Pages

Wednesday, 9 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం


దర్పం ధంభం తొలగాలంటే వామనవాతార ఘట్టాన్ని పారాయణ చేయాలి. ఉన్న అవతారాలలోకెల్లా వాత్సల్య పూరితమైన అవతారం వామన అవతారం. వాతస్యం ఔదార్యమూ సౌశీల్యమూ నిండి ఉన్న అవతారం, మనం చేసిన తప్పునే గుణముగా స్వీకరించి, ఆ తప్పుతోనే మనకు బుద్ధి చెప్పే అవతారం

శ్రీశుక ఉవాచ
ఏవం విప్రకృతో రాజన్బలిర్భగవతాసురః
భిద్యమానోऽప్యభిన్నాత్మా ప్రత్యాహావిక్లవం వచః

ఇలా స్వామి పలికితే తన మనసులో ఉన్న సంకల్పాన్ని మాత్రం మార్చుకోలేదు. ధైర్యముగా ఇలా చెప్పాడు

శ్రీబలిరువాచ
యద్యుత్తమశ్లోక భవాన్మమేరితం వచో వ్యలీకం సురవర్య మన్యతే
కరోమ్యృతం తన్న భవేత్ప్రలమ్భనం పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజమ్

మహానుభావులచేత కీర్తించబడే స్వామీ!, నేను చెప్పిన మాట అబద్దం అవుతుంది అని మీరు అనుకుంటే దానిని నిజం చేస్తాను.నేను పలికిన మాట వంచన కాదు, కాకూడదు.మీ మూడవ పాదాన్ని నా శిరస్సున ఉంచు.నా శిరస్సు మీద నీ పాదధూళి పడనీ. అంటే నన్ను నీ దాసున్ని చేసుకో అని అడిగాడు

బిభేమి నాహం నిరయాత్పదచ్యుతో న పాశబన్ధాద్వ్యసనాద్దురత్యయాత్
నైవార్థకృచ్ఛ్రాద్భవతో వినిగ్రహాదసాధువాదాద్భృశముద్విజే యథా

నా పదవి పోతుందనీ నరకానికి పోతుంది అని భయపడను.పాశబంధానికి కూడా భయపడను.వచ్చిన పెద్ద ఆపదకు కూడా భయపడను.దారిద్ర్యం వచ్చి ధనం అంతా పోయిందే అని భయపడను.బలి చక్రవర్తి అబద్దం ఆడాడు, బలి చక్రవర్తి ఉత్తముడు కాడు అన్న మాటకు భయపడతాను. అపకీర్తి వస్తే భయపడతాను.

పుంసాం శ్లాఘ్యతమం మన్యే దణ్డమర్హత్తమార్పితమ్
యం న మాతా పితా భ్రాతా సుహృదశ్చాదిశన్తి హి

నన్ను మీరు శిక్షించుట, శిక్షించుట కాదు, అనుగ్రహించుటే.యోగ్యుడైన వాడి చేతా, గొప్పవాని చేతా శిక్షింపబడుట కూడా గొప్పతనమే, గౌరవమే. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఉన్న స్థితిలో నన్ను ఎవరూ శాసించలేరు.మా తల్లి, తండ్రీ మిత్రులూ గురువూ ఎవరూ శాసించరు. నా అధికానికే అందరూ తల ఒగ్గి ఉండేవారే 

త్వం నూనమసురాణాం నః పరోక్షః పరమో గురుః
యో నోऽనేకమదాన్ధానాం విభ్రంశం చక్షురాదిశత్

నీవు పేరుకు దేవతా పక్షపాతివి గానీ నీవు పరోక్షముగా మాకే మేలు చేస్తున్నావు. దేవతలకు ప్రియం కలిగిస్తున్నావు, మాకు హితం కలిగిస్తున్నావు. మేము రక రకాల మదములతో గుడ్డివారమయ్యాము. మాకు మీరు కన్నునిచ్చారు, గుడ్డితనాన్ని పోగొట్టి మా కన్ను తెరిపించారు. 

యస్మిన్వైరానుబన్ధేన వ్యూఢేన విబుధేతరాః
బహవో లేభిరే సిద్ధిం యాము హైకాన్తయోగినః

ఏకాంత యోగులు (పరమాత్మ మాత్రమే అంతా అని భావించే, పరమాత్మ కన్న ఇతరమైన దానిని కోరని వారు) పొందే సిద్ధిని మాకు ఇచ్చారు. బాగా పాతుకుని పోయే వైరానుబంధముతో దేవతల కన్నా వేరైనా చాలా మంది రాక్షసులు చాలా మంది నీ ఏకాంత భక్తులు పొందే సిద్ధిని పొందారు

తేనాహం నిగృహీతోऽస్మి భవతా భూరికర్మణా
బద్ధశ్చ వారుణైః పాశైర్నాతివ్రీడే న చ వ్యథే

నన్ను మీరు వరుణ పాశాలతో బంధించారు.నీవు చాలా పెద్ద పెద్ద పనులు చేసేవాడవు.అంత పెద్ద పనులు చేసే నీవు నన్ను బంధిస్తే నాకు అవమానమా గౌరవమా. ఇది నాకు అనుగ్రహమే నిగ్రహం కాదు 

పితామహో మే భవదీయసమ్మతః ప్రహ్రాద ఆవిష్కృతసాధువాదః
భవద్విపక్షేణ విచిత్రవైశసం సమ్ప్రాపితస్త్వం పరమః స్వపిత్రా

నీవు నా మీద ఇటువంటి దయను చూపడానికి కారణం నీవారికి చాలా ఇష్టమైన మా తాతగారు. అందరిచేతా ఉత్తముడు అని కీర్తించబడేవాడు.సాధు వాదమును (ఉత్తముడంటే ఇలా ఉండాలి) ప్రకటింపచేసి ప్రవర్తింపచేసడు ప్రహ్లాదుడు. ఆయన నీకు భక్తుడు.నీకు శత్రువూఇన తన తండ్రితో అనేక హింసలు పొందాడు

కిమాత్మనానేన జహాతి యోऽన్తతః కిం రిక్థహారైః స్వజనాఖ్యదస్యుభిః
కిం జాయయా సంసృతిహేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః

ఈ శరీరముతో ఏమి లాభం.చివరకు ఆ శరీరం మనని వదిలిపెడుతుంది. స్వజనులు అన్న పేరుతో దొంగలు గా ఉన్న, భాగాన్ని పంచుకునే వారైన బంధువులతో ఏమి పని. భార్యా భార్యకు భర్త అనే దానితో ఏమి లాభం.సంసారానికి ఈ దాంపత్యమే హేతువు 

ఇత్థం స నిశ్చిత్య పితామహో మహానగాధబోధో భవతః పాదపద్మమ్
ధ్రువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్భీతః స్వపక్షక్షపణస్య సత్తమ

ఇల్లు కట్టుకోవడం ధనం సంపాదించడం ఆయువును వ్యయం చేస్తాయి.ఇలా ప్రహ్లాదుడు నిశ్చయించుకుని, "ఇంత" అని చెప్పలేని లోతు గల జ్ఞ్యానం కల ప్రహ్లాదుడు ఎవరికీ భయం కలిగించని నీ పాదపద్మాలను చేరాడు. ప్రపంచములో ఉండే జనులతో భయపడి భయమును తొలగించే నీ పాదాలని ఆశ్రయించాడు. తనవారినందరినీ (రాక్షసులను) క్షయించడములో ఉత్తముడు. (ఇక్కడ తన వారు అన్న మాటకు శరీరేంద్రియ బుద్ధి మనసాదులు కూడా వస్తాయి. మనకు శత్రువులు ఇవే. వీటినే క్షయింపచేయాలి).  జ్ఞ్యాని ఐన వాడు తన వారిని క్షయింపచేయడములో సిద్ధుడు కావాలి. శరీరం ఇందిర్యం మనసు బుద్ధి వీటిని క్షయింపచేయాలి.ఇంద్రియాలు కోరిన వాటికి దూరముగా ఉండుటే క్షయింపచేయుట.ఉదయం సాయంకాలం కలిపి 32 ముద్దలతో పూర్తి చేయాలి.దానిని మెల్లగా ఎనిమిదికి తగ్గించుకుంటూ వెళ్ళాలి

అథాహమప్యాత్మరిపోస్తవాన్తికం దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీః
ఇదం కృతాన్తాన్తికవర్తి జీవితం యయాధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే

స్వామీ నేను నిన్ను ఎన్నడూ ద్వేషించలేదు.నిన్ను పూజించలేదు కూడా.నీ భక్తునకు శత్రువును కాబట్టి నన్ను నీవు శత్రువుగా భావించావు.అది నా అదృష్టమే.నీవు శత్రువుల దగ్గరకే తొందరగా వస్తావు.దైవం నన్ను నా శత్రువు దగ్గరకు బలవంతముగా తీసుకు వచ్చింది.
నా సంపద అంతా తొలగించిన తరువాతనే నేను నిన్ను చేరాను.నా సంపద పోగొట్టి నా వద్దకు వచ్చి నన్ను చేర్చుకున్నావు.ఎవరెవరు ఎంత గొప్పవారిగా వారిని భావించుకున్నా అందరి జీవితాలూ యముని దగ్గరే ఉంటుంది.జడబుద్ధులు ఈ విషయాన్ని తెలుసుకోలేరు

శ్రీశుక ఉవాచ
తస్యేత్థం భాషమాణస్య ప్రహ్రాదో భగవత్ప్రియః
ఆజగామ కురుశ్రేష్ఠ రాకాపతిరివోత్థితః

ఈ విధముగా బలి చక్రవర్తి మాట్లాడుతుంటే నిండు చంద్రునిలాగ ఆ ప్రాంతాన్ని ప్రకాశింపచేస్తూ వచ్చాడు

తమిన్ద్రసేనః స్వపితామహం శ్రియా విరాజమానం నలినాయతేక్షణమ్
ప్రాంశుం పిశఙ్గామ్బరమఞ్జనత్విషం ప్రలమ్బబాహుం శుభగర్షభమైక్షత

శోభతో, సమున్నతుడు, పీతాంబరం ధరించినవాడు, విశాల నేత్రుడు, నీలమేఘశ్యాముడు, ఆజానుభావుడు, సుందరుడు ఐన ప్రహ్లాదున్ని కళ్ళు పైకెత్తి చూసాడు

తస్మై బలిర్వారుణపాశయన్త్రితః సమర్హణం నోపజహార పూర్వవత్
ననామ మూర్ధ్నాశ్రువిలోలలోచనః సవ్రీడనీచీనముఖో బభూవ హ

వరుణ పాశములతో బంధించబడిన బలి చక్రవర్తి మామూలుగా తాతగారు వస్తే ఎలా పూజిస్తాడో అలా పూజించలేదు. తల మాత్రం వంచి కళ్ళు నిండా నీరు నిండగా సిగ్గుతో తల వంచుకున్నాడు

స తత్ర హాసీనముదీక్ష్య సత్పతిం హరిం సునన్దాద్యనుగైరుపాసితమ్
ఉపేత్య భూమౌ శిరసా మహామనా ననామ మూర్ధ్నా పులకాశ్రువిక్లవః

పరమాత్మ ఆసీనుడై ఉన్నాడు సింహాసనం మీద. సునంద నందాదులతో కూడి సింహాసనములో ఉన్న స్వామిని తల ఎత్తి చూసి శరీరం అంతా పులకించి ఆనందముతో సాష్టాంగపడి దండప్రణామం చేసి 

శ్రీప్రహ్రాద ఉవాచ
త్వయైవ దత్తం పదమైన్ద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనమ్
మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్

దీనిలో పెద్ద వింతేముంది, ఆనాడు ఇచ్చినదీ నీవే, ఈనాడు లాక్కుంటున్నదీ నీవే.ఇదీ మంచిదే.మీరు మావాన్ని చక్కగా అనుగ్రహించారు అనే నాభావన.ఎలాంటి వారినైనా మోహింపచేసే సంపద నుండి పడవేసారు

యయా హి విద్వానపి ముహ్యతే యతస్తత్కో విచష్టే గతిమాత్మనో యథా
తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిలలోకసాక్షిణే

పండితులు కూడా ఈ రాజ్య సంపదతో మోహం చెందుతారు.అలాంటిది ఆత్మ తత్వాన్ని ఎవరు తెలుస్కుంటారు.నా మనవడికి ఇంత ఉపకారం చేసిన జగదీశ్వరుడవూ అఖిల లోక సాక్షి ఐన నీకు నమస్కారం 

శ్రీశుక ఉవాచ
తస్యానుశృణ్వతో రాజన్ప్రహ్రాదస్య కృతాఞ్జలేః
హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనమ్

ప్రహ్లాదుడు వింటూ ఉండగా బ్రహ్మగారు స్వామితో ఇలా అన్నారు

బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ తత్పత్నీ భయవిహ్వలా
ప్రాఞ్జలిః ప్రణతోపేన్ద్రం బభాషేऽవాఙ్ముఖీ నృప

ఇంతలో బంధించిన తన భర్తను చూచి వింధ్యావలి భయపడి ఉపేంద్రునితో తల కిందకు వంచి  చేతులు జోడించి నమస్కరించి ఇలా అన్నది. 

శ్రీవిన్ధ్యావలిరువాచ
క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతం తే స్వామ్యం తు తత్ర కుధియోऽపర ఈశ కుర్యుః
కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహన్తి త్యక్తహ్రియస్త్వదవరోపితకర్తృవాదాః

మీరు ఆడుకోవడానికి మూడు లోకాలూ ఏర్పరచుకున్నారు.అవి నావి నావి, అని దుష్టబుద్ధులే అనుకుంటారు.నీవు కర్తవూ, ప్రభువువూ, అలాంటిది వారు నీ భూమిని నాది అనుకుంటున్నారు.అలాంటిది నీవే వారి కర్తృత్వాన్ని తొలగించావు.అలాంటి వారు, సిగ్గు విడిచిన వారు ఇపుదేమి చేయగలరు.

శ్రీబ్రహ్మోవాచ
భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ
ముఞ్చైనం హృతసర్వస్వం నాయమర్హతి నిగ్రహమ్

స్వామీ, అంతా తీసుకున్నావు కదా, ఇంకా ఎందుకు కట్టావు.ఇతను నిగ్రహానికి యోగ్యుడు కాడు, అనుగ్రహానికి అర్హుడు.

కృత్స్నా తేऽనేన దత్తా భూర్లోకాః కర్మార్జితాశ్చ యే
నివేదితం చ సర్వస్వమాత్మావిక్లవయా ధియా

తాను కష్టపడి సత్కర్మ చేసి, సంపాదించిన లోకాలను దైన్యం లేకుండా ధైర్యముగా నీకు ఇచ్చాడు.కాబట్టి అతన్ని విడిచిపెట్టు 

యత్పాదయోరశఠధీః సలిలం ప్రదాయ
దూర్వాఙ్కురైరపి విధాయ సతీం సపర్యామ్
అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం
దాశ్వానవిక్లవమనాః కథమార్తిమృచ్ఛేత్

ఏ సంపదా లేని వాడు రెండు గడ్డిపూసలు కమండలములో వేసి వాటితో ఆ నీటితో పాదాలు కడిగి, ఆ గరికతో తీర్థం నెత్తిన జల్లుకున్నవారికే ఉత్తమలోకాలు (మోక్షము) ఇస్తావే, అలాంటిది అన్నీ ఇచ్చినవాడిని బంధిస్తావా. నిన్ను సేవించి నీ పాద జలాన్ని శిరస్సున వేసుకుని, తనది అనుకున్నదాన్ని  నీకిచ్చిన వాడిని ఎందుకు బంధించావు

శ్రీభగవానువాచ
బ్రహ్మన్యమనుగృహ్ణామి తద్విశో విధునోమ్యహమ్
యన్మదః పురుషః స్తబ్ధో లోకం మాం చావమన్యతే

నేను ఎవరిని దయ చూడాలని అనుకుంటానో వాడి సంపదను నేను తీసుకుంటాను.ఆ విషయం నీకు తెలుసు కదా. ఆ సంపద మదముతో లోకాన్ని నన్నూ అవమానిస్తాడు 

యదా కదాచిజ్జీవాత్మా సంసరన్నిజకర్మభిః
నానాయోనిష్వనీశోऽయం పౌరుషీం గతిమావ్రజేత్

మానవుడు తాను చేసిన కర్మలతో రకరకాల జాతులలో పుడతాడు. ఇలా పుట్టీ పుట్టీ నా అనుగ్రహముతో వాడికి మానుష జాతిలో పుట్టుక వస్తుంది. మనుష్య జన్మ వాడికి మళ్ళీ ఏ జాతిలో పుట్టకుండా ఉండటానికి ఉపయోగపడాలి. 

జన్మకర్మవయోరూప విద్యైశ్వర్యధనాదిభిః
యద్యస్య న భవేత్స్తమ్భస్తత్రాయం మదనుగ్రహః

ఈ మానవుడిగా పుట్టిన్వాడి చుట్టూ శత్రువులు ఉంటారు. 1. ఉత్తమ జాతిలో పుట్టానూ 2. గొప్ప పని చేస్తున్నాను. 3. మంచి యవ్వనములో ఉన్నాను. 4. బాగా అందముగా ఉన్నాను 5. బాగా చదువుకున్నాను 6. బాగా పాలిస్తున్నాను 7. బాగా సంపాదించాను.
ఇవి ఉండి కూడా వాడికి అహంకారం లేదంటే వాడికి నా అనుగ్రహం ఉంది అని అర్థం. 

మానస్తమ్భనిమిత్తానాం జన్మాదీనాం సమన్తతః
సర్వశ్రేయఃప్రతీపానాం హన్త ముహ్యేన్న మత్పరః

నా భక్తుడైన వాడు ఇలాంటి వాటికి మోహము చెందకూడదు. అభిమానం అహంకారం జడత్వానికి నిమిత్తమైన, అన్ని రకముల శ్రేయస్సులకూ శత్రువులైన వాటి  యందు నా భక్తుడు మోహం పొందడు

ఏష దానవదైత్యానామగ్రనీః కీర్తివర్ధనః
అజైషీదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి

ఇతను సకల దానవ దైత్యులలో గొప్పవాడు, వారికి కీర్తిని పెంచేవాడు. నా  మాయను గెలిచాడు. ఇంత బాధలు వచ్చినా మోహం చెందలేదు. 

క్షీణరిక్థశ్చ్యుతః స్థానాత్క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః
జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాతనామనుయాపితః

ధనమూ సంపదా పోయింది, పదవీ పోయింది, అధిక్షేపించబడ్డాడు, శత్రువుచే బంధించబడ్డాడు, బంధువులు కూడా వదిలిపెట్టారు, అన్ని రకాల బాధలూ పడ్డాడు

గురుణా భర్త్సితః శప్తో జహౌ సత్యం న సువ్రతః
ఛలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్

గురువుగారు బెదిరించారు,చివరకు శపించారు, ఇన్న ఐనా ఇతను సత్యాన్ని వదిలిపెట్టలేదు. ఇన్ని వచ్చినా సత్యం మీద నిలిచి  ఉన్న ఇతను సత్య వ్రతుడు. నేను కూడా ఇతన్ని సత్యం నుండి తప్పిద్దామనే మాట్లాడాను గానీ ఇతను సత్యాన్ని వదలలేదు

ఏష మే ప్రాపితః స్థానం దుష్ప్రాపమమరైరపి
సావర్ణేరన్తరస్యాయం భవితేన్ద్రో మదాశ్రయః

దేవతలకు కూడా పొందరాని స్థానాన్ని నేను ఇస్తున్నాను. ఇతను సావర్ణి మన్వంతరములో ఇంద్రుడవుతాడు. అప్పుడు కూడా నన్నే ఆశ్రయించి ఉంటాడు.

తావత్సుతలమధ్యాస్తాం విశ్వకర్మవినిర్మితమ్
యదాధయో వ్యాధయశ్చ క్లమస్తన్ద్రా పరాభవః
నోపసర్గా నివసతాం సమ్భవన్తి మమేక్షయా

ఆ మన్వంతరం వరకూ సుతల లోకములో ఉంటాడు. విశ్వకర్మ నిర్మించిన సుతల లోకాన్ని ఇస్తున్నాను. అక్కడ మనో వ్యాధిగానీ వ్యాధి కానీ పరాజయం విఘ్నములూ బద్దకమూ ఉండవు. సుతలం బ్రహ్మ కల్పాంతం వరకూ ఉంటుంది. 

ఇన్ద్రసేన మహారాజ యాహి భో భద్రమస్తు తే
సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః

ఇంద్రుడే సైన్యముగా కల వాడా నీకు శుభం కలుగుతుంది. నీవు సుతలం వెళ్ళు. స్వర్గములో ఉన్న దేవతలు కూడా "మాకు వస్తే బాగుండు" అనుకునే ఆ లోకానికి నీ బంధువులతో కలిసి వెళ్ళు

న త్వామభిభవిష్యన్తి లోకేశాః కిముతాపరే
త్వచ్ఛాసనాతిగాన్దైత్యాంశ్చక్రం మే సూదయిష్యతి

అష్టదిక్పాలకులు కూడా నిన్ను ఓడించలేరు. ఇంక మిగతావారి సంగతి వేరేచెప్పాలా. నీ శాసనాన్ని దిక్కరించేవారిని నా చక్రమే సంహరిస్తుంది

రక్షిష్యే సర్వతోऽహం త్వాం సానుగం సపరిచ్ఛదమ్
సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్

అన్ని దిక్కుల నుండి నిన్నూ నీ పరివారాన్నీ నీ జనులనూ ద్వారపాలకుడిగా ఉండి కాపాడుతూ ఉంటాను. నిరంతరం నీవు నన్ను చూస్తూ ఉంటావు. నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను

తత్ర దానవదైత్యానాం సఙ్గాత్తే భావ ఆసురః
దృష్ట్వా మదనుభావం వై సద్యః కుణ్ఠో వినఙ్క్ష్యతి

నీ చుట్టూ ఉన్న దానవ దైత్యులతో కలిస్తే నీకు మళ్ళీ అసురీ స్వభావం రావచ్చు. అది నన్ను చూడటముతో పోతుంది. అందుకే నేను అక్కడ నీ ఎదుటే ఉంటాను