Pages

Saturday, 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథులవిక్రమమ్
తత్రోపజగ్ముర్మునయశ్చత్వారః సూర్యవర్చసః

ప్రజలందరూ పృధు చక్రవర్తిని స్తోత్రం చేస్తుంటే సూర్యున్ని కూడా ప్రకాశింపచేసే తేజస్సు కలవారు నలుగురు వచ్చారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. 

తాంస్తు సిద్ధేశ్వరాన్రాజా వ్యోమ్నోऽవతరతోऽర్చిషా
లోకానపాపాన్కుర్వాణాన్సానుగోऽచష్ట లక్షితాన్

ఆకాశమునుండి తమ దివ్యమైన కాంతితో దిగుతున్న ఆ నలుగురు సిద్ధేశ్వరులూ సకల లోకములనూ పవిత్రము చేస్తూ ఉన్న వారిని పరివారముతో ఉన్న మహారాజు చూసాడు

తద్దర్శనోద్గతాన్ప్రాణాన్ప్రత్యాదిత్సురివోత్థితః
ససదస్యానుగో వైన్య ఇన్ద్రియేశో గుణానివ

అలాంటి వారు రాగానే లేచిన ప్రాణాలను తిరిగి తీసుకు రావడానికా అన్నట్లు రాజు కూడా లేచాడు. ఎప్పుడైతే ఆయా విషయములను అనుసరించి ఎలా లేస్తుందో రాజు తన వారందరినీ కూడ గట్టుకుని లేచాడు

గౌరవాద్యన్త్రితః సభ్యః ప్రశ్రయానతకన్ధరః
విధివత్పూజయాం చక్రే గృహీతాధ్యర్హణాసనాన్

పరమాత్మ యొక్క మొదటి సృష్టి వీరు. అంత పెద్దలు వచ్చారని గౌరవముతో తనను తాను నియమించుకున్నాడు, వినయముతో మెడ వంచుకుని ఉన్నాడు. అర్ఘ్య పాద్య ఆచమనీయ సింహాసనాలు ఇచ్చాక యధా విధిగా ఆరాధించాడు

తత్పాదశౌచసలిలైర్మార్జితాలకబన్ధనః
తత్ర శీలవతాం వృత్తమాచరన్మానయన్నివ

వారి పాదములు కడిగి ఆ పాద తీర్థముతో తన శిరోజాలకు ఉన్న చిక్కుని తొలగించుకున్నాడు. తాము ఇలా చేస్తేనే తక్కిన వారు అలా చేస్తారు. తమకంటే ముందు ఉన్న శీలవంతులు ఎలా నడిచారో అలా వారు కూడా నడుస్తూ

హాటకాసన ఆసీనాన్స్వధిష్ణ్యేష్వివ పావకాన్
శ్రద్ధాసంయమసంయుక్తః ప్రీతః ప్రాహ భవాగ్రజాన్

బంగారు సింహాసనము మీద అగ్నిహోత్రములా కూర్చున్న వారిని శ్రద్ధతో నియమముతో పూజించి సంతోషించి, శంకరునికి అన్నలు అయిన ఆ సనకాదులను శ్రద్ధతో నియమముతో ప్రీతితో భక్తితో జాగ్రత్తగా ఇలా మాట్లాడాడు. 

పృథురువాచ
అహో ఆచరితం కిం మే మఙ్గలం మఙ్గలాయనాః
యస్య వో దర్శనం హ్యాసీద్దుర్దర్శానాం చ యోగిభిః

అన్ని శుభములకూ నిలయమైన మీరు వచ్చారంటే నేను ఏ పుణ్యము చేసాను. యోగులకు కూడా దర్శనమీయని మీ దర్శనమయ్యిందంటే నేను పెద్ద పుణ్యమే చేసుకుని ఉంటాను

కిం తస్య దుర్లభతరమిహ లోకే పరత్ర చ
యస్య విప్రాః ప్రసీదన్తి శివో విష్ణుశ్చ సానుగః

తన పరివారముతో ఉన్న విష్ణువూ శంకరుడూ బ్రాహ్మణులూ ప్రసన్నమైనవాడికి లభించరానిదేముంది

నైవ లక్షయతే లోకో లోకాన్పర్యటతోऽపి యాన్
యథా సర్వదృశం సర్వ ఆత్మానం యేऽస్య హేతవః

మీలాంటి వారు అన్ని లోకాలనూ సంచరిస్తూ ఉంటారు గానీ మిమ్ములని లోకములూ చూడలేవు. నిరంతర పరమాత్మ ధ్యానములో ఉన్న మీరు కూడా ఈ లోకాలని చూడరు ఎలా ఐతే అంతరాత్మను అక్కడే ఉన్న ఇంద్రియములూ మనసూ, ఇంద్రియ విషయాలనూ మనసునూ సర్వ వ్యాపి  ఆత్మా చూడలేవో.

అధనా అపి తే ధన్యాః సాధవో గృహమేధినః
యద్గృహా హ్యర్హవర్యామ్బు తృణభూమీశ్వరావరాః

ధనమునకు యోగ్యులూ లేదా ధనము కలవారినీ ధన్యులు అంటారు. కానీ మీలాంటి మహానుభావుల దర్శన స్పర్శలు కలిగితే ధనము లేకున్నా గృహస్థులూ సాధువులూ ధన్యులే. ఎవరి ఇంటిలో ఉత్తముల పాదములను దర్భలతో జలములతో పూజా ద్రవ్యములతో ఆరాధిస్తారో వారు ధనము లేకున్నా ధన్యులే. 

వ్యాలాలయద్రుమా వై తేష్వరిక్తాఖిలసమ్పదః
యద్గృహాస్తీర్థపాదీయ పాదతీర్థవివర్జితాః

తీర్థములను కూడా పవిత్రము చేసే పవిత్రమైన పాదాముల తీర్థ స్పర్శ పడని ఇళ్ళు ఎంత ఐశ్వర్యమున్నా పాములు ఉండే వృక్షాల (ఉదా చందన వృక్షం) వంటివి. 

స్వాగతం వో ద్విజశ్రేష్ఠా యద్వ్రతాని ముముక్షవః
చరన్తి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహన్తి చ

మీకు స్వాగతం. మీరు మహానుభావులూ, బ్రాహ్మణోత్తములు, మోక్షమును కోరి బాల్యములోనే పెద్ద వ్రతాలను (శరణాగతి వ్రతం) ఆచరించిన వారు

కచ్చిన్నః కుశలం నాథా ఇన్ద్రియార్థార్థవేదినామ్
వ్యసనావాప ఏతస్మిన్పతితానాం స్వకర్మభిః

నేనేంత జాగ్రత్తగా ఉన్నాను అనుకున్నా మాకు కుశలమే లేదు ఎందుకంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు మాత్రమే తెలిసిన వారము. మా జ్ఞ్యానమంతా ఈ ఐదింటి కోసమే. విషయములను పొందే మార్గము తెలుసుకో ప్రయత్నించే మాకు కుశలము లేదు. సంసారములో వ్యసనాలనే  (కష్టాలు) విత్తనాలు విత్తుతాము. దానిలో కర్మలతో పడ్డాము. అలాంటి మాకు క్షేమముంటుందా. 

భవత్సు కుశలప్రశ్న ఆత్మారామేషు నేష్యతే
కుశలాకుశలా యత్ర న సన్తి మతివృత్తయః

మీకు  కుశలమా అని ప్రశించడములోనే అర్థము లేదు. ఎందుకంటే మీకు అకుశలము అన్న మాటే లేదు. మీరంతా ఆత్మారాములు. పరమాత్మ యందే రమిస్తూ ఉంటారు. క్షేమమూ అకుశలమూ అన్న ఆలోచనే లేదు. సంసారముంటేనే బాధ. 
మీరు క్షేమముగా ఉన్నారా అని అడగనవసరం లేదు

తదహం కృతవిశ్రమ్భః సుహృదో వస్తపస్వినామ్
సమ్పృచ్ఛే భవ ఏతస్మిన్క్షేమః కేనాఞ్జసా భవేత్

మీ మీద నమ్మకం కలిగింది నాకు. తపస్వులైన మీకు నేను సుహృత్. మిమ్మలని ఒక చిన్న మాట అడుగుతున్నాను. ఈ సంసారములో సులభముగా ఎలా క్షేమమును పొందవచ్చు?

వ్యక్తమాత్మవతామాత్మా భగవానాత్మభావనః
స్వానామనుగ్రహాయేమాం సిద్ధరూపీ చరత్యజః

మీరు వచ్చారంటే మాలాంటి వారిని అనుగ్రహించడానికి పరమాత్మే వచ్చాడు. ఈ మాట నిజము. పుట్టుక లేని పరమాత్మ మాలాంటి వారిని అనుగ్రహించడానికి చర రూపములో సిద్ధుడిలాగ వచ్చాడు. మనసు గలవారందరికీ ఆత్మ. అందరికీ అంతర్యామిగా ఉన్న పరమాత్మ. ఆత్మ జ్ఞ్యానన్ని కలిగించేవాడు తన వారిననుగ్రహించడానికి ఈ భూమి మీద సిద్ధుల రూపములో సంచరిస్తూ ఉంటాడు. 

మైత్రేయ ఉవాచ
పృథోస్తత్సూక్తమాకర్ణ్య సారం సుష్ఠు మితం మధు
స్మయమాన ఇవ ప్రీత్యా కుమారః ప్రత్యువాచ హ

మంచి మాట విన్న బ్రహ్మ మానస పుత్రులు. పృధువు చెప్పినది సారము, చక్కగా చెప్పాడు, తక్కువ మాటలు చెప్పాడు, వినటానికి సొంపుగా ఉన్న మాటలు చెప్పాడు. అవి విన్న కుమారులలో సనత్కుమారుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. 

సనత్కుమార ఉవాచ
సాధు పృష్టం మహారాజ సర్వభూతహితాత్మనా
భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ

మహారాజా బాగా అడిగావు. నీవడిగినది నీ కోసము కాదు. నీవు అన్నీ తెలిసిన వాడవు.అయినా సకల ప్రాణుల హితమును కోరి అడిగావు. మంచివారెప్పుడూ తమ కోసం దేనినీ అడగరు. 

సఙ్గమః ఖలు సాధూనాముభయేషాం చ సమ్మతః
యత్సమ్భాషణసమ్ప్రశ్నః సర్వేషాం వితనోతి శమ్

సజ్జన సంగం ఇద్దరికీ పనికొస్తుంది. మోక్షం కావాలనుకున్న వారికీ సంసారము బాగా ఉండాలి అన్నవారికీ. ఇద్దరికీ సాధు సంగం సమ్మతమే. వారితో మాట్లాడుట అడుగుటా అందరికీ శుభాన్ని కలిగిస్తాయి. 

అస్త్యేవ రాజన్భవతో మధుద్విషః పాదారవిన్దస్య గుణానువాదనే
రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలమన్తరాత్మనః

నీకు చెప్పడం పెద్ద కష్టము కాదు. ప్రధానమైన పరమాత్మ యందు భక్తి నీకుంది. పరమాత్మ పాదముల కథలను వినడములో రతి నీకు ఉంది. అన్నీ బాగా ఉన్నవారికి కూడా పరమాత్మ యందు భక్తి ఉండదు. పరమాత్మ పాదారవింద కథామృతము యందు ప్రీతి మనసు యొక్క మలాన్ని పోగొడుతుంది. 

శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సధ్ర్యగ్విమృశేషు హేతుః
అసఙ్గ ఆత్మవ్యతిరిక్త ఆత్మని దృఢా రతిర్బ్రహ్మణి నిర్గుణే చ యా

మానవులకు క్షేమము కలగాలంటే ఒకటే మార్గము. ఆత్మ కాని యందు వైరాగ్యం, ఆత్మ యందు రతి. ఇది ఉంటే అందరూ బాగు పడతారు. నిర్గుణుడైన పరమాత్మ యందు దృఢమైన ప్రీతి ఉండాలి. ప్రకృతి యందు శబ్దాది విషయాల యందు విరక్తి ఉండాలి 

సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్ఠయా
యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవఃకథయా పుణ్యయా చ

సంసారం యందు విరక్తి ఎలా వస్తుంది? దానికి శ్రద్ధ కావాలి. పరమాత్మ యొక్క ధర్మాలైన దర్శన స్పర్శన కీర్తనలయందు ప్రీతి కావాలి. తత్వాన్నిన్ తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. ఆధ్యాత్మిక యోగ నిష్ఠ ఉండాలి (పరమాత్మ జీవాత్మ ప్రకృతి గురించి తెలుసుకుని వాటిలో ప్రవర్తించడానికి కావలసినయోగం). ఇవాన్నీ వచ్చాక పరమాత్మ యొక్క ఆరాధనతో, అది కలగాలంటే భగవంతుని యందు ప్రీతి కలగాలి. అది కలగాలంటే ఇష్టమున్నా లేకున్నా పరమాత్మ కథలను వింటూ ఉండాలి. 

అర్థేన్ద్రియారామసగోష్ఠ్యతృష్ణయా తత్సమ్మతానామపరిగ్రహేణ చ
వివిక్తరుచ్యా పరితోష ఆత్మని వినా హరేర్గుణపీయూషపానాత్

అర్థములు (శద్బాది విషయములు ) ఇంద్రియములూఉ (చర్మమూ మొదలైన ఇంద్రియాలు) వీటితో రమించేవారితో కలిసి ఉండాలనే కోరిక లేకుండా ఉండాలి. అలాంటి వారికి ఇష్టమైన భోగములనీ స్వీకరించవద్దు. 
వివిక్తరుచ్యా - ఏకాంతమైన ప్రీతి. పరమాత్మ యందు మాత్రమే ప్రీతి ఉండాలి. సాంసారిక విషయభోగులతో సంబంధములేని ఏకాంతముతో ఉండి పరమాత్మ గుణామృత పానము కంటే మరేమీ నచ్చకూడదు. 

అహింసయా పారమహంస్యచర్యయా స్మృత్యా ముకున్దాచరితాగ్ర్యసీధునా
యమైరకామైర్నియమైశ్చాప్యనిన్దయా నిరీహయా ద్వన్ద్వతితిక్షయా చ

కాయిక వాచిక మానసిక అహింస కావాలి. ఎదుటి వాడిని నిందించడం కూడా హింసే. సన్యాసులూ పరమాత్మ నిష్ఠులు, నిరంతరమూ పరమాత్మ నామస్మరణ, పరమాత్మ అవతార కథలనే అమృతాన్ని  యమ నియమములతో ఎలాంటి కోరికా లేకుండా ఎదుటివారిని పొరబాటున కూడా నిందించకుండా దేని యందూ ఆశ లేకుండా ద్వంద్వ తితీక్ష (చలీ వేడీ సుఖమూ దుఃఖమూ ఒక్క లాగే చూడాలి, తట్టుకోగలగాలి) 

హరేర్ముహుస్తత్పరకర్ణపూర గుణాభిధానేన విజృమ్భమాణయా
భక్త్యా హ్యసఙ్గః సదసత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాఞ్జసా రతిః

అది కలగాలంటే నిరంతరమూ పరమాత్మ వీర్య చరితమును చెవులకు ఇంపుగా వినాలి. దానితో రోజు రోజుకూ విజృంభించిన భక్తితో సత్తునూ అసత్తునూ తలవకుండా ఆత్మ కాని దాని యందు ప్రకృతి విషయముల యందూ అసంగముతో ఉంటే గుణాతీతమైన పరమాత్మ యందు సులభముగా ప్రీతి కలుగుతుంది. 

యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమానాచార్యవాన్జ్ఞానవిరాగరంహసా
దహత్యవీర్యం హృదయం జీవకోశం పఞ్చాత్మకం యోనిమివోత్థితోऽగ్నిః

ఇలా పరమాత్మ యందు నైష్ఠికమైన ప్రీతీ భక్తీ కలిగితే, ఒక అచార్యుడు దొరుకుతాడు ("ఆచార్యవాన్‌ పురుషోవేద''  - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఛాందోగ్యోపనిషత్ చెబుతున్నవి) దాని వలన జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలుగుతుంది. జ్ఞ్యాన వైరాగ్యాల వలన జీవునికి కోశముగా ఉండే పంచభూతాత్మకమైన ప్రకృతిని ధ్వంసం చేస్తుంది, దహింపచేస్తుంది. ఆత్మ ఉండేదీ మనసు ఉండేదీ జీవకోశముండేదీ శరీరములోనే. అగ్ని అరణి నుండి పుడుతుంది (వెదురు బొంగులు), అయినా ఆ వెదురు బొంగును కూడా కాలుస్తుంది. అలాగే శరీరములో పుట్టిన జ్ఞ్యానాగ్ని శరీరాన్ని దహిస్తుంది. 

దగ్ధాశయో ముక్తసమస్తతద్గుణో నైవాత్మనో బహిరన్తర్విచష్టే
పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్స్వప్నే యథా పురుషస్తద్వినాశే

దీని వలన వాసన దగ్ధమవుతుంది. ప్రకృతికి కావలసిన అన్ని గుణముల నుండీ విడివడి, ఆత్మలోపలా ఉండడు ఆత్మ బయటా ఉండడు. అంటే కైవల్యమూ ఉండదు, సంసారమూ ఉండదు. జీవాత్మకూ పరమాత్మకూ వ్యవధానము లేకుండా ఉండాలి. (అద్వైతం ప్రకారం అవిద్య ఇద్దరి మధ్యా వ్యవధానముగా ఉంటుంది) అంతర్యాత్మగా ఉన్న పరమాత్మతో జీవాత్మ శరీరములోపల ఎలా కలిసి ఉంటాడో, శరీరము నుండి విడివడిన తరువాత కూడా జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండాలి. జీవుడు హృదయములో ఉంటాడు, అందులో పరమాత్మ ఉంటాడు. ఇద్దరికీ అడ్డముగా సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం పోతే జీవుడు పరమాత్మతో కలుస్తాడు. స్వప్నములో విషయాలు మెలకువ రాగానే పోయినట్లుగా. జీవుడు ఆచరించిన పుణ్యపాపాలను అనుభవించడానికి ఉన్న లోకాలు సరిపోక స్వప్నలోకం కూడా సృష్టించబడింది. స్వప్నము కూడా పరమాత్మ ఏర్పరచిన లోకమే. స్వప్నములో ఉన్నంత కాలం ఉన్నట్లుగా ఉండి లేవగానే ఎలా పోతున్నాయో, ప్రకృతి ఉన్నంతకాలం ఉంది అంటూ అది పోవగానే అది లేదని తెలుసుకుంటాము 
స్వప్నావస్థలో ఉన్నవి జాగృదావస్థలో లేనట్లుగా ఎలా తెలుసుకుంటామో అజ్ఞ్యానావస్థలో ఉన్నవి జ్ఞ్యానావస్థలో లేవని తెలుసుకుంటాము

ఆత్మానమిన్ద్రియార్థం చ పరం యదుభయోరపి
సత్యాశయ ఉపాధౌ వై పుమాన్పశ్యతి నాన్యదా

ఇక్కడ ఆత్మ అంటే శరీరం. ఆత్మానం - శరీరము. ఇంద్రియార్థమంటే శబ్దాది విషయాలు. భోగ్యములు విషయములూ భోగస్థానం శరీరం భోగోపకరణం ఇంద్రియాలు. శరీరేంద్రియ విషయాలు వాసన ఉన్నప్పుడే, ఉపాధి ఉన్నప్పుడే చూస్తాడు. 

నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుషః
ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి నాన్యదా

పూర్వ జన్మ సంస్కారం, వాటితో ఉన్న శరీరం ఉన్నప్పుడే "ఇది వేరూ అది వేరు" అని చూస్తారు. జడాదావపి - ప్రకృతి పురుషునకూ తేడా చూస్తాము ఈ శరీరం సంబంధం ఉన్నంతవరకూ. 

ఇన్ద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః
చేతనాం హరతే బుద్ధేః స్తమ్బస్తోయమివ హ్రదాత్

శరీరేంద్రియ విషయాలు. మనస్సును ఇంద్రియాలు ఆకర్షిస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములతో ఆకర్షింపబడిన ఇంద్రియాలు మనసును ఆకర్షిస్తాయి, బుద్ధికున్న చైతన్యాన్ని  హరిస్తాయి. దాని వలన జీవాత్మను  అటువైపు లాగి సంసారములో పడేస్తాయి. అంటే భయంకరమైనవి విషయాలు. సంసారములో పడటానికీ మోక్షానికి వెళ్ళకుండా ఉండటానికీ ఇక్కడే మనని  బంధించడానికీ కారణాలు ఇవే - శబ్ద స్పర్శ రూప రస గంధములు. విషయాలు ఇంద్రియాలని, ఇంద్రియాలు మనసునీ, మనసు బుద్ధినీ ఆకర్షిస్తాయి. పొలాల్లో నీళ్ళు పడటానికి కలవలుంటాయి, అక్కడే గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి ఆ నీళ్ళను లాక్కుని బ్రతుకుతుంది, వరద పెరగగానే ఆ గడ్డి కుప్ప ఊడి ఒడ్డును కూడా లాగుకొని నీటిలో పడుతుంది. మనము కూడా విషయాలచే ఆకర్షింపబడి బుద్ధిని కూడా అందులో పడేస్తాము. ఇంద్రియములు విషయముల వెంట వెళతాయి. విషయములు ఇంద్రియాలకు ఆహారం. విషయాలకీ ఇంద్రియాలకీ చైతన్యం ఉండదు. 

భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశః స్మృతిక్షయే
తద్రోధం కవయః ప్రాహురాత్మాపహ్నవమాత్మనః

ఎప్పుడైతే బుద్ధి యొక్క చైతన్యం హరించబడుతుందో స్మృతి పోతుంది. స్మృతిపోగానే జ్ఞ్యానమూ పోతుంది. జ్ఞ్యానభ్రంశమే ఆత్మ స్వరూపం తెలియడానికి అడ్డు, ఆత్మను కప్పి పుచ్చుతుంది, తెలియకుండా చేస్తుంది. 

నాతః పరతరో లోకే పుంసః స్వార్థవ్యతిక్రమః
యదధ్యన్యస్య ప్రేయస్త్వమాత్మనః స్వవ్యతిక్రమాత్

జ్ఞ్యాన భ్రంశము కంటే జీవునికి వచ్చే నష్టమింకోలేదు. పురుషునికి ఇంత కంటే స్వార్థ (స్వస్వరూప జ్ఞ్యానం) భంగం లేదు. ఆత్మ కంటే పరమాత్మ కంటే భిన్నమైన విషయములు ప్రీతిగా అనిపించడమే పెద్ద ఆపద. మన దారి నుంచి మనని తప్పించేది మనకు వాస్తవముగా ఏది ప్రియమో, అది కాక అన్యమైనవి ప్రియముగా అనిపించడం. చెడ్డగా ఉన్న దానిని మంచీ అనుకోవడం వలన మంచిగా ఉన్న మనం చెడైపోతున్నాము.

అర్థేన్ద్రియార్థాభిధ్యానం సర్వార్థాపహ్నవో నృణామ్
భ్రంశితో జ్ఞానవిజ్ఞానాద్యేనావిశతి ముఖ్యతామ్

మనను నిండా ముంచేది విషయాలు ఇంద్రియాలూ గురించి ఆలోచించుటే. అర్థేంద్రియాల మీద కలిగిన ఆసక్తి మరి దేని మీద ఆసక్తి లేకుండా చేస్తుంది. అర్థేంద్రియాల మీద కలిగిన ఆసక్తి వలన మన మీద మనమే ఆసక్తిని పోగొట్టుకుంటాము. 
ఇంద్రియార్థాలను నిరంతరం ధ్యానించుటే అన్ని విషయాలను తెలుసుకోకుండా చేస్తోంది. జ్ఞ్యానమూ (మోక్షము మీద బుద్ధి) విజ్ఞ్యానము (శాస్త్ర జ్ఞ్యానం) లేకుండా పోతున్నయి. ఇలా రెంటి వలనా భ్రష్టులమై మనము చాలా ముఖ్యులమవుతాము (స్థావర సృష్టిని ముఖ్యసృష్టీ అంటారు. అంటే మొద్దులవుతామన్నమాట) 

న కుర్యాత్కర్హిచిత్సఙ్గం తమస్తీవ్రం తితీరిషుః
ధర్మార్థకామమోక్షాణాం యదత్యన్తవిఘాతకమ్

తీవ్రమైన తమస్సునూ అజ్ఞ్యానాన్నీ సంసారాన్నీ దాటాలి అంటే విషయముల యందు ఆసక్తి కలిగి ఉండకూడదు. ఈ సంగము ఎంత ప్రమాదకారీ అంటే ధర్మాన్నీ అర్థాన్నీ కామాన్నీ మోక్షాన్నీ పాడుచేస్తుంది. 

తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యన్తికతయేష్యతే
త్రైవర్గ్యోऽర్థో యతో నిత్యం కృతాన్తభయసంయుతః

తక్కిన మూడూ పోయినా మోక్షము పోవడం వలన ఎక్కువ నష్టము కలుగుతుంది. ఆత్యంతికమైనది మోక్షము. దానికీ భంగము కలిగించి త్రైవర్గికానికి (ధర్మార్థ కామాలకు) భంగం కలిగిస్తుంది. అసలు నాశము లేని మోక్షానికి భంగం వస్తే మిగతా వాటి సంగతి వేరే చెప్పాలా. త్రివర్గము (ధర్మార్థ కామాలు) ప్రతీ క్షణమూ కాలానికి భయపడుతూ ఉంటుంది. కాల భయం లేనిది మోక్షానికి. స్వస్వరూప జ్ఞ్యానము లేని వారికి ధర్మమూ అర్థమూ జ్ఞ్యానమూ వస్తే ఏమి పోతే ఏమి. ధర్మార్థ కామాలు మనము కోరుకున్నా కోరకున్నా వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పటికీ నాశము లేని మోక్షాన్ని కోరాలు

పరేऽవరే చ యే భావా గుణవ్యతికరాదను
న తేషాం విద్యతే క్షేమమీశవిధ్వంసితాశిషామ్

పరావర భావములు (శరీరమూ మనసు ఇంద్రియములూ విషయములూ బుద్ధీ) గుణవ్యతికరము (అంటే గుణ వైషమ్యాలు వస్తే, అంటే సృష్టి వస్తే) ఐతేనే పుడతాయి. అంటే సృష్టి జరిగితేనే "ఇది శరీరమూ మనసూ ఆత్మ బుద్ధీ ఎక్కువా తక్కువా " అనిపించే బుద్ధి పుడుతుంది. సృష్టిననుసరించే ఈ భావాలన్నీ కలుగుతాయి. సృష్టి తరువాత కలిగే శరీరేంద్రియ విషయ భేధాలకి క్షేమమే లేదు. ఈశవిధ్వంసితాశిషామ్ - పరమాత్మ చేత నాశము చేయబడే స్వరూపము గలవి. వస్తువు పుట్టిందంటే దాని నాశము కూడా పుడుతుంది. ఈ భావాలన్నీ సృష్టి వెంట వచ్చేవి, ప్రళయం వెంట పోయేవి.

తత్త్వం నరేన్ద్ర జగతామథ తస్థూషాం చ
దేహేన్ద్రియాసుధిషణాత్మభిరావృతానామ్
యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః
ప్రత్యక్చకాస్తి భగవాంస్తమవేహి సోऽస్మి

నేను భగవంతుని అంశే. స్థావర జంగమాలకూ దేహ ఇంద్రియ ప్రాణ బుద్ధీ ఆత్మా ఉంటాయి. క్షేత్రవిత్తపతయా  - శరీరాన్ని తెలుసుకునేది ఆత్మ (శరీరము వేరు నేను వేరు). ఆ జ్ఞ్యానం కలగడానికి ఆ ఆత్మ శరీరములో పడే తాపమునకు ఏదీ సాటి లేదు. హృది విశ్వగావిః - హృదయములో అనేకమైన ఇంద్రియముల చేత. దేన్ని చూచి నేను ఆత్మ అనుకుంటున్నానో దేన్ని సమగమాన్ని సుఖమనుకుంటున్నానో, దేని ప్రవృత్తిని బలమనుకుంటున్నానో, దేని వ్యవహారాన్ని జ్ఞ్యానమనుకుంటున్నానో అది అంతా నశ్వరములూ, అనిత్యములూ క్షుద్రములూ దుఃఖమును కలిగించేవి అనే భావనను మనలో ఉన్న పరమాత్మ ప్రతీ క్షణమూ చెబుతున్నాడు. పరమాత్మ ఆవరించి ఉన్న జీవాత్మ ఆవరించిన ఉన్న శరీరములో ఉన్న వాడిని నేను. నేను పరమాత్మకు సంబంధించిన వాడిని, జ్ఞ్యాన స్వరూపిని. చలీ వేడీ సుఖమూ దుఃఖమూ ఏమీ లేని పరమాత్మ నాలో ఉన్నాడు.
పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మను నేను. భగవాంస్తమవేహి సోऽస్మి - సః  భగవన్ అహం అస్మి. అదే సోऽస్మి - సోహం. పరమాత్మ అంతరాత్మగా ఉన్న నాకు సుఖ దుఃఖ రాగా ద్వేషాదులూ సంగములూ లేవు. విషయములచేత ఆకర్షింపబడిన మనసు చేత ఆకర్షింపబడిన బుద్ధిని కలగకుండా ఉన్న నాడు ఈ విషయం తెలుస్తుంది. 

యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి
మాయా వివేకవిధుతి స్రజి వాహిబుద్ధిః
తం నిత్యముక్తపరిశుద్ధవిశుద్ధతత్త్వం
ప్రత్యూఢకర్మకలిలప్రకృతిం ప్రపద్యే

"ఇది సత్, ఇది అసత్, ఇది ప్రకృతి ఇది జీవాత్మ" అనే బుద్ధి, జ్ఞ్యానం లేకుంటే పూలదండను పాము అనుకున్నట్లు భ్రమింపచేస్తాయి. వివేకం లేని చోట ఈ మాయ ప్రకాశిస్తుంది. వాస్తవముగా పరమాత్మ నిత్యముక్తపరిశుద్ధవిశుద్ధతత్త్వం. పరమాత్మకు గానీ జీవాత్మకు గానీ సంసారముతో సంబంధము లేదు. పరమాత్మ నిత్యుడూ పరిశుద్ధుడు, ఎలాంటి దోషమూ లేని వాడు, అజ్ఞ్యానం లేని వాడు (ఇంద్రియార్థములే జ్ఞ్యానమునకు ఆవరణములు),  కర్మల చేత ఏర్పడే ప్రకృతికి పరమాత్మ ఎదురు. అటువంటి పరమాత్మను శరణు వేడుతున్నాను. 

యత్పాదపఙ్కజపలాశవిలాసభక్త్యా
కర్మాశయం గ్రథితముద్గ్రథయన్తి సన్తః
తద్వన్న రిక్తమతయో యతయోऽపి రుద్ధ
స్రోతోగణాస్తమరణం భజ వాసుదేవమ్

సత్పురుషులు కర్మకు మూలమైన, కూర్చబడిన (గ్రధితం) వాసనా సంస్కారాన్ని పరమాత్మ యొక్క పాద పద్మ దళ సౌందర్య భక్తి కలవాడు కూర్చబడిన వాసనను తొలగిస్తాడు. రిక్తమతయో - ఏమీ లేని దాన్ని ఆలోచించేవారు, శూన్యము గురించి ఆలోచించేవారు. న రిక్తమతయో - శూన్యాన్ని గురించి ఆలోచించని వారు, ఇంద్రియాలను అరికట్టిన యతులు కూడా (రుద్ధ స్రోతోగణా, స్రోతమంటే ఇంద్రియములు, నిరంతరం ప్రవహించేవి. ) ఇంకొక పుట్టుక రాకుండా సంస్కారాన్ని వాసననూ తొలగించుకుంటారు. అలాంటి దానికి ఆశ్రయమైన వాసుదేవున్ని భజించు. 

కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం
షడ్వర్గనక్రమసుఖేన తితీర్షన్తి
తత్త్వం హరేర్భగవతో భజనీయమఙ్ఘ్రిం
కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరార్ణమ్

నడిపేవాడు లేని పడవతో, లేదా, పడవలేకుండా (అప్లవేశా) ముసళ్ళూ సొరచేపలూ ఉన్న సంసార సముద్రాన్ని దాటాలనుకోవడం చాలా కష్టము. పరమాత్మ యొక్క సేవించదగిన పాదమును పడవగా చేసుకుని కష్టాన్ని దాటు. అది లేని వారికి ఈ సంసార సాగరం దాట శక్యము గానిది. 

మైత్రేయ ఉవాచ
స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా
దర్శితాత్మగతిః సమ్యక్ప్రశస్యోవాచ తం నృపః

ఆత్మజ్ఞ్యానం కల సనత్కుమారునిచేత ఆత్మ స్వరూపం చూపెట్టబడి మహారాజు స్తోత్రం చేసి ఇలా అన్నాడు

రాజోవాచ
కృతో మేऽనుగ్రహః పూర్వం హరిణార్తానుకమ్పినా
తమాపాదయితుం బ్రహ్మన్భగవన్యూయమాగతాః

ఆర్తుల మీద దయ కలిగిన పరమాత్మ మొదట నన్ను అనుగ్రహించాడు. పరమాత్మ చూపిన అనుగ్రహాన్ని దృఢం చేయడానికి మీరొచ్చారు. 

నిష్పాదితశ్చ కార్త్స్న్యేన భగవద్భిర్ఘృణాలుభిః
సాధూచ్ఛిష్టం హి మే సర్వమాత్మనా సహ కిం దదే

పరమ దయాళువులైన మీరు చేయవలసిన పనిని పూర్తి చేసారు. మీరనుభవించి వదిలిపెట్టినదే నా దగ్గర ఉంది. అది అంతా మీ సొమ్మే (గొప్పవారు వద్దనుకున్నదే మనకు దక్కుతుంది). అది మీకిస్తే మీది మీకిచ్చినట్లే అవుతుంది

ప్రాణా దారాః సుతా బ్రహ్మన్గృహాశ్చ సపరిచ్ఛదాః
రాజ్యం బలం మహీ కోశ ఇతి సర్వం నివేదితమ్

నావి అనుకున్నవన్నీ మొత్తం మీకే నివేదిస్తున్నాను.

సైనాపత్యం చ రాజ్యం చ దణ్డనేతృత్వమేవ చ
సర్వ లోకాధిపత్యం చ వేదశాస్త్రవిదర్హతి

వేద శాస్త్రములు తెలిసినవాడు సేనాపతీ కాగలడూ, రాజూ కాగలడూ కోశాధికారీ కాగలడూ సర్వలోకాధిపతీ కాగలడు. 

స్వమేవ బ్రాహ్మణో భుఙ్క్తే స్వం వస్తే స్వం దదాతి చ
తస్యైవానుగ్రహేణాన్నం భుఞ్జతే క్షత్రియాదయః

ఒక్క బ్రాహ్మణుడే తన వస్తువును తాను తింటున్నాడు, తన ఇంటిలో తాను ఉంటున్నాడు, అటువంటి బ్రాహ్మణుడు దయ చూపితేనే క్షత్రియులూ, మిగతా వారు అన్నం తింటున్నారు. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తేనే వర్షమొస్తుంది. 

యైరీదృశీ భగవతో గతిరాత్మవాద
ఏకాన్తతో నిగమిభిః ప్రతిపాదితా నః
తుష్యన్త్వదభ్రకరుణాః స్వకృతేన నిత్యం
కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రమ్

మీరు ఇలాంటి భగవత్స్వరూప స్వభావాలనూ ఆత్మ వాదాన్ని నిశ్చయముగా వేదములతో సహా మాకు ప్రతిపాదించారు. మీకంటూ ఇవ్వడానికి నాదంటూ ఏమీ లేదు. ఇలాంటి సంసారములో పడి బాధ పడుతున్న మూర్ఖులకు ఇలాంటి జ్ఞ్యానం కలిగించామని మీరే సంతోషించండి. మీరు చేసిన వాటితోనే మీరు సంతోషించండి. మీకు సంతోషాన్నిచ్చే పని మేము చేయలేము. అడ్డు లేని, అనంతమైన దయ కలిగిన వారు. ప్రపంచములో జ్ఞ్యానమును బోధించిన గురువుగారికి తగిన ప్రత్యుపకారం ఎవరు చేయగలరు. నేను చేయగలిగినది ఒక్కటే - వినోదపాత్రమ్ - వినా + ఉదపాత్రం - దోసిటితో ఆర్ఘ్యం ఇవ్వగలగడం తప్ప. 

మైత్రేయ ఉవాచ
త ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితాః
శీలం తదీయం శంసన్తః ఖేऽభవన్మిషతాం నృణామ్

ఈ ప్రకారముగా సనకాదులు ఆదిరాజైన పృధు చక్రవర్తితో ఆరాధించబడి అతని స్వభావాన్ని ప్రశంసించి అందరూ చూస్తుండగా ఆకాశములోకి వెళ్ళిపోయారు. 

వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా
ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః

వేనపుత్రుడు అయిన పృధు చక్రవర్తి మహానుభావుల జ్ఞ్యానబోధతో రాజ్యభారాన్ని పరమాత్మలో ఉండి తనకన్నీ లభించాయనుకున్నాడు (కొరతే ఆశకు మూలం. అన్నీ ఉన్నాయనుకుంటే ఇంక ఆశకు ఆస్కారము లేదు. నేనంటే ఆత్మా అని తెలుసుకున్నవాడికి ఆశ ఉండదు. పరమాత్మకన్నా భిన్నమైనది ఆత్మకు అవసరం లేదు. ఆ పరమాత్మ ఆత్మలోనే ఉన్నాడు)

కర్మాణి చ యథాకాలం యథాదేశం యథాబలమ్
యథోచితం యథావిత్తమకరోద్బ్రహ్మసాత్కృతమ్

ఏ సమయములో ఏ పనులు ఎంత శక్తితో చేయాలో యధోచితముగా యధా విత్తం పరమా. త్మను ప్రత్యక్షముగా చేసుకుని చేసిన పనులన్నీ బ్రహ్మార్పణం చేసాడు

ఫలం బ్రహ్మణి సన్న్యస్య నిర్విషఙ్గః సమాహితః
కర్మాధ్యక్షం చ మన్వాన ఆత్మానం ప్రకృతేః పరమ్

పని చేస్తున్న పరమాత్మకే ఫలితాన్ని అర్పించాడు. దేనియందూ ఆసక్తి లేకుండా సావధాన మనస్కుడై ఏ పని చేస్తున్నా మనసు ఆ పని మీదే ఉండి, ఫలితం మీద కాకుండా చేసాడు. అన్ని కర్మలకూ అధ్యక్షుడుగా ఉన్న ఆత్మే ప్రకృతి కంటే పరం అని తెలుసుకున్నాడు. శరీరం కంటే విడిగా ఆత్మ ఉంది అని తెలుసుకున్నవాడేకోరికలూ కోరడు.

గృహేషు వర్తమానోऽపి స సామ్రాజ్యశ్రియాన్వితః
నాసజ్జతేన్ద్రియార్థేషు నిరహమ్మతిరర్కవత్

సంసారములో రాజ్యములో ఉన్నాడు, అయినా విషయముల యందు ఏ మాత్రం ఆసక్తి కలిగి లేడు. అహంకార మమకారాలు లేకుండా ఉన్నాడు. సూర్యభగవానుడిలా నీటిలో నిప్పులో ఉండి కూడా ఏది అంటకుండా ఉన్నాడు. 

ఏవమధ్యాత్మయోగేన కర్మాణ్యనుసమాచరన్
పుత్రానుత్పాదయామాస పఞ్చార్చిష్యాత్మసమ్మతాన్

ఈ రీతిలో ఆధ్యాత్మ యోగముతో కర్మలు చేస్తూ ఉన్నాడు. అర్చి యందు తనకు అనుగుణమైన వారు ఐదుగురు పుత్రులు కలిగారు. 

విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకమ్
సర్వేషాం లోకపాలానాం దధారైకః పృథుర్గుణాన్

విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకమ్. తాను చక్రవర్తిగా ఉండి సకల లోకపాలకుల గుణాలన్నీ తానొక్కడే ధరించాడు.

గోపీథాయ జగత్సృష్టేః కాలే స్వే స్వేऽచ్యుతాత్మకః
మనోవాగ్వృత్తిభిః సౌమ్యైర్గుణైః సంరఞ్జయన్ప్రజాః

ఏ సమయములో ఏమి కావాలో అవి తీసుకున్నాడు. పరమాత్మ యందు మనసు పెట్టి చేసాడు. ప్రజలను తన మనసుతో వాక్కుతో శరీరముతో రంజింపచేసాడు. రంజింపచేసే వాడు రాజు. రాజు అనే నామాన్ని ఈయన సార్థకం చేసాడు, చంద్రుడిలా. 

రాజేత్యధాన్నామధేయం సోమరాజ ఇవాపరః
సూర్యవద్విసృజన్గృహ్ణన్ప్రతపంశ్చ భువో వసు

సూర్యునిలా వ్యవహరించాడు. నీటిని తీసుకుని విడిచిపెట్టి అవసరమైనప్పుడు ఇస్తాడు. రాజు కూడా ప్రజాపాలనకు ఇబ్బంది వస్తే పన్నుగా తీసుకుని, ప్రజలకు బాధలొచ్చినపుడు మళ్ళీ ఇస్తాడు. శాసనముతో ఆజ్ఞ్యతో తపింపచేసాడు

దుర్ధర్షస్తేజసేవాగ్నిర్మహేన్ద్ర ఇవ దుర్జయః
తితిక్షయా ధరిత్రీవ ద్యౌరివాభీష్టదో నృణామ్
వర్షతి స్మ యథాకామం పర్జన్య ఇవ తర్పయన్
సముద్ర ఇవ దుర్బోధః సత్త్వేనాచలరాడివ

ధర్మరాడివ శిక్షాయామాశ్చర్యే హిమవానివ
కువేర ఇవ కోశాఢ్యో గుప్తార్థో వరుణో యథా

అగ్ని లాగ ఎవ్వరినీ (శత్రువులను) దగ్గరకు రానివ్వలేదు, ఇంద్రునిలా ఎవ్వరిచేతా జయింపబడని వాడు , భూమి వంటి ఓర్పూ, ఆకాశములా అడిగినవన్నీ ఇచ్చేవాడు. పర్జన్యుడిలా ప్రజల అవసరాన్ని తీర్చేవాడూ, సముద్రములా తనలో ఏముందో ఎవరికీ తెలియని వాడు, ధైర్యములో పర్వతములా ఉన్నాడు, తప్పు చేసిన వారిని శిక్షించడములో యముడిలా, ఐశ్వరములో హిమవంతునిలా ఉన్నాడు ధనములో కుబేరునిలా, ధనమును దాచిపెట్టడములో వరుణుడిలా (వరుణుడు నీటిని దాస్తాడు) 

మాతరిశ్వేవ సర్వాత్మా బలేన మహసౌజసా
అవిషహ్యతయా దేవో భగవాన్భూతరాడివ
కన్దర్ప ఇవ సౌన్దర్యే మనస్వీ మృగరాడివ
వాత్సల్యే మనువన్నృణాం ప్రభుత్వే భగవానజః
బృహస్పతిర్బ్రహ్మవాదే ఆత్మవత్త్వే స్వయం హరిః
భక్త్యా గోగురువిప్రేషు విష్వక్సేనానువర్తిషు
హ్రియా ప్రశ్రయశీలాభ్యామాత్మతుల్యః పరోద్యమే

వాయువులా అందరిలో ఉంటాడు, శరీర మనో ఇంద్రియ బలముతో వాయువులా ఉంటాడు.  ఎవ్వరూ దగ్గరగా రాకుండా ప్రళయ కాల రుద్రుడిలా ఉంటాడు. సౌందర్యములో మన్మధుడిలా పౌర్షములో సింహములా ప్రేమలో మనువులా ఉంటాడు శాసించడములో యోగక్షేమాలను కల్పించడములో బ్రహ్మలో బుద్ధిలో వేద వాదములో బృహస్పతిలా, ఆత్మ స్వరూపములో శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు. ఇన్ని ఉన్నా ఆయన సిగ్గుపడాడు (వినయవంతుడు) ఇతరులకి ఏదైనా కావలసి వస్తే, తనకి కావలసిన దానికెంత కష్టపడతాడో అంత కష్టపడతాడు. ఇన్ని ఉత్తమ గుణములతో తన కీర్తిని పృధు చక్రవర్తి మూడు లోకాలలో వ్యాపింపచేసాడు 


కీర్త్యోర్ధ్వగీతయా పుమ్భిస్త్రైలోక్యే తత్ర తత్ర హ
ప్రవిష్టః కర్ణరన్ధ్రేషు స్త్రీణాం రామః సతామివ

సత్పురుషులందరికీ ఎలా రాముడు ఆరాధ్యుడో ఈ రాజ్యములో అందరికీ ఈయన ఆరాధ్యుడు. పృధు చక్రవర్తి కూడా సర్వ జన రంజకుడుగా ప్రసిద్ధి పొందాడు.