయముగా గెలవాలంటే తన కుమారుడితో గెలుస్తాడని శ్రుతి. ఇంతవరకూ అది శ్రుతి అనిపించేది. ఇపుడు నీతో అది నిజమని అర్థమయింది. పరమ పాపి అయిన వేనుడు ఉత్తమగతులను పొందాడు. బ్రహ్మదండం పొందిన వాడు వేనుడు అజ్ఞ్యానాన్ని సంసారాన్ని దాటి మోక్షాన్ని పొందాడు.

హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిన్దయా తమః
వివిక్షురత్యగాత్సూనోః ప్రహ్లాదస్యానుభావతః

హిరణ్యకశిపుడు కూడా భగవన్నిందతో నరకానికి వెళ్ళవలసిన వాడే గానీ తన కొడుకు ప్రహ్లాదుని వలన ఉత్తమగతిని పొందాడు

వీరవర్య పితః పృథ్వ్యాః సమాః సఞ్జీవ శాశ్వతీః
యస్యేదృశ్యచ్యుతే భక్తిః సర్వలోకైకభర్తరి

అఖిల బ్రహ్మానడ కోటి నాయకుడైన నారాయణుని మీద భక్తి ఉన్న నీవు, భూమికి తండ్రివైన నీవు, చాలా కాలము చల్లగా బ్రతుకు.

అహో వయం హ్యద్య పవిత్రకీర్తే త్వయైవ నాథేన ముకున్దనాథాః
య ఉత్తమశ్లోకతమస్య విష్ణోర్బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి

మీ నాన్నగారే కాదు, ఉత్తముడైన నీవు రాజుగా ఉన్న మీ రాజ్యములో ఉన్న ప్రజలమైన మేము కూడా తరించాము. మాకు కూడా శ్రీమన్నారాయణుడే స్వామి. మహానుభావులందరూ గానము చేసే పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు బ్రాహ్మణోత్తములను ఆరాధించేవారికి దేవుడు, బ్రాహ్మణుల యందు ప్రీతి గల దేవుడు. ఆ పరమాత్మ కథను మీచే నిరంతరం వినడం వలన మేము కూడా ఆయన భక్తులమయ్యాము.

నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనమ్
ప్రజానురాగో మహతాం ప్రకృతిః కరుణాత్మనామ్

నీలాంటి మహానుభావుడు ప్రజలను ఇలా శాసించుట పెద్ద వింతేమీ కాదు. లోకములో రాజూలైన వారు తమ ఇంటిలో పరమాత్మను ఆరాధించవచ్చు గానీ, ప్రజల మీద ప్రేమతో ప్రజలు కూడా ముక్తి పొందాలని కరుణతో ఉన్న రాజులకు ప్రజలయందు అనురాగం ఉండుట సహజం.

అద్య నస్తమసః పారస్త్వయోపాసాదితః ప్రభో
భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవసంజ్ఞితైః

మహారాజా! ఈనాడు మా చీకటి మీ వలన తొలగించబడింది.  ఒక వేళ మీరు ఇలా మాకు తత్వమును బోధించకుంటే మా పరిస్థితి ఏమయి ఉండేది? పనులను చేస్తున్నాము, దేవతలను ఆరాధిస్తున్నాము. కానీ దేనికి ఆరాధిస్తున్నాము. మంచి ఇంటికోసమో భార్యకోసమో పిల్లల కోసమో ఆరాధిస్తున్నాము. సంసారములో పూర్తిగా మునిగి పోవడానికి ఆరాధిస్తూ సంసారమే నిత్యమూ సుఖమూ అనుకుని భ్రమిస్తున్నాము. వాస్తవానీ చూడలేకపోతున్నాము. నిత్యాన్ని అనిత్యమనీ, అనిత్యాన్ని నిత్యమనీ అనుకుంటున్నాము. అలాంటి మా అజ్ఞ్యానం నీ వలన తొలగించబడింది.

నమో వివృద్ధసత్త్వాయ పురుషాయ మహీయసే
యో బ్రహ్మ క్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజసా

పరమాత్మకు నమస్కారం! తత్వం బాగా తెలిసిన మహానుభావుడు, మహాపురుషుడూ అయిన పరమాత్మకు నమస్కారము. ఏ పరమాత్మ్ ఈ క్షత్రియున్ని ఆవేశించి పరిపాలిస్తున్నాడో అలాంటి మహా పురుషునికి నమస్కారం