Pages

Saturday, 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

                         
                                                                   ఓం నమో భగవతే వాసుదేవాయ
 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
గర్గః పురోహితో రాజన్యదూనాం సుమహాతపాః
వ్రజం జగామ నన్దస్య వసుదేవప్రచోదితః

యదువంశపు రాజుల పురోహితుడు గర్గుడు. ఆయన చాలా గొప్పవాడు. గర్గుడు ఆకాశములో చూసి గ్రహాల స్థితి చెప్పేవాడు. ఆయన కూడా అరవై అధ్యాయాల గర్గ భాగవతం వ్రాశాడు. రోలూ రోకలీ పెరట్లోనే పెట్టాలి. ఇంటి ముందర పెట్టరాదు. కత్తి పీట, చీపురు విసురు రాయి కొడవలి వంటివీ, వీటిలో ఒక్కో దానిలో ఒక్కో రాక్షసి ఆవహించబడి ఉంటుంది. మొదలు భాగములో రాక్షసి చివరి భాగములో దేవతా ఆవహించి ఉంటాయి. కత్తి పీటను పడుకోబెట్టాలి, విసురు రాయిని కూడా పైదాన్ని అడుగునా అడుగుదాన్ని పైనా పెట్టకూడదు, రెండూ వేరు చేసి పెట్టకూడదు. పనిలేనప్పుడు రోకలిని రోటి మీద పెట్టి ఉంచకూడదు. ముగ్గు కూడా ఎపుడూ వంగి వేయకూడదు కూర్చుని వేయాలి

తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాఞ్జలిః
ఆనర్చాధోక్షజధియా ప్రణిపాతపురఃసరమ్

పరమాత్మ నోటిలోని అనంతమైన విశ్వాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తరువాత యదువుల పురోహితుడు గర్గుడు. గర్గున్ని వసుదేవుడు పంపాడు. ఆయన వ్రేపల్లెకు వెళ్ళాడు. గర్గుడు వచ్చాడని లేచి ఎదురేగి ఆనందముతో
సాష్టాగపడి నమస్కారం చేసి

సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూనృతయా మునిమ్
నన్దయిత్వాబ్రవీద్బ్రహ్మన్పూర్ణస్య కరవామ కిమ్

ఆసనములో కూర్చిని ఆతిథ్యాన్ని పొంది, ఆయనను అభినందించి స్తోత్రం చేసి, మీరు పరిపూర్ణులు, ఏ కొరతా లేనివారు. మేము మీకు ఏమి చేయగలము.

మహద్విచలనం నౄణాం గృహిణాం దీనచేతసామ్
నిఃశ్రేయసాయ భగవన్కల్పతే నాన్యథా క్వచిత్

పెద్దలూ గొప్పవారు తామున్న చోటి నుండి కదిలారంటే దీనులైన వారికి శ్రేయస్సు కలిగించడానికే. ఇంకో ప్రయోజనం ఉండదు.

జ్యోతిషామయనం సాక్షాద్యత్తజ్జ్ఞానమతీన్ద్రియమ్
ప్రణీతం భవతా యేన పుమాన్వేద పరావరమ్

మీరు కన్నులతోటే నక్షత్రాలను చూచి ఆ శాస్త్రాన్ని రచించారు. అది మామూలు కళ్ళకు కనపడదు. మీరు రచించిన ఆ శాస్త్రముతో మానవుడు శ్రేయస్సును పొందుతాడు.

త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారాన్కర్తుమర్హసి
బాలయోరనయోర్నౄణాం జన్మనా బ్రాహ్మణో గురుః

మీరు బ్రాహ్మణోత్తములలో శ్రేష్టులు. మా పిల్లలకు నామకరణ సంస్కారాన్ని మీరు పూర్తి చేయండి. ప్రపంచములో అన్ని లోకాలలో పుట్టుకతోనే బ్రాహ్మణుడు గురువు.

శ్రీగర్గ ఉవాచ
యదూనామహమాచార్యః ఖ్యాతశ్చ భువి సర్వదా
సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీసుతమ్

నేనెవరో లోకమంతా తెలుసు. యదు వంశానికి ఆచార్యున్ని. నేను నీ పిల్లవానికి సంస్కారం చేస్తే ఈ పిల్లలు నీ పిల్లలు కారు వసుదేవుని పిల్లలు అనుకుంటుంది.

కంసః పాపమతిః సఖ్యం తవ చానకదున్దుభేః
దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి

పాపమతి ఐన కంసుడు ఇప్పటికే అనుమానముతో ఉన్నాడు. వసుదేవునికీ నీకూ ఉన్న మత్రి వానికి తెలుసు. దేవకి యొక్క ఎనిమిదవ గర్భం స్త్రీ కావడానికి వీలు లేదని అనుమానిస్తూనే ఉన్నాడు. ఇపుడు నేను నామకరణం చేస్తే వాని అనుమానం బలపడుతుంది.

ఇతి సఞ్చిన్తయఞ్ఛ్రుత్వా దేవక్యా దారికావచః
అపి హన్తా గతాశఙ్కస్తర్హి తన్నోऽనయో భవేత్

అందువలన నీకూ హాని కలగవచ్చు, లేదా వారికీ హాని కలగవచ్చు, బంధించవచ్చు. అతను పాపి. చేయరాని పని అంటూ ఏదీ ఉండదు. ఇంత ఆపద పెట్టుకుని నన్ను నామకరణం చేయమంటున్నావు.

శ్రీనన్ద ఉవాచ
అలక్షితోऽస్మిన్రహసి మామకైరపి గోవ్రజే
కురు ద్విజాతిసంస్కారం స్వస్తివాచనపూర్వకమ్

మా వాళ్ళకు కూడా తెలియకుండా అతి రహస్యముగా నామకరణం గోశాలలో చేయండి. మీరు నామకరణం చేస్తున్నట్లు మావాళ్ళకు కూడా తెలియకుండా చేయండి.

శ్రీశుక ఉవాచ
ఏవం సమ్ప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్
చకార నామకరణం గూఢో రహసి బాలయోః

తాను చేయగోరిన పనినే నందుడు ప్రార్థించగా, తాను కూడా తన వేషం మార్చుకుని అతను కూడా ఒక గొల్లవానిలా వచ్చాడు.

శ్రీగర్గ ఉవాచ
అయం హి రోహిణీపుత్రో రమయన్సుహృదో గుణైః
ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్బలం విదుః
యదూనామపృథగ్భావాత్సఙ్కర్షణముశన్త్యపి

ఈ రోహిణీ పుత్రుడు తన ఉత్తమ గుణములతో తనవారందరినీ రమింపచేస్తాడు, ఆనందింపచేస్తాడు. కాబట్టి ఈయనను రాముడు అంటారు. ఉన్నవారందరిలో బలం ఎక్కువ ఉంది కాబట్టి బలుడు. అందుకు ఈయనను బలరాముడు అంటారు. ఈయన యాదవులనూ మిమ్ములనూ కౌరవులనూ, ఎంతో దూరముగా ఉన్నవారిని లాగి ఒకటి చేస్తాడు కాబట్టి ఈయన సంకర్షణుడు, (ఒకే సారి రెండు గర్భాలలో ప్రవేశించినవాడు కాబట్టి సంకర్షణుడు. ఈ సంకర్షణుడే వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణులనే వ్యూహాలలో ఒకటి. ఈయన ప్రళయ కాలములో సకల జగత్తునూ లాక్కుంటాడు. జీవులు ఆచరించిన కర్మల ఫలితాన్ని లాగి జీవులకు అందించేవాడు. ఎక్కడో ఉన్న కర్మ ఫలితాలను వారి వారికి అందిస్తాడు. ఇవన్నీ పరమార్థాలు)
వేరుగా ఉన్న యాదవులను ఒకటి చేస్తాడు కాబట్టి ఈయనను సంకర్షణుడు అంటారు

ఆసన్వర్ణాస్త్రయో హ్యస్య గృహ్ణతోऽనుయుగం తనూః
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః

యశోద కొడుకు ఐన ఈయన రంగు చెబుతూనే ఉంది. ఈయన ఒక్కో యుగానికీ ఒక్కో రంగు తీసుకుంటూ ఉంటాడు. సత్వ రజస్తమో గుణాలకూ మూడు వర్ణాలు, తెలుపూ ఎరుపూ నలుపు. ఆ యుగం ఏ రంగో ఆ రంగు తీసుకుంటాడు. ఒకప్పుడు శుక్ల, ఇంకొప్పడు రక్త, ఇంకొకప్పుడు పీత వర్ణం ఇపుడు నలుపు వర్ణం పొందాడు

ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః
వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాః సమ్ప్రచక్షతే

రంగు నలుపు కాబట్టి ఈయన కృష్ణుడు.కొన్ని జన్మల కింద ఈయన వసుదేవునికి కొడుకుగా ఉన్నాడు. కనుక ఈయన వాసుదేవుడు. తెలిసిన వారు ఇతన్ని వాసుదేవుడు అంటారు. కృష్ణుడు అని కూడా అంటారు . (కృష్ణా అంటే అనంతమైన అపరిచ్చినమైన ఆనందము)

బహూని సన్తి నామాని రూపాణి చ సుతస్య తే
గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః

ఈ పిల్లవానికి చాలా రూపాలూ చాలా పేరులు ఆయన గుణాలను బట్టీ చేసిన పనుల బట్టీ ఉంటాయి. అవి నాకు తెలుసు. వేరే ఎవరికీ తెలియదు.

ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనన్దనః
అనేన సర్వదుర్గాణి యూయమఞ్జస్తరిష్యథ

ఈయన మీకు ఉత్తమ శ్రేయస్సు ఇస్తాడు. ఈయన గోకులానికి గోపాలురనూ ఆనందింపచేస్తాడు. ఈయన చేత మీకొచ్చిన అన్ని ఆపదలనూ అనాయాసముగా దాటి వేస్తారు.

పురానేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః
అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్సమేధితాః

ఈయన పూర్వ జన్మలో దుర్మార్గుల చేత పీడించబడుతున్న సజ్జనుల బాధ చూడలేక వారిని ఓడించాడు.

య ఏతస్మిన్మహాభాగాః ప్రీతిం కుర్వన్తి మానవాః
నారయోऽభిభవన్త్యేతాన్విష్ణుపక్షానివాసురాః

ఈ పిల్లవాని మీద ఎవరైనా ప్రేమ చూపితే, విష్ణు పదములో ఉన్న వారికి ఆపదలు రానట్లు ఇతన్ని ప్రేమించిన వారికి ఆపదలు రావు.

తస్మాన్నన్దాత్మజోऽయం తే నారాయణసమో గుణైః
శ్రియా కీర్త్యానుభావేన గోపాయస్వ సమాహితః

ఈయన గుణాలతో నారయణుడంతటి వాడు. ఈ నామకరణ ఘట్టాన్ని శ్రద్ధా భక్తులతో విన్న వారు మళ్ళీ పుట్టరు (యాని నామాని గౌణాని)
కొంచెం సావధానముగా పిల్లవాన్ని పెంచు. సంపదతో కీర్తితో ప్రభావముతో, ఈ మూడింటితో పిల్లవాడిని కాపాడు.

శ్రీశుక ఉవాచ
ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే
నన్దః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషామ్

ఇలా చెప్పి గర్గుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. నందుడు పరమానందముగా తనకు పూర్తి ఆశీర్వాదం లభించింది, ధన్యుడిని అయ్యాననుకున్నాడు

కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ
జానుభ్యాం సహ పాణిభ్యాం రిఙ్గమాణౌ విజహ్రతుః

ఇలా కొంత కాలం గడిచేసరికి రామకృష్ణులు చేతులతో కలిసిన మోకాళ్ళతో నడవడం (పాతాళం) ప్రారంభించారు. స్వామి మోకాళ్ళు అతలమూ సుతలము. స్వామి హస్తములు భూభాగాన్ని గట్టిగా పట్టుకుని రక్షిస్తున్నాడు. సకల లోకాధారుడని చెప్పడానికి జానుభ్యాం సహ పాణిభ్యాం

తావఙ్ఘ్రియుగ్మమనుకృష్య సరీసృపన్తౌ
ఘోషప్రఘోషరుచిరం వ్రజకర్దమేషు
తన్నాదహృష్టమనసావనుసృత్య లోకం
ముగ్ధప్రభీతవదుపేయతురన్తి మాత్రోః

మానవుడు శిశువుగా చేసే పనులలో రహస్యం, వీరు కూడా పాకుతున్నవారై వ్రజ కర్దమాలలు ( గోశాలలూ మొదలైనవి), వాటిలో ఆవులూ మేకలూ రకరకాల ధ్వములు చేస్తుంటే పిల్లలు కూడా కేకలేస్తూ అంబాడుతున్నారు.
గోవుల అంబారవం వింటే గోవిందుడికి ఆనందము కలుగుతుంది. అది ప్రణవముతో సమానం. ఆ గోవుల యొక్క ధ్వనితో విని సంతోషించినా, లోకాన్ననుసరించి ముఖములో భయం చూపుతూ (భయం నటిస్తూ) తల్లి వద్దకు వచ్చి చేరాడు. వీరిద్దరూ కాసేపు పాములయ్యారు. ఘోష ప్రఘోషములతో (ఘోషము గరుత్మంతుడు, ప్రఘోషం విశ్వక్సేనుని హెచ్చరిక. పరమాత్మ బయలు దేరబోతూ ఉంటే గరుత్మంతుడు స్వామి నామాన్ని పెద్దగా అరుస్తాడు, కేంకారవం చేస్తాడు, విశ్వక్సేనుడు తన బెత్తముతో కొడుతూ స్వామి వస్తున్నాడని సూచిస్తాడు.)
స్వామి పిల్లవాడిగా తిరుగుతూ ఉన్నా ఆయన సకల రాజ లాంచనాలూ అలాగే  ఉన్నాయి.

తన్మాతరౌ నిజసుతౌ ఘృణయా స్నువన్త్యౌ
పఙ్కాఙ్గరాగరుచిరావుపగృహ్య దోర్భ్యామ్
దత్త్వా స్తనం ప్రపిబతోః స్మ ముఖం నిరీక్ష్య
ముగ్ధస్మితాల్పదశనం యయతుః ప్రమోదమ్

ఆ తల్లులు తమ పిల్లలు పరిగెత్తుకు వస్తే "పిల్లవాడు భయపడ్డాడని" దగ్గరకు తీసుకున్నారు. ఆ పిల్లవాళ్ళు బయట తిరిగినందు వలన ఒళ్ళంతా  బురద పట్టి ఉండగా, వారినెత్తుకుని పాలు ఇచ్చి, అలా పాలు తాగుత్న్న వారి ముఖాన్ని చూసారు. అప్పుడే పుడుతున్న చిన్న దంతములను చూస్తూ అందరికీ పళ్ళు వచ్చిన సంగతి చెప్పి తాము కూడా ఆనందించారు.
ఇక్కడ దశన అంటే చిన్న పళ్ళు వస్తున్నాయి అనే అర్థమే కాకుండా సంహరించడం అని కూడా వస్తుంది. అల్ప దశన అంటే చిన్నవారిని (పూతనాదులను)చంపాడు అని కూడా అర్థం వస్తుంది.

యర్హ్యఙ్గనాదర్శనీయకుమారలీలావ్
అన్తర్వ్రజే తదబలాః ప్రగృహీతపుచ్ఛైః
వత్సైరితస్తత ఉభావనుకృష్యమాణౌ
ప్రేక్షన్త్య ఉజ్ఝితగృహా జహృషుర్హసన్త్యః

ఆడవారు చూచి సంతోషించే చిన్నపిల్లల చేష్టలు చేస్తూ, ఆడవారు కానీ వేరే పిల్లలు కానీ, వారి ఆటలో భాగముగా తోకపట్టుకుని దూడ తోకను లాగుతున్నారు, ఆ దూడలు ముందుకు వెళుతున్నాయి. కానీ బలరామ కృష్ణులు అలా తోకపట్టుకుని లాగితే ఆ దూడలు ముందుకు పోక అక్కడే ఉంటున్నాయి. వారు అది చూసి ఈ దూడలు ముందుకు వెళ్ళట్లేదేంటని భయం నటిస్తూ వెనక్కు వచ్చేసారు. ఇల్లు వదిలిపెట్టి ఇలా వినోదిస్తున్నారు బలరామ కృష్ణులు.

శృఙ్గ్యగ్నిదంష్ట్ర్యసిజలద్విజకణ్టకేభ్యః
క్రీడాపరావతిచలౌ స్వసుతౌ నిషేద్ధుమ్
గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ
శేకాత ఆపతురలం మనసోऽనవస్థామ్

కొమ్ములున్నవాటితో, అగ్నితో, కోరలున్నవాటితో కత్తులతో నీటితో పక్షులతో ముళ్ళతో ఆపద పొంచి ఉండగా మహా చంచలులైన బలరామ కృష్ణులను  కట్టడి చేస్తూ ఇంటి పనులూ చేయలేకపోతున్నారూ, వారినీ పూర్తిగా ఒక కంట కనిపెట్టలేకుండా ఉండలేకున్నారు. మనసును ఒక చోట నిలుపలేకున్నారు.
పైకి అలా కనపడినా వారి అల్లరిని చూసి ఆనందిస్తూ ఉననారు.
లోకములో సంసారులు కూడా ఇల్లూ వాకిలీ భార్యా మొదలైనవారు ఉండటం వలన పూర్తిగా ఇటు భగవంతునీ కొలవలేమూ, పూర్తిగా మన పనులనూ మనం సరిగా చేయలేము.

కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే
అఘృష్టజానుభిః పద్భిర్విచక్రమతురఞ్జసా

కొద్దికాలం అయ్యే సరికి మోకాళ్ళు ఆంచకుండానే భూమి మీద సులభముగా నడవడం నేర్చుకున్నారు.

తతస్తు భగవాన్కృష్ణో వయస్యైర్వ్రజబాలకైః
సహరామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ముదమ్

కృష్ణుడు రామునితో కలిసి వ్రేపల్లెలో ఉన్న గోపిలకు ఆనందం కలిగించడానికి ఆడటం మొదలుపెట్టాడు

కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమారచాపలమ్
శృణ్వన్త్యాః కిల తన్మాతురితి హోచుః సమాగతాః

కృష్ణ పరమాత్మ చంచలమైన దుడుకు పనులు చూచి, కుమ్మరావస్థలోని చాపల్యం చూచి యశోదమ్మ వద్దకు వచ్చి ఈ విధముగా చెప్పారు.

వత్సాన్ముఞ్చన్క్వచిదసమయే క్రోశసఞ్జాతహాసః
స్తేయం స్వాద్వత్త్యథ దధిపయః కల్పితైః స్తేయయోగైః
మర్కాన్భోక్ష్యన్విభజతి స చేన్నాత్తి భాణ్డం భిన్నత్తి
ద్రవ్యాలాభే సగృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్

నీ పిల్లవాడు సమయం కాని సమయములో దూడలను ఆవు వద్దకు వదులుతున్నాడు. అవి పాలు తాగుతున్నాయి. అవి చూచి మేము ఏడుస్తున్నాము. (మనమందరమూ దూడలమే. స్వామి తన భక్తులను అసమయములో (అకారానికి అర్థం విష్ణువు, అసమయం అంటే తనను సేవించే సమయం వచ్చినపుడు) సంసార బంధము నుండి విడిపించి తన దగ్గరకు తీసుకుపోతాడు. హఠాత్తుగా బంధువులు పోతే తక్కిన వారు ఏడుస్తారు.
వారు ఏడుస్తుంటే స్వామి తాను నవ్వుతుంటాడు.
స్తేయం స్వాద్వత్త్యథ దధిపయః కల్పితైః స్తేయయోగైః దొంగతనానికి పనికొచ్చే సాధనములతో సహచరులతో కలిసి దొంగిలించి తాను బాగా తింటాడు.
మనం దొంగతనానికి కావలసిన అహంకారం మమకారం లాంటి వానితో జీవాత్మని మనం దొంగిలిస్తే, మనం దొంగిలించిన తన వస్తువును తాను తీసుకుని తాను భుజిస్తాడు.
పాలూ పెరుగూ దొంగతనం చేసి తినేస్తున్నాడు. తానొక్కడే తినకుండా పక్కనున్న వారికి పెట్టేస్తున్నాడు. ఎందుకు వారికి కూడా పెడుతున్నావంటే వారు నాకు సహకారం చేసారు అంటున్నాడు
పిల్లవాళ్ళకూ పెడుతున్నాడు, ఇంకా మిగిలితే కోతులకూ పెడుతున్నాడు. వెన్నా పాలూ చేతికి అందకపోతె కుండ పగలగొడుతున్నాడు. (నాకు అందనిదేదీ మీకు అందదు అని చెప్పడం దీని వలన. ఆరగింపు చేసిన తరువాతనే మీరు తినాలి అని చెప్పడం. ఈ శరీరానికే కుండ అని పేరు. పరమాత్మ సేవ చేయకుండా స్వార్థముగా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించకుండా అవయవాలతో ఉన్న ఆ కుండని (శరీరాన్ని) పగలగొట్టి వేరే శరీరాన్నిస్తాడు)
ఇక్కడ కోతి అంటే చపల చిత్తం అని కూడా వస్తుంది. స్వామి వారు వారు ఆచరించిన పనుల , కర్మల ఫలితాన్ని వారి వారికి పంచుతాడు.
ఆ మాత్రం పెరుగూ పాలూ కూడా లభించకపోతే దూడలను అరిపించి వెళ్ళిపోతాడు. పడుకుని ఉన్న పిల్లలను గిల్లి ఏడిపించి వెళ్ళిపోతాడు. మనం కూడా పరమాత్మను పరమాత్మ ఇవ్వని ద్రవ్యాలతో ఆరాధించకుంటే ఆయన కూడా మనని ఏడిపిస్తాడు. పరమాత్మకు అర్పించవలసిన దాన్ని పరమాత్మకు అర్పించాలి. ఆచరించినవన్నీ స్వామికి అర్పించకుంటే ఆ కర్మలౌ మనవవుతాయి. ఆ ఫలితాన్ని మనం అనుభవించాలి.

హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యైశ్
ఛిద్రం హ్యన్తర్నిహితవయునః శిక్యభాణ్డేషు తద్విత్
ధ్వాన్తాగారే ధృతమణిగణం స్వాఙ్గమర్థప్రదీపం
కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః

వెన్నా పాలూ పెరుగూ చేతికి అంటకుంటే ఒక రోలు ఎక్కి ఉట్టిని పట్టుకుంటాడు.
అప్పుడు కూడా అంటకుంటే ఆ కుండకు చిల్లు చేస్తాడు. అందులోంచి వచ్చిన పాలను తాను తాగక పక్కనున్న పిల్లల చేత తాగింపచేస్తాడు.
గోపికలందరూ ఇంటి పనులలో మునిగి బయటకు రాలేనంతగా ఉంటే చీకటి గదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న పాలూ పెరుగూ వెన్నా తీసుకోవడానికి నీవు తొడిగిన కంకణాలూ మణులూ రత్నాలూ వాటి వలన వచ్చే కొంచెం కాంతితో కనపడే పాలూ పెరుగూ వెన్నా కుండలను చూచి,  ఇలా సగం కనపడీ కనపడకుండా పాలూ పెరుగూ వెన్ననూ ఆ భాండాలను భేధించి, అవి చిల్లుపడి మేము తెలుసుకునే లోపలే అందులో ఉన్న పాలూ పెరుగూ వెన్నా పోతున్నాయి.
మనం సంసారములో పడి, పరమాత్మను స్మరించడం మరచిపోయి, అజ్ఞ్యానమనే చీకటి గదిలో ఉండగా, పరమాత్మ రక రకాలుగా తన దివ్య ఆభరణాల వెలుగులను మనకు అందిస్తూ ఉంటాడు. వారే పరమాత్మ మనకు అందించిన ఆచార్యులూ గురువులూ. వారు కూడా మనందరం బాగా పనిలో ఉన్నప్పుడే చెబుతారు. పని చేసుకోలేము, వారు చెబుతున్నది వినలేము. మనం మన కృత్యాలలో పడి గురువుగారు చెప్పినది కూడా వినకపోతే స్వామి మన దగ్గర ఉన్నవన్నీ ఖాళీ చేస్తాడు. ఇంకో జన్మకు మనని సిద్ధం చేస్తాడు. లీలల పేరుతో స్వామి మనకు ఈ విషయం చెబుతున్నాడు.

ఏవం ధార్ష్ట్యాన్యుశతి కురుతే మేహనాదీని వాస్తౌ
స్తేయోపాయైర్విరచితకృతిః సుప్రతీకో యథాస్తే
ఇత్థం స్త్రీభిః సభయనయనశ్రీముఖాలోకినీభిర్
వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ న హ్యుపాలబ్ధుమైచ్ఛత్

మేము ఇంటి పక్కనో వెనకనో గోడ మీద ఒక బొమ్మను గీసి , "ఈయన మన దేవుడు ఈయనను మేము పూజిస్తున్నాము" అని పూజిస్తుంటే కృష్ణుడు వచ్చి దాని మీద మూత్రం పోసి నాకంటే దేవుడు ఎవరున్నారు అంటున్నాడు. ఒక గోడ బొమ్మకు ఒక గోపిక ఆరగింపు చేస్తూ కళ్ళు మూసుకుని తెరిచి చూసే సరికి అది కాస్తా కృష్ణుడు తినేసి నీవు పెట్టింది నాకే కదా, ఇంకో దేవుడేవడున్నాడు నాకంటే అని అన్నాడు. అలా కృష్ణుడు నైవేద్యాన్ని ఎంగిలి చేస్తున్నాడు.
ఇలా ఆడవారు కృష్ణుడంటేనే భయపడుతున్నారు. అలా అని కృష్ణున్ని చూడకుండా ఉండలేకపోతున్నారు.
ఇవన్ని చెబితే యశోదమ్మ నవ్వింది. పిల్లవాడిని తిట్టుటకు కూడా మనసు రాలేదు. అలా పిల్లవాడి మీద నేరాలు చెప్పిన వారినే మందలించింది.

ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః
కృష్ణో మృదం భక్షితవానితి మాత్రే న్యవేదయన్

ఒక సారి పరమాత్మ యశోదమ్మకు తన విశ్వరూపాన్ని చూప సంకల్పించి ఒక చిన్న లీల చేసాడు. చుట్టుపక్కన ఉన్న పిల్లలందరూ కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్పగా

సా గృహీత్వా కరే కృష్ణముపాలభ్య హితైషిణీ
యశోదా భయసమ్భ్రాన్త ప్రేక్షణాక్షమభాషత

పిల్లవాడి హితము కోరే తల్లి కాబట్టి యశోద పిల్లవాడిని పట్టుకుని చేతిలో బెత్తం పట్టుకుంది. కృష్ణుడు భయముతో రెప్పలు ఆడిస్తూ. భయముతో ఉలికిపడుతూ ఆశ్చర్యపడుతూ అదిరిపడుతూ ఉన్న పిల్లవాడితో

కస్మాన్మృదమదాన్తాత్మన్భవాన్భక్షితవాన్రహః
వదన్తి తావకా హ్యేతే కుమారాస్తేऽగ్రజోऽప్యయమ్

మంద బుద్ధీ మట్టి ఎందుకు తిన్నావు. అని అడిగింది. అపుడు కృష్ణుడు వారందరూ అబద్దం చెబుతున్నారు అన్నాడు. అప్పుడు యశోదమ్మ బలరాముడు కూడా చెబుతున్నాడు. చెప్పు ఎందుకు తిన్నావో

నాహం భక్షితవానమ్బ సర్వే మిథ్యాభిశంసినః
యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖమ్

నేను మట్టి తినలేదమ్మా. నిజం చెబుతున్నాను. వారు చెబుతున్నది నిజం అని నీవనుకుంటే, నీకు అనుమానం ఉంటే నా నోరు చూడు అన్నాడు

యద్యేవం తర్హి వ్యాదేహీ త్యుక్తః స భగవాన్హరిః
వ్యాదత్తావ్యాహతైశ్వర్యః క్రీడామనుజబాలకః

నోరు చూపమని తల్లి అడుగగా, లీలా మానుష రూపుడైన, తన శాసనానికి అడ్డులేనివాడైన శ్రీకృష్ణుడు నోరు తెరిచాడు. ఈనాడు యశోదమ్మ ముందు పిల్లవాడిలా నటిస్తున్నా అతని శాసకత్వానికి ఎదురులేదు

సా తత్ర దదృశే విశ్వం జగత్స్థాస్ను చ ఖం దిశః
సాద్రిద్వీపాబ్ధిభూగోలం సవాయ్వగ్నీన్దుతారకమ్

పరమాత్మ నోటిలో సకల ప్రపంచాన్నీ స్థావర జంగమాన్నీ ఆకాశాన్ని దిక్కులనూ పర్వతములనూ ద్వీపములనూ సముద్రములనూ పంచభూతాలనూ జ్యోతిస్చక్రాన్నీ, కర్మ జ్ఞ్యానేంద్రియాలనూ మనసునూ పంచ తన్మాత్రలనీ సత్వ రజస్తమోగుణాలనీ, ఇవన్నీ ఏ ఏ సమయములో జరుగుతాయో ఆ కాలాన్నీ జీవులనీ వారి కర్మలనూ ఆ కర్మలను ఆచరింపచేసే సంస్కారాలను, ఆ సంస్కారాల చేత కప్పి వేయబడిన మనసు. ప్రళయ కాలం నుంచీ సృష్టి కాలం వరకు ఉండే అన్ని తత్వాలనూ చూసింది. జీవులనూ వారి కర్మలనూ వారి వాసనలనూ వారి వ్యామోహాలనూ, మహదాది తత్వాలనూ చూసింది. జీవ కాల స్వభావ ఆశయ లింగాలనూ అన్నింటినీ చూచింది. బ్రహ్మాండమంతా చూచింది. అందులో ఉండే ప్రతీ భేధాన్నీ చూచింది. ప్రతీ దానిలో దాని పక్క దానిలో ఉండే భేధాన్నీ చూపించాడు. ప్రపంచం మొత్తాన్నీ చూపాడు.

జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్వియదేవ చ
వైకారికాణీన్ద్రియాణి మనో మాత్రా గుణాస్త్రయః

ఏతద్విచిత్రం సహజీవకాల స్వభావకర్మాశయలిఙ్గభేదమ్
సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే వ్రజం సహాత్మానమవాప శఙ్కామ్

తెరిచిన నోటిలో పిల్లవానిలో అన్నీ చూచింది. చివరికి తాను ఉన్న వ్రేపల్లెనూ వ్రేపల్లెలో తనను కూడా చూచుకుంది.

కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధిమోహః
అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః

ఇది కలయా లేక వైష్ణవ మాయా, నా బుద్ధిలో ఏమైనా మోహం సంభవించిందా, లేకుంటే ఈ పిల్లవానికి ఏదో ఉత్పాతాల వలన ఇతనికి ఏమైనా ఆత్మ యోగం సిద్ధించిందా?లేదా నాకు మోహం వచ్చిందా. లేక ఇది పరమాత్మ మాయా?

అథో యథావన్న వితర్కగోచరం చేతోమనఃకర్మవచోభిరఞ్జసా
యదాశ్రయం యేన యతః ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదమ్

ఎపుడైతే ఏమీ అర్థం కాలేదో, ఏమీ నిర్ణయించుకోలేకపోయిందో ఊహకు అందలేదో, తెలుసుకోవడానికి సాధనములుగా చెప్పబడిన అన్ని సాధనముల(చిత్తమూ మనసూ మాటలూ పనులూ) చేత తెలుసుకోలేక పోయేసరికి, ఈ ప్రపంచం అంతా ఎవరి చేతా ఆశ్రయించబడి ఉంటుందో, మనం భావించడానికి కూడా వీలులేనటువంటి స్వామి పాదములకు నమస్కరిస్తున్నాను.

అహం మమాసౌ పతిరేష మే సుతో వ్రజేశ్వరస్యాఖిలవిత్తపా సతీ
గోప్యశ్చ గోపాః సహగోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతిః స మే గతిః

నేనూ నా పిల్లవాడూ నా భర్తా, వ్రేపల్లెలో ఉండే సకల సంపదలూ వాటిని కాపాడే వారందరూ, గోపికలూ గోపాలురూ గోవులూ, ఇలా ఎవరి మాయతో నాకు ఈ (నా అనే) దుష్ట బుద్ధి పుట్టిందో వాడే నాకు దిక్కు. పరమాత్మ విశ్వరూపాన్ని చూపుటకు కారణం యశోదమ్మ మమకారం పోవడానికే. ఒక్క సారి కృష్ణుడి వలన విశ్వరూపాన్ని చూసే సరికి, అన్నీ "నావి" అనుకోవడం తప్పు అని తెలుసుకుని, ఇలా "నా" అన్న భావన ఎవరి వలన వచ్చిందో వాడే నాకు దిక్కు అని వేదింది యశోదమ్మ.

ఇత్థం విదితతత్త్వాయాం గోపికాయాం స ఈశ్వరః
వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభుః

ఒక్క సారి యశోదమ్మకు తత్వం మొత్తం తెలిసిపోయింది. అప్పుడు స్వామి తన విష్ణు మాయను వ్యాపింపచేసాడు. "అమ్మా పాలివ్వ" మని అడిగాడు. పుత్ర భావముతో స్వామికి యశోదమ్మ పాలిచ్చింది. మనకు కూడా అపుడపుడు భక్తీ వైరాగ్యం కలుగుతూ ఉంటాయి, కానీ వెంటనే పోతూ ఉంటాయి. ఒక సారి స్వామిని శరణు వేడితే ఆయన మనను మాయలో ముంచినా, మనం మాయలో మునిగినా, మనకు నరకం రాదు. మనను పాపం అజ్ఞ్యానం మాయా ముంచదు.

సద్యో నష్టస్మృతిర్గోపీ సారోప్యారోహమాత్మజమ్
ప్రవృద్ధస్నేహకలిల హృదయాసీద్యథా పురా

ఒక్క సారి మరలా ఆయన మాయ కప్పి వేయగా అంతా మరచిపోయి పిల్లవాడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, బాగా ప్రీతి హృదయములో కలిగి ఎప్పటిలాగానే పాలు ఇచ్చింది.

త్రయ్యా చోపనిషద్భిశ్చ సాఙ్ఖ్యయోగైశ్చ సాత్వతైః
ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజమ్

ఎంత మహానుభావురాలు యశోద. అన్ని వేదములతో ఉపనిషత్తులతో సాంఖ్యములతో ఆగమములతో ఏ మహానుహ్బావుని మహత్యాన్ని స్తోత్రం చేస్తున్నాయో అలాంటి స్వామిని నా పుత్రుడూ అని అనుకుంటున్నది.

శ్రీరాజోవాచ
నన్దః కిమకరోద్బ్రహ్మన్శ్రేయ ఏవం మహోదయమ్
యశోదా చ మహాభాగా పపౌ యస్యాః స్తనం హరిః

ఇలాంటి మహత్ అదృష్టం రావడానికి నంద యశోదలు ఏ తపస్సు చేసారు. యశోద ఏ తపస్సు చేసింది. అసలు ఎవరు తల్లి తండ్రులో ఆ భాగ్యాన్ని వారు పొందలేదు. దేవకీ వసుదేవులు పుత్రున్ని మాత్రం కన్నారు. ఆయన పెరుగుతుండగా చూచే భాగ్యాన్ని నంద యశోదలు పొందారు

పితరౌ నాన్వవిన్దేతాం కృష్ణోదారార్భకేహితమ్
గాయన్త్యద్యాపి కవయో యల్లోకశమలాపహమ్

పండితులూ గురువులూ జ్ఞ్యానులు ఎవరి చరితను గానం చేస్తున్నారో, ఆ గానములో కూడా నంద నందనా యశోదా నందనా అన్న పేరు వచ్చింది. సకల లీలలను వీరికి చూపారంటే వారు ఏ పుణ్యం చేసారు.

శ్రీశుక ఉవాచ
ద్రోణో వసూనాం ప్రవరో ధరయా భార్యయా సహ
కరిష్యమాణ ఆదేశాన్బ్రహ్మణస్తమువాచ హ

నందుడంటే అష్ట వసువులలో ప్రథానుడైన ద్రోణ అనే వసువు. అతని భార్య ధర. ఆమే యశోద. శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరించబోతూ ఉంటే వారికి సహాయముగా బ్రహ్మ మాటను బట్టి దేవతలు అందరూ భూమి మీద అవతరించారు.

జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ
భక్తిః స్యాత్పరమా లోకే యయాఞ్జో దుర్గతిం తరేత్

అపుడు వీరు అలాగే పుడతాము కానీ, పరమాత్మ మా దగ్గరే ఉండాలి. ఆయనకు అన్ని సేవలూ మేమే చేయాలి. ఆ సేవల వలన పరమాత్మ యందు మాకు భక్తీ ప్రీతీ బాగా పెరగాలి అని అడిగారు. మాకు పరమ భక్తి లభించాలి. దాని వలన దుర్గతి తొలగించబడుతుంది

అస్త్విత్యుక్తః స భగవాన్వ్రజే ద్రోణో మహాయశాః
జజ్ఞే నన్ద ఇతి ఖ్యాతో యశోదా సా ధరాభవత్

బ్రహ్మ అలాగే అని వారిని వెళ్ళమన్నాడు. ఈ ద్రోణుడనే వసువు, నందుని రూపములో వ్రేపల్లెలో పుట్టగా, ఆ ధర యశోద అయ్యింది. ఇలా కుమారుడిలా పరమాత్మ పెరిగినందు వలన వీరికి పరమాత్మ యందు ప్రీతీ భక్తీ కలిగింది.

తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే
దమ్పత్యోర్నితరామాసీద్గోపగోపీషు భారత

కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభుః
సహరామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా

బ్రహ్మ యొక్క మాటను నిజం చేయాలనుకున్న పరమాత్మ వ్రేపల్లెలో తాను వచ్చి బలరామునితో కలిసి నివసించి, నంద యశోదలకు (ద్రోణ ధరలకు) వారు కోరిన రీతిలో ప్రీతిని చేకూర్చాడు.