Pages

Sunday, 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై తొమ్మిదవ అధ్యాయం

              ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
స గత్వా హాస్తినపురం పౌరవేన్ద్రయశోऽఙ్కితమ్
దదర్శ తత్రామ్బికేయం సభీష్మం విదురం పృథామ్

అకౄరుడు స్వామి యొక్క ఆజ్య్నానుసారం హస్తినకు వెళ్ళి దృతరాష్టౄన్నీ భీష్మున్నీ కుంతినీ అందరినీ దర్శించాడు

సహపుత్రం చ బాహ్లీకం భారద్వాజం సగౌతమమ్
కర్నం సుయోధనం ద్రౌణిం పాణ్డవాన్సుహృదోऽపరాన్

ద్రోణాచార్యుడూ మొదలైన వారినీ అశ్వద్ధామనూ దుర్యోధనున్నీ కర్ణున్నీ ధర్మరాజునూ ఇతర మిత్రులనూ కలసి, అందరూ బాగున్నరా అని కుశల వార్తలు అడిగి, వారిచే అడిగించబడి

యథావదుపసఙ్గమ్య బన్ధుభిర్గాన్దినీసుతః
సమ్పృష్టస్తైః సుహృద్వార్తాం స్వయం చాపృచ్ఛదవ్యయమ్

ఉవాస కతిచిన్మాసాన్రాజ్ఞో వృత్తవివిత్సయా
దుష్ప్రజస్యాల్పసారస్య ఖలచ్ఛన్దానువర్తినః

కొన్ని నెలలు అక్కడ ఉండి బయలుదేరాడు. అలా ఉంటే కానీ వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్న విషయం తెలుస్తుంది (వృత్తవివిత్సయా -రాజు యొక్క నడవడి తెలియగోరి).
రాజుగారికి మూడు విశేషణాలు వేశాడు. దుష్ట సంతానం గలవాడూ, కొద్ది జ్ఞ్యానం కలవాడు, దుష్టుల ఇష్టమును అనుసరించేవాడు. ఇలాంటి రాజు యొక్క స్వభావాన్ని తెలుసుకుందామని

తేజ ఓజో బలం వీర్యం ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్
ప్రజానురాగం పార్థేషు న సహద్భిశ్చికీఋషితమ్

పాండవులలో ఏమేమి ఉన్నాయో కంటే, పాండవులకు అపకారం చేయాలని దృతరాష్ట్ర పుత్రులు ఎందుకు కోరుతున్నారో తెలుసుకున్నాడు. తమలో లేనివి పాండవులలో ఉన్నాయి, ఓజః బలం వీర్యం తేజస్సు ఇలాంటివి ఎన్నో సద్గుణాలున్నాయి. ప్రజలందరూ వారి యందు అనురాగముతో ఉన్నారు. వారి దగ్గర ఉన్న మంచి గుణాలూ, వారికి మీద ప్రజలకు ఉన్న అనురాగం సహించరానిదిగా ఉంది కౌరవులకు

కృతం చ ధార్తరాష్ట్రైర్యద్గరదానాద్యపేశలమ్
ఆచఖ్యౌ సర్వమేవాస్మై పృథా విదుర ఏవ చ

దృతరాష్ట్ర పుత్రులు పాండు పుత్రులకు విషం పెట్టుట మొదలైన పనులు ఏమేమి చేసారో విదురుడు, కుంతీ అకౄరునికి చెప్పారు. కుంతికి అన్నగారు అకౄరుడు.

పృథా తు భ్రాతరం ప్రాప్తమక్రూరముపసృత్య తమ్
ఉవాచ జన్మనిలయం స్మరన్త్యశ్రుకలేక్షణా

తన పుట్టిల్లు జ్ఞ్యాపకం చేసుకుని కళ్ళవెంబడి నీళ్ళు రాగా కుంతీ దేవి

అపి స్మరన్తి నః సౌమ్య పితరౌ భ్రాతరశ్చ మే
భగిన్యౌ భ్రాతృపుత్రాశ్చ జామయః సఖ్య ఏవ చ

మమ్ము ఎపుడైనా అమ్మా నాన్నలూ అన్నలూ జ్ఞ్యాపకం చేసుకుంటున్నారా. చెల్లేళ్ళూ మేనళ్ళుల్లు దగ్గర  బంధువులూ

భ్రాత్రేయో భగవాన్కృష్ణః శరణ్యో భక్తవత్సలః
పైతృష్వస్రేయాన్స్మరతి రామశ్చామ్బురుహేక్షణః

భక్తుల యందు వాత్సల్యం కలవాడు, శరణు వేడిన వారిని రక్షించేవాడు ఐన భగవానుడైన కృష్ణుడూ, బలరాముడు మేనత్త పిల్లలను జ్ఞ్యాపకం చేసుకుంటున్నారా

సపత్నమధ్యే శోచన్తీం వృకానాం హరిణీమివ
సాన్త్వయిష్యతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్

తోడేళ్ళ మధ్య ఉన్న లేడి పిల్లల్లాగ శత్రువుల ఇంట ఉన్నాము. తండ్రి లేని పిల్లలు వారు, భర్త లేని దాన్ని ఐన నాకూ, మా యోగ క్షేమాలు కృష్ణ బలరాములు చూస్తారా

కృష్ణ కృష్ణ మహాయోగిన్విశ్వాత్మన్విశ్వభావన
ప్రపన్నాం పాహి గోవిన్ద శిశుభిశ్చావసీదతీమ్

చిన్న చిన్న పిల్లలతో ఉన్నాను, బాధపడుతున్నాను, నిన్నే శరణు వేడాను గోవిందా, నన్ను నీవు కాపాడవలసింది

నాన్యత్తవ పదామ్భోజాత్పశ్యామి శరణం నృణామ్
బిభ్యతాం మృత్యుసంసారాదీస్వరస్యాపవర్గికాత్

మానవులకు నీ పాద పద్మము కంటే మరొక రక్షకం నేను చూడలేదు. మృత్యువనే సంసారం నుండి బయలు పడాలని కోరేవారికీ పరమాత్మ మోక్షాన్ని పొందగోరేవారికీ నీ పాదపద్మం తప్ప వేరే రక్షకం నాకు కనపడలేదు.

నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే
యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గతా

కృష్ణా, సత్వాది గుణములు లేనివాడా, సకల జగత్తూ వ్యాపించి ఉన్నవాడా, యోగీశ్వరుడువూ, యోగమువూ నీవే. నిన్నే శరణు వేడుతున్నాను

శ్రీశుక ఉవాచ
ఇత్యనుస్మృత్య స్వజనం కృష్ణం చ జగదీశ్వరమ్
ప్రారుదద్దుఃఖితా రాజన్భవతాం ప్రపితామహీ

నీ పితామహుల తల్లి ఇలా చెప్పి బాగా ఏడిచింది. ఆమె ఎంతటి దుఃఖాన్ని పొందిందో అంతటి దుఃఖాన్నీ విదురుడూ అకౄరుడూ పొందారు.

సమదుఃఖసుఖోऽక్రూరో విదురశ్చ మహాయశాః
సాన్త్వయామాసతుః కున్తీం తత్పుత్రోత్పత్తిహేతుభిః

కుంతిని వారిరువురూ ఓదార్చారు. వారి పిల్లలనూ, వారి పుట్టుకనూ, వారి తేజస్సునూ గుర్తు చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పారు. దేవతలు నీ వెంట ఉంటారు ఎపుడూ  అని చెప్పారు.

యాస్యన్రాజానమభ్యేత్య విషమం పుత్రలాలసమ్
అవదత్సుహృదాం మధ్యే బన్ధుభిః సౌహృదోదితమ్

వెళ్ళే ముందు అకౄరుడు దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. తన పిల్లల మీద అతి ప్రేమతో ఉన్న దృతరాష్ట్రునితో అందరి సమక్షములో ఇలా మాట్లాడాడు

అక్రూర ఉవాచ
భో భో వైచిత్రవీర్య త్వం కురూణాం కీర్తివర్ధన
భ్రాతర్యుపరతే పాణ్డావధునాసనమాస్థితః

నీవు కురువులకు కీర్తి పెంచేవాడవు. నీ తమ్ముడైన పాండు రాజు మరణించిన తరువాత నీవు ఆ సింహాసనములో కూర్చున్నావు ( నీ స్థానం తాత్కాలికమే. పాండవులు పెద్దవారవగానే వారికి రాజ్యం ఇవ్వాలి. గుడ్డివారికి రాజ్యాధికారం  ఉండదు. అందుకే పాండురాజునకు రాజ్యం వచ్చింది)

ధర్మేణ పాలయన్నుర్వీం ప్రజాః శీలేన రఞ్జయన్
వర్తమానః సమః స్వేషు శ్రేయః కీర్తిమవాప్స్యసి

రాజైన వాడు భూమిని ఎపుడూ ధర్మముగా పరిపాలించాలి,శీలముతో ప్రజలను రంజింపచేయాలి. తనవారిలో ఇతరులతో సమునిగా ఉండాలి. అలా ఉన్న రాజుకు శ్రేయస్సూ కీర్తీ లభిస్తుంది.

అన్యథా త్వాచరంల్లోకే గర్హితో యాస్యసే తమః
తస్మాత్సమత్వే వర్తస్వ పాణ్డవేష్వాత్మజేషు చ

ఇంకో తీరుగా ప్రవర్తిస్తే అందరి చేతా నిందించబడతావు, నరకానికి వెళతావు. నీ కొడుకుల విషయములో పాండవుల విషయములో సమముగా ప్రవర్తించు.

నేహ చాత్యన్తసంవాసః కస్యచిత్కేనచిత్సహ
రాజన్స్వేనాపి దేహేన కిము జాయాత్మజాదిభిః

నావారు అనుకుని నీ కొడుకులను ప్రేమిస్తున్నావు. ప్రపంచములో ఎవరితో ఎపుడూ మనం మిక్కిలి కలసి ఉండుట కుదరదు. ప్రపంచములో ప్రతీ ప్రాణికీ అన్నిటికంటే ఇష్టమైనది తన శరీరం. అంత బాగా ఇష్టపడే శరీరముతోనే ఎక్కువకాలం ఉండము. అలాంటిది శరీరముతో వచ్చేవాటితో చాలా కాలం ఉండగలం అనుకోవడం సరి కాదు. నీవారు నీకెంత అశాశ్వతమో పాండవులు కూడా నీకు అంతే అశాశ్వతం. అలాంటపుడు ఇద్దరిపట్లా సమానముగా ఉంటూ మంచివాడిగా పేరు తెచ్చుకో.

ఏకః ప్రసూయతే జన్తురేక ఏవ ప్రలీయతే
ఏకోऽనుభుఙ్క్తే సుకృతమేక ఏవ చ దుష్కృతమ్

నీ వెంట కౌరవులూ రారు, పాండవులూ రారు. నీకున్న పేరు మాత్రమే నీ వెంట వస్తుంది. తనతోనే తాను ఎక్కువ కాలం కలసి ఉండలేడు.భార్యా పిల్లలతో కలసి ఉంటాడా ఎవడైనా. ఒక్కడిగా పుడతాడు, ఒక్కడిగా చస్తాడు. తాను చేసిన పుణ్యాన్ని తానే అనుభవిస్తాడు. తాను చేసిన పాపాన్ని కూడా తానే అనుభవిస్తాడు.
మన సుకృత దుష్కృతాలు మనం ఒంటిగానే అనుభవించాలి.

అధర్మోపచితం విత్తం హరన్త్యన్యేऽల్పమేధసః
సమ్భోజనీయాపదేశైర్జలానీవ జలౌకసః

నీది కాని సొమ్మును నీవు అధర్మముగా సంపాదిస్తే దాన్ని ఇంకొకరు అపహరిస్తారు. అధర్మముగా సంపాదించడం బుద్ధి హీనులు చేసే పని. నీది కాని వస్తువు నీ దగ్గర ఉండదు.
చేపలు నీళ్ళలో ఉంటాయి. నీళ్ళలో ఉన్న చేపలు, తమకు ఆహారముగా నీటిలో ఉన్న పదార్థాలని తింటాయి. ఆ పదార్థాలతో బాటు తాము ఏ నీటిలో ఉన్నాయో ఆ నీటిని కూడా తాగుతాయి. కొన్నాళ్ళకు తాము ఉండడానికే చోటు ఉండవు. అధర్మముగా సంపాదించడం అంటే మన ఇంటిని మనమే కొల్లగొట్టుకుంటున్నాం అని అర్థం.

పుష్ణాతి యానధర్మేణ స్వబుద్ధ్యా తమపణ్డితమ్
తేऽకృతార్థం ప్రహిణ్వన్తి ప్రాణా రాయః సుతాదయః

తన బుద్ధి బలముతో అధర్మముతో ఎవరిని పోషిస్తారో అటువంటి జ్ఞ్యానం లేని వాన్నీ, కృతార్థుడు కాని వాన్ని, ప్రాణములూ ధనమూ పుత్రాదులూ బయటకు వెళ్ళగొడతారు.

స్వయం కిల్బిషమాదాయ తైస్త్యక్తో నార్థకోవిదః
అసిద్ధార్థో విశత్యన్ధం స్వధర్మవిముఖస్తమః

ఎవరిని పోషించడానికి నీవు అధర్మం ఆచరించావో అలాంటి వారిచేత నీవు విడువబడతావు. కానీ వారిని పోషించడానికి చేసిన అధర్మం మాత్రం తోడుగా వస్తుంది.
వారు అర్థకోవిదులు కారు. తెలిసినవారు, తాను వెళ్ళేప్పుడు ఏది వెంట వస్తుందో దాన్ని పెంచుకుంటారు. దారాపుత్రాదులను పెంచితే వారు  విడిచిపెడతారు, వారిని దేనితో పోషిస్తామో అవి వెంట వస్తాయి.,
అనుకున్నదాన్ని సాధించలేక చీకటిలోపడి తన ధర్మాన్ని తాను ఆచరించలేకపోతాడు

తస్మాల్లోకమిమం రాజన్స్వప్నమాయామనోరథమ్
వీక్ష్యాయమ్యాత్మనాత్మానం సమః శాన్తో భవ ప్రభో

కలలో వచ్చిన మాయ కోరిక వంటిది ఈ లోకం. అటువంటి దాన్ని విడిచిపెట్టు.
మనసుతో మనసుని (బుద్ధిని )నిగ్రహించుకుని  శాంతముగా ఉండవలసినది. అని చెప్పగా

ధృతరాష్ట్ర ఉవాచ
యథా వదతి కల్యాణీం వాచం దానపతే భవాన్
తథానయా న తృప్యామి మర్త్యః ప్రాప్య యథామృతమ్

అకౄరా నీవు మంగళకరమైన చాలా మంచి మాటను చెబుతున్నావు. అమృతం పొందినవాడు  ఎలా తృపి పొందడో నీ మాట విన్న నేను తృప్తి పొందలేకున్నాను.

తథాపి సూనృతా సౌమ్య హృది న స్థీయతే చలే
పుత్రానురాగవిషమే విద్యుత్సౌదామనీ యథా

నీవు చెప్పినవన్నీ నాకు తెలుసు. కాని ఆ పరమాత్మ మంచి ఏదీ నా హృదయములో నిలవకుండా చేస్తున్నాడు. అందులో సత్యమూ ధర్మమూ ఉండుటలేదు. నా మనసు మొదట నుండీ పుత్రుల అనురాగముతో వైషమ్యాన్నే పొందింది. మెరుపు తీగలాగ వినే వన్నీ చంచలముగా వెళ్ళిపోతూ ఉంటాయి

ఈశ్వరస్య విధిం కో ను విధునోత్యన్యథా పుమాన్
భూమేర్భారావతారాయ యోऽవతీర్ణో యదోః కులే

ఐనా పరమాత్మ అనుకున్న దాన్ని ఎవరు మార్చగలరు. ఎలాగా భూభారం తొలగించడానికి పరమాత్మ పుట్టనే పుట్టాడు.

యో దుర్విమర్శపథయా నిజమాయయేదం
సృష్ట్వా గుణాన్విభజతే తదనుప్రవిష్టః
తస్మై నమో దురవబోధవిహారతన్త్ర
సంసారచక్రగతయే పరమేశ్వరాయ

పరమాత్మ ఎవరి ఊహకూ అందనంతటి తన మాయతో ఈ ప్రపంచాన్ని, రజస్ సత్వాది గుణాలను సృష్టించి అందులో ప్రవేశించి జగత్తును నడిపిస్తున్నాడు. ఏ మాత్రమూ అర్థం కాని విహారం ప్రధానముగా ఉండే గతి ఐన పరమేశ్వరునికి నా నమస్కారం.

శ్రీశుక ఉవాచ
ఇత్యభిప్రేత్య నృపతేరభిప్రాయం స యాదవః
సుహృద్భిః సమనుజ్ఞాతః పునర్యదుపురీమగాత్

ఈ ప్రకారముగా అకౄరుడు అతని అభిప్రాయాన్ని విని, మిత్రుల ఆజ్ఞ్యను పొంది యదు పురిని చేరాడు

శశంస రామకృష్ణాభ్యాం ధృతరాష్ట్రవిచేష్టితమ్
పాణ్దవాన్ప్రతి కౌరవ్య యదర్థం ప్రేషితః స్వయమ్

దృతరాష్ట్రుని చర్యలను వివరించాడు. ఏ పాండవుల గురించి కృష్ణుడు పంపాడో ఆ పాండవుల గురించి కౌరవులు ఏమనుకుంటున్నారో ఏమి చేయాలనుకుంటున్నారో వివరించాడు.

                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు