Pages

Sunday, 27 April 2014

శ్రీమద్భాగవతం దశం స్కంధం నలభై రెండవ అధ్యాయం

       

      ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశం స్కంధం నలభై రెండవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
అథ వ్రజన్రాజపథేన మాధవః స్త్రియం గృహీతాఙ్గవిలేపభాజనామ్
విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛ యాన్తీం ప్రహసన్రసప్రదః

మూడు వంకరలు గల ఒక అమ్మాయి వచ్చింది. ఆమె త్రివక్ర. ఆమె రాజ మార్గములో వెళుతూ సుగంధములు గల పాత్రను తీసుకు వెళుతున్నది. ఆమె ముఖం మాత్రం బాగుంది. బ్రహ్మానందాన్నిచ్చే పరమాత్మ నవ్వుతూ ఇలా ప్రశించారు

కా త్వం వరోర్వేతదు హానులేపనం కస్యాఙ్గనే వా కథయస్వ సాధు నః
దేహ్యావయోరఙ్గవిలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్భవిష్యతి

సుందరీ నీవెవరు, ఈ అనులేపనం ఏమిటి, నీవెవరి స్త్రీవి. ఇది చందములా ఉన్నది. దీన్ని మాకు కూడా ఇస్తావా. అది ఇస్తే నీకు త్వరలోనే ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది

సైరన్ధ్ర్యువాచ
దాస్యస్మ్యహం సున్దర కంససమ్మతా
త్రివక్రనామా హ్యనులేపకర్మణి
మద్భావితం భోజపతేరతిప్రియం
వినా యువాం కోऽన్యతమస్తదర్హతి

సుందరా నేను కంసునికి ఇష్టురాలైన దాసిని. నా పేరు త్రివక్ర. నేను తీసిన ఈ చందనమే భోజపతి కంసునికి ఇష్టము. అలాంటి గంధమునకు మీరు కాక ఇంకెవరు తగిన వారు.

రూపపేశలమాధుర్య హసితాలాపవీక్షితైః
ధర్షితాత్మా దదౌ సాన్ద్రముభయోరనులేపనమ్

రూపపేశలం - సౌందర్యమైన రూపాన్ని  మాధుర్యమైన చిరునవ్వునూ కమకమ్మని మాటలనూ చిరునవ్వులనూ కల నీకు కాక ఇంకెవరికి ఇస్తాను.

తతస్తావఙ్గరాగేణ స్వవర్ణేతరశోభినా
సమ్ప్రాప్తపరభాగేన శుశుభాతేऽనురఞ్జితౌ

భగవంతుడు తనకు తానుగా వచ్చి మనం అనుభవిస్తున్న ఆయన వస్తువులను స్వయముగా యాచిస్తే ఇవ్వడానికి ఇవ్వకపోవడానికీ గల కారణాలు ఇందులో గమనించవచ్చు
ఎలాంటి వారు ఎలాంటి గంధం రాసుకోవాలో శాస్త్రం ఉంది. తనకు ఏ రంగు ఉందో దానికి వ్యతిరేకమైన రంగు గల గంధం పూసుకోవాలి. తెల్లగా ఉన్నవారు ఎర్రగా ఉన్న గంధాన్ని పూసుకోవాలి.
అది తెలిసిన కుబ్జ వారి రంగు కంటే వేరే రంగు చందనం పూసింది. చందనముతో పూల దండలతో కృష్ణ బలరాములు మరింతగా ప్రకాశిస్తున్నారు. కుబ్జ తాను స్వయముగా గంధం పూసింది.

ప్రసన్నో భగవాన్కుబ్జాం త్రివక్రాం రుచిరాననామ్
ఋజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్దర్శనే ఫలమ్

తనను సేవిస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో, తనను సేవిస్తే ఫలం కలగడానికి ఆలస్యం కలగదు అన్న విషయం లోకానికి చెప్పదలచాడు కృష్ణుడు. ఆమెను చక్కని దానిగా చేయాలనుకున్నాడు

పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్ర్యఙ్గుల్యుత్తానపాణినా
ప్రగృహ్య చిబుకేऽధ్యాత్మముదనీనమదచ్యుతః

ఆమె రెండు ముందరి కాళ్ళ మీద తన రెండు ముందరి కాళ్ళు పెట్టి రెండు బొటన వేళ్ళూ మడమ కింద పెట్టి సాగదీసాడు. దానితో ఆమె బంగారు తీగలాగ అయ్యింది. ఆమె మూడు వంకరలూ పోయాయి.

సా తదర్జుసమానాఙ్గీ బృహచ్ఛ్రోణిపయోధరా
ముకున్దస్పర్శనాత్సద్యో బభూవ ప్రమదోత్తమా

మద్ది చెట్టంత పొడుగు అయ్యింది. పరమాత్మ యొక్క హస్త స్పర్శతో ఉత్తమ స్త్రీ అయ్యింది.

తతో రూపగుణౌదార్య సమ్పన్నా ప్రాహ కేశవమ్
ఉత్తరీయాన్తమకృష్య స్మయన్తీ జాతహృచ్ఛయా

రూపమూ గుణమూ ఔదార్యమూ ఉన్న ఆమె, కృష్ణ పరమాత్మ ఉత్తరీయాన్ని పట్టి లాగింది. తన ఇంటికి రమ్మని అడిగింది. నిన్ను నేను విడిచి ఉండలేను అన్నది.

ఏహి వీర గృహం యామో న త్వాం త్యక్తుమిహోత్సహే
త్వయోన్మథితచిత్తాయాః ప్రసీద పురుషర్షభ

నీ వలన నా మనసు కలత పడింది . అనుగ్రహించు, ప్రసన్నుడవు కా

ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః
ముఖం వీక్ష్యాను గోపానాం ప్రహసంస్తామువాచ హ

బలరాముడు చూస్తుండగా అడిగిన కుబ్జతో అన్నగారి ముఖాన్నీ తోటివారి ముఖాన్నీ చూచి నవ్వుతూ, కొంచెం సకోచించి ఇలా అన్నాడు

ఏష్యామి తే గృహం సుభ్రు పుంసామాధివికర్శనమ్
సాధితార్థోऽగృహాణాం నః పాన్థానాం త్వం పరాయణమ్

తప్పకుండా వస్తాను. పురుషుల మానసిక బాధ తొలగించే నీ ఇంటికి తప్పకుండా వస్తాను. ఇక్కడ పనులు పూర్తి చేసుకుని వస్తాను. మాబోటి బాట సారులకు నీ ఇల్లే దిక్కు.

విసృజ్య మాధ్వ్యా వాణ్యా తామ్వ్రజన్మార్గే వణిక్పథైః
నానోపాయనతామ్బూల స్రగ్గన్ధైః సాగ్రజోऽర్చితః

తీయ తీయని మాటలతో ఆమెను పంపించాడు. చిత్త వికారం పొందిన స్త్రీని ఎలాంటి మాటలతోనైనా విడిపించుకోవడం కష్టం. ఆమె మనసుకు నచ్చేవిధముగా మాట్లాడి ఆమెను పంపించాడు
దారిలో ఉండే పౌరులందరూ తాంబూలాలూ పుష్పములూ గంధములూ ఇచ్చారు

తద్దర్శనస్మరక్షోభాదాత్మానం నావిదన్స్త్రియః
విస్రస్తవాసఃకవర వలయా లేఖ్యమూర్తయః

యువతులు ఆయన సౌందర్యాన్ని చూచి తమలో కలిగిన మన్మధ వికారముతో తాము ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోయారు

తతః పౌరాన్పృచ్ఛమానో ధనుషః స్థానమచ్యుతః
తస్మిన్ప్రవిష్టో దదృశే ధనురైన్ద్రమివాద్భుతమ్

ఇలా స్వామి బయలు దేరి ధనుర్యాగం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇంద్ర ధనస్సులాగ ఆ ధనుర్యాగ శాల అద్భుతముగా ఉంది

పురుషైర్బహుభిర్గుప్తమర్చితం పరమర్ద్ధిమత్
వార్యమాణో నృభిః కృష్ణః ప్రసహ్య ధనురాదదే

ఎంతో మంది భక్తులు దాన్ని పూజిస్తున్నారు, కాపలా కాస్తున్నారు. చాలా మంది వద్దు వద్దని వారిస్తుండగా కృష్ణుడు అక్కడకు వెళ్ళి ఆ ధనువును ఎడమ చేత్తో తీసుకుని ఆ నారిని ఎక్కుపెట్టగా

కరేణ వామేన సలీలముద్ధృతం సజ్యం చ కృత్వా నిమిషేణ పశ్యతామ్
నృణాం వికృష్య ప్రబభఞ్జ మధ్యతో యథేక్షుదణ్డం మదకర్యురుక్రమః

ఎప్పటిదో కాబట్టి ఆ ధనువు కాస్తా విరిగిపోయింది. ఈ విధముగా రామునిలాగ కృష్ణుడు కూడా ధనుర్భంగం చేసాడు. మదించిన, బాగా బలం ఉన్న ఏనుగు చెరుకు గడ విరిచినట్లుగా స్వామి ధనువును విరిచాడు

ధనుషో భజ్యమానస్య శబ్దః ఖం రోదసీ దిశః
పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్

ఆ ధనువు విరుగుచుండగా ఆ ధ్వని భూమ్యాకాశాలు వ్యాపించాయి. ఇది విన్న కంసుడు కంపించాడు

తద్రక్షిణః సానుచరం కుపితా ఆతతాయినః
గృహీతుకామా ఆవవ్రుర్గృహ్యతాం వధ్యతామితి

అది చూసిన ఆ ధనుశ్శాలను కాపాడే వారు, ఎవరో చిన్న పిల్లవాడు వచ్చి యాగం పాడుచేస్తున్నాడని చంపండి అంటూ పరుగెత్తుకుంటూ వచ్చారు.

అథ తాన్దురభిప్రాయాన్విలోక్య బలకేశవౌ
క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతుః

ఆయుధాలు తీసుకుని వారు రాగా కృష్ణుడు ఆ విరిగిన ధనువు యొక్క ముక్కలు తీసుకుని ఆ శకలాలతో వారిని చంపి వేశాడు

బలం చ కంసప్రహితం హత్వా శాలాముఖాత్తతః
నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసమ్పదః

కంసుడు ఇంకొందరిని పంపాడు. వారందరినీ ఆశాల ద్వారములోనే వధించాడు
అక్కడినుంచి బయటకు వచ్చి నగర శోభను చూస్తూ సంతోషించాడు
తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః
తేజః ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ

ఈయన తేజస్సు సౌందర్యమూ బలమూ పరాక్రమమూ బలమూ ఇవన్నీ చూచి ప్రజలు వీరు దేవోత్తములే అని అనుకున్నారు.

తయోర్విచరతోః స్వైరమాదిత్యోऽస్తముపేయివాన్
కృష్ణరామౌ వృతౌ గోపైః పురాచ్ఛకటమీయతుః

ఇలా తిరుగుతూ ఉండగా సూర్యాస్తమయం అయ్యింది. సాయం కాలం అయ్యేసరికి వారు ఎక్కడ దిగారో అక్కడికి వెళ్ళారు.

గోప్యో ముకున్దవిగమే విరహాతురా యా ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్
సమ్పశ్యతాం పురుషభూషణగాత్రలక్ష్మీం హిత్వేతరాన్ను భజతశ్చకమేऽయనం శ్రీః

కృష్ణ పరమాత్మ వ్రేపల్లె దాటి బయలు దేరేప్పుడు అక్కడ ఉన్న గోపికలు తమ మనసులో ఏమేమి ఆశించారో ( వారికి ఎలాంటి సన్మానం జరగాలని ఆశించారో) అవి అన్నీ మధురాపురిలో నిజం అయ్యాయి.

ఎంతో మంది ఉండగా అందరినీ వదలిపెట్టి పరమాత్మ యొక్క వక్ష స్థలాన్ని అమ్మవారే కోరుకున్నారంటే అటువంటి దివ్య రూప సౌందర్య సౌభాగ్యాలను ఎవరు మాత్రం వదులుకుంటారు, మధురా నగర స్త్రీలు కూడా కృష్ణున్ని చక్కగా ఆదరించహరు

అవనిక్తాఙ్ఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనమ్
ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితమ్

తమ విడిదికి వచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కుని పాలూ అన్నం తిన్నారు. (రాత్రి పెరుగు అన్నం తింటే ఆయువు తరిగిపోతుంది)
కంసుడు ఏమేమి చేయాలనుకుంటున్నాడో అన్నీ చేస్తున్నారు. ఆ  రాత్రి కృష్ణుడూ మొదలైన వారు హాయిగా నిదురించారు.

కంసస్తు ధనుషో భఙ్గం రక్షిణాం స్వబలస్య చ
వధం నిశమ్య గోవిన్ద రామవిక్రీడితం పరమ్

వార్తలన్నీ తెలుసుకున్నాడు కంసుడు. ధనుర్భంగం, దాన్ని రక్షించిన వారూ తాను పంపిన వారు హతమయిన సంగతీ, మధురా నగరమున కృష్ణ బలరాములు విహరించిన సంగతీ వినీ,

దీర్ఘప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః
బహూన్యచష్టోభయథా మృత్యోర్దౌత్యకరాణి చ

మొత్తం రాత్రి జాగారం చేసాడు భయపడి. అన్నీ దుర్నిమిత్తాలే కనపడుతున్నాయి. అంతా మృత్యువు దూతలుగానే కనపడుతున్నారు. ప్రతీ దుర్నిమిత్తం కంసునికి మృత్యువు తప్పదు అనే చెబుతోంది.

అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి
అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా

అతను వెళ్ళి అద్దములో చూసుకుంటే తన తల కనపడలేదు. తన మేద కనపడుతోంది. ఒక మనిషి వస్తోంటే ఇద్దరు కనపడుతున్నారు, ఒకటికి రెండు నక్షత్రాలు కనపడుతున్నాయి

ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః
స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనమ్

తన నీడలో మధ్యన పెద్ద రంధ్రం కనపడుతోంది. రెండు చెవులూ మూసుకుంటే వచ్చే ఘోష వినపడట్లేదు. చెట్లన్నీ బంగారం లాగ పసుపు పచ్చగా కనపడుతున్నాయి. తన కాళ్ళు తనకు కనపడట్లేదు

స్వప్నే ప్రేతపరిష్వఙ్గః ఖరయానం విషాదనమ్
యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగమ్బరః

కలలో ఒక పెద్ద ప్రేత వచ్చి కౌగిలించుకుందిల్. గాడిద మీద ఎక్కి ఊరేగుతున్నాడు, విషభోజనం తింటున్నాడు. నల్లని మాలలూ నల్లని గంధమూ, ఒళ్ళంతా నూనె పూసుకుని దిగంబరముగా ఉన్నాడు

అన్యాని చేత్థంభూతాని స్వప్నజాగరితాని చ
పశ్యన్మరణసన్త్రస్తో నిద్రాం లేభే న చిన్తయా

కొన్ని కలలో కనపడ్డాయి కొన్ని మెలకువలో కనపడ్డాయి. ఇవన్నీ చూచి మరణం తప్పదు అని తెలుసుకుని భయపడి ఆ రాత్రి నిదురపోలేదు

వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాద్భ్యః సముత్థితే
కారయామాస వై కంసో మల్లక్రీడామహోత్సవమ్

ఇలా ఆ రాత్రి గడచిన తరువాత సూర్యభగవానుడు ఉదయించిన తరువాత మల్ల యుద్ధ ఉత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లూ పూర్తి చేసాడు

ఆనర్చుః పురుషా రఙ్గం తూర్యభేర్యశ్చ జఘ్నిరే
మఞ్చాశ్చాలఙ్కృతాః స్రగ్భిః పతాకాచైలతోరణైః

మొత్తం రంగాన్ని బాగా అలంకరించి మంగళ వాద్యాలను మ్రోగించి వేదికలను పూలతో అలంకరించారు. జెండాలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. అందరికీ

తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రపురోగమాః
యథోపజోషం వివిశూ రాజానశ్చ కృతాసనాః

కూర్చోడానికి వర్ణాలకు అనుగుణముగా ఆసనాలు ఏర్పాటు చేసారు. యధేచ్చగా అందరూ వచ్చి కూర్చున్నారు

కంసః పరివృతోऽమాత్యై రాజమఞ్చ ఉపావిశత్
మణ్డలేశ్వరమధ్యస్థో హృదయేన విదూయతా

కంసుడు తన రాజ సింహాసనము మీద మంత్రులందరితో వచ్చి కూర్చున్నాడు. చుట్టూ అందరూ ఉన్నా లోపల మాత్రం వణుకుతున్నాడు. వణుకుతున్న హృదయముతో ఉన్నాడు

వాద్యమానేసు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ
మల్లాః స్వలఙ్కృతాః దృప్తాః సోపాధ్యాయాః సమాసత

మంగళ వాద్యాలు మోగుతున్నాయి, మల్ల యుద్ధానికి భేరీలు మోగిస్తున్నారు. మల్లులు అలంకరించుకుని వచ్చారు

చాణూరో ముష్టికః కూతః శలస్తోశల ఏవ చ
త ఆసేదురుపస్థానం వల్గువాద్యప్రహర్షితాః

అందరూ మంగళ వాద్యాలతో ఉత్సాహ పరుస్తూ ఉంటే వీరందరూ వచ్చారు

నన్దగోపాదయో గోపా భోజరాజసమాహుతాః
నివేదితోపాయనాస్త ఏకస్మిన్మఞ్చ ఆవిశన్

నందగోపాదులు వచ్చారు. వారు వచ్చి రాజుగారికి కానుకలు అందించి, రాజు ఏర్పరచిన ఆసనాలలో కూర్చున్నారు.


                                                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు