Pages

Saturday, 26 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై రెండవ అధ్యాయం (రాస పంచాధ్యాయి - 4)


       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై రెండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఇతి గోప్యః ప్రగాయన్త్యః ప్రలపన్త్యశ్చ చిత్రధా
రురుదుః సుస్వరం రాజన్కృష్ణదర్శనలాలసాః

ఇలా గోపికలు పాడారు, కృష్ణుడు కనపడకపోవడముతో మత్తుతో ప్రేలాపణ చేసారు. ఇలా పరమాత్మను చూడాలని కోరికతో ఆయన ఎంతకీ రాకపోతే వారందరూ కలసి రోదించారు.

తాసామావిరభూచ్ఛౌరిః స్మయమానముఖామ్బుజః
పీతామ్బరధరః స్రగ్వీ సాక్షాన్మన్మథమన్మథః

అపుడు స్వామి వారికి సాక్షాత్కరించాడు. లేత చిరునవ్వు ముఖములో తొణికిసలాడుతుంటే పీతాంబరధరధారి ఐ, మన్మధునికే మన్మధుడైన స్వామి , మన్మధుని మనసునే మధించే ఆకారం గల స్వామి వచ్చాడు

తం విలోక్యాగతం ప్రేష్ఠం ప్రీత్యుత్ఫుల్లదృశోऽబలాః
ఉత్తస్థుర్యుగపత్సర్వాస్తన్వః ప్రాణమివాగతమ్

ఆ స్వామిని చూచి ప్రీతితో కనులు వికసించి, పోయిన ప్రాణం లేచి వస్తే శరీరం ఎలా నిలబడుతుందో,అలా అందరూ లేచారు

కాచిత్కరామ్బుజం శౌరేర్జగృహేऽఞ్జలినా ముదా
కాచిద్దధార తద్బాహుమంసే చన్దనభూషితమ్

కాచిదఞ్జలినాగృహ్ణాత్తన్వీ తామ్బూలచర్వితమ్
ఏకా తదఙ్ఘ్రికమలం సన్తప్తా స్తనయోరధాత్

ఏకా భ్రుకుటిమాబధ్య ప్రేమసంరమ్భవిహ్వలా
ఘ్నన్తీవైక్షత్కటాక్షేపైః సన్దష్టదశనచ్ఛదా

ఒక్క సారే వారికి కనపడేసరికి, ఆయన చుట్టూ చేరారు, ఒక్కో గోపికా ఒక్కోలా ప్రవర్తించింది,ఒకరు కృష్ణుని చేతిని గట్టిగా పట్టుకుంది, ఒక గోపిక చందనం పూసిన కృష్ణుని బాహువును తన భుజం మీద ఉంచుకుంది, ఒక గోపిక కృష్ణుడు తాంబూలం తన నోటితో విడువబోతూ ఉంటే  తన దోసిట్లోకి తీసుకుంది, ఒక గోపిక ఆయన పాదాలను స్తనములలో తాపం తీరడానికి ఉంచుకుంది.ఇంకో గోపిక ప్రణయ కోపముతో కనుబొమ్మలు బాగా ముడివేసి కాల్చేసేట్లు చూస్తూ తన పెదవిని తానే కొరుక్కుంది (దశనచ్ఛదా  - దశనం అంటే దంతములు, దంతములను కప్పేవి - పెదవులు)

అపరానిమిషద్దృగ్భ్యాం జుషాణా తన్ముఖామ్బుజమ్
ఆపీతమపి నాతృప్యత్సన్తస్తచ్చరణం యథా

ఒక గోపిక రెప్ప వేయడం కూడా మరచిపోయి పరమాత్మను చూస్తూ ఉంది. పరమాత్మ గాధను ఎంతగా గానం చేసినా తృప్తి పొందుటలేదు. భగవంతునిపాదాలను సేవిస్తున్న సత్పురుషులకు తృప్తి కలుగనట్లుగా వీరికీ తృప్తి కలగలేదు

తం కాచిన్నేత్రరన్ధ్రేణ హృది కృత్వా నిమీల్య చ
పులకాఙ్గ్యుపగుహ్యాస్తే యోగీవానన్దసమ్ప్లుతా

ఇంకో గోపిక పరమాత్మను తన నేత్ర రంధ్రములోంచి లోపలకు పంపించి మళ్ళీ బయటకు రాకుండా గట్టిగా కళ్ళు మూసుకుంది
ఇలా కళ్ళు మూసుకుని శరీరం అంతా పులకింతలొస్తే యోగిలాగ ధ్యానం చేసింది

సర్వాస్తాః కేశవాలోక పరమోత్సవనిర్వృతాః
జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః

అందరి మనసు కృష్ణున్ని చూచుటచే పరమానందములో ఉంది. ఆ ఆనందములో పరమాత్మకు దూరముగా  ఉండడం వలన కలిగిన దుఃఖం తొలగిపోయింది,సామాన్య జనం ఒక పండితున్ని జేరితే వారి అజ్ఞ్యానం తొలగిపోయినట్లు. వారి విరహ తాపం అంతా తొలగిపోయింది

తాభిర్విధూతశోకాభిర్భగవానచ్యుతో వృతః
వ్యరోచతాధికం తాత పురుషః శక్తిభిర్యథా

పరమ పురుషుడు విమలాది శక్తులతో కూడి ఎలా ఉంటాడో గోపికలతో ఉన్న పరమాత్మ అంత బాగా శోభించాడు. ఇలా వారు మాట్లాడుతూ ఉండగా స్వామి వారందరనీ కాళిందీ నదీ తీరానికి తీసుకు వెళ్ళాడు

తాః సమాదాయ కాలిన్ద్యా నిర్విశ్య పులినం విభుః
వికసత్కున్దమన్దార సురభ్యనిలషట్పదమ్

వికసించిన రక రకాల పుష్పముల యొక్క మకరందమును సేవించడానికి వచ్చే తుమ్మెదల చేత ధ్వని చేయబడుతున్నది ఆ కాళిందీ తీరం

శరచ్చన్ద్రాంశుసన్దోహ ధ్వస్తదోషాతమః శివమ్
కృష్ణాయా హస్తతరలా చితకోమలవాలుకమ్

ఈ రాత్రి చాలా శుభప్రదమైనది. శరత్ కాలము కాబట్టి ఎటువంటి మబ్బులూ లేవు. ఆ చంద్రుని కిరణములతో తొలగించబడిన చీకటి గలది.

తద్దర్శనాహ్లాదవిధూతహృద్రుజో మనోరథాన్తం శ్రుతయో యథా యయుః
స్వైరుత్తరీయైః కుచకుఙ్కుమాఙ్కితైరచీక్లృపన్నాసనమాత్మబన్ధవే

కాళిందీ నదీ తరంగముల చేత మెత్తగా ఉన్న ఇసుక తిన్నెలు గల ఆ ప్రాంతమంతా  అందముగా ఉంది.
ఆత్మ బంధువైన కృష్ణుని ఒక ఆసనం వేసారు. ఆసనముగా పైట చెంగును వేసారు. వక్షస్థలానికి ఉన్న కుంకుకతో అంటబడిన ఉత్తరీయాన్ని వేసారు.

తత్రోపవిష్టో భగవాన్స ఈశ్వరో యోగేశ్వరాన్తర్హృది కల్పితాసనః
చకాస గోపీపరిషద్గతోऽర్చితస్త్రైలోక్యలక్ష్మ్యేకపదం వపుర్దధత్

వారు కూర్చోమనగానే స్వామి కూర్చున్నాడు. ఎంతో మంది మహా యోగీశ్వరులు తమ హృదయములో స్వామికి ఆసనం వేసారు. అలా ఆసనం కల్పించబడిన పరమాత్మ గోపికలు పైట చెంగు పరిస్తే హాయిగా కూర్చున్నాడు. గోపికల మధ్యన ఉన్న స్వామి ప్రకాశించాడు. మూడు లోకములకూ శోభనూ ప్రకాశాన్నీ కలిగించే శరీరాన్ని ధరించి గోపికలు అర్పించిన ఆసనం మీద కూర్చున్నాడు.

సభాజయిత్వా తమనఙ్గదీపనం సహాసలీలేక్షణవిభ్రమభ్రువా
సంస్పర్శనేనాఙ్కకృతాఙ్ఘ్రిహస్తయోః సంస్తుత్య ఈషత్కుపితా బభాషిరే

మళ్ళీ కృష్ణుడు అంతర్ధానమవుతాడేమో అని జాగ్రత్తగా ఉన్నారు. చిరునవ్వూ వయ్యారమూ రెండూ కలిసి ఉన్న చూపు, దానితో ఉన్న కనుబొమ్మ, 

పరమాత్మ యొక్క స్పర్శ పొందిన శరీర భాగాలను పొగడుతూ ఉన్నారు. పరమాత్మ చేయి నా భుజం మీద పడింది అని భుజాన్ని గౌరవించింది. పరమాత్మ స్పర్శ ఏ ఏ ప్రాంతాలలో పడిందో ఆ ప్రాంతాలన్నీ ఉన్న గోపిక తన అదృష్టానికి సంతోషించి ఇలా అన్నారు

శ్రీగోప్య ఊచుః
భజతోऽనుభజన్త్యేక ఏక ఏతద్విపర్యయమ్
నోభయాంశ్చ భజన్త్యేక ఏతన్నో బ్రూహి సాధు భోః

లోకములో ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, మానవులు తమను సేవిస్తున్న వారిని విడిచిపెట్టరు. మరి కొందరు సేవించని వారిని అనుసరించి ఉంటారు. మరి కొందరు ఇద్దరి వెంటా ఉండరు. దీని భావమేమి
కొందరు సేవించే వారిని మళ్ళీ సేవిస్తారు. కొందరు సేవించని వారిని సేవిస్తారు. కొందరు సేవించని వారినీ సేవించిన వారినీ ఇద్దరినీ సేవించరు. నీ సంగతి ఏమిటో చెప్పు

శ్రీభగవానువాచ
మిథో భజన్తి యే సఖ్యః స్వార్థైకాన్తోద్యమా హి తే
న తత్ర సౌహృదం ధర్మః స్వార్థార్థం తద్ధి నాన్యథా

ప్రియురాళ్ళారా సేవించిన వారిని సేవిస్తున్నారంటే ఆ ఇద్దరూ పచ్చి స్వార్థ పరులు. అక్కడ మైత్రీ ధర్మం అపేక్షా, ఉండవు. వారు కేవలం తమ స్వార్థం కోసం సేవిస్తున్నారంతే.

భజన్త్యభజతో యే వై కరుణాః పితరౌ యథా
ధర్మో నిరపవాదోऽత్ర సౌహృదం చ సుమధ్యమాః

సేవించని వారని సేవించేవారు దయ గలవారు.  వారు తల్లి తండ్రుల వంటి వారు. బాల్యములో తల్లి తండ్రులు పిల్లలను సేవిస్తారు, వారు సేవించకపోయినా.వారు ధర్మం కాబట్టి చేస్తున్నారు. అందులో అపేక్ష ఏదీ ఉండదు

భజతోऽపి న వై కేచిద్భజన్త్యభజతః కుతః
ఆత్మారామా హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహః

అసలు మీకు సందేహం ఎక్కడ వచ్చింది. ఇక్కడ ధర్మానికి ఎటువంటి బాధా కలుగదు. సేవించిన వారిని సేవించకున్నా, సేవించని వారిని సేవించినా,ఇద్దరినీ సేవించినా, ఇద్దరినీ సేవించకున్నా ధర్మానికి ఎక్కడా ఆటంకం కలుగదు.
సేవించిన వారినే సేవించనపుడు సేవించని వారని ఎందుకు సేవిస్తారు.ఇలా ఉభయులనూ సేవించని వారు ఆత్మారాములు. వారికెటువంటి స్వార్థం ఉండదు. తమలో తాము ఆనందిస్తూ ఉంటారు. తాము కోరదగిన కోరికలు పొందినవారు (ఆప్త కాములు).

నాహం తు సఖ్యో భజతోऽపి జన్తూన్భజామ్యమీషామనువృత్తివృత్తయే
యథాధనో లబ్ధధనే వినష్టే తచ్చిన్తయాన్యన్నిభృతో న వేద

ఇక నా స్వభావం ఎలాంటిదంటే, నన్ను సేవించే వారిని కూడా నేను సేవించను, వారి వెంట ఉండను, వారికి కనపడను. నిరంతరం వారి మనసు నా మీదే ఉంచడానికి వారి వెంట కూడా నేను పడను.
వారికోసమే నేను వారికి కనపడను.
అలాంటి వాడవు మరి ఎందుకొచ్చావంటారా? డబ్బు అసలు లేని వాడికి డబ్బు మీద రుచి ఉండదు. డబ్బు ఉన్నవాడికి మధ్యలో డబ్బు పోతే బాధపడతాడు. అదే మీ బాధ. మీకు అసలు కనపడకపోతే మీరు నన్ను అసలు తలచుకోరు. మీ మనసు నిరంతరం నా మీద ఉండాలంటే నేనేమిటో మీకు తెలియాలి కదా. అందుకోసం వచ్చాను.
నన్ను కోరేవాడు నా కంటే భిన్న్మైన దాన్ని దేన్నీ కోరకూడదు. సర్వాత్మనా మీ మనసు నా మీదే ఉండాలి. అలా ఉండాలంటే నేనేమిటో మీకు తెలియాలి. ధనం లేని వాడికి ధనం దొరికి మళ్ళీ పోతే ఆ పోయిన ధనం మీద చింతతో ఉన్నవాటిని వేటినీ తలచడు

ఏవం మదర్థోజ్ఝితలోకవేద స్వానామ్హి వో మయ్యనువృత్తయేऽబలాః
మయాపరోక్షం భజతా తిరోహితం మాసూయితుం మార్హథ తత్ప్రియం ప్రియాః

నాకోసం అన్ని కర్మలనూ విడిచిపెట్టిన మీ మనసు నా మీదే నిలచి ఉండడానికి, మిమ్ములను చాటుగా ఉండి చూడడానికి నేను అంతర్ధానమయ్యాను. మీకు వాస్తవ జ్ఞ్యానం కలిగించడానికి కొంతసేపు కనపడలేదు. దానిని వేరేగా భావించకండి. నా ప్రవృత్తిని తప్పు పట్టకండి. ప్రియురాలులారా నన్ను అసూయతో చూడవద్దు.

న పారయేऽహం నిరవద్యసంయుజాం స్వసాధుకృత్యం విబుధాయుషాపి వః
యా మాభజన్దుర్జరగేహశృఙ్ఖలాః సంవృశ్చ్య తద్వః ప్రతియాతు సాధునా

మీకున్న భావానుబంధం ముందర నేను ఏమి చేసినా తక్కువే. దివ్యమైన దేవతాకాల ఆయుష్షు ఉండి కూడా మీరు చేసిన దానికి నేను ప్రత్యుపకారం చేయలేను . ఎంత కష్టపడి తెంపుకుందామన్నా ఇల్లూ, శరీరం అనే సంకెళ్ళు తెగవు.ఎంత కష్టపడి ఎంత ప్రయత్నం చేసినా సంసారం వాకిలీ ఇల్లూ పిల్లలూ అన్న బంధములతో ఉన్న వారు నన్ను సేవించరు. అలాంటిది మీరు నా కోసం అందరినీ వదలిపెట్టి వచ్చారు.
మీకు నేను ఒక వరం ఇస్తున్నాను. మీరు ఆ భావం వదిలించుకోంది.నిరంతరం మీ మనసు నా మీదే ఉండడానికి నేను అదృశ్యమయ్యాను గానీ ఇంకో కారణమేదీ లేదు.

                                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు